Jump to content

అధికారంలో ఉన్న పార్టీకే అవకాశం.. టీడీపీలో ధీమా అదే..! 


Ramesh39

Recommended Posts

అధికారంలో ఉన్న పార్టీకే అవకాశం.. టీడీపీలో ధీమా అదే..! 

4/15/2019 12:55:16 AM

636908865253377914.jpg
  • అధికారంలో ఉన్న పార్టీకే అవకాశం
  • తెలంగాణలో జరిగిందదే..
  • 2009లోనూ అదే ఒరవడి
  • 2019లోనూ పునరావృతం అవుతుందని ఆశ
అనంతపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్‌ శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా పెంచుతోంది. మెజార్టీపై అంచనాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కన్నా.. కృతజ్ఞత చాటుకునేందుకే అర్ధరాత్రి వరకు మహిళా ఓటర్లు వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారనే విశ్వాసాన్ని అధికార పార్టీ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూండడం విశేషం. పసుపు-కుంకుమ పథకం మహిళా ఓటర్లలో మరింత ఉత్సాహం నింపిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 2009లో ఎన్నికల పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే 2019లోనూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటోందని వారు చెబుతున్నారు. ఓటింగ్‌శాతం పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే భావం గతంలో ఉండేదేమో కానీ.. దశాబ్ద కాలంగా ఆ భావనకు కాలం చెల్లిందనే వాదన వివిధ వర్గాల ప్రజల నుంచి వినిపిస్తోంది.
 
ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో 2004 కంటే మూడున్నర శాతం ఓటింగ్‌ పెరిగింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సార్వత్రిక ఎన్నికలు జరగగా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో టీడీపీ అధికారం చేపట్టాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్ల పాలన అనంతరం తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ వెళ్లారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి.
 
2014లో కంటే 2018లో తెలంగాణ ఎన్నికల్లో 4 శాతం ఓటింగ్‌ పెరిగింది. అంటే పెరిగిన ఓట్లు ప్రభుత్వానికి అనుకూలమనే విషయం తేటతెల్లమైంది. రాష్ట్రంలోనూ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2014లో కంటే 2019లో సుమారు మూడుశాతం ఓటింగ్‌ పెరిగింది. దీన్నిబట్టి చూస్తే పెరిగిన ఓటింగ్‌ శాతం ప్రభుత్వానికి అనుకూలమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారం టీడీపీదేననే ధీమా ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెజార్టీ ఎంత అనే దానిపైనే వారిలో జోరుగా చర్చ జరుగుతోంది. పోటాపోటీగా ఎన్నికలు జరిగాయని చెప్పుకుంటున్నప్పటికీ.. మహిళాఓటర్లు అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం టీడీపీకి అనుకూలమైన అంశంగా రాజకీయ విశ్లేషకులు, మేధావివర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
జిల్లాలో 32,39,517 మంది ఓటర్లుండగా.. 26,54,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 13,43,176మంది, మహిళలు 13,11,031 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు కులాలు, వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఓట్ల చీలిక ఉంటుంది. అలాగే వారు ఫలానా పార్టీకి ఓటేయాలనే నిర్ణయం ముందుగానే తీసుకుని ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పోలైన ఓట్లలో 80 నుంచి 85 శాతం వరకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకే పోలై ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయనే అభిప్రాయం మేధావివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అయితే మహిళాఓటర్ల విషయంలో నిర్ణయం అలా ఉండదనే వాదన వినిపిస్తున్నారు. మహిళలు ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకునే విషయంలో స్పష్టత ఉండదంటున్నారు. ఎవరైతే ప్రభుత్వపరంగా లబ్ధి పొందారో.. వారిలో 75 శాతం మంది అధికార పార్టీకే ఓటు వేసి ఉండే అవకాశముందంటున్నారు.
 
ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే మహిళాఓటర్లలో అత్యధికంగా టీడీపీకే ఓటు వేశారని రూఢి అవుతోంది. ఇదే తమ విజయంపై టీడీపీ అభ్యర్థుల్లో ధీమా పెంచుతోంది. ఈవీఎంల మొరాయింపుతో మహిళాఓటర్లు ఇంటికి వెళ్లిపోయినా.. చంద్రబాబు విజ్ఞప్తితో తిరిగి ఓటేసేందుకు వెళ్లడం చూస్తే మహిళలు టీడీపీ వైపే ఉన్నారనే విశ్వాసం టీడీపీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
 
 
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పోలింగ్‌ కేంద్రం నుంచి ఓటు వేయకుండా ఇంటికి వెళ్లిపోయిన మహిళలు మరోసారి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి గంటలతరబడి క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు ఓటు వేసిన పరిస్థితి చూడలేదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, సీనియర్‌ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ గెలుపుపై ధీమా పెంచుతున్నాయని పలువురు టీడీపీ అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కంటే మెజార్టీ ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం ఆ పార్టీ అభ్యర్థుల్లో వ్యక్తమవుతూండడం విశేషం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...