Jump to content

Modi wants the Lord of Seven Hills?


Recommended Posts

  • 2 years later...
ఏడుకొండల వాడికి ఎసరు!
06-05-2018 01:34:41
 
636611672855135876.jpg
  • ‘చరిత్ర’ పేరిట కేంద్రం కుట్ర
  • భక్తుల మనోభావాలతో ఆటలు
  • దివ్య పుణ్యక్షేతాన్ని ‘పురావస్తు’గా మార్చి,చేతుల్లోకి తీసుకొనే ఎత్తు
  • జీర్ణ కట్టడాల్ని కాపాడే శాఖ చేతికి జనజీవత్వంతో వెలిగే దేవాలయం
  • అదే జరిగితే విస్తరణ, అభివృద్ధికి గండి
  • సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ లేఖ
  • ఏడేళ్ల క్రితమూ ముంచుకొచ్చిన ముప్పు
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు, జనాగ్రహంతో టీటీడీ సాధికార కమిటీ యత్నాలకు బ్రేక్‌
  • మళ్లీ ఇన్నాళ్లకు తిరగదోడిన ఢిల్లీ పెద్దలు
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారంతో వెనకడుగు.. ‘కర్ణాటక’ భయంతోనే!
వందల సంవత్సరాల చరిత్ర! ఏ రాయిని ముట్టినా, ఏ స్తంభాన్ని తాకినా ప్రతిధ్వనించే ప్రాచీన వేద గానం! అన్నమయ్య గొంతులో పలికిన ఆది జానపదాల జావళీలు! ఏడు కొండల మీద వెలిసిన కలియుగ దైవానికి క్రీస్తుశకం తొలి పాదంలో తొండమాన్‌ చక్రవర్తి కట్టించిన ఆలయం!.. కథలు కథలుగా చెప్పుకొంటున్న, పాటలుగా పాడుకొంటున్న ఈ చరిత్రే ఇప్పుడు తిరుమల వేంకటేశ్వరుడికి, ఆయన ఆలయాలకు బంధనం కానుందా? ‘చరిత్ర గల’ అనే పేరిట వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదా? జీర్ణదశలో ఉన్న కట్టడాలను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖకు.. జన జీవత్వంతో ప్రవర్ధమానమవుతున్న ఆలయాన్ని అప్పగించడానికి రంగం సిద్ధం చేసిందా? పురావస్తు శాఖ టీటీడీకి పంపిన తాజా లేఖను చూస్తే.. అవునన్న సమాధానమే వస్తోంది.
 
 
అమరావతి, తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమల తిరుపతి దేవస్థానం, దాని పరిధిలోని ఆలయాలను ‘రక్షిత కట్టడాలు’గా ప్రకటించి..పరిరక్షించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించండి’ ..అంటూ భారత పురావస్తు శాఖ విజయవాడలోని తన విభాగం ద్వారా శుక్రవారం టీటీడీకి ఓ లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ప్రజలకే కాదు.. ఏడుకొండల వాడికీ ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఈ లేఖ స్పష్టంచేస్తోంది. నిజానికి, ఏడేళ్ల క్రితం, 2011 ఇలాంటిదే ప్రతిపాదన ముందుకువచ్చినప్పుడు..ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన కథనం ప్రచురించింది. టీటీడీలోని అంతర్గత విభేదాలు ఎలా తిరుమల ఆలయం అస్తిత్వానికి ముప్పుగా మారిందీ, ఈ ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించడానికి రహస్యంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వెలుగులోకి తెచ్చింది. ఆ కథనంతో భక్తులు కదిలి.. ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను వరుసగా దెబ్బతీస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వం రూపంలో ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ‘మా వాళ్లు వస్తారు. సమాచారం ఇవ్వండి’ అంటూ ఓ ఆదేశాన్ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు పురావస్తు శాఖ జారీ చేసింది.
 
 
పురావస్తు శాఖకు ఇస్తే..
తిరుపతి సమీపంలో శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఆ మధ్య పురావస్తు శాఖకు అప్పగించారు. అప్పటినుంచి కాలు తీస్తే ఒక నిబంధన, కాలు వేస్తే ఒక నిబంధన అన్నట్టు.. ఆలయ నిర్వాహకులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేకుండాపోయింది. చివరకు ఉత్సవాల సమయంలో పందిళ్లు వేయాలన్నా ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయం పక్కన దారికి అడ్డంగా పడిపోతున్న శిథిల తోరణాన్ని తొలగించడానికే దశాబ్దాల కాలం పట్టింది.
 
