Jump to content

లక్ష ఏటీఎంలు మూతబడతాయా ?


KING007

Recommended Posts

లక్ష ఏటీఎంలు మూతబడతాయా 
ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రభావం 
రూ.3,000 కోట్ల భారం అంటున్న పరిశ్రమ 
క్యాసెట్‌లో నగదు నింపే బాధ్యత బ్యాంకులకు 
వాటిని చేరవేయడమే మూడోపార్టీ విధి 
క్యాసెట్‌లు అదనంగా కొనుగోలు చేయాలి 
ఒక్కో క్యాసెట్‌ ధర రూ.7,000-20,000 
21busi1a.jpg

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు రెండున్నర లక్షల ఏటీఎంలున్నా, వాటిలో నగదు అందించేవి ఎన్నో ఎవరూ చెప్పలేని స్థితి. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలలో నగదు నింపేందుకు ఆర్‌బీఐ రూపొందించిన కొత్త ప్రతిపాదనల వల్ల ఈ పరిశ్రమపై రూ.3,000 కోట్ల భారం పడటమే కాక, లక్షకు పైగా ఏటీఎంలు మూతబడే అవకాశముందని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే జరిగితే, గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలపైనే అధిక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

2,21,492 
సెప్టెంబరు ఆఖరుకు దేశంలో ఏటీఎంలు

15,000 
ప్రైవేట్‌ లేబుల్‌ ఏటీఎంలు

116.14 కోట్లు 
వినియోగంలోని డెబిట్‌ కార్డులు

13.90 కోట్లు 
జారీ అయిన క్రెడిట్‌ కార్డులు

33,93,396 
పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలు

80.67 కోట్ల సార్లు 
సెప్టెంబరులో ఏటీఎంల వద్ద కార్డుల వినియోగం..

50.10 కోట్ల సార్లు 
పీఓఎస్‌ల వద్ద స్వైపింగ్‌

83.55 కోట్లు 
మొబైల్‌బ్యాంకింగ్‌, వాలెట్లు కలిపి  లావాదేవీలు

2016 నవంబరులో పెద్దనోట్లు రద్దు చేసేవరకు, డెబిట్‌ కార్డు ఉంటే, ఏటీఎం నుంచి నగదు ఎప్పుడైనా పొందవచ్చనే భరోసా ఉండేది. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎంలలో నగదు ఎప్పుడూ అందుబాటులో ఉండేది. బ్యాంక్‌ శాఖల ప్రాంగణాల్లో (ఆన్‌సైట్‌) ఉండే ఏటీఎంలలో బ్యాంకులే నగదు నింపుకున్నా, ఇతర ప్రాంతాల్లో నెలకొల్పే (ఆఫ్‌సైట్‌) ఏటీఎంలలో నగదు నింపే కాంట్రాక్టును ప్రైవేట్‌ ఏజెన్సీలకు ఇస్తున్నాయి. వీరు మరికొందరికి సబ్‌కాంట్రాక్టులు ఇస్తున్నారు. లావాదేవీల పరిమాణాలకు అనుగుణంగా ఒక్కో ఏటీఎంలో రూ.10 లక్షల వరకు నగదు ఉంచుతారు. ఈ రూపేణ రోజూ దేశవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు రూ.12,000-15,000 కోట్ల బ్యాంకుల నగదును ఏటీఎంలలో నింపుతున్నాయని అంచనా. బ్యాంకుల అధికారులతో కుమ్మక్కయి కొందరు, ఏజెన్సీల సిబ్బంది మరిందరు ఏటీఎంలలో నగదు ఉంచకుండా అపహరించడం, వడ్డీలకు తిప్పుకుని, ఆడిటింగ్‌ జరిగే ముందు తెచ్చి సక్రమంగా లెక్క చూపడం వంటి అక్రమాలకు పాల్పడిన కేసులూ నమోదయ్యాయి. రెండేళ్ల నుంచి నగదు వినియోగం తగ్గించేందుకు, ఏటీఎంలలో నగదు నింపడాన్ని బ్యాంకులు బాగా తగ్గించాయి.

21busi1b.jpg

ఏటీఎం లావాదేవీలు తగ్గుతున్నాయ్‌ 
మొబైల్‌-ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ లావాదేవీలు పెంచడంపై, బిల్లుల చెల్లింపునకు విరివిగా పీఓఎస్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, బ్యాంకులన్నీ ఈ దిశగా చర్యలు చేపట్టాయి. ఒకే ప్రాంతంలో 2-3 కేంద్రాలు ఉంటే, కొన్ని తొలగించి, కొత్తగా ఏర్పాటయ్యే కాలనీల్లో నెలకొల్పుతున్నాయి. ఫలితంగా ఏటీఎం కేంద్రాల సంఖ్య పెరగడం లేదు. వీటిల్లోనూ నగదు ఎప్పుడు ఉంటుందో, లేదో తెలియడం లేదు. దీనికితోడు లావాదేవీల్లో పారదర్శకత ఉండటం వల్ల, పీఓఎస్‌ల వద్ద స్వైపింగ్‌ ద్వారా బిల్లులు చెల్లించడం పెరిగింది. సౌలభ్యంగా, ఎక్కడైనా వినియోగించ గలగడంతో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగమూ అధికమైంది. చాలా ఏటీఎం కేంద్రాలు మూసివేసి ఉంటున్నాయి. నెలవారీ నగదు ఉపసంహరణ సంఖ్య-మొత్తాలపై పరిమితులు కూడా డిజిటల్‌ లావాదేవీలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏటీఎంలలో నగదు నింపేందుకు ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు చేసింది.

