Jump to content

Ramayapatnam Port


sonykongara

Recommended Posts

రామాయపట్నం పోర్టుకు గ్రీన్‌సిగ్నల్
11-09-2018 18:41:08
 
అమరావతి: రామాయపట్నం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పోర్టు ఏర్పాటుకు అవకాశం ఉందని సాంకేతిక, ఆర్థిక కమిటీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నం పోర్టును ప్రభుత్వం ప్రకటించింది. డీపీఆర్‌ తయారీ బాధ్యతను అర్హత గల ఏజెన్సీకి అప్పగించాలని కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. ఇతర అనుమతులు, అధ్యయనం కోసం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జీవో నెం.28ని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్‌ జారీ చేశారు.
Link to comment
Share on other sites

రామాయపట్నానికి రైట్‌ రైట్‌
12-09-2018 03:11:24
 
  • చిన్న తరహా పోర్టు నిర్మాణం
  • రాష్ట్రమే చేపట్టేలా ఉత్తర్వులు
  • కృష్ణపట్నం యాజమాన్యంతో చర్చలు
  • దుగరాజపట్నం బాధ్యత కేంద్రానిదే
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రామాయపట్నం మైనర్‌ పోర్టు నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. దీనిపై ఇంధన, మౌలిక సదుపాయాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో... విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం మేజర్‌ పోర్టు నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. దుగరాజపట్నం మేజర్‌ పోర్టుపై కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓడరేవుల విషయంలో ప్రత్యామ్నాయాలను పరిశీలించారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో చిన్నతరహా ఓడరేవును నిర్మించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. స్థానికులు కూడా ఓడరేవు కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ రేవు నిర్మాణంతో స్థానికుల ఆకాంక్షను నెరవేర్చడంతోపాటు... ఉపాధి కల్పన, అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు భావించారు.
 
ఎన్నాళ్లుగానో...
రాష్ట్రంలో రెండో మేజర్‌ ఓడరేవు నిర్మించాలని 2011లోనే కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి రాష్ట్రంలో నక్కపల్లి, రామాయపట్నం, దుగరాజపట్నంలలో మేజర్‌ పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామాయపట్నంలో మేజర్‌ పోర్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని 2012లో సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈలోగా 2014లో రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన చట్టంలో... 2012లో ఏపీ సర్కార్‌ సిఫారసు చేసిన రామాయపట్నంలో కాకుండా దుగరాజుపట్నం వద్ద మేజర్‌ పోర్టును నిర్మిస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. ఇతర ప్రధాన హామీల్లాగే దుగరాజపట్నం పోర్టునూ సముద్రంలో కలిపేసింది. ఈ నేపథ్యంలో, రామాయపట్నంలో మైనర్‌పోర్టును రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఇన్‌క్యాప్‌) ద్వారా నిర్మించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్టు (టీఈఎ్‌ఫఆర్‌)ను ఇవ్వాల్సిందిగా మెసర్స్‌ రైట్స్‌ను 2015లో రాష్ట్ర ఇంధన మౌలిక సదుపాయాల కల్పనా శాఖ కోరింది.
 
గత ఏడాది సెప్టెంబరు 19న దీనికి సంబంధించిన నివేదిక అందింది. మైనర్‌ పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. అయితే... ఈ పోర్టు నిర్మించే ప్రాంతం కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఉంటుందని తెలిపింది. కృష్ణపట్నం పోర్టు సరిహద్దులను 2008లోనే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. రామాయపట్నంలో చిన్నతరహా ఓడరేవు నిర్మాణానికి అభ్యంతరం చెప్పకుండా ఒప్పించింది. కృష్ణపట్నం ఓడరేవు ప్రధాన పోర్టుగా ఉంటుందని, రామాయపట్నం చిన్నతరహా ఓడరేవు మాత్రమేనని స్పష్టం చేసింది. అన్నిరకాల అడ్డంకులు తొలగిపోవడంతో... రామాయపట్నం మైనర్‌ ఓడరేవు నిర్మాణం చేపడుతున్నట్లుగా రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు.
Link to comment
Share on other sites

ఆశల తీరంలో... ఆకాంక్షల అడుగు..!
ఓడరేవుకు అడ్డంకులు తొలగినట్లే...
కృష్ణపట్నం పరిధిని కుదిస్తూ ఉత్తర్వులు
నాన్‌- మేజర్‌ పోర్టుగా ‘రామాయపట్నం’
ఈనాడు డిజిటల్‌- ఒంగోలు
pks-top1a.jpg