ఈ ఆలయమనే కాదు, పురావస్తు శాఖ సంరక్షణలోని కట్టడాలకు మరమ్మతులు, పునర్నిర్మాణాల కోసం అనుమతులు పొందటం చాలా కష్టం. ఎందుకంటే, ఈ శాఖ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఏదైనా ఒక కట్టడాన్ని, ప్రదేశాన్ని, చారిత్రక ప్రాంతాన్ని పురావస్తు ప్రదేశంగా ప్రకటిస్తే... వాటి చుట్టూ ప్రత్యేక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఆ కట్టడంతోపాటు, చుట్టూ ఉన్న వంద మీటర్ల ప్రాంతాన్ని నిషిద్ధ స్థలంగా ప్రకటిస్తారు. మరో వంద మీటర్ల పరిధిని రెగ్యులేటెడ్‌ ఏరియాగా గుర్తిస్తారు. ఇలా ప్రకటించిన ప్రదేశంలో... దాని యజమానితో సహా ఎవరూ, ఎలాంటి మార్పులు చేపట్టకూడదు. కొత్త నిర్మాణాల సంగతి పక్కన పెడితే...ఉన్నవాటికి మరమ్మతులు కూడా చేయడం కుదరదు.
 
 
లేఖలో ఏమున్నదంటే..
‘‘తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), దాని పరిధిలోని ఇతర దేవాలయాల ప్రాచీనత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వాటిని రక్షిత కట్టడాలుగా ప్రకటించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మా డైరెక్టరేట్‌కు సమాచారం అందింది. టీటీడీ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను పరిశీలించేందుకు మా భారత పురావస్తు విభాగం అధికారులు మిమ్మల్ని కలుస్తారు. సంబంధిత సమాచారాన్ని వారికి అందజేసి సహకరించాలని విజ్ఞప్తి.’’ అంటూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు విజయవాడలోని తమ విభాగం ద్వారా భారత పురావస్తు శాఖ లేఖ రాసింది. సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ సంతకంతో శుక్రవారం అందిన ఈ లేఖ తీరును చూస్తే, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారంలో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
 
 
తెల్ల పాలకులే తాకలేదు
వాస్తవానికి తిరుమలలోని ప్రధాన ఆలయాలతో పాటు పరిసరాల్లోని వివిధ ఆలయాలు కూడా వందల సంవత్సరాల నాటివి. ప్రస్తుతం ఉన్న గర్భగుడి, విమాన ప్రదక్షిణం, సంపంగి ప్రదక్షిణం, బాహ్య ప్రాకారం కలిపి తూర్పు, పడమరలుగా 415 అడుగులు... ఉత్తర, దక్షిణాల్లో 263 అడుగులు 1843 లోనే ఏర్పాటయ్యాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చాక ఈ ఆలయ నిర్వహణను హథీరాంజీ మఠానికి, ఆ తర్వాత 1932లో తిరుమల తిరుపతి దేవస్థానాలకు అప్పగించారు. అంతకముందే తొండమాన్‌ చక్రవర్తి ఒకటో శతాబ్దంలోనే ప్రధాన ఆలయాన్ని నిర్మించినట్లు రికార్డులున్నాయి. అప్పటినుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ వచ్చింది. ఈస్ట్‌ ఇండియా పాలకులుగానీ, చివరకు బ్రిటిషర్లు కూడా ఈ ఆలయాన్ని తాము పరిపాలించాలని కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు కేంద్రం దానిపై కన్నేసింది. నిజానికి, రాష్ట్రాల పరిధిలోని కట్టడాలను భారత పురావస్తు శాఖ తీసుకోవాలంటే, ఆ రాష్ట్రం నుంచి అభ్యర్థన రావాలి. ఈ కారణంగానే 2011లో ఒకసారి తీర్మానం చేసినా, మళ్లీ వెనక్కి తీసుకొంది.
 
 
అప్పట్లోనూ ఇలాగే..
తిరుమల గర్భాలయం సహా అన్ని ఆలయాలను భారత పురావస్తు శాఖకు అప్పగించి వాటి నిర్వహణను ఆ సంస్థ ద్వారా చేపట్టాలని, ఆలయానికి సంబంధించిన హక్కులు మాత్రం టీటీడీకే ఉండాలని పేర్కొంటూ 2011లో టీటీడీ సాధికార కమిటీ ఓ తీర్మానం చేసింది. తిరుమల ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయం(తిరుచానూరు), గోవిందరాజ స్వామి ఆలయం(తిరుపతి), కపిలేశ్వర స్వామి ఆలయం(తిరుపతి), కోదండరామ స్వామి ఆలయం(తిరుపతి), ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం(అప్పళాయగుంట), అభయ వేంకటేశ్వరస్వామి మందిరం (నారాయణవనం), వేదనారాయణ స్వామి ఆలయం(నాగలాపురం), వేణుగోపాలస్వామి ఆలయం(కార్వేటి నగరం)లను కలుపుకొని మొత్తం 9 ఆలయాలను ఈ జాబితాలో చేర్చిం ది. దీనిపై అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు.. చాలా రహస్యంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖకు పంపిన లేఖలోని అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టడం, జనాగ్రహంతో ఆ ప్రతిపాదన ఆగింది. గత్యంతరం లేక కొద్ది రోజుల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది.
 
