Jump to content

విజయోత్సాహంలో తారక రాముడు Eenadu


pavanesd

Recommended Posts

న్టీఆర్‌కి ఏదీ సులభంగా లభించలేదు. విజయం కోసం ఆయన ప్రతిసారీ ఓ దండయాత్ర చేయాల్సి వచ్చింది. వరుసగా ఎదురయ్యే పరాజయాల వల్ల అప్పుడప్పుడు నిరాశ నిస్పృహలు ఆవహించినా అభిమానుల్ని చూసి మళ్లీ ఉత్తేజితులవుతుంటారు. వాళ్ల కోసమైనా హిట్టు కొట్టాల్సిందే అంటూ మరింత కసితో కష్టపడుతుంటారు. ఆ కసి, పట్టుదలే ఆయన్ని విజేతగా నిలిపాయి. ‘సింహాద్రి’ తర్వాత మళ్లీ పుష్కరకాలానికి అంతటి పరిపూర్ణమైన విజయాన్ని సొంతం చేసుకొన్నారు ఎన్టీఆర్‌. ‘జనతా గ్యారేజ్‌’ ఫలితంతో ఎన్టీఆర్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఆ వూపులోనే కొత్త సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్‌కి విజయాలు కొత్త కాదు. కానీ ఇదివరకు సాధించిన విజయాలకీ, ‘జనతా గ్యారేజ్‌’తో దక్కిన విజయానికీ మధ్య చాలా తేడాలున్నాయి. ఈమధ్య నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొంటున్నాడు. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు ఎన్టీఆర్‌లోని నటుడిని పూర్తిగా మార్చేశాయి. ఆయనకి కథలపై కూడా పట్టు దొరికిందనే విషయం ఇటీవల వరుసగా వచ్చిన ఆ మూడు చిత్రాలే స్పష్టం చేస్తాయి. అందుకే పరిశ్రమ వర్గాలు సైతం ఎన్టీఆర్‌ ఇప్పటిదాకా సాగించిన ప్రయాణం ఒకెత్తు, ఇకపై ప్రయాణం మరో ఎత్తు అంటున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఎన్టీఆర్‌ ఆచితూచి అడుగులేస్తున్నారు. కథల విషయంలో తన మేథస్సుకి మరింతగా పదును పెడుతున్నారు. నాలుగైదు కథలు చుట్టుముట్టినా ఏమాత్రం గందరగోళానికి గురవ్వకుండా ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.

పూరినే ఖాయమా? 
‘టెంపర్‌’తో తన యాక్టింగ్‌ స్టైల్‌ని పూర్తిగా మార్చేసిన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయబోతున్నాడని మొదట్లో ప్రచారం సాగింది. ఆ తర్వాత లింగుస్వామి, త్రివిక్రమ్‌ తదితర దర్శకుల పేర్లు వినిపించాయి. ఎన్టీఆర్‌ మాత్రం మరోమారు పూరి జగన్నాథ్‌ చెప్పిన కథపైనే నమ్మకం పెంచుకొన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఆ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ‘టెంపర్‌’లాంటి విజయం తర్వాత ఎన్టీఆర్‌, పూరి కలిస్తే ఆ అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఆ అంచనాలకి తగ్గట్టుగానే పూరి కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చాలా రోజుల క్రితమే ఆ కథని విన్నట్టు తెలుస్తోంది.

ప్రేమకథలు రెడీ? 
ఎన్టీఆర్‌ ఇటీవల తెరపై కనిపిస్తున్న విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదివరకటితో పోలిస్తే చాలా క్లాస్‌గా కనిపిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్‌ కూడా తాను ప్రేమకథల్లో నటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారట. ఆయన ఆలోచనలకి తగ్గట్టుగానే కొద్దిమంది దర్శకులు మాస్‌ అంశాలతో కూడిన ప్రేమకథల్ని ఎన్టీఆర్‌కి వినిపించినట్టు తెలిసింది. ఆ కథల్లో నటించడంపై కూడా ఎన్టీఆర్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ దర్శకుడు హను రాఘవపూడితోపాటు, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండా కూడా ఎన్టీఆర్‌కి కథలు వినిపించినట్టు తెలిసింది. మరో పక్క ఎన్టీఆర్‌కి నచ్చేట్టుగా ఓ మాస్‌ కథని సిద్ధం చేసే పనిలో వక్కంతం వంశీ కూడా బిజీగా ఉన్నట్టు సమాచారం. పూరితో చేయనున్న చిత్రం తర్వాతే మిగతా నిర్ణయాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break85

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...