Jump to content

Externally Aided Projects/International Collaborat


sonykongara

Recommended Posts

విదేశీ సాయం.. మోయలేని భారం
ప్రత్యేక హోదా లేదు
ప్యాకేజీ వర్తించదు
విదేశీ సాయంతో 9 ప్రాజెక్టులు చేపట్టిన ఏపీ
వీటి వడ్డీ భారం రాష్ట్రమే భరించాల్సిన పరిస్థితి
ఈనాడు - అమరావతి
7ap-main1a.jpg

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన 9 ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర సాయం పరంగా ఇటూ అటూ కాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో కేంద్రం నుంచి హామీ లభించింది. 2016లో హోదా బదులు ప్రత్యేక ప్యాకేజిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హోదాకు సమానమైన లబ్ధి ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని కూడా కేంద్రం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమూ అంగీకరించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదు. ఈ ప్రభావం విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులపై కనబడుతోంది. ప్రస్తుతం ప్యాకేజీ, హోదా రెండూ లేకపోవడంతో విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీని రాష్ట్రమే చెల్లించాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

తక్కువ వడ్డీకే రుణం...
ప్రపంచ బ్యాంకు, జైకా, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కేవలం 3శాతం వడ్డీకే రుణాలు అందిస్తాయి. అందువల్ల అనేక రాష్ట్రాలు ఈ రుణాల కోసం గట్టిగా ప్రయత్నిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వమే ఈ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని రుణ మొత్తాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. రాష్ట్రం ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే తొలుత ఆ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం వీటిని ఆమోదిస్తుంది.

* ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు.. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల్లో ఎక్కువ లబ్ధి పొందే ఆస్కారం ఉంది. హోదా అమలవుతున్న రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 10శాతం భరిస్తే సరిపోతుంది. మిగిలిన 90శాతం కేంద్రమే విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుని రాష్ట్రానికి గ్రాంటుగా అందిస్తుంది.

* కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ప్రకటించిన క్రమంలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు ఒక ఫార్ములా సిద్ధం చేసింది. విదేశీ సంస్థలు, బ్యాంకులు ఒక్కో నిష్పత్తిలో రుణం సమకూరుస్తుంటాయి. అవి 70:30, 60:40, 50:50 నిష్పత్తిలో ఉంటాయి. కేంద్రం కేవలం ఆ తేడాను మాత్రమే భరిస్తామని.. అదీ ఒక ఫార్ములా ప్రకారం దాదాపు ప్యాకేజీ అమలయ్యే మొత్తం కాలానికి కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే ప్రయోజనం కలిగేలా భరించేందుకు అంగీకరించింది. ఈ రుణాలపై వడ్డీని చెల్లించడంతో పాటు రుణం తిరిగి చెల్లించడంలో ఆ ఫార్ములా ప్రకారం నిర్దుష్ట మొత్తానికి అంగీకారం తెలిపింది.

* ప్రత్యేక హోదాతో పోలిస్తే ప్యాకేజీ వల్ల విదేశీ సాయంలో కొంత నష్టపోయినా.. గతంలో వ్యయం చేసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సగటున ఎంత ఖర్చు చేస్తున్నామో లెక్కించి ఆ మేరకు కేంద్రం నుంచి సొమ్ములు వచ్చేలా ప్యాకేజీకి ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కేంద్రం రెండూ లేకుండా చేయడంతో రాష్ట్రం నష్టపోవాల్సి వస్తోంది. వడ్డీ చెల్లింపు రాష్ట్రమే చేపట్టిందని అధికారులు వెల్లడించారు.

* 2016లో కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొత్తం 9 ప్రాజెక్టులకు రూ.19,475.69 కోట్ల విలువతో కేంద్రం పచ్చజెండా ఊపింది. పథకాలు ఆమోదించే విషయంలో ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బంది రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇందులో 4 ప్రాజెక్టులకు రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడం, రుణం సమకూరడం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరో 5 ప్రాజెక్టులకు కేంద్రమూ, రుణదాతల అంగీకారమూ కుదిరింది. ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించాల్సి ఉంది. ఇవి కాక మరో 5 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి.