 
9ttd2-12.jpg 
 
తూచ్‌..
తిరుమల వెంకన్నను గుప్పిట్లో పెట్టుకోవాలన్న తన ఆలోచనలు బట్టబయలు కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పురావస్తు శాఖ లేఖ విషయాన్ని శుక్రవారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రజల ముందుకు తెచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమయింది. ఆగమేఘాల మీద తన ప్రతిపాదనను వెనక్కి తీసుకొంది. భక్తుల విశ్వాసాలతో ముడిపడిన ఈ అంశం కర్ణాటక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పరిణమించవచ్చునన్న ఆలోచనతోనే ఇలా వెనక్కి తగ్గినట్టు సమాచారం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ విజయవాడలోని పురావస్తు శాఖ విభాగం శనివారం మరో లేఖను టీటీడీ ఈవోకు రాసింది. ‘రక్షిత కట్టడం’ గా తిరుమల ఆలయాన్ని పరిగణించడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ శుక్రవారం తాను రాసిన లేఖను ఉపసంహరించుకొంటున్నట్టు తాజా లేఖలో పేర్కొంది.
 
 
 
పరిరక్షించుకొనే సామర్థ్యం ఉంది
‘‘తిరుమల తిరుపతి దేవస్థానం, వాటి ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర పురావస్తుశాఖ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పురావస్తుశాఖ రాసిన (శుక్రవారం) లేఖపై సీఎంతో చర్చించిన తర్వాత ఏంచేయాలో నిర్ణయం తీసుకుంటాం. దేశ, విదేశాల్లో తిరుమలకు కోట్లాది మంది భక్తులున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు టీటీడీ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి’’
- కేఈ కృష్ణమూర్తి, దేవదాయశాఖ మంత్రి
 
 
 
కంగారు పడక్కర్లేదు
‘‘ఢిల్లీ ఆర్కియాలజీ విభాగం అధికారులతో మాట్లాడాం. తమకు తెలియకుండా విజయవాడ ఆఫీస్‌ నుంచి ఆ లేఖ జారీ అయ్యిందని వారు తెలిపారు. అది పూర్తిగా తప్పుడు కమ్యూనికేషన్‌. దాన్ని పంపించి ఉండాల్సింది కాదు. అలాంటి నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఆ లేఖను వెనక్కి తీసుకుంటామని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడితో ఈ వివాదానికి తెరపడిందని భావిస్తున్నాను’’.
- అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడీ ఈవో
 
 
 
సంతోషంగా ఉంది
‘‘లేఖ అంశాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ దృష్టికి తీసుకెళ్లా. వెంటనే లేఖను వెనక్కి తీసుకోవడం సంతోషంగా ఉంది. ఆ లేఖ రాసిన అధికారిపై తప్పక చర్య తీసుకొంటామని హామీ ఇచ్చారు. తమ అధికారుల వైపునుంచి జరిగిన పొరపాటుకు బాధ్యత వహించి, టీటీడీకి ఏఎస్ ఐ డీజీ స్వయంగా క్షమాపణలు చెప్పడం ఆనందాన్ని కలిగించింది’’
- జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ ఎంపీ
 
 
 
9ttd-112.jpg 
టీటీడీ ఈవోకు పురావస్తు శాఖ శుక్రవారం రాసిన లేఖ 
 
 
9TTD3--12.jpg 
5-2-11 తేదీన  ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం 
Link to comment
Share on other sites