ఇవీ కొత్త ప్రతిపాదనలు 
* ఏటీఎంలలో నగదు నింపే కాంట్రాక్టు పొందే సంస్థలు, ఉప కాంట్రాక్టు తీసుకునే సంస్థల నికర విలువ కూడా ఇకపై రూ.100 కోట్లు ఉండాలి. 2019 మార్చి 31 నాటికి ఈ నిబంధనను అమలు చేయాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 
* నగదు తీసుకెళ్లేందుకు ఆయుధాలు కలిగిన సిబ్బందితో పాటు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసిన వాహనాలు ప్రతిసంస్థకు 300 తప్పనిసరిగా ఉండాలి. 
* ఇప్పటివరకు ఈ ఏజెన్సీలు వ్యాన్లలో నగదును భద్రతతో తీసుకెళ్లి, ఏటీఎంలను తెరచి, వాటి క్యాసెట్‌ల (నగదు ఉంచే పెట్టె)లో నోట్లు నింపేవి. ఇకపై క్యాసెట్‌లలో బ్యాంకులే నగదు నింపి, ఈ సంస్థలకు ఇస్తాయి. వీరు భద్రత నడుమ ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి, ఇవి అక్కడ పెట్టి, ఖాళీ క్యాసెట్‌లు బ్యాంకుకు చేర్చాలి. ఇందువల్ల ప్రజా నగదుకు భద్రత పెరుగుతుంది. ఇందుకు క్యాసెట్లు భారీగా కొనుగోలు చేయాలి. 
బ్యాంకులపై రూ.కోట్లలో భారం: రూ.100, 200, 500, 2000 నోట్లను జారీ చేసేందుకు ఏటీఎంలలో క్యాసెట్‌లు ఉంటాయి. ఒక్కో క్యాసెట్‌ ధర రూ.7,000-20,000 వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 2.36 లక్షల ఏటీఎంలున్నందున, క్యాసెట్‌లు మార్చాలంటే, కొత్తగా వీటిని లక్షల్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
* పాత ఏటీఎంలు విండోస్‌ ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. విండోస్‌ 10 వెర్షన్‌ నడుస్తున్నందున, పాతదైన ఎక్స్‌పీకి అప్‌డేట్లు ఇవ్వడాన్ని మైక్రోసాఫ్ట్‌ నిలిపివేసింది. ఫలితంగా పాత ఏటీఎంలను హ్యాక్‌ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తప్పనిసరిగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. ఇందువల్ల ఏటీఎంలూ కొత్తవి కొనాలి. ఒక్కోదానికి రూ.4 లక్షల వరకు అవుతుంది. ఆరంభంలో జాతీయ బ్యాంకులే ఎక్కువగా ఏటీఎంలు నెలకొల్పినందున, పాత యంత్రాలు తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యతా వీటిపైనే ఉంటుంది.

అంతర్జాతీయ ప్రమాణాలొస్తాయ్‌: ఆర్‌బీఐ నిబంధనలు పాటిస్తే, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలే దేశీయంగానూ అమల్లోకి వస్తాయి. అయితే కొత్త క్యాసెట్ల కొనుగోలు, రవాణా ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. ఏజెన్సీల్లోని కొందరు సిబ్బంది చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. తమ  బ్యాంకులు, ఏజెన్సీల అభిప్రాయాలను కూడా ఆర్‌బీఐ తెలుసుకుంటోంది.

పరిశ్రమ వర్గాల ఆందోళన ఇదీ 
కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, పడే రూ.3,000 కోట్ల భారాన్ని పరిమితం చేసుకునేందుకు బ్యాంకులు భారీగా ఏటీఎంలను మూసివేసే అవకాశం ఉందని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య పేర్కొంటోంది. దేశంలో 2.38 లక్షల ఏటీఎంలున్నాయని, వచ్చే మార్చి ఆఖరుకు వీటిల్లో 1.13 లక్షల వరకు  మూతబడవచ్చని సమాఖ్య అంచనా వేస్తోంది. ఇందులో గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలవే అధికంగా ఉండొచ్చని తెలిపింది. ఇందువల్ల ఉద్యోగాల కోతా తప్పదని అంటోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...