July 2Jul 2 Author 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ముందడుగుBy Andhra Pradesh Dist. DeskUpdated : 02 Jul 2026 05:43 ISTEeFont size2 min readకొలిక్కి వచ్చిన భూ బదలాయింపు సమస్యలు బాపట్ల, న్యూస్‌టుడే సూర్యలంకలో హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి కేటాయించిన భూములుసూర్యలంకలో ఐదు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ శాఖ నుంచి 25 ఎకరాల భూమిని పర్యాటక శాఖకు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. ఇందులో ఏపీటీడీసీ 18 ఎకరాలను మూడు ప్రముఖ హోటల్స్ గ్రూపులకు లీజుకు ఇస్తోంది. వీటిపై పర్యాటక శాఖకు సంపూర్ణ హక్కులు లేకపోవడంతో లీజు రిజిస్ట్రేషన్‌కు సాంకేతిక అవరోధాలు ఎదురయ్యాయి. వీటిని ప్రభుత్వం పరిష్కరించడంతో త్వరలో భూమిపూజ చేసి నిర్మాణాలు ప్రారంభించడానికి పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు. సూర్యలంకలో పర్యాటకులకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా ఇచ్చి రాయితీలు కల్పిస్తోంది. పీపీపీ పద్ధతిలో ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ఐటీసీ, హిల్టన్, ఆర్చిడ్స్ గ్రూపులు ముందుకు వచ్చాయి. రూ.464 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. కాగా, ఏడు నెలలు గడిచినా నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన జరగలేదు.పర్యాటకులకు గదుల కొరతహైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. బీచ్ ఒడ్డున పర్యాటక శాఖకు చెందిన రిసార్టులో 32 కాటేజీలు మాత్రమే ఉన్నాయి. వారాంతంలో కాటేజీలు, గదులు లభించడం లేదు. గదుల కొరత సమస్య తీవ్రంగా ఉంది. సూర్యలంకలో ఐదు నక్షత్రాల హోటళ్లు, రిసార్టుల నిర్మాణం జరిగితే నాలుగు వందల గదులు అందుబాటులోకి వచ్చి సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. భూముల కేటాయింపు అధికారం పర్యాటక శాఖకు.. హోటల్స్ గ్రూపులకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖవి కాగా.. అవి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటిని ఆ జాబితా నుంచి తొలగించి పర్యాటక శాఖకు పూర్తిగా బదిలీ చేస్తేనే లీజు రిజిస్ట్రేషన్ జరిగి నిర్మాణాలకు నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ భూములపై పర్యాటక శాఖకు సంపూర్ణ హక్కులు కల్పించక పోవడంతో హోటళ్లు, రిసార్టుల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి పర్యాటక శాఖ ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సమస్యను పరిష్కరిస్తూ.. భూములు కేటాయించే అధికారాన్ని పర్యాటక శాఖకు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మూడు సంస్థలు సూర్యలంకలో ఐదు నక్షత్రాల హోటల్, రిసార్టుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టనున్నాయి. ఏడాదిన్నరలో పూర్తి చేసి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే 2028 జనవరి నాటికి పర్యాటకులకు అధునిక వసతులతో కూడిన గదులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ భూ బదలాయింపులో సాంకేతిక సమస్యలతో హోటళ్లు, రిసార్టుల నిర్మాణ పనులు ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించిందని, వెంటనే పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థలను కోరామన్నారు
July 8Jul 8 Author తీరంలో ప్రగతి వీచికBy Andhra Pradesh Dist. DeskPublished : 08 Jul 2026 05:16 ISTEeFont size2 min readబీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనవాడరేవు తీరంలో బీచ్ రోడ్డు బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. బీచ్ పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. దీనికోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నిజాంపట్నం-సూర్యలంక-వాడరేవు-రామాపురం-మోటుపల్లి-పెదగంజాం బీచ్ కారిడార్ రోడ్డును ప్రతిపాదించారు. ఇది కార్యరూపం దాలిస్తే పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. నిజాంపట్నం, వాడరేవు తీరాల్లో పెద్ద ఎత్తున చేపల వేట సాగుతోంది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఏటా రూ.వంద కోట్లకు పైగా విలువైన చేపలను ఎగుమతి చేస్తున్నారు. తీర ప్రాంతంలో లభించే టూనా చేపలకు జపాన్, చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. చెన్నై పోర్టు ద్వారా ఆయా దేశాలకు తరలిస్తున్నారు. బీచ్ కారిడార్ రోడ్డు ఏర్పాటైతే రవాణాకు మరింత అనుకూలంగా మారుతుంది. జిల్లాలో 74 కి.మీ. తీర ప్రాంతం ఉంది. బీచ్‌లను మూడు క్లస్టర్లుగా విభజించారు. మొత్తం 15 బీచ్‌లను అనుసంధానం చేస్తూ తీరం వెంబడి రోడ్డు నిర్మిస్తే పర్యాటక రంగానికి మణిహారం అవుతుంది. ప్రస్తుతం చీరాల మండలం వాడరేవు నుంచి వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం వరకు ఉన్న రోడ్డును రెండు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. పాండురంగాపురం నుంచి వాడరేవు వరకు రోడ్డును నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం కాలువపై వంతెన నిర్మాణానికి రూ.8.50 కోట్లు కేటాయించారు. కొత్తగా నిజాంపట్నం నుంచి సూర్యలంక మీదుగా పాండురంగాపురం వరకు, పొట్టిసుబ్బయ్యపాలెం నుంచి మోటుపల్లి మీదగా ఏటిమొగ్గ వరకు బీచ్ రోడ్డును నిర్మించాలి. మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత బీచ్ కారిడార్ అటవీ భూములు, వాగులు, కాలువల్లో నుంచి వెళ్తోంది. దీనికోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కారిడార్ వెళ్లే ప్రాంతంలో మడ అడవులు, విదేశీ, స్వదేశీ పక్షులు వలస వచ్చే చిత్తడి నేలలు, వాగులు, కాలువలు సముద్రంలో కలిసే సంగమం, ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. బీచ్ రోడ్డు నిర్మాణానికి భారీగా వ్యయం అవుతుంది. త్వరలో సీఎం చంద్రబాబు వద్ద మాస్టర్‌ప్లాన్‌ను ప్రజెంటేషన్ చేయడానికి పర్యాటక శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. సీఎం నుంచి పచ్చజెండా రాగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసి నిధుల మంజూరు కోసం కేంద్రానికి పంపించనున్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ బీచ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను సీఎం ముందు ఉంచి అనుమతి తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు జిల్లా పర్యాటక రంగానికి పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు.
Create an account or sign in to comment