కేంద్రం గిల్లి.. కజ్జం
శ్రీవారి ఆలయాన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించే అంశంపై కేంద్ర పురావస్తు శాఖ లేఖ
  తిరుమల గుడిని కేంద్రం స్వాధీనంలోకి తీసుకోబోతోందని దుమారం
  వివిధ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళనలు, అభ్యంతరాలు
  సాయంత్రానికి ఆగమేఘాలపై దిద్దుబాటు చర్యలు
  లేఖను ఉపసంహరించుకుంటున్నామంటూ ఈవోకి మరో లేఖ
  ఈ పరిణామాలకు విజయవాడ ఏఎస్‌ఐ అధికారే కారణమన్న భాజపా ఎంపీ జీవీఎల్‌
ఈనాడు - అమరావతి, తిరుపతి
5ap-main1a.jpg
తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు, ఉపాలయాలనూ చారిత్రక కట్టడాలుగా ప్రకటించే అంశాన్ని పరిశీలించబోతున్నామంటూ కేంద్ర పురావస్తు శాఖ నుంచి తితిదే కార్యనిర్వహణాధికారికి అందిన లేఖ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం ఈ సమాచారం బయటకు పొక్కడంతో సామాజిక, ప్రసార మాధ్యమాల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశమైంది. తిరుమల ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకోబోతోందంటూ వివిధ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తితిదే ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌తో మాట్లాడారు.  ఈ వ్యవహారం మరింత వివాదాంశంగా మారుతుండటం, భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో సాయంత్రానికి కేంద్ర పురావస్తుశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇది వరకు రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నామని, దాన్ని రద్దయినట్టుగా భావించాలంటూ తితిదే ఈఓకి మరో లేఖ పంపింది. అక్కడితో వివాదం కాస్త సద్దుమణిగింది. తితిదే ఆలయాలనుగానీ, మరే ఇతర ఆలయాలు, మసీదుల్ని గానీ తమ స్వాధీనంలోకి తీసుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి తనతో ఈ విషయం చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు మాత్రమే కేంద్రం అలాంటి ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆయన స్పష్టంచేశారని తెలిపారు. దీనిపై దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ఏఎస్‌ఐ పరిధిలో 3686 కట్టడాలున్నాయి. ఆ జాబితాలో మరిన్ని చేర్చే ఆసక్తి ఏఎస్‌ఐకి లేదు. సాంస్కృతిక, పురావస్తు మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే విజయవాడలోని ఏఎస్‌ఐ అధికారి తితిదే ఈఓకి లేఖ రాశారు. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఆ శాఖ మంత్రి మహేశ్‌శర్మను కోరాను’’ అని నరసింహారావు ట్వీట్‌ చేశారు. కేంద్రం ఉన్నఫళంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక నేపథ్యం ఏంటి? శ్రీవారి ఆలయం పురావస్తు శాఖ పరిధిలోకి వెళితే వచ్చే ఇబ్బందులేంటి? అన్న అంశాలపై మాత్రం ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.

వివాదానికి మూలం ఇదీ..!
విజయవాడలోని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) అమరావతి సర్కిల్‌ కార్యాలయం సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ టి.శ్రీలక్ష్మి శుక్రవారం తితిదే ఈఓకి ఒక లేఖ రాశారు. ‘‘తిరుమలలోని శ్రీవారి ఆలయం, ఉపాలయాలు వాటికున్న పురాతన, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా రక్షిత ఆలయాలుగా ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఏఎస్‌ఐ డైరెక్టరేట్‌ నుంచి మాకు వర్తమానం అందింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని వివిధ ఆలయాల సమాచారం మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్‌ఐ అధికారులు అక్కడికి వచ్చి సమాచారం సేకరించేందుకు, చిత్రాలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖ శనివారం బయటకు రావడంతో కలకలం మొదలైంది.

స్పెసిఫైడ్‌ అథారిటీ ఉండగా లేఖ..!
శ్రీవారి ఆలయాన్ని ఏఎస్‌ఐ పరిధిలోకి తీసుకోవాలని కోరుతూ ఐవైఆర్‌ కృష్ణారావు తితిదే ఈఓగా ఉన్నప్పుడు సాంస్కృతిక, పురావస్తు శాఖకు ఒక లేఖ పంపించారు. అప్పట్లో శ్రీవారి ఆలయం గోడలకు బంగారు రేకుతో తాపడం చేయాలని పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఆలయ ప్రాశస్త్యం, చారిత్రక ప్రాధాన్యం దెబ్బతింటాయని, గోడలపై ఉన్న శాసనాలు మరుగున పడిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమవడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఆ పాలక మండలి గడువు ముగిశాక, ఏర్పాటైన స్పెసిఫైడ్‌ అథారిటీలో దీనిపై చర్చ జరిగింది. భవిష్యత్తులో మరెవరూ అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా... ఏఎస్‌ఐకి ప్రతిపాదన పంపించాలన్న స్పెసిఫైడ్‌ అథారిటీ సూచన మేరకు ఐవైఆర్‌ ఒక లేఖ రాశారు. దానిపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగడంతో, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు.

