September 30, 2025Sep 30 Author పడవల్లో విహరించేలా.. ప్రకృతిని ఆస్వాదించేలా By Andhra Pradesh Dist. DeskUpdated : 30 Sep 2025 06:37 IST Ee Font size 2 min read పట్టా లెక్కుతున్న ప్రాజెక్టు సర్వే పూర్తి చేసిన పర్యాటక శాఖ న్యూస్‌టుడే, బాపట్ల పర్యాటకులు ఉల్లాసంగా గడపటానికి సూర్యలంకలో మరో కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పడవల్లో విహరిస్తూ తీరం ప్రకృతి అందాలు తిలకించే అవకాశం దక్కనుంది. పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు మీదుగా నిజాంపట్నం హార్బర్ వరకు కేరళ అలెప్పీ తరహాలో హౌస్‌బోట్లు నడపాలని నిర్ణయించారు. ఆపరేటర్లతో కలిసి పర్యాటక శాఖాధికారులు సర్వే పూర్తి చేశారు. కేరళ తరహాలో జిల్లాలోని తీర ప్రాంతంలో వాగులు, కాలువలు, సముద్ర వెనుక జలాలు పడవల్లో విహారానికి అనుకూలంగా ఉన్నాయి. పర్యాటకుల కోసం హౌస్ బోట్లు తిప్పాలని పుష్కరకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. బోటు షికారు ప్రాజెక్టుకు గత మార్చిలోనే జలవనరుల శాఖ అధికారుల ద్వారా ప్రాథమిక డీపీఆర్‌ను రూపొందించారు. జులై నుంచి పడవలను నడపాలని భావించినా జాప్యం జరుగుతూ వచ్చింది. తీరంలో 1500 హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలాల తీర ప్రాంతాల్లో సహజసిద్ధ అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం సూర్యలంకకు వస్తున్న పర్యాటకులు ఒకట్రెండు రోజులు ఉండి వెళ్లిపోతున్నారు. అలాంటి వారు ఎక్కువ సమయం స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపేలా పడవల్లో విహార ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఓ హౌస్ బోటు నిర్మాణం జరుగుతోంది. దీని విలువ రూ.85 లక్షలు పైనే. నవంబరు నాటికి పడవను అందుబాటులోకి తీసుకురానున్నారు. బాపట్ల మండలం ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువలో పడవలు ప్రారంభమై నల్లమడ వాగు సముద్రంలో కలిసే పొగురు వద్ద ఇసుక తిన్నెల్లో ఆగేలా మొదటి ల్యాండింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. నల్లమడ వాగు సంగమం, మూడు వైపులా నీరు ఓ వైపు భూమి ఉండే ద్వీపకల్పం. పక్షుల సందర్శన ఉంటుంది. ఇక్కడ నుంచి పడవ ప్రారంభమై ఉప్పుటేరులోకి ప్రవేశించి మడ అడవుల మధ్య విహరిస్తూ కర్లపాలెం మండలం తుమ్మలపల్లి రామాలయం వద్ద రెండో ల్యాండింగ్ పాయింట్‌లో ఆగుతుంది. ఇసుక తిన్నెలు, మడ అడవుల అందాలు వీక్షించిన తర్వాత పర్యాటకులతో పడవ తూర్పు తుంగభద్ర కాలువలోకి ప్రవేశించి నిజాంపట్నం హార్బర్‌కు 1.5 కి.మీ. దూరంలో చివరి ల్యాండ్ పాయింట్‌కు చేరుకుంటుంది. హార్బర్, మడ అడవుల సందర్శన అనంతరం పడవ వచ్చిన మార్గంలో వెనుదిరిగి ఆదర్శనగర్ జెట్టీ వద్దకు చేరుకోవటంతో విహారం ముగుస్తుంది. దీనిపై కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ హౌస్ బోట్లు నడపటానికి ఆపరేటర్లకు వసతులు కల్పిస్తామని చెప్పారు. పర్యాటకులకు పడవల్లో విహారం కొత్త అనుభూతి ఇస్తుందని, ఇది జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి ముఖ్య ప్రాజెక్టుగా మారుతుందన్నారు. విహార మార్గం మొత్తం దూరం: 18.35 కి.మీ. ల్యాండింగ్ పాయింట్లు: 4 పేరలి కాలువ: 4 కి.మీ. నల్లమడ వాగు: 1.5 కి.మీ. ఉప్పుటేరు: 12.2 కి.మీ. తూర్పు తుంగభద్ర కాలువ: 0.65 కి.మీ. ఏడాదిలో నీరుండే రోజులు: 330
October 20, 2025Oct 20 Author సముద్ర తీరం.. పర్యాటక సోయగం! By Andhra Pradesh Dist. DeskPublished : 19 Oct 2025 05:04 IST Ee Font size 1 min read సూర్యలంకలో రూ.97.52 కోట్లతో అభివృద్ధి పనులు బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంకలో స్వదేశీ దర్శన్ 2.0 కింద కలల ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోంది. భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. వాడరేవు, రామాపురం తీరంలోనూ పర్యాటకులకు మౌలిక వసతుల కల్పనకు పనులు చేపడుతున్నారు. సూర్యలంక తీరం సుందరీకరణ, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం రూ.97.52 కోట్లు కేటాయించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గత నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులకు భూమిపూజ చేయాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సీఎం పర్యటన రద్దయింది. టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో గుత్తేదారు సంస్థ పనులు ప్రారంభించింది. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల మెరుగైన సౌకర్యాలు అందించడానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. బీచ్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దనున్నారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, విశ్రాంతి గదులు, కాటేజీలు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకోవడానికి భవనాలు నిర్మించనున్నారు. 2026 సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ లక్ష్యాన్ని నిర్దేశించారు.
