Jump to content

దయనీయ స్థితిలో కమెడియన్ ‘అల్లరి’ సుభాషిణి


Recommended Posts

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘అల్లరి’ సినిమాతో అల్లరి నరేష్‌గా మారిపోయాడు హీరో నరేష్. ఆ సినిమా తర్వాత నరేష్‌తో పాటు డైరెక్టర్ రవిబాబు, కమెడియన్ సుభాషిణికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమెను కూడా అల్లరి సుభాషిణి అని పిలవడం మొదలు పెట్టారు. సినిమా అంతా నైటీతోనే కనిపించి కామెడీ పండించిన సుభాషిణి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో ఆమె పోరాడుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ధీనస్థితి గురించి వెల్లడించారు సుభాషిణి.

 

 

‘‘నేను పుట్టి పెరిగింది తిరుపతి. మా తల్లిదండ్రులు హరికథలు చెప్పేవారు. మా అక్క కూడా హరికథలు నేర్చుకుని తిరుపతిలో ఫేమస్ అయింది. నాతో కూడా హరికథలు చెప్పించాలని అక్క ప్రయత్నించింది. కానీ నాకు నాటకాలంటే ఇష్టం. సినిమాల్లో వాణిశ్రీని చూసి ఆవిడలా తయారయ్యేదాన్ని. ఆవిడే నాకు గురువు. ఆమె ద్వారా స్ఫూర్తి పొంది సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. నాటకాలు వేసుకుంటే ఉండే నాకు ‘చింతామణి’ నాటకంతో బాగా పేరొచ్చింది. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ గారి సహాయంతో సినిమాల్లోకి వచ్చాను. ఆ తరువాత చాలా సినిమాలు చేశాను. చలపతిరావు గారి కుమారుడు రఘుబాబు సినిమాల్లో చాలా వేషాలు వేశాను. డబ్బులు బాగా సంపాదించే సమయంలో ఆ డబ్బును మా అక్కవాళ్ల బిజినెస్‌కు ఇచ్చేదాన్ని. వాళ్లు తిరుపతిలో ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్లు. మా అక్క చనిపోయిన తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబం మొత్తం నామీదే ఆధారపడింది. 20 ఏళ్ల క్రితమే నా భర్త చనిపోవడంతో హైదరాబాద్‌లో ఒకాయన ద్వారా సెటిల్ అయ్యాను. కానీ, ఆయన కూడా నాకు అన్యాయమే చేశారు. ఇలా ప్రతిచోటా మోసపోవడం వీక్‌నెస్ అయిపోయింది. ఆ వీక్‌నెస్ నరాల వీక్‌నెస్‌గా మారి క్యాన్సర్ వచ్చింది. టెన్షన్స్ వల్లే నాకు క్యాన్సర్ ఎటాక్ అయిందని డాక్టర్లు చెప్పారు.

 

 

మూడు సంవత్సరాల నుంచి అనారోగ్యంగా ఉంది. మాత్రలతో నెట్టుకుంటూ వస్తున్నా. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. చివరికి మనోహర్ రాజు అనే ఒకాయన నా పరిస్థితి తెలుసుకుని నీలోఫర్ పక్కనున్న ఎంఎంజే ఆసుపత్రిలో చూపించారు. అక్కడ టెస్టులు చేయించాక క్యాన్సర్ అని తెలిసింది. వ్యాధి ప్రథమ దశలోనే ఉందని, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందన్నారు. డీఎన్సీ చేశాక పది రోజులకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ కోసం రూ. 5 లక్షలదాకా అవుతుందన్నారు. నా స్నేహితులు ఆసుపత్రికి వచ్చి చూసి సహాయం చేశారు. నన్ను బతికించింది ఎంఎంజే ఆసుపత్రి వాళ్లే. వాళ్లకు కళాభివందనాలు. నేను పూర్తిగా కోలుకున్నాక.. సినిమా అవకాశాలు వస్తే చేస్తాను. ప్రస్తుతం నా కూతురి ఇంట్లో ఉంటున్నాను. స్నేహితుల రూపంలో నాకు దేవుడు సహాయం చేశాడు. మాలాంటి కళాకారులను అందరూ తప్పక ఆదుకుంటారు.’’ అని ఆశాభావం వ్యక్తం చేస్తూ తన దయనీయస్థితి గురించి వివరించారు సుభాషిణి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...