Jump to content

నూటికో... కోటికో... ఒక్కడు! ఒకే ఒక్కడు!!


NBK2NTRMT

Recommended Posts

DA2stXAUMAAv5W0.jpg

 

 

 

సినిమాల్లోనైనా, సామాజిక సిద్ధాంతాల నమ్మకంలోనైనా తెలుగునాట చెరిగిపోని చరిత్రను నెలకొల్పిన ఘనుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆల్‌ ఇండియా రికార్డులు సృష్టించిన హిందీ చిత్రాల రికార్డులను తెలుగునేలపైన సాధించిన ఘనత ఎన్టీయార్‌ చిత్రాలకే దక్కుతుంది. అసలు తెలుగునాట వసూళ్ళ పర్వం ఆరంభమైందే ఎన్టీయార్‌ చిత్రాలతో. 1963లో ఎన్టీయార్‌ లవకుశ ఆ రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసి ఉత్తరాదివారిని సైతం అబ్బురపరచింది.
 
 
 
ఎన్టీయార్‌ ఏకచ్ఛత్రాధిపత్యం
ఆ రోజుల్లో ఓ సినిమా కోటి రూపాయలు సాధించడం అంటే ఈ రోజున వందలాది కోట్లు వచ్చినట్టే! ఎన్టీయార్‌ సినీ రంగంలో ఉన్నంత వరకు తెలుగునాట కోటిరూపాయలు చూసిన చిత్రాలు పదిహేను. అందులో పదమూడు ఎన్టీయార్‌వే కావడం విశేషం. టికెట్‌ ట్యాక్స్‌తో డైలీ కలెక్షన్ రిపోర్టు(డి.సి.ఆర్‌)ల ఆధారంగా నడిచిన ఆ రోజుల్లో పత్రికల్లో వేసిన అధికారిక ప్రకటనల ద్వారా అవన్నీ సాధికారికంగా నిరూపితమైనవే. కోట్లు గడించిన ఆ చిత్రాలు ఏమిటంటే... లవకుశ (1963), దానవీరశూరకర్ణ, అడవిరాముడు, యమగోల (1977), డ్రైవర్‌ రాముడు, వేటగాడు (1979), ఛాలెంజ్‌ రాముడు, సర్దార్‌ పాపారాయుడు(1980), గజదొంగ, కొండవీటి సింహం (1981), జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, నాదేశం (1982). మిగతావి. శంకరాభరణం (1980), ప్రేమాభిషేకం (1981). ఏడాదికో రెండేళ్ళకో ఓ భారీ విజయం చూడడమే గగనమవుతున్న ఈ రోజుల్లో... ఎన్టీయార్‌ కురిపించిన ఈ వసూళ్ళ వర్షాన్ని చూస్తే స్టార్డమ్‌ అంటే ఏంటో అర్థమవుతుంది.
 
 
 
తెలుగునాట మొదటివారం కలెక్షన్స్‌ను ప్రకటించడం ఎన్టీయార్‌ జానపద చిత్రం ‘అగ్గి పిడుగు’ (1964)తోనే ప్రారంభమైంది. ఆ తరువాత నుంచీ మొదటి వారం వసూళ్లకు తెలుగునేలపై ఓపెనింగ్‌ కలెక్షన్లుగా ఆసక్తి నెలకొంది. తెలుగులో మొదటి వారం 23 లక్షల పైగా వసూలు చేసిన తొలి చిత్రం ‘అడవిరాముడు’ (1977). అప్పటి నుంచీ ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వెళ్ళే దాకా అంటే ‘నాదేశం’ (1982) వరకు ఆరేళ్లలో ఒక్క ఎన్టీయార్‌ చిత్రాలే రూ. 23 లక్షలకు పైగా ఓపెనింగ్స్‌ చూశాయి. అవి... అడవి రాముడు, వేటగాడు, యుగంధర్‌, ఛాలెంజ్‌ రాముడు, సర్కస్‌ రాముడు, సూపర్‌మేన, సర్దార్‌ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, బొబ్బిలిపులి, నాదేశం, రామకృష్ణులు, సత్యం- శివం. 1982లో సంచలన విజయమైన ‘బొబ్బిలిపులి’ ఏకంగా మొదటి వారం రూ.71 లక్షలు వసూలు చేసింది. ఇతరులెవరికీ అంతటి ఓపెనింగ్స్‌ ఉన్న సినిమా ఒక్కటీ రాలేదు. ‘బొబ్బిలిపులి’ వసూళ్ళలో మూడోవంతు కూడా ఇతరులు సాధించలేదు. ఒక స్టార్‌ హీరోకు ఇంతటి ఏకచ్ఛత్రాధిపత్యం ఏ ఇతర చిత్రసీమలోనూ కనిపించదు!
 
 
 
పరిశ్రమకు పెద్దన్న
తెలుగు సినిమా అభివృద్ధిలోనూ ఎన్టీయార్‌ పాత్ర అనితరసాధ్యం. ఆయన చిత్రసీమలో ప్రవేశించే నాటికి ఏడాదికి సుమారు పది తెలుగు సినిమాలు రూపొందేవి. తరువాతి రోజుల్లో ఏటా తెలుగులో రూపొందే చిత్రాల్లో ఎన్టీయార్‌ సినిమాలే ఎక్కువ. యాభై ఏళ్ళు దాటిన తరువాత కూడా ఎన్టీయార్‌ ఏడాదికి ఆరేడు చిత్రాల్లో నటిస్తూ ఉండేవారు. తన 55వ ఏట అంటే 1978లో అయితే ఏకంగా 12 చిత్రాల్లో నటించారాయన. ఆయన సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళేనాటికి ఏడాదికి దాదాపు వంద తెలుగు చిత్రాలు రూపొందే స్థాయికి వెళ్ళింది. ఇలా పరిశ్రమ పదిరెట్లు పెరగడంలో ఎన్టీయార్‌దే పెద్ద పాత్ర. తనకు నీడనిచ్చిన పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయన అహరహం తపించేవారు. ఆ తపనతోనే అధిక చిత్రాల్లో నటించి, పరిశ్రమను నమ్ముకున్నవారికి జీవనోపాధి కల్పించేవారు. తరువాతి తరం హీరోలు సైతం ఎన్టీయార్‌ను అనుసరిస్తూ ఎక్కువ చిత్రాల్లో నటించారు.
 
 
 
సిల్వర్‌స్ర్కీన్ సోషల్‌ డాక్యుమెంట్లు
కేవలం ఎక్కువ సంఖ్యలో చిత్రాల్లో నటించడమే కాదు. ఆయన నటించిన చిత్రాలు ఆ నాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ ఉండేవి. ఆ తరహా చిత్రాలు ఇతరులకు లేవని కాదు కానీ, ఎన్టీయార్‌ తన చిత్రాల్లో సమకాలీన పరిస్థితులకూ, సమస్యలకూ అద్దం పట్టి వాటికి తగ్గ పరిష్కారం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ఏ కోవ చిత్రం చేసినా ఆ చిత్ర కథాంశం, కథాగమనం నాటి కాలమాన పరిస్థితుల్నీ, అప్పటి జనజీవన సంస్కృతినీ ప్రతిబింబించడం విశేషం. అందుకే, ఆయన సినిమాలన్నీ సిల్వర్‌ స్ర్కీన్ పై సోషల్‌ డాక్యుమెంట్లు అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. కేవలం సినిమాల్లో ఆదర్శాలు వల్లించడం, ముఖాన రంగు తుడిచేసుకోగానే వాటిని మరచిపోవడం అన్నది ఎన్టీయార్‌ నిఘంటువులో లేదు. ఓ కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల కథగా స్వీయ రచన చేసి, ఆయన నటించి, తీసిన ‘ఉమ్మడి కుటుంబం’ (1967) చిత్రం ఆ రోజుల్లో ఎందరో అన్నదమ్ముల అనుబంధాన్ని తిరిగి బలపడేలా చేసింది. ఆ సినిమా స్ఫూర్తితో ఆ తరువాత కూడా చాలా చిత్రాలు రూపొందాయి. అప్పటి వర్ధమాన హీరోల భవిష్యత్తుకు బాటలు వేశాయి. 1967వ సంవత్సరానికి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఉమ్మడి కుటుంబం చిత్రం అప్పట్లో 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, విజయవాడలో డైరెక్టుగా 197 రోజులు ప్రదర్శితమయింది. భారతదేశ కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టే ఈ చిత్రంలోని ఔన్నత్యాన్ని గుర్తించిన భారతప్రభుత్వం ఆ సంగతిని అంతర్జాతీయ వేదికపై చాటేలా, దీన్ని మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అధికార ఎంట్రీగా పంపింది. ఇలా నందమూరి చిత్రాలు జనరంజకంగా ప్రదర్శితమై రికార్డులు సృష్టించడమే కాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ పాలుపంచుకున్న సందర్భాలున్నాయి.
 
 
 
నమ్మిన సిద్ధాంతానికే... నిబద్ధుడు
కళ కళ కోసం కాదు... సమాజసేవ కోసం అని నమ్మిన వ్యక్తి ఎన్టీయార్‌. నమ్మడమే కాదు... మనసా వాచా కర్మణా ఆచరించి చూపారు. తెలుగు భాషన్నా, తెలుగుజాతి అన్నా ఆయనకు ఎంతో అభిమానం. తెలుగుజాతి మనది... నిండుగ వెలుగుజాతి మనది అంటూ తెరపై నినదించిన ఏకైక కథానాయకుడూ ఆయనే. కలిసుంటేనే సుఖమని ఆయన భావించారు. 1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ‘జై ఆంధ్రా’ ఉద్యమం వచ్చింది. అయితే, తెలుగువారు విడిపోవాలని ఏనాడూ కోరుకోని ఎన్టీయార్‌ తాను ఆ ఆంధ్రా ప్రాంతానికి చెందినవాడే అయినా, ఎంత ఒత్తిడి వచ్చినా లొంగలేదు. అప్పుడూ మొదటి నుంచీ నమ్మిన కలసి ఉండాలనే సిద్ధాంతానికే కట్టుబడ్డారు. అందుకే జై ఆంధ్రా ఉద్యమానికీ ఆయన మద్దతు పలకలేదు. అయితే ఇటీవల కొంతమంది ఈ వాస్తవాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని తన ఆస్తులు కాపాడుకోవాలన్న ధ్యాసతోనే జై ఆంధ్రా ఉద్యమానికి అప్పట్లో ఎన్టీయార్‌ మద్దతు ప్రకటించలేదంటూ అర్థంపర్థం లేని అసత్యపు మాటలతో నోరుజారుతున్నారు.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అంతకన్నా ముందు 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ ఎన్టీయార్‌ బెసగలేదు. అదే సమయంలో తాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘తల్లా పెళ్ళామా’ చిత్రంలో ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది...’ అంటూ గుర్తుచేశారు. ‘పాలుపొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు...’ అంటూ సాహసోపేతంగా నినదించారు. అప్పటికే హైదరాబాద్‌లో ఆయనకు స్వగృహంతో పాటు ఎన్టీఆర్‌ ఎస్టేట్‌ కూడా ఉంది. అయినా, లెక్క చేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుగడ్డను పగులగొట్టవద్దు అని తెరపై పాడే సాహసం చేశారు. ఆస్తుల గురించే గనక ఆయన ఆలోచించి ఉంటే, ఆ పెను సాహసానికి దిగేవారు కాదు కదా! పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే చాలామందికి భిన్నంగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ నమ్మిన మాటకే కట్టుబడి, ఏటికి ఎదురీదడమే ఎన్టీయార్‌ను ఇప్పటికీ జనం గుర్తుంచుకొనేలా చేసింది. గుండెల్లో పెట్టుకొనేలా చూసింది.
 
 
 
అలాగే, సినీ పరిశ్రమ మద్రాసు నుంచి తెలుగు గడ్డ మీదకు తరలిరావడం కోసం అప్పటి తెలుగు ప్రభుత్వాలు సినీ ప్రముఖులకు హైదరాబాద్‌లో ఇళ్ళస్థలాలు, స్టూడియోలకు జాగాలు కట్టబెట్టాయి. కానీ, ఎన్టీయార్‌ తన పేరున కానీ, తన కుటుంబ సభ్యుల పేరున కానీ ఏనాడూ ఏ ప్రభుత్వం నుంచీ గజం స్థలం కూడా తీసుకోలేదు. స్వార్జితమైన సొంత స్థలంలోనే ఆయన స్టూడియో నిర్మాణం, ఇళ్ళ నిర్మాణం చేపట్టారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గుర్తుంచుకోవాల్సిన మరో గొప్ప విషయం. ఇవాళ తెలుగు నేల భౌగోళికంగా రెండుగా విడిపోయినా, ప్రపంచమంతా వేరు కుంపట్ల ధోరణిలో కాకుండా, ఒకే తెలుగువారి రెండు రాష్ట్రాలుగా కలిపి సంబోధించడం, రెండు ప్రాంతాల వారినీ ఒకే తెలుగు ప్రజలుగా గుర్తించి ప్రస్తావించడం విశేషం. ఆ రకంగా ప్రాంతాలు వేరైనా, తెలుగుజాతి ఒక్కటే అన్న ఎన్టీయార్‌ ప్రధానోద్దేశం ఇవాళ్టికీ మరో రూపంలో నిలిచింది, గెలిచిందనుకోవాలి. మొత్తం మీద సినీరంగ పురోగతిలోనైనా, నమ్మిన సిద్ధాంతానికే చివరిదాకా కట్టుబడి నిలబడడంలోనైనా ఎన్టీయార్‌కు సాటి ఎన్టీయారే. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ మహనీయుడి పుట్టినరోజును ఒక పండుగలా అభిమాన జనం జరుపుకొనేది అందుకే!
Link to comment
Share on other sites

  • Replies 378
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...