November 4, 2025Nov 4 Author పర్యాటకాభివృద్ధికి భూముల అన్వేషణ By Andhra Pradesh Dist. DeskPublished : 04 Nov 2025 04:18 IST Ee Font size 2 min read నక్షత్రాల హోటళ్లు.. రిసార్టుల నిర్మాణంపై ఆసక్తి న్యూస్‌టుడే, బాపట్ల దిండి వద్ద కేటాయించిన భూమి జిల్లాలో పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. తీరంలో మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో భూములు కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వ, పట్టా భూముల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. సూర్యలంకలో రూ.97.52 కోట్లతో పర్యాటకాభివృద్ధి పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టారు. కారవాన్, హౌస్ బోటింగ్ టూరిజాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల తీరాల్లో కొత్తహోటళ్లు, రిసార్టుల నిర్మాణం చేపట్టారు. కొత్త వాడరేవు వద్ద యాగంగి గ్రూప్ రూ.250 కోట్లతో నిర్మించిన నాలుగు నక్షత్రాల హోటల్‌ను ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సమీపంలో రూ.200 కోట్లతో మరో రెండు పెద్ద రిసార్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. తీరంలో మడ అడవుల అందాలు, కేరళ అలెప్పీ తరహాలో సముద్ర వెనుకజలాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. నిజాంపట్నం మండలం దిండి వద్ద పర్యాటకరంగం కోసం 50 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. అయితే దిండికి రవాణా సౌకర్యాలు పెద్దగా లేవని, బాపట్ల, చీరాలకు రైలు, రోడ్డు మార్గాల్లో సులువుగా పర్యాటకులు చేరుకుంటున్నారని ఈ ప్రాంతంలోనే భూములు కావాలని కోరుతున్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన భూముల అన్వేషణలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. రెండు నుంచి ఐదు, పది ఎకరాలు కేటాయించాలని పెట్టుబడిదారులు కోరుతున్నారు. తమకు కేటాయిస్తే టెంట్, హోమ్‌స్టే టూరిజం నిర్మాణాలు చేపడతామని ప్రతిపాదిస్తున్నారు. కొత్త హోటళ్లు, రిసార్టుల నిర్మాణం జరిగితే పర్యాటకులకు వసతి సౌకర్యాలు మెరుగవటంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. వారాంతంలో రద్దీ జిల్లాలో బీచ్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి వ్యాపారవేత్తలు, టెకీలు, ఉన్నతాధికారులు వారాంతంలో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సూర్యలంక, కొత్త వాడరేవు, రామాపురం బీచ్‌లలో విహారానికి వస్తున్నారు. నెలలు ముందుగానే హోటళ్లు, రిసార్టులలో గదులు బుక్ చేసుకుంటున్నారు. వివాహాలకు ముందు మెహందీ, సంగీత్ వేడుకలు బీచ్ ఒడ్డున రిసార్ట్‌లలో నిర్వహిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వేదికలవుతున్నాయి. ఆక్యుపెన్సీ సైతం బాగుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే బాపట్ల, చీరాల బీచ్‌లలో భవిష్యత్తులో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్న అంచనాతో పెట్టుబడిదారులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు.