ఏఎస్‌ఐ పరిధిలోకి వెళితే..!
వందేళ్లు దాటిన జాతీయస్థాయి ప్రాధాన్యం, చారిత్రక, పురాతన విలువలు కలిగిన కట్టడాలను, స్థలాలను ఏఎస్‌ఐ పరిధిలోకి తీసుకుని, రక్షిత కట్టడాలుగా ప్రకటించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. మన రాష్ట్రంలోని ద్రాక్షారామం, తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, ఒంటిమిట్ట రామాలయం వంటి ఆలయాలు,  ఏఎస్‌ఐ పరిధిలోనే ఉన్నాయి. దేవాలయాల్ని గానీ, ఇతర చారిత్రక నిర్మాణాల్ని గానీ కేంద్ర పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటే... ఆ కట్టడం బాగోగులు, రక్షణ మాత్రమే కేంద్రం చూస్తుంది. దేవాలయాల్లో జరిగే నిత్య పూజా విధులు, ఉత్సవాలు, ఆదాయ వ్యయాలు వంటి అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. స్థానిక ప్రభుత్వాలుగానీ, పాలకమండళ్లుగానీ తమంతట తాము నిర్ణయాలు తీసుకుని వారసత్వ కట్టడాల్ని తొలగించేందుకు, కూలగొట్టేందుకు, మార్పులు చేర్పులు చేసేందుకు, కట్టడాల్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసేందుకు అవకాశముండదు. దేవాలయం లేదా కట్టడం ప్రహరీ నుంచి 100 మీటర్ల వరకు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటిస్తారు. అక్కడ కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేయడానికీ అనుమతించరు. అక్కడి నుంచి 200 మీటర్ల వరకు నియంత్రిత ప్రాంతంగా ప్రకటిస్తారు. అ పరిధిలో ఏమైనా నిర్మాణాలు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. రక్షిత కట్టడాలుగా కేంద్రం ప్రకటించిన నిర్మాణాలకు మరమ్మతులు చేయాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. చారిత్రక కట్టడాల్ని ఏఎస్‌ఐ పరిధిలోకి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటి రక్షణకు కేంద్ర భద్రతా సిబ్బందితో గట్టి భద్రత కల్పిస్తారు. మరమ్మతులకయ్యే నిధులను కేంద్రం భరిస్తుంది. చారిత్రక కట్టడాలు, ప్రదేశాల్ని చూసేందుకు వచ్చే సందర్శకులకు అవసరమైన మౌలిక వసతుల్ని కేంద్రం కల్పిస్తుంది.

5ap-main1b.jpg
శ్రీవారి ఆలయాన్ని తీసుకుంటే..!
తిరుమలలోని శ్రీవారి ఆలయం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఒకటి. ప్రధాన ఆలయంతో పాటు, ఉపాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆగమశాస్త్రం, హిందూ సనాతన ధర్మానికి అనుగుణంగానే నిత్యం ఇక్కడ పూజా విధులు, నిత్య కైంకర్యాలు జరుగుతాయి. రోజూ వేల సంఖ్యలో స్వామిని దర్శించుకోడానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం తితిదే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. వీలైనంత ఎక్కువ మంది వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వీలుగా తితిదే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేపడుతోంది. దేవాలయం చుట్టుపక్కల భక్తుల సౌలభ్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆలయం ఏఎస్‌ఐ పరిధిలోకి వెళ్తే పూజా విధుల్లోను, నిర్వహణ వ్యవహారాల్లోను పురావస్తుశాఖ జోక్యం చేసుకోకపోయినా, ఆలయానికి సంబంధించినంత వరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు, నిర్మాణాలు చేయాలన్నా కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఆలయానికి చుట్టుపక్కల నిర్దేశిత పరిధిలో ఉన్న ఆధునిక నిర్మాణాల్ని కూడా తొలగించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.

వివాదం ముగిసింది: తితిదే ఈవో
పురావస్తుశాఖ నుంచి వచ్చిన లేఖ వ్యవహారంపై తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పందించారు. ‘‘లేఖ అందిన వెంటనే పురావస్తు శాఖ డీజీతో మాట్లాడాను. తమ ప్రమేయం లేకుండానే లేఖ వచ్చిందని, కొందరు అధికారుల వల్లే అలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ లేఖను వెంటనే రద్దు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో వివాదం ముగిసిందనే భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

5ap-main1c.jpg
అనుమానాలు కలిగిస్తోంది: కేఈ
తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర పురావస్తుశాఖ ప్రతిపాదన అనుమానాలు కలిగిస్తోందని ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ‘‘తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. దేశ విదేశాల్లో ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఎవరికి ఏ అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు తితిదే, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. శ్రీవారి ఆలయాన్ని, ఉపాలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం తితిