Jump to content

BJP lessthan 200 by Ramoji Rao


Ramesh39

Recommended Posts

అధికారానికి అయిదు మెట్లు

పట్టు సాధించాల్సిన కీలక రాష్ట్రాలు

opinion1a_219.jpg

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సొంతగా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే నమ్మకం  భారతీయ జనతా పార్టీకి కానీ, కాంగ్రెస్‌కు కానీ లేదు. అందుకే వాటికి ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తులు అనివార్యమయ్యాయి. సదరు భాగస్వామ్య పార్టీలు స్వప్రయోజనాల కోసమే కలిసి వస్తున్నాయి తప్ప భాజపా కోసమో, కాంగ్రెస్‌ కోసమో అవి పోరాడటం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన భాజపా, కాంగ్రెస్‌లు భాగస్వాములతో సీట్ల సర్దుబాటు కోసం ఎక్కడాలేని ఔదార్యం కనబరుస్తున్నాయి. లోక్‌సభకు మొత్తం 250 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తర్‌ ప్రదేశ్‌ (80 సీట్లు), బిహార్‌ (40), మహారాష్ట్ర (48), పశ్చిమ్‌ బంగ (42), తమిళనాడు, పుదుచ్చేరి (40) రాష్ట్రాల్లో కుదిరిన ఎన్నికల పొత్తులు దీనికి ఉదాహరణ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీ లేదా కూటమే భారతదేశాన్ని ఏలుతూ వస్తోంది. ఈసారి సొంతంగా మెజారిటీ సాధిస్తాననే నమ్మకంలేని కాంగ్రెస్‌, ప్రధానమంత్రి పదవిని ఆశించకుండా భాజపాను ఓడించడమే లక్ష్యంగా పొత్తులు కుదుర్చుకుంటోంది. తమిళనాడులో డీఎమ్‌కేతో, మహారాష్ట్రలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో నిరాటంకంగా పొత్తు కలిపిన కాంగ్రెస్‌కు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి నిరాదరణ ఎదురైంది. దాంతో అక్కడ చిన్న పార్టీలతో కలిసి ఒంటరిగా బరిలోకి దిగింది. బిహార్‌లో 11 సీట్లు ఆశించినా గట్టి బేరసారాల తరవాత ఎనిమిది సీట్లతో సరిపెట్టుకొంది. ఈ విధంగా కాంగ్రెస్‌ పార్టీ వీలైన చోట్ల త్వరగా పొత్తులు కుదుర్చుకుని, వీలుకాని చోట్ల (పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ తనకు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో లోగడకన్నా తక్కువ సీట్లు వస్తాయని గ్రహించి, ఆ లోటును ఇతర రాష్ట్రాల్లో భర్తీ చేసుకోవాలని చూస్తోంది. 2014 ఎన్నికల్లో లోక్‌సభలో భాజపా, కాంగ్రెస్‌లకు కలిపి 60 శాతం సీట్లు లభిస్తే, ప్రాంతీయ పార్టీలు 40 శాతం సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, రాజకీయ ప్రభంజనాలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలు తమ బలం నిలబెట్టుకోవడం గమనించాల్సిన అంశం. జాతీయ స్థాయిలో పోరు కాంగ్రెస్‌, భాజపాల మధ్యనే అయినా, ఈసారీ అంతిమ విజేతను నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే. అందుకే వాటితో సర్దుబాట్లకు రెండు జాతీయ పార్టీలు ఎంతో రాజీ పడుతున్నాయి. లోక్‌సభలో సంఖ్యాధిక్యం సాధించడానికి రాష్ట్రాల్లో పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నాయి. ఇంతవరకు తమకు బలంలేని రాష్ట్రాల్లోనూ వీలైనన్ని సీట్లు సంపాదించాలని చూస్తున్నాయి.

పశ్చిమ్‌ బంగ

opinion1b_204.jpgశ్చిమ్‌ బంగలో భాజపా వ్యూహం అదే. ఈ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లకు 23 సీట్లు గెలుచుకొంటామని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఘనంగా చాటారు. కానీ, తృణమూల్‌ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన కలను వమ్ముచేయాలని కంకణం కట్టుకున్నారు. 2009లో ఇక్కడ ఆరు శాతం ఓట్లు సాధించిన భాజపా 2014 వచ్చేసరికి 17 శాతం ఓట్లు గెలుచుకున్నా తృణమూల్‌ను ఓడించడానికి ఆ ఊపు సరిపోలేదు. కాంగ్రెస్‌, వామపక్షాలను మించి మమతను కంగారుపెట్టడంలో మాత్రం భాజపా సఫలమవుతోంది. పశ్చిమ్‌ బంగలో మమతా బెనర్జీకి దీటైన జన సమ్మోహన శక్తి కలిగిన నాయకుడు లేకపోవడం భాజపాకు పెద్ద లోటు. దిల్లీ నుంచి వచ్చి హిందీలో ఉపన్యాసాలు దంచే నాయకులు బెంగాలీ ఓటర్ల మనసులను గెలుచుకోలేరు. తృణమూల్‌ మాదిరిగా బలమైన బూత్‌ స్థాయి కమిటీలు భాజపాకు లేకపోవడం మరో లోపం. అయినా మమత నిరంకుశ పోకడలు, కొత్త ఉద్యోగాల కల్పనలో, పరిశ్రమల స్థాపనలో వైఫల్యం, బంగ్లాదేశీల అక్రమ వలసలను అడ్డుకోలేకపోవడం భాజపాకు ప్రచార అస్త్రాలుగా మారాయి. వామపక్షాలు, కాంగ్రెస్‌ ముఠా కలహాలతో సతమతమవడం వల్ల భాజపా నేడు మమతకు గట్టి పోటీదారుగా అవతరించింది. ఇటీవల ఒక ఉప ఎన్నికలో తృణమూల్‌ తరవాత ఎక్కువ ఓట్లు భాజపాకు రావడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. బంగ్లాదేశీ వలసదారులపై బెంగాలీ ఓటర్లలో ఉన్న భయాన్ని సొమ్ముచేసుకోవడానికి ఆరెస్సెస్‌ కార్యకర్తలు ముమ్మరంగా కృషి చేస్తూ  భాజపా గెలుపు అవకాశాలను పెంచాలని చూస్తున్నారు. కానీ, ఉదారవాద, ప్రగతిశీల భావజాలానికి పట్టుగొమ్మ అయిన బెంగాల్‌లో మతావేశం భాజపాకు ఎంతవరకు ఓట్లు తెచ్చిపెడుతుందో చూడాలి. మరోవైపు ఎకరాకు రూ.5,000 చొప్పున చెల్లించే కర్షక బంధు, బాలికల విద్యకు కన్యాశ్రీ, విద్యార్థులకు సైకిళ్లు అందించే సబుజ్‌ సాథీ వంటి పథకాల వల్ల మమతకు ప్రజాదరణ పెరిగింది. గత లోక్‌సభలో 39 సీట్లున్న తృణమూల్‌ ఈసారి కూడా అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటే మహా గఠ్‌ బంధన్‌ నాయకురాలిగా కేంద్రంలో నరేంద్ర మోదీకి గట్టి సవాలుదారుగా మమత అవతరిస్తారు.

మహారాష్ట్ర

opinion1c_117.jpgభాజపా రాష్ట్ర ప్రభుత్వంపై మిత్ర పక్షం శివసేన గత నాలుగేళ్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నా, లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని గత నెలలో ఒప్పందం కుదిరింది.  మోదీని మళ్ళీ ప్రధానిని చేయడం కోసం శివసేన ఉదారంగా సీట్లు వదులుకొంది. భాజపా 25 లోక్‌సభ సీట్లకు, శివసేన 23 సీట్లకూ పోటీ చేస్తాయి. ఈ ఏడాది డిసెంబరులో జరిగే విధాన సభ ఎన్నికల్లో చెరి సగం సీట్లు పంచుకున్నాయి. కాంగ్రెస్‌-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) కూటమి పరిస్థితి ఇంత సాఫీగా లేదు. కొందరు నాయకులు భాజపా-శివసేన కూటమిలో చేరిపోవడమే కాదు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈసారి తాను ఎన్నికల్లో పాల్గొనడం లేదని ప్రకటించడం కూటమికి నిరాశ కలిగించింది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందువల్ల, గడువు ముగిసేవరకు తన రాజ్యసభ సీటులోనే కొనసాగుతానని పవార్‌ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో భాజపా-సేన కూటమికి 48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌-ఎన్సీపీ 34 శాతం ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. పెరిగిన నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి తమను బురిడీ కొట్టించారని మరాఠాల్లో రగులుతున్న ఆగ్రహం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. వ్యాపార-పారిశ్రామిక కేంద్రమైన మహారాష్ట్రలో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. అన్ని వర్గాలూ ఆర్థికంగా గడ్డుస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కనీసాదాయ పథకం ‘న్యాయ్‌’ ఏ మేరకు ఓట్లను ఆకర్షిస్తుందో చూడాలి.

బిహార్‌

opinion1d_33.jpgమాయావతి, అఖిలేశ్‌ ప్రభృతుల మహా గఠ్‌ బంధన్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌లో తన పరిధిని కుదింపజేయడంతో భాజపా ఇతరచోట్ల  మినీ గఠ్‌ బంధన్‌లను కూడగడుతోంది. స్థానికంగా బలీయమైన పార్టీలతో పొత్తు కోసం గతంలో తాను గెలిచిన సీట్లనూ వదులుకొంటోంది. 40 సీట్లు గల బిహార్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న భాజపా ఈసారి 17 సీట్లకే పరిమితం కావడం దీనికి నిదర్శనం. 2014లో కేవలం రెండు సీట్లు గెలిచిన జనతా దళ్‌ (యునైటెడ్‌) ఈసారి 17 సీట్లకు పోటీచేస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ (యు)కు ఎక్కువ సీట్లు వదలడం ద్వారా తన గురి దిల్లీ పీఠంపైనేనని భాజపా స్పష్టీకరించింది. ఎన్డీయేలో మూడో భాగస్వామి రాం విలాస్‌ పాసవాన్‌ ఎల్‌జేపీకి ఆరు సీట్లు కేటాయించారు. లాలూప్రసాద్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌ తదితర పార్టీల యూపీఏ కూటమి నుంచి ఎన్డీయేకు గట్టిపోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రకటించిన కనీసాదాయ పథకం- న్యాయ్‌, పేదల ఓట్లలో గణనీయ భాగాన్ని ఎన్డీయే నుంచి యూపీఏకి బదిలీ చేయవచ్చునన్న ఆశలున్నాయి. యూపీఏ భాగస్వామ్య పార్టీల మధ్య కూడా ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అయితేనే విజయం దక్కుతుంది. బిహార్‌లో ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు సూచించాయి.

తమిళనాడు

opinion1e_9.jpg

రుణానిధి, జయలలిత వంటి మహానాయకులు లేకుండా మొదటిసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉభయ డీఎమ్‌కేలు గతంలోకన్నా ఎక్కువ సీట్లను జాతీయ పార్టీలకు కేటాయించడం విశేషం. కాంగ్రెస్‌కు డీఎమ్‌కే తొమ్మిది సీట్లు కేటాయించడం ఆశ్చర్యకరం. కాంగ్రెస్‌తోపాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఎమ్‌డీఎమ్‌కే తదితర చిన్న పార్టీలను కలుపుకొని పోతున్న డీఎమ్‌కే తనకు తాను 20 సీట్లలో పోటీచేస్తోంది. 2014 లోక్‌సభ, 2016 విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయిన డీఎమ్‌కే ఈసారి ఎన్నికల పొత్తులతో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరోవైపు అన్నా డీఎమ్‌కే, భాజపా, పాట్టాళి మక్కళ్‌ కట్చి, విజయకాంత్‌ నేతృత్వంలోని దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం, మరి మూడు చిన్న పార్టీలతో ఎన్డీయే కూటమి బరిలో ఉంది. అన్నా డీఎమ్‌కే 20 సీట్లలో, భాజపా అయిదు సీట్లలో పోటీచేస్తున్నాయి. కమల్‌ హాసన్‌ మక్కళ్‌ నీతి మైయ్యం, శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ పార్టీ అయిన అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కళగం ఎవరితో కలవకుండా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దినకరన్‌ పాలక అన్నాడీఎమ్‌కే ఓట్లను చీల్చనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తమిళ ప్రజలు గుర్రుగా ఉన్నారు. మోదీ ఎప్పుడు తమిళనాడుకు వచ్చినా నిరసనలు పలకరిస్తున్నాయి. జయలలిత మరణానంతరం కేంద్ర దాష్టీకం పెరిగిందని, తమిళుల ఆత్మగౌరవం దెబ్బతిందని అత్యధిక ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌

opinion1f_2.jpg

న్ని వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరిగినా చివరకు లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ సింహాసనాధీశులెవరో నిర్ణయించేది ఉత్తర్‌ ప్రదేశ్‌ (యూపీ) మాత్రమే. 2014లో యూపీలోని 80 లోక్‌సభా స్థానాలకు 71 స్థానాల్లో భాజపా, మరి రెండు స్థానాల్లో దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌ (ఎస్‌) నెగ్గినందునే నరేంద్ర మోదీ దిల్లీ గద్దె ఎక్కగలిగారు. 2019లోనూ అదే స్థాయి విజయాన్ని అందుకోవాలన్న భాజపా కలను సమాజ్‌ వాది-బహుజన్‌ సమాజ్‌వాది- రాష్ట్రీయ లోక్‌దళ్‌ కూటమి వమ్ముచేసే అవకాశాలున్నాయి. ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్‌కు ప్రియాంక రంగప్రవేశం కాస్త హుషారునిచ్చినా యూపీలో ఆ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశం కనిపించడంలేదు. 2014లో మాదిరిగా కాకుండా ఈసారి మహిళలు, యువ ఓటర్లలో భాజపా పట్ల, ముఖ్యంగా మోదీ పట్ల ఉత్సాహం సన్నగిల్లింది. ఉపాధి కల్పనలో, ఆర్థికాభివృద్ధిలో వారు ఆశించిన పురోగతి సిద్ధించకపోవడం దీనికి కారణం. క్రితంసారి తన సంప్రదాయ అగ్రవర్ణ హిందూ ఓటర్లతోపాటు జాతవేతర దళితులను, యాదవేతర ఓబీసీలనూ తనవైపు తిప్పుకోవడం భాజపా విజయ రహస్యమైంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై అత్యాచారాల నిరోధ చట్టం దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మార్పుచేర్పులు ఈసారి దళితులకు, భాజపాకు మధ్య దూరం పెంచాయి. ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేదలకు ఉన్నత విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయడం ఇతర వెనకబడిన వర్గాల్లో (ఓబీసీ) అనుమానాలు రేపింది.  గిట్టుబాటు ధరలు లభించక ప్రభుత్వంపై గ్రామీణులు ఆగ్రహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ వ్యవసాయ సంక్షోభం వల్లే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైంది. ప్రస్తుత ఎన్నికల్లో హిందుత్వ (అయోధ్య), అభివృద్ధి, జాతీయవాదం (బాలాకోట్‌ లక్షిత దాడులు) తనను గట్టెక్కిస్తాయని భాజపా ఆశపడుతోంది. మతపరమైన పునరేకీకరణ యూపీలో ఎక్కువ సీట్లు తెచ్చిపెడుతుందని ఆ పార్టీ అంచనా వేసుకొంటుంటే దళిత, ఓబీసీ, ముస్లిం ఓటర్ల పునరేకీకరణతో అత్యధిక స్థానాలు గెలవాలని ఎస్పీ-బీఎస్పీ కూటమి లక్షిస్తోంది. బ్రాహ్మణులతోపాటు పై వర్గాలనూ ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కానీ, కాంగ్రెస్‌ కానీ ఒంటి చేత్తో 200 పైచిలుకు సీట్లు సాధించగలిగితేనే, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పరచగలుగుతాయి. 200 స్కోరును చేరడానికి యూపీ, బిహార్‌లు ముఖ్య సోపానాలు కాని, రెండు జాతీయ పార్టీలకు అక్కడ నాటి పరపతి లేదు. అందువల్లఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఆ లోటును భర్తీ చేస్తాయని అవి ఆశిస్తున్నాయి.
- ఏఏవీ ప్రసాద్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...