ఆ 9 కీలక ప్రాజెక్టులే!
2016లో ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల్లో కీలకమైనవి ఉన్నాయి. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌
7ap-main1e.jpg
రాష్ట్ర ప్రభుత్వం రూ.3187.80 కోట్లతో చేపట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-2022 వరకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో ఆ బ్యాంకు రుణం రూ.2442 కోట్లు. రాష్ట్రం వాటా రూ.712.80 కోట్లు. గ్రాంటు రూ.33 కోట్లు. ఏడీబీ, రాష్ట్రం 75:25 నిష్పత్తిలో ఆర్థికభారం భరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, రోడ్ల నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఇందులో ఏపీఐఐసీ రూ.483.17 కోట్లు, విశాఖ కార్పొరేషన్‌ రూ.405.97 కోట్లు, రహదారుల అభివృద్ధి సంస్థ రూ.270.07 కోట్లు, విశాఖ చెన్నై కారిడార్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ యూనిట్‌ రూ.1190.51 కోట్లు, ట్రాన్స్‌కో రూ.837.54 కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. రుణం విడుదల ప్రారంభమైంది. పనులు ప్రారంభమైనా ఇంకా వేగం అందుకోలేదు.
2. కరవు నివారణ పథకం
7ap-main1g.jpg
రాష్ట్రంలో కరవు నివారణ పథకం రూ.1148.57 కోట్లతో చేపడుతున్నారు. 5 జిల్లాల్లో సూక్ష్మనీటి పారుదల కల్పన, ఇతరత్రా సౌకర్యాల ఏర్పాటు, రైతులకు శిక్షణ వంటి కార్యక్రమాల కోసం ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు. ఇందులో రూ.464 కోట్ల గ్రాంటు రాష్ట్ర వాటాతో కలిపి ఉంది. విదేశీ ఆర్థిక సాయం కింద రూ.570.89 కోట్లు తీసుకుంటున్నారు. 2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ప్రాజెక్టు అమలు చేసేలా రూపకల్పన చేశారు. ఇందులో గ్రాంటు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.113.68 కోట్లు.
3. నిరంతర విద్యుత్‌
రాష్ట్రంలో 24్ఠ7 విద్యుత్తు అందరికీ అందించేందుకు అవసరమైన విధంగా మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రూ.3584 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో విదేశీ రుణం రూ.2560 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1024 కోట్లు. 2017-18 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ప్రాజెక్టు అమలు చేసేలా ఒప్పందం కుదిరింది.
4. వెనుకబడిన ప్రాంతాల్లో నీటిపారుదల
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో నీటిపారుదల వసతి కల్పించడంతో పాటు రైతులు, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు రూ.2000 కోట్లతో ప్రాజెక్టుకు రుణ ఒప్పందం జరిగింది. ఇందులో విదేశీ రుణం రూ.1700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.300 కోట్లు. ఇందులో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేస్తారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. 2020-21 వరకు ప్రాజెక్టు అమలవుతుంది.
5. సమగ్ర నీటిపారుదల
7ap-main1b.jpg
ప్రపంచ బ్యాంకు రుణంతో రాష్ట్రంలో రూ.1600 కోట్లతో సమగ్ర నీటిపారుదల, వ్యవసాయ బదలాయింపు ప్రాజెక్టు ఆమోదం పొందింది. ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇందులో రూ.1120 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం కాగా, రూ.480 కోట్లు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. రుణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది.
6. అమరావతి నగరాభివృద్ధి
అమరావతి నగర అభివృద్ధికి రూ.4749 కోట్ల అంచనా వ్యయంతో ఒక ప్రాజెక్టు ఆమోదించారు. ప్రపంచ బ్యాంకు వాటా రూ.3324 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1425 కోట్లు భరించాల్సి ఉంటుంది. రాజధాని నగరంలో రోడ్లు, ఇతరత్రా మౌలిక సౌకర్యాల కల్పనకు ఈ నిధులు వినియోగిస్తారు.
7. పట్టణ నీరు సరఫరా
7ap-main1d.jpg
ఆంధ్రప్రదేశ్‌ పట్టణ నీటి సరఫరా, సెప్టేజి నిర్వహణ పథకం  రూ.3723 కోట్లతో చేపడుతున్నారు. ఇందులో విదేశీ రుణం 70శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 30శాతం. రూ.2606 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1117 కోట్లు భరించాల్సి ఉంది. ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది.
8. గ్రామీణ రహదారుల అభివృద్ధి
7ap-main1f.jpg
పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.4234 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టుకు పచ్చజెండా లభించింది. ఒప్పందమూ కుదిరింది. ఇందులో విదేశీ రుణం రూ.2963.80 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1270.20 కోట్లు. 70శాతం విదేశీ రుణంగా లభిస్తుంది.
9. వైద్య సౌకర్యాల మెరుగు
7ap-main1h.jpg
వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఆస్పత్రుల్లో వసతులు పెంచేందుకు రూ.3127 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇందులో రూ.2189 కోట్లు విదేశీ రుణంగా లభిస్తుంది. రూ.938 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా భరించాలి. ఇక రుణదాతతో ఒప్పందం కుదర్చుకోవాల్సి ఉంది. దాదాపు రూ.15725 కోట్ల విలువైన మరో 5 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం ఆమోదిస్తే రుణదాత ముందుకు వస్తారు. ఇందులో రూ.4717.20 కోట్లు రాష్ట్రం తన వాటాగా భరించాల్సి ఉంది.
ఏడాదికి సగటు వ్యయం తక్కువే...!
7ap-main1c.jpg
రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చు పరిశీలిస్తే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది స్వల్పమే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1400 కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు చూపితే సుమారు రూ.1300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ.3500 కోట్లు కేటాయింపులు చూపినా ఖర్చు చేసింది రూ.1300 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7500 కోట్లు కేటాయింపులు చూపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎపిలిప్‌ ప్రాజెక్టులో కన్సల్టెన్సీ ఖరారు