November 29, 2025Nov 29 Author తూర్పు తీరం.. ప్రగతి పథం By Andhra Pradesh Dist. DeskUpdated : 29 Nov 2025 06:43 IST Ee Font size 2 min read సూర్యలంకలో పట్టాలెక్కిన అభివృద్ధి పనులు ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, బాపట్ల: తూర్పు తీరాన పనులు ఊపందుకున్నాయి. సూర్యలంక బీచ్‌లో మౌలిక వసతుల కల్పన సాగుతోంది. మొంథా తుపాను కారణంగా ఆలస్యమైన పనులు పట్టాలెక్కగా.. మూడు వారాలుగా వేగంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో అధికారులు సమీక్షిస్తున్నారు. ఏడాదిలో నూరుశాతం పూర్తిచేయడంపై దృష్టి పెట్టారు. రూ.97.52 కోట్లతో అభివృద్ధి.. సూర్యలంక తీరం భౌగోళికంగా వైవిధ్యం సంతరించుకున్న ప్రదేశం. బంగాళాఖాతం వెంబడి బాపట్ల, చీరాల, చినగంజాం వరకు 12 బీచ్‌లు సిల్వర్‌శాండ్ బీచ్‌లుగా, గోవా ఆఫ్ ఈస్ట్‌గా గుర్తింపు పొందాయి. వారాంతాల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది. ఇంతటి నేపథ్యం ఉన్నప్పటికీ మౌలిక వసతుల సమస్య వేధిస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.52 కోట్లతో అభివృద్ధికి సంకల్పించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికాగా గుత్తసంస్థలకు పనులు అప్పగించారు. గుత్తేదారులు పనులు ప్రారంభించారు. కార్మికులకు నివాస సముదాయాలు, సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల పార్కు.. ఎయిర్ థియేటర్ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ సూర్యలంక బీచ్ వద్ద రెండు ప్రవేశ ద్వారాలు నిర్మించనున్నారు. బీచ్‌రోడ్డు కొత్త రూపు సంతరించుకోనుండగా..రోడ్డు మధ్య డివైడర్‌పై మొక్కలు, వాటి కింద బల్లలు ఏర్పాటు చేయనున్నారు. బీచ్‌లో పర్యాటకులు నడవడానికి ప్రత్యేక నడకమార్గం, రాత్రివేళ అలల హోరును తిలకించేందుకు అనువుగా సెంట్రల్ లైటింగ్, ప్రత్యేక సైకిల్ ట్రాక్, బీచ్ వద్ద సముద్రం కనిపించేలా 20 కాటేజీల నిర్మాణం వంటివి అనేకం ఈ జాబితాలో ఉన్నాయి. 300 సీట్ల సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల పార్కు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానుంది. పార్కింగ్ జోన్లు, ఆహార స్టాళ్లు, జలక్రీడలకు అనువుగా అనేక ఏర్పాట్లు చేయనున్నారు. పర్యాటక హబ్‌కు కృషి సూర్యలంక బీచ్ అత్యుత్తమంగా మారుతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు. చీరాలను పర్యాటక హబ్‌గా మార్చడానికి కృషి చేస్తానన్నారు. మొంథా తుపాను తరవాత మూడు వారాలుగా పనులు వేగంగా చేపట్టినట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. అమరావతికి చేరువగా, హైదరాబాద్ వారికి అనువుగా ఈప్రాంతం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ఏడాదిలోపు పనులు పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
December 13, 2025Dec 13 Author సందర్శకులు వచ్చేలా.. పర్యాటక ఆదాయం పెరిగేలా.. By Andhra Pradesh Dist. DeskUpdated : 13 Dec 2025 06:33 IST Ee Font size 1 min read బీచ్ రిసార్ట్స్‌కు కేంద్రంగా బాపట్ల తీరం పాండురంగాపురం తీరంలోని బీచ్ రిసార్ట్ న్యూస్‌టుడే, బాపట్ల: బీచ్ రిసార్ట్స్‌కు బాపట్ల తీరం కేంద్రంగా మారుతోంది. రిసార్ట్స్, మూడు, నాలుగు, ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడిదారులు రూ.వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. తీరం వెంబడి భూములు కొని నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ వ్యయంతో నిర్వహించే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు వేదికగా మారుతున్నాయి. ప్రత్యక్షంగా..పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సూర్యలంకలో ప్రైవేటు భూములు చాలా తక్కువ. ప్రభుత్వ, అటవీ భూములే ఎక్కువ. రిసార్టులు, హోటళ్ల నిర్మాణానికి రొయ్యల చెరువులు పూడ్చివేశారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద కేంద్రం మంజూరు చేసిన రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంకలో పర్యాటకంగా మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నారు. బాపట్ల మండలంలోని పాండురంగాపురం, రామచంద్రాపురం, కొత్త వాడరేవు, కృపానగర్, అడవిపల్లెపాలెం తీరానికి సమీపంలో ప్రైవేటు భూములు ఉన్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడుతున్న వ్యాపారులు తీరం వెంబడి వందల ఎకరాలు కొనుగోలు చేశారు. ఇటీవలే రూ.150 కోట్లతో నిర్మించిన నాలుగు నక్షత్రాల హోటల్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే మూడు, నాలుగు రిసార్టులు ఉన్నాయి. మరో రెండు నిర్మాణ దశలో ఉండగా త్వరలో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ఓ రిసార్టు, నాలుగు నక్షత్రాల హోటల్‌ను నిర్మించిన యాగంటి ఎస్టేట్స్ సంస్థ రూ.61.32 కోట్లతో ర్యాడిసన్ రిసార్ట్స్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం తాజాగా పచ్చజెండా ఊపింది. రెండేళ్లలోగా దీని నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించనున్నారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం పరిశ్రమ హోదా కల్పించి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండటంతో రూ.వందలకోట్ల పెట్టుబడులు జిల్లాకు వస్తున్నాయి. బాపట్ల బీచ్ పర్యాటకానికి హబ్‌గా మారుతోంది. చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతంలోనూ కొత్త రిసార్ట్స్ వస్తున్నాయి.
Create an account or sign in to comment