అడ్డంకులు తొలిగాయి.. చిక్కుముడులు వీడాయి.. పోర్టు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి..! ఇన్నాళ్లు రామాయపట్నంలో పోర్టు నిర్మాణం ఎందుకు సాధ్యపడటం లేదో గుర్తించి, ఆ సమస్యనే పరిష్కరించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ, కొద్దిరోజులుగా ఆయన జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. దీంతో చివరిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదించారు. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో.. మరే ఇతర పోర్టు నిర్మాణం చేయరాదని 2008 అక్టోబరులో, 2009లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం, దానికి 103 కిలోమీటర్ల దూరంలోనే రామాయపట్నం ఉండటంతో ఇక్కడ పోర్టు సాధ్యపడలేదు. సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ మంగళవారం జీవో నంబరు 28ని జారీ చేశారు. తద్వారా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అధికారికంగా తొలి అడుగు పడినట్లయింది. నిర్మాణ ప్రక్రియ, ఇతర పనులు వేగం పుంజుకోనున్నాయి. వచ్చే నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వ్యవధిలో నిధుల మంజూరు, సాంకేతిక అంశాలు, టెండర్లు, భూసేకరణ తదితర ఇతర అంశాలూ పరిష్కరించాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం...
‘రామాయపట్నం’లో నాన్‌ మేజర్‌ పోర్టును నిర్మించనున్నారు. నిజానికి కేంద్రం విభజన చట్టం హామీల్లో భాగంగా దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం జరగాల్సి ఉన్నా... సాంకేతిక కారణాలతో సాధ్యం కాదని తేలింది. కేంద్రమే నిధులిచ్చి, నిర్మాణం చేపడితే మేజర్‌ పోర్టు అవుతుంది. దీనిలో లావాదేవీలు, సరకు రవాణా సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిర్వహణ మొత్తం కేంద్రం అధీనంలోనే జరుగుతుంది. నాన్‌ మేజర్‌ పోర్టు అంటే.. నిధులు, నిర్మాణం, నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలదే. దేశ వ్యాప్తంగా 52 శాతం సరకు రవాణా మేజర్‌ పోర్టుల ద్వారా, 48 శాతం సరకు నాన్‌ మేజర్‌ పోర్టుల ద్వారా జరుగుతోంది. దేశ వ్యాప్తంగా మేజర్‌ పోర్టులు 12 ఉండగా- విశాఖపట్టణంలో ఉండేది దీని కిందకే వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 12 నాన్‌ మేజర్‌ పోర్టులు ఉండగా- రామాయపట్నంలో నిర్మించనున్నది 13వది. దీని సామర్థ్యం, పరిధి, పరిమితి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. నిర్మాణానికి భాగస్వామ్య సంస్థలతో త్వరలోనే ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు.

అన్నీ సానుకూల అంశాలే...
రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి అన్నీ సానుకూల అంశాలే. 2011లోనే రాష్ట్రంలో రెండో మేజర్‌ పోర్టు (మొదటిది విశాఖపట్టణం) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. రాష్ట్రంలోని నక్కపల్లి, రామాయపట్నం, దుగరాజపట్నంలో పరిశీలన జరిపిన బృందం... అందుకు రామాయపట్నమే సరైన ప్రాంతమని తేల్చింది.

* 2015లో రాష్ట్ర ప్రభుత్వం నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణానికి పరిశీలన జరపాలని ఒక కమిటీని నియమించింది. రామాయపట్నంలో సాంకేతిక అంశాలు, భూములు, స్థానిక వాతావరణ పరిస్థితులు పరిశీలించిన బృందం.. అన్నీ సానుకూల అంశాలేనని నివేదిక ఇచ్చింది. ఇలా పలు పరిశీలనలు, పరిశోధనల తర్వాతే పోర్టు నిర్మాణానికి అంగీకరించారు. కృష్ణపట్నం పోర్టు పరిధి పేచీ ఉండటంతో ఇన్నాళ్లు నాన్చారు. చివరకు జిల్లాలో ఆశలు, పోరాటాలు ఫలించేలా ముఖ్యమంత్రి హామీ మేరకు నిర్మాణానికి అడ్డంకులు తొలగించారు.