ఈనాడు-అమరావతి: జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ రుణంతో రూ.2000 కోట్లతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎపిలిప్‌-2 ప్రాజెక్టుకు రూ.61.24 కోట్లతో నిప్పోన్‌ కోయి కంపెనీ లిమిటెడ్‌, నిప్పోన్‌ కోయి ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ల సంయుక్త భాగస్వామ్యానికి కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల, జీవనోపాధి అభివృద్ధి పథకం (ఏపీఐఎల్‌ఐపీ-2) కింద ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు, 19 మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు 445 చిన్ననీటి వనరుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతోపాటు వ్యవసాయ, ఉద్యానం, పశుసంవర్థకం, మత్స్యశాఖకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నారు. రూ.2000 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రూ.300 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ వాటా. ఈ ఏడాది నుంచే ప్రాజెక్టు అమల్లోకి రానుంది. ఇందులో కన్సల్టెన్సీ సేవలకు రూ.71.45 కోట్లు కూడా కలిపి గతంలోనే పాలానామోదం ఇచ్చారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
ప్యాకేజీకీ లీకేజీ!
23-11-2018 02:02:26
 
636785353478462112.jpg
  • ఈఏపీల అసలుకు కేంద్రం ఎసరు
  • కేంద్ర పథకాలకు మాత్రమే 90%
  • ‘సర్దుకోవాలని’ సలహా.. 
  • ఈఏపీ రుణాల్లో అదనపు చెల్లింపులకు ‘నో’
  • కొన్నాళ్లుగా ఆర్థిక శాఖకు సూచనలు.. 
  • ససేమిరా అంటున్న రాష్ట్రం
  • జైట్లీ ప్రకటన ఏమైనట్లో!?.. అది కేంద్రం పెద్దలకే ఎరుక
  •  ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అన్నారు!
  • తర్వాత... స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ అంటూ మెలిక పెట్టారు!
  • ‘కేంద్రం డబ్బులు ఇస్తామన్నా ఏపీ సర్కారు తీసుకోవడంలేదు.
  • అకౌంట్‌ నెంబరు చెప్పండి. డబ్బులు పంపించేస్తాం’ అంటూ సవాళ్లు విసిరారు.
  • ఇప్పుడు... ఇన్నాళ్లకు కేంద్రం ‘చావు కబురు’ చల్లగా వినిపించింది!
  • హోదాకు పాతరేసి ప్రకటించిన ప్యాకేజీకీ తూట్లు పొడిచింది.
  • అది ఉత్త లీకేజీయే అని తేలిపోయింది. ఎలాగంటే...
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్‌) కింద 90 శాతం నిధులు ఇవ్వడం! విదేశీ సహాయ ప్రాజెక్టు (ఈఏపీ) రుణంలో 90 శాతం అసలుతోపాటు వందశాతం వడ్డీ భరించడం! ప్రత్యేక హోదా ప్రయోజనాల్లో ఇవే ప్రధానమైనవి! 14వ ఆర్థిక సంఘం సిఫారసులను బూచిగా చూపి, సాంకేతికాంశాలను వల్లెవేస్తూ... ‘హోదా’ ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. అయితే... హోదా ప్రయోజనాన్నింటినీ, పైసా తక్కువకాకుండా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఢిల్లీలో, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రకటించారు. ‘పేరు ఏదైనప్పటికీ ప్రయోజనం అదే’ అని స్పష్టంగా చెప్పినందుకే... ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
 
కానీ... ప్యాకేజీ లెక్క కట్టుకదల్లేదు. నిర్దిష్ట ఐదేళ్ల కాలంలో ఈఏపీల కింద రుణం తెచ్చుకుని, ఖర్చు చేయడం సాధ్యం కాదు కాబట్టి... ఆ మేరకు దేశీయ ఆర్థిక సంస్థల ద్వారా రుణం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరింది. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై ప్రభావం పడుతుందని తెలిసికూడా... ఆ రుణం మీరే తెచ్చుకోండంటూ కేంద్రం ఉచిత సలహాలు ఇచ్చింది. చివరికి... ఉన్నట్టుండి ఎస్పీవీని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టేలా... ‘కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90 శాతం నిధులు మాత్రమే ఇస్తాం! విదేశీ సహాయ ప్రాజెక్టులకు మా త్రం అదనంగా ఇవ్వలేం’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం గత కొంతకాలంగా సలహాలు ఇస్తోంది. సీసీఎస్‌ కింద ఇచ్చే నిధులతోనూ ఈఏపీల అసలు చెల్లించుకోవాలని సూచిస్తోంది. రాష్ట్ర అధికారులు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు.
 
తిరకాసు లెక్కలు...
ప్రస్తుతం ఒక్క ఉపాధి హామీకి మినహా మిగిలిన ఏ పథకానికీ కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వడంలేదు. ఆయా పథకాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, 40 శాతం, 50 శాతం చొప్పున భరిస్తోంది. ఇప్పుడు కొత్తగా అన్నింటికీ 90 శాతం ఇస్తామని... తద్వారా మిగిలిన నిధులనే ‘ఈఏపీ’ల కిందతామిచ్చినట్లుగా సర్దుకోవాలని కేంద్రం చెబుతోంది. అసలు విషయేమిటంటే... హోదాతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికైనా ఈఏపీల కింద కేంద్రం 70 శాతం భరిస్తుంది. ప్యాకేజీ హామీ మేరకు రాష్ట్రానికి మరో 20 శాతం అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఏపీలో 2015 నుంచి మూడేళ్లలో ఏడు ఈఏపీలకు రుణాలు ఖరారయ్యాయి. 2018కి సంబంధించి ఈఏపీలు చర్చల దశలో ఉన్నాయి.
 
సాధారణంగా ఈఏపీలకు అసలు చెల్లింపులు రుణం తీసుకున్న తర్వాత ఐదు లేదా ఏడేళ్లకు మొదలవుతాయి. 2015-2017 వరకు ఏపీకి ఖరారైన ఈఏపీలకు అసలు చెల్లింపు 2020 తర్వాత నుంచి చేయాలి. ప్రస్తుతం ఈ పథకాలకు సంబంధించిన వడ్డీ రూ.15.81 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. అయితే, ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 2020 తర్వాత కేంద్రం అదనంగా 20 శాతం అసలు చెల్లింపులు చేస్తుందో లేదో అని ఆర్థిక శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే నిధులు ఇస్తోందని, ప్రత్యేకించి 90 శాతం నిధులు ఇవ్వడంలేదని అధికారులు తెలిపారు.
 
Link to comment
Share on other sites

  • 4 weeks later...
నాబార్డు, హడ్కో ద్వారా ఇవ్వలేం

 

విదేశీ ప్రాజెక్టుల రుణాలను మాత్రమే 90% తిరిగి చెల్లిస్తాం
ప్రత్యేక ప్యాకేజీ మొత్తంపై కేంద్రం స్పష్టీకరణ
కొత్త పథకాలను రెవెన్యూలోటు  కింద తీసుకోలేం
ఆంధ్రప్రదేశ్‌కు సాయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడి
ఈనాడు - దిల్లీ

18ap-main11a_1.jpg

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సాయాన్ని నాబార్డు, హడ్కో, ఇతర బ్యాంకుల ద్వారా అందించలేమని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించలేదని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన మొత్తాన్ని విదేశీ రుణ రూపంలోనే సాయం చేస్తామని పేర్కొంది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో సంతకం చేసి మొదలుపెట్టిన విదేశీ ఆర్థికసాయం ప్రాజెక్టుల కింద పొందిన రుణం, దానిపై వడ్డీని 90% గ్రాంట్‌ రూపంలో తిరిగి చెల్లించడానికి అంగీకరించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, సహాయమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌లు వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యులు సుజనాచౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన వేర్వేరు లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం 58.32% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% మాత్రమే ఆదాయం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే 14వ ఆర్థికసంఘం ప్రత్యేక, సాధారణ రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడా చూపలేదని, ఆయా రాష్ట్రాల ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని అయిదేళ్ల కాలానికి రెవెన్యూ లోటు భర్తీచేయాలని సిఫార్సు చేసిందని చెప్పారు. దాని ప్రకారం 2015-20 మధ్యకాలంలో ఏపీకి రూ.22,113 కోట్ల రెవెన్యూలోటు గ్రాంట్‌ వస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి కేంద్రప్రాయోజిత పథకాల కింద 90:10 నిష్పత్తిలో నిధులు ఇచ్చి ఉంటే ఎంత మొత్తం వచ్చి ఉండేదో అంతే మొత్తాన్ని ప్రత్యేక ఆర్థిక సాయం కింద అందించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రానికి బదిలీ చేయకుండా 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో విదేశీ ఆర్థికసాయం ప్రాజెక్టుల కింద ఏపీ ప్రభుత్వం తీసుకొనే రుణం, వడ్డీని 90% నిష్పత్తిలో తిరిగి చెల్లించడానికి కేంద్రం సమ్మతించిందన్నారు. వీటి వాయిదాల చెల్లింపు గడువు వచ్చిన వెంటనే చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థికసాయం కింద ప్రకటించిన మొత్తాన్ని నాబార్డ్‌, హడ్కో, బ్యాంకుల ద్వారా అందించమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిందని, అయితే ఆ ప్రతిపాదనను తాము పరిగణలోకి తీసుకోలేదని స్పష్టంచేశారు. కాగ్‌ నివేదిక ప్రకారం 2014-15లో ఏపీకి రూ.16,078.76 కోట్ల రెవెన్యూలోటు ఏర్పడిందన్నారు. అందులో రూ.2,303 కోట్ల మొత్తాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే ఇచ్చేశామని చెప్పారు. ఆ ఏడాది ఏపీ ప్రభుత్వం రుణమాఫీ, ఏపీట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థికసాయం, పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు, సామాజిక పింఛన్ల పెంపులాంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల రెవెన్యూలోటు పెరిగిందన్నారు. అందువల్ల వీటన్నింటినీ తాము పరిగణలోకి తీసుకోలేదని, అవిపోగా మిగిలిన లోటు రూ.4,117.89 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఇందులో రూ.3979.50 కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రూ.38,926 కోట్ల విలువైన విదేశీ ఆర్థికసాయం ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. అందులో రూ.10,131 కోట్ల విలువైన ప్రాజెక్టులపై సంతకం చేసి ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు. అమలుకావాల్సిన ప్రాజెక్టులు రూ.24,174 కోట్లు, స్క్రీనింగ్‌ కమిటీ పరిగణలోకి తీసుకున్నవి రూ.4,620 కోట్ల విలువైన ప్రాజెక్టులున్నట్లు చెప్పారు.

 

ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న విదేశీ ఆర్థికసాయం ప్రాజెక్టులు
(31.3.2015 తర్వాత సంతకం చేసినవి)

క్రమసంఖ్య-ప్రాజెక్టు పేరు- రుణదాత- మొత్తం రూ.కోట్లలో
1. ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌ప్రాజెక్టు- ప్రపంచబ్యాంకు(ఐడీఏ) 529.16
2. ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు(ఏడీఆర్‌పీ)- ప్రపంచబ్యాంకు(ఐడీఏ) 1,763.87
3. ఆంధ్రప్రదేశ్‌ 24్ఠ7 అందరికీ విద్యుత్తు- ప్రపంచబ్యాంకు(ఐబీఆర్‌డీ), ఏఐఐబీ 2,822.20
4. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌-ప్రాజెక్టు1- ఏడీబీ, 2,610.53
5. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్స్‌(జీఈసీ) ఇన్‌ఫ్రా స్టేట్‌ ట్రాన్స్‌మిషన్స్‌ సిస్టం- కేఎఫ్‌డబ్ల్యు(జర్మనీ) 557.38
6. ఆంధ్రప్రదేశ్‌ కరువు నివారణ ప్రాజెక్టు- ఐఎఫ్‌ఏడీ- 532.69
7. ఏపీ ఇరిగేషన్‌, లైవ్‌లీహుడ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు ఫేజ్‌2(1)-జైకా, 1,315.85

అమలుకావాల్సిన విదేశీ ప్రాజెక్టులు

1. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్రాజెక్టు- ప్రపంచబ్యాంకు 1,214.95
2. అమరావతి కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు- ప్రపంచబ్యాంకు 3,527.75
3. ఏపీ రోడ్స్‌ అండ్‌ బ్రిడ్జెస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు- ఎన్‌డీబీ- 2,240
4. ఏపీ మండల్‌ కనెక్టివిటీ అండ్‌ రూరల్‌ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్‌ప్రాజెక్టు- ఎన్‌డీబీ 2,240
5. ఆర్బన్‌వాటర్‌సప్లై, సెప్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు- ఏఐఐబీ 2,857.47
6. రూరల్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్టు- ఏడీబీ-3,527.75
7.250 జనాభా మించిన ఆసావాలకు రహదారి అనుసంధానం- ఏఐఐబీ-3,210.25
8. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌-ప్రాజెక్టు 2- ఏడీబీ-1,799.15
9. అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు-జైకా- 1,242.5
10. ఏపీ హెల్త్‌సిస్టమ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు-ప్రపంచబ్యాంకు 2,314.20
Link to comment
Share on other sites

స్వదేశీ’ నిధులు ఇప్పించలేం
19-12-2018 02:43:57
 
636807842383776394.jpg
  • ఈఏపీలపై కేంద్రం స్పష్టీకరణ
  • ఆంధ్రకు ఆదాయం తక్కువేనని అంగీకారం
  • అయినా రెవెన్యూ లోటుపై పాత పాటే
  • 4,117 కోట్లేనని రాజ్యసభలో జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా విదేశీ రుణసాయంతో నడిచే ప్రాజెక్టుల(ఈఏపీలు)కు స్వదేశీ సంస్థల నుంచి రుణాలను ఇప్పించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ సంస్థల నుంచి రుణాలు పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో స్వదేశీ ఆర్థిక సంస్థలైన నాబార్డు, హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనలను ఆమోదించలేమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా.. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు తక్కువ రెవెన్యూ వచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58 శాతం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. రాష్ట్ర విభజన సమయంలో ఆదాయం 46 శాతమే ఉండడం వాస్తవమేనని రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు తెలియజేశారు. నిధులిచ్చే విషయంలో సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపించలేదని పాతపాటే పాడారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిశీలించి 2015-20 మధ్యలో ఆర్థిక లోటు కింద రూ. 22,113 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, ఆ మేరకు నిధులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కానీ 2014-15లో రెవెన్యూ లోటు మాత్రం రూ.4,117.89 కోట్లేనని.. అందులో ఇప్పటికే రూ. 3,979.50 కోట్లు ఇచ్చామని, ఇక రూ.138.39 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని సుజనాచౌదరికి లిఖితపూర్వకంగా తెలియజేశారు.
 
2014 జూన్‌ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఆంధ్ర రెవెన్యూ లోటు రూ.16,078.76 ఉంటుందని కాగ్‌ తేల్చిందని, దాని ఆధారంగా అదే ఏడాదిలో రూ.2303 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత రైతు రుణ మాఫీ, డిస్కమ్‌లకు ఆర్థిక సహకారం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెన్షన్ల పెంపు వంటి కొత్త పథకాలకు అయిన వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కలిపినట్లు కాగ్‌ సమాచారమిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాల వ్యయాన్ని రెవెన్యూ లోటులో కలపడానికి తాము అంగీకరించలేదని తెలిపారు. అయినప్పటికీ 2013-14, 2014-15కు సంబంధించిన రూ.91.27 కోట్ల బకాయిలను లోటులో కలిపి లెక్కించగా... రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లుగా ఉంటుందని తేలిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం 2015-16 నుంచి 2019-20 మధ్యలో తీసుకునే రుణాలను కేంద్రం 90:10 నిష్పత్తిలో తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విదేశీ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. అయితే ఈఏపీల కింద వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలకు రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లలో అసలు, వడ్డీ చెల్లింపులు చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఈఏపీల కింద వడ్డీగా కేంద్రం చెల్లించింది కేవలం రూ.15.81 కోట్లు. దీనినిబట్టే ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఎంత సాయం చేస్తోందో తేటతెల్లమవుతోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...