September 22, 2025Sep 22 Author Bapatla: సూర్యలంక తీరాన నవోదయం By Andhra Pradesh News DeskPublished : 22 Sep 2025 06:12 IST Ee Font size 2 min read రూ.97.52 కోట్లతో బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన సూర్యలంక బీచ్ రెండో ప్రవేశద్వారం నమూనా బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల సమీపంలోని సముద్ర తీర ప్రాంతం సూర్యలంకను పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దే బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం ఆమోదించింది. కేంద్ర పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టుకు గత మార్చిలో రూ.97.52 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, గుత్తేదారు సంస్థకు పనులు అప్పగించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. రెండేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులు పూర్తిచేసి, బీచ్ రూపురేఖలు మార్చనున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయిన తరువాత బీచ్ ఇలా ఉంటుంది ఏమేం పనులు చేస్తారంటే.. పర్యాటకులకు స్వాగతం పలుకుతూ బీచ్ వద్ద రెండు ప్రవేశద్వారాలు నిర్మించి, ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం కి.మీ. ఉన్న బీచ్ రోడ్డు నూతన రూపు సంతరించుకోనుంది. రోడ్డు మధ్య డివైడర్‌పై మొక్కలు నాటి, ఆ చెట్ల నీడలో పర్యాటకులు కూర్చొని సేద తీరటానికి బల్లలు ఏర్పాటు చేసేలా ఆకృతిని సిద్ధం చేశారు. సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో తీరం అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు తిలకిస్తూ పర్యాటకులు నడవటానికి ప్రత్యేక నడకమార్గం నిర్మించనున్నారు. రాత్రులు అలల హోరును తిలకించేలా సెంట్రల్ లైటింగ్, సైక్లిస్ట్‌లకు ప్రత్యేకంగా సైకిల్‌ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. బీచ్ వద్ద సముద్రం కనిపించేలా 20 కాటేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. 300 సీట్ల సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించడంతో పాటు పిల్లల కోసం పార్కు అభివృద్ధి చేయనున్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ జోన్లు, ఆహార స్టాళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. బీచ్ ప్రారంభంలో పర్యాటకులకు సమాచార కేంద్రం ఉంటుంది. బీచ్‌లో స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్, ఇతర జల క్రీడలకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తారు. విద్యుత్తు వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు ధ్యాన కేంద్రాలు, స్థానిక సముద్ర ఉత్పత్తుల మార్కెటింగ్, మత్స్యకారులకు ఉపాధి కల్పనకు దుకాణాల వీధిని ప్రతిపాదించారు. ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువ కట్టలను పటిష్ఠం చేసి నాలుగు కి.మీ. మేర రింగ్‌రోడ్డు నిర్మిస్తారు. పడవల్లో విహారం కోసం జెట్టీలు ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ పూర్తయితే సూర్యలంక పర్యాటక రంగానికి హబ్‌గా మారనుంది.
Create an account or sign in to comment