సమష్టి పోరాట ఫలం...!
రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి జిల్లాలో సుదీర్ఘ కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. రామాయపట్నం పోర్టు సాధన సమితి ఏర్పాటై పలుమార్లు చర్చా వేదికలు, పోరాటాలు చేశారు. మరోవైపు జిల్లాలోని ప్రజాప్రతినిధులు తరచూ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా తెదేపా సమన్వయ కమిటీ సమావేశాలు, మహానాడు నిర్వహణల్లోనూ రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని అంశంగా చేర్చి తీర్మానాలు పంపారు. ఇప్పటికి వరకూ ఇలా 16 తీర్మానాలు ఆమోదించి రాష్ట్ర ప్రతినిధులకు పంపారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ సహా ఎమ్మెల్యేలు సైతం ఈ విషయమై ముఖ్యమంత్రితో చాలా సార్లు చర్చించారు. జిల్లా నుంచి పోరాటాలు చేస్తున్న ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు వినతులు అందించారు. ఇన్ని పోరాటాల ఫలితంగా పోర్టు నిర్మాణ కల సాకారం సాధ్యమవుతోంది.

దొనకొండలో ఎయిర్‌బేస్‌...! 800 ఎకరాలు అవసరమని ప్రతిపాదన
ఈనాడు డిజిటల్‌- ఒంగోలు : దొనకొండలో ఎయిర్‌ బేస్‌ నిర్మాణానికి భూమి ఇవ్వాలని సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ ముఖ్య అధికారి బి.సురేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎయిర్‌ బేస్‌ల నిర్మాణానికి స్థలాలు కోరే క్రమంలో, జిల్లాలోని దొనకొండలోనూ 800 ఎకరాలు అవసరమంటూ ప్రతిపాదించారు. ఇతర జిల్లాల కంటే దొనకొండలో అత్యధికంగా ప్రతిపాదించారు. గతంలోనే ఇక్కడ ఎయిర్‌ వే, బేస్‌ల నిర్మాణానికి భూముల పరిశీలన జరిగింది. అనుకూల, ప్రతికూల అంశాలతో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేశారు. అవి పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అధికారి ముఖ్యమంత్రిని కలిసి దొనకొండలో భూమిని కోరడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఎయిర్‌పోర్టు ఉండేది. ఇక్కడ పారిశ్రామికవాడ ప్రకటించడం, పలువురు ప్రతినిధులు వచ్చి చూస్తుండడంతో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పలు సంస్థలు వచ్చి చూసి వెళ్లాయి. తాజాగా ఈ ప్రతిపాదన జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఈ సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొని, స్థానిక పరిస్థితులను ఆ అధికారులకు వివరించారు.

Link to comment
Share on other sites

తొలగిన అడ్డంకి!
రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు మార్గం
కృష్ణపట్నం పోర్టు పరిధి తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు
nlr-top1a.jpg

జిల్లాను ఆనుకుని మరో కొత్త పోర్టు ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం దగ్గర పోర్టు ఏర్పాటు కోసం ప్రధానమైన అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాకు ఉత్తర ప్రాంతం(కావలి పరిసర మండలాలు) మొత్తం కొత్త పోర్టుకు అనుసంధానం కానున్నాయి.

ఈనాడు-నెల్లూరు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2008లో కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సరిహద్దులను నిర్దేశించారు. ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌ సంస్థకు భూములకు కేటాయించారు. రెండు సంస్థల మధ్య ఉన్న రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు ఇది అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గించటం.. వాన్‌పిక్‌కు కేటాయించిన భూములను డీ-నోటిఫై చేయటంతో సమస్య రామయపట్నం పోర్టు ఏర్పాటుకు మార్గం ఏర్పడింది.

ఏళ్లుగా పోరాటం
రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2008లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం కృష్ణపట్నం, వాన్‌పిక్‌కు భూములను ఇవ్వటంతో కొత్తగా సరకు రవాణా పోర్టు ఏర్పాటుకు ఆస్కారం లేకుండా పోయింది. కృష్ణపట్నం పోర్టుకు ప్రస్తుతం ఉన్న సరిహద్దు నుంచి 30 కి.మీల మేర పరిధిని విస్తరిస్తూ జీవోను అప్పటి వైఎస్‌ ప్రభుత్వం విడుదల చేసింది.  రామాయపట్నం ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది.

మరో ప్రాంతం పరిశీలన
2011లో రాష్ట్రంలో మరో పోర్టు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాన్ని పరిశీలించాలని కేంద్రం ప్రభుత్వం సాంకేతిక కమిటీకి సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పరిశీలించిన కమిటీ.. రాష్ట్రంలో నక్కపల్లి, రామాయపట్నం, దుగరాజపట్నం దగ్గర మరో పోర్టు ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా 2012లో రామాయపట్నంలో మరో పోర్టు ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పోర్టు అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది.

తెదేపా అధికారంలోకి వచ్చాక...
రాష్ట్రంలో తెదేపా అధికారం చేపట్టిన తర్వాత రామాయపట్నం దగ్గర పోర్టు ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను రైట్స్‌ సంస్థకు అప్పగించింది. పోర్టు ఏర్పాటుకు అయ్యే వ్యయం.. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం.. ఇతర అంశాలకు సంబంధించి రైట్స్‌ సంస్థ నివేదికను సమర్పించింది. రాష్ట్ర మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రామయపట్నం దగ్గర పోర్టు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది.

పరిగణనలోకి రైట్స్‌ నివేదిక
రైట్స్‌ సంస్థ తుది నివేదికను 2017, సెప్టెంబరు 19వ తేదీన ప్రభుత్వానికి అందించింది. ఇందులో రామాయపట్నం దగ్గర ఓడరేవు ఏర్పాటుకు అనుకూల పరిస్థితి ఉందని తుది నివేదికలో ప్రస్తావించింది.  రైట్స్‌ సంస్థ ఇచ్చిన తుది నివేదికను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రామయపట్నం దగ్గర ఓడరేవు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ పోర్ట్సు ఏర్పాటుకు మార్గం తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ భూముల రద్దు.. ఈ మేరకు గతంలో జీవో నెంబర్లు 40/2008, 09/2009 ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కృష్ణపట్నం పోర్టు పరిధికి కేటాయించిన భూములను రద్దు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో వైఎస్‌ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుకు 30 కి.మీల దూరం పరిధిని విస్తరిస్తూ కేటాయించిన పరిధి రద్దు అవుతుంది.

బిల్లులో చేర్చి...
* 2014లో కేంద్రం ప్రకటించిన విభజన చట్టంలో దుగరాజపట్నం దగ్గర ఓడరేవు ఏర్పాటు అంశాన్ని బిల్లులో చేర్చారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో దుగరాజపట్నం దగ్గర ఓడరేవు ఏర్పాటు వల్ల ప్రయోజనం లేదని తేల్చారు. కేంద్రం కూడా దుగరాజపట్నం దగ్గర ఓడరేవు ఏర్పాటు అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.

తాజాగా ప్రభుత్వం ఉత్తర్వు
కృష్ణపట్నం పోర్టు పరిధిని విస్తరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో నెం28/2018 ద్వారా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రామాయపట్నం దగ్గర పోర్టు ఏర్పాటు చేసే అంశాన్ని గతంలో వైకాపా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేసింది. వైఎస్‌ హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల వల్ల పోర్టు ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయిందని తెదేపా నేతలు చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు పోర్టు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనివల్ల పోర్టు పరిధి ప్రకాశం జిల్లాలో ఉన్నా అభివృద్ధి కావలి పరిసర ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుందని జిల్లా తెదేపా నేతల అంచనాగా ఉంది. రామాయపట్నం ఏర్పాటుకు అవకాశం కల్పించే విధంగా కృష్ణపట్నం పోర్టుకు కేటాయించిన భూములను డీ-నోటిఫై చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వులు ఇచ్చేలా చేశారని కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఓడరేవుతో మారనున్న రూపురేఖలు

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండలంలోని రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పోతుల రామారావు, అటవీ అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దివి శివరాం అన్నారు. రామాయపట్నంలో వారు మంగళవారం పర్యటించారు. తొలుత ఓడరేవు నిర్మాణానికి అంగీకరించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృజ్ఞతలు తెలిపారు. ఓడరేవు కారణంగా గ్రామాలను ఖాళీ చేయించాల్సి వస్తే వారికి అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషిచేస్తున్నారని అన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే కాలువ పనులు పూర్తికావచ్చాయని చెప్పారు. లోయర్‌ ఉప్పుటేరు ఛానల్‌పై షట్టర్లు ఏర్పాటుచేస్తే త్వరలో నీరు సరఫరా అవుతుందని.. పరిసర మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం తాజా మాజీ సర్పంచి కృష్ణారావు, నాయకులు బ్రహ్మయ్య, తెట్టు, సాలిపేట, గుడ్లూరు, ఉలవపాడు గ్రామస్థులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రామాయపట్నం పోర్టుతో ప్రగతి బాట 
సీఎంకు అభినందన సభలో మంత్రులు నారాయణ, శిద్దా 
కందుకూరు - న్యూస్‌టుడే
రామాయపట్నం పోర్టు నిర్మాణంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ప్రగతి బాటలో పయనిస్తాయని మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు అన్నారు. రూ.4,880 కోట్ల అంచనాతో ఈ పోర్టును నిర్మించనున్నట్లు తెలిపారు. ఓడరేవు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురువారం రామాయపట్నం తీరంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి ఓడ రేవే కీలకమన్నారు. కృష్ణపట్నం పోర్టు పరిధిని 80 కిలోమీటర్ల నుంచి 110 కిమీకి పెంచుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుమతించారని, ఆ కారణంగానే ఇన్నాళ్లూ పోర్టు నిర్మాణానికి అడ్డంకులు వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాకచాక్యంగా ఈ సమస్యను పరిష్కరించారని వివరించారు. పోర్టు నిర్మాణంలో మేజర్‌, నాన్‌ మేజర్‌ అని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు మొదట చట్టాలు తెలుసుకోవాలని సూచించారు. ‘‘మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇది నాన్‌ మేజర్‌ అంటున్నారు. పోర్టుల చట్టం 1908 సెక్షన్‌-3 క్లాజ్‌ 8 ప్రకారం.. మేజర్‌ పోర్టులను కేంద్రం, నాన్‌ మేజర్‌ పోర్టులను రాష్ట్రాలు నిర్మిస్తాయి. కృష్ణపట్నం పోర్టు మైనర్‌ అయినా అది దేశంలోనే అత్యధిక లావాదేవీలు జరుపుతోంది. ఈ విషయాలు తెలుసుకోవాలి’ అని సూచించారు. మంత్రి శిద్దా మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఉన్న అపార అనుభవంతో రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి కృషి చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రామాయపట్నాన్ని ‘చిన్న’బుచ్చొద్దు!
21-09-2018 03:26:30
 
636730971872867080.jpg
  • రాష్ట్రం ఏర్పాటుచేసినా భారీతనం తగ్గదు
  • ఈ ఓడరేవు అభివృద్ధికి ఢోకా ఉండబోదు
  • నాన్‌, మేజర్‌ అనేవి సామర్థ్యచిహ్నాలు కావు
  • దేశంలోని ముఖ్య పోర్టులన్నీ నాన్‌ మేజరే
  • ఈ అవగాహనా లేకుండా విమర్శలా?
  • సభలుపెట్టి జనంలో భయం రేపుతారా?
  • వైసీపీ నేతలపై మంత్రి నారాయణ ఫైర్‌
  • రామాయపట్నానికి జీవో విడుదలచేసిన
  • ‘సీఎంకు కృతజ్ఞత’గా పోర్టు ప్రాంతంలో సభ
కందుకూరు, సెప్టెంబరు 20: ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ తిప్పికొట్టారు. రామాయపట్నంలో ఏర్పాటు చేస్తున్నది నాన్‌ మేజర్‌ పోర్టు అని, మేజర్‌ పోర్టు ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న వాదనలో పస లేదని తేల్చిచెప్పారు. ఓడరేవును కేంద్రం ఏర్పాటు చేస్తున్నదా లేక రాష్ట్ర ప్రభుత్వమా అనేది తప్ప ఒక పోర్టు సామర్థ్యాన్ని నాన్‌, మేజర్‌ అనేవి నిర్ణయించబోవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడితే నాన్‌ మేజర్‌ అని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తే మేజర్‌ అని అంటారన్న ఆయన, ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
రామాయపట్నంలో రాష్ట్రప్రభుత్వం సారథ్యంలో ఓడరేవు నిర్మాణానికి జీవో విడుదల అయిన నేపథ్యంలో ఓడరేవు నిర్మాణం జరిగే ప్రదేశంలో గురువారం ‘ముఖ్యమంత్రికి కృతజ్ఞత’ సభ జరిగింది. ఈ సభా వేదికగా మంత్రి నారాయణ విపక్షాలపై విరుచుకుపడ్డారు. రామాయపట్నంలో భారీ ఓడరేవును నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. రూ.4,883 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఓడరేవు రాకతో వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో అడుగుపెడుతుందని ఆకాంక్షించారు. నిజానికి, ఈ పోర్టు ఎప్పుడో అందుబాటులోకి రావాల్సి ఉన్నా, వైఎస్‌ ప్రభుత్వం నిర్వాకంతో నిర్మాణానికి నోచుకోలేకపోయిందని విమర్శించారు. ‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో, 2008లో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి రామాయపట్నం పోర్టు ప్రాంతాన్ని కూడా అనుసంధానం చేశారు. అప్పట్లో కుదిరిన ఆ ఒప్పందమే ఈ పోర్టుకు శాపమయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో ఈ పోర్టుకు ఉన్న సాంకేతిక అవరోధాలను అధిగమించాం.
 
న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాం. దానికోసం ముందుగానే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సమ్మతి పొందాం. రామయపట్నానికి ఉన్న అన్ని అడ్డంకులను క్రమంగా తొలగిస్తూ.. ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. అతి త్వరలోనే పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రామాయపట్నం విషయంలో వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. మేజర్‌ పోర్టుకి నాన్‌ మేజరు పోర్టుకి తేడా తెలియని వ్యక్తులు సభలు పెట్టి ప్రజలను రెచ్చగొడుతుండటం హాస్యాస్పదమన్నారు. ‘‘దేశంలో ఇప్పటికి 212 పోర్టులు ఏర్పాటయ్యాయి. అందులో కేంద్రం ఏర్పాటుచేసిన 13 మాత్రమే మేజర్‌ పోర్టులు.
 
మిగతావన్నీ నాన్‌ మేజరు పోర్టులే. గుజరాత్‌లో రిలయన్స్‌ ఆధ్వర్యంలో దేశంలోనే అత్యధికంగా 150 మిలియన్‌ టన్నుల సామర్థ్యంలో నడుస్తున్న పోర్టు.. నాన్‌ మేజరు. అదేరాష్ట్రంలో అదానీ గ్రూప్‌ సారథ్యంలో 125 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రెండో అతి పెద్ద పోర్టు కూడా నాన్‌ మేజర్‌ కేటగిరీలోనే ఏర్పాటయింది. అంతెందుకు మన రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టు కూడా నాన్‌ మేజరే’’ అని వివరించారు. పేరుకు మేజర్‌ అయినా, కేంద్రమే ఏర్పాటుచేసినా, ఏటా 25 మిలియన్‌ టన్నుల కార్యకలాపాలు కూడా జరగని ఓడరేవులు ఎన్నో కనిపిస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు అధ్యక్షత వహించగా, మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

‘రామాయపట్నం’పై కదలిక! 
పోర్టు డీపీఆర్‌ తయారీకి రైట్స్‌ సంస్థతో సర్కారు ఒప్పందం 
9 అంశాలపై  ఏడాదిలో నివేదిక 
ఈనాడు డిజిటల్‌ - ఒంగోలు

ప్రకాశం జిల్లా ప్రగతికి ఊపిరిలూదే రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదించడం, రామాయపట్నం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లాంటివి గడిచిన నెలలోనే జరిగాయి. తాజాగా పోర్టు నిర్మాణంలో కీలకమైన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయడానికి రైట్స్‌ సంస్థతో ప్రభుత్వం రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పోర్టు నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక అంశాలు, వ్యయం అంచనా, ఆకృతులు రూపకల్పన...తదితర 9 కీలకాంశాలను పరిశీలించి ఏడాదిలోగా (వచ్చేఏడాది సెప్టెంబరు 20లోగా) డీపీఆర్‌ తయారుచేయాలని ప్రభుత్వం గడువు విధించింది. రైట్స్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ కేజీఎస్‌.శర్మ ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు పది మంది నిపుణుల బృందం డీపీఆర్‌ కోసం పనిచేస్తుంది. నివేదిక విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా.. కాకినాడ పోర్టు డైరెక్టర్‌ రైట్స్‌ సంస్థతో సమన్వయం చేస్తుంటారు.

కీలకమైన 9 అంశాలు...! 
* పోర్టు నిర్మాణానికి అనుకూలమైన ఆకృతి ఇవ్వాలి. దాని కోసం వాతావరణ పరిస్థితులు, భూముల లభ్యత, అన్నీ పరిశీలించాలి. పలు విధాలుగా ఆకృతులను ప్రతిపాదిస్తే వాటిలో ఒక ఆకృతిని ఖరారు చేస్తారు. 
* అయిదు బెర్తులు, పరిపాలనా భవనం, షెడ్డుల నిర్మాణ ఆకృతులు ఇవ్వాలి. పోర్టులో పేపర్‌ మిల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. రానున్న 25 ఏళ్లలో 3 మిలియన్‌ టన్నుల పేపర్‌ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు అందాల్సి ఉంది. ఇక్కడే పరిపాలన భవనం, సిబ్బంది కార్యాలయాలు, సమావేశ భవనాలు, నీటి పథకాలు నిర్మాణం జరగాలి. వీటిని డీపీఆర్‌లో పొందుపరచాలి. 
* పోర్టు లోపల వసతుల నిర్మాణం. అంతర్గత రహదారులు, రైల్వే నెట్‌వర్క్‌, అగ్నిమాపక కార్యాలయం, డ్రెయినేజీ, షిప్పులకు నీటి సరఫరా పథకాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. 
* పోర్టుకు రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం; బకింగ్‌హామ్‌ కాలువ నుంచి రవాణా సదుపాయం లాంటివి పరిశీలించాలి. 
* పోర్టులో కార్గో రవాణాకు సంబంధించిన సాంకేతిక అంశాలను సూచించాలి. 
* భారత ప్రభుత్వం పర్యావరణ నిబంధనలకు అనుసరించి పోర్టు నిర్మాణం జరగాలి. అందుకు తగిన పరిశీలనలు చేయాలి. స్థానిక ప్రజల అభిప్రాయాలు పరగణనలోకి తీసుకోవాలి. సీఆర్‌జెడ్‌ (కోస్తా ప్రాంతీయ జోన్‌) నిబంధనలు ప్రకారం ఆకృతులు, నివేదికలు ఉండాలి. 
* సహజ సిద్ధ గ్యాస్‌ నిర్వహణ, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్వహణలను సూచించాలి. 
* అన్ని నిర్మాణాలకు ఎంత వ్యయమవుతుందో సూచించాలి. వీటికి విడివిడిగా బిడ్‌ పత్రాలు రూపొందించాలి. టెండర్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక అందించాలి. 
* పనుల సమయంలో అవసరమైన మెరైన్‌ లిఫ్టులు, క్రేనులు, యంత్ర పరికరాలు, భారీ వాహనాల అవసరాలను టెండర్‌ విధానాల్లోనే ప్రతిపాదించాలి. నివేదిక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత నిర్మాణ ప్రక్రియ మొదలువుతుంది.

Link to comment
Share on other sites

కృష్ణపట్నానికి దీటుగా రామాయపట్నం!
27-09-2018 03:25:48
 
636736155497174493.jpg
  •  2 కోట్ల టన్నుల ముడి సరుకులు
  •  దిగుమతి చేసేలా రూపకల్పన
  •  కాకినాడ పోర్టు డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి
కావలి: వైజాగ్‌ పోర్టు కన్నా పెద్దదిగా.. కృష్ణపట్నం రేవుకు దీటుగా రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపడతామని కాకినాడ పోర్డు డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రామాయపట్నం రేవు కోసం భూ సేకరణలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లా కావలి ఆర్‌డిఒ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి చేపట్టాల్సిన భూసేకరణపై చర్చించారు. పోర్టు నిర్మాణానికి 3,500 ఎకరాలు, దాని పరిధిలో పేపరు మిల్లునిర్మాణానికి 2,000 ఎకరాలు కలిపి మొత్తం 5,500 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భూసేకరణ చేపట్టాలనే విషయంపై రామాయపట్నం, రావూరు, చేవూరు, చెన్నాయపాలెం పరిధిలోని గ్రామాల మ్యాపులను పరిశీలించారు. ప్రకాశం జిల్లా సరిహద్దు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలో 500 మీటర్ల పొడవున భూసేకరణ జరపాలని నిర్ణయించారు.
 
అనంతరం ప్రవీణ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. మైనర్‌ పోర్టు అంటే చిన్నది కాదు. రామాయపట్నం పోర్టులో 2 కోట్ల టన్నుల ముడిసరుకు దిగుమతి చేసేలా రూపకల్పన చేస్తున్నాం’ అని తెలిపారు. సమీక్షలో కాకినాడ పోర్టు ఎస్‌ఇ రాఘవరావు, పోర్టు అధికారి ధర్మశాస్త్రి, కావలి, కందుకూరు ఆర్‌డిఒలు భక్తవత్సలరెడ్డి, రామారావు, సిఆర్‌డిఎ సభ్యులు బీద మస్తాన్‌రావు, తహశీల్దార్‌ గోళ్ల వెంకటేశ్వర్లు, సర్వేయర్లు, రైట్స్‌ సంస్థ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ బృందం తీరం వెంబడి చెన్నాయపాలెం, చేవూరు, రావూరు మీదుగా రామాయపట్నం వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది.
Link to comment
Share on other sites

మరో కీలక అడుగు
రామాయపట్నం తీరంలో ఓడరేవు అధికారుల బృందం పరిశీలన
భూ వివరాలతోపాటు సంబంధిత అంశాలన్నిటిపై ఆరా!
రామాయపట్నం(ఉలవపాడు), న్యూస్‌టుడే:
pks-top1a.jpg

జిల్లాకు కీలకమైన రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి ముందు పనులు వేగవంతమయ్యాయి. పూర్తి డీపీఆర్‌ తయారు చేసి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇటీవల రైట్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కీలకమైన క్షేత్ర పరిశీలనకు బుధవారం నిపుణుల బృందం వచ్చింది. ఓడరేవుల సంచాలకుడు ప్రవీణ్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధులు బుధవారం నెల్లూరు జిల్లా కావలి నుంచి గుడ్లూరు, ఉలవపాడు మండలాల పరిధిలోని తీరాన్ని పరిశీలించారు. పోర్టు ప్రతిపాదిత స్థలంలో పర్యటించారు. ఏర్పాటుకు నిర్దేశించిన ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామాన్ని పోర్ట్సు డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని బృందం వీక్షించారు. సముద్ర తీరంతోపాటు గ్రామాలు ఎన్ని ఉన్నాయి?  గుడ్లూరు మండలంలో తీర ప్రాంతం ఎన్ని కిలోమీటర్ల మేర ఉంది? గ్రామాల్లో అటవీభూమి? ఇతర పోరంబోకు భూమి? పట్టా భూమి? ఎంతెంత ఉందనేది ఆరా తీశారు. కావలి, కందుకూరు ఆర్డీవోలు అధికారుల బృందం వెంట ఉన్నారు. నిపుణులు రెవెన్యూ అధికారులను అడిగి భూమికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

3,500 ఎకరాల భూమి అవసరం...!
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సరాయిపాలెం మీదుగా తీరంలోని గ్రామాలను కలుపుతూ ఉన్న రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. అనంతరం రామాయపట్నం- తెట్టు, చేవూరు, రావూరు గ్రామాలను కలుపుతున్న తారు రోడ్డు మార్గం నుంచి జాతీయ రహదారిని కలుపుతున్న మార్గాలనూ పరిశీలించారు. తీరంలోని ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామంతోపాటు గుడ్లూరు మండలం తీర ప్రాంత గ్రామాలు, కావలి మండలం చెన్నాయపాలెం వరకూ పోర్టు విస్తరించనున్నారు. మొత్తం 3,500 ఎకరాల భూమి పోర్టుకు అవసరమనీ, వాటిలో పేపర్‌ మిల్లు ఏర్పాటుకు రెండు వేల ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు. గుడ్లూరు మండలం, కావలి మండలంలోని చెన్నాయపాలెం, ఉలవపాడు మండలంలోని రామాయపట్నం సరిహద్దులను, ఆయా గ్రామాల రేఖా పటాలను పరిశీలించారు. త్వరలో పోర్టుకు కావాల్సిన భూములు ఏ ప్రాంతంలో తీసుకోవాలో నిర్ణయిస్తామని పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. పోర్టులో అయిదు బెర్తులు నిర్మించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పోర్టు డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు కాకినాడ పోర్టు బృందం, ఏపీఐఐసీ ఒంగోలు జోనల్‌ మేనేజరు నరసింహారావు, కందుకూరు ఆర్డీవో రామారావు, గుడ్లూరు, ఉలవపాడు తహసీల్దార్లు సీతారామయ్య, పద్మావతి, మెరైన్‌ సీఐ శేషయ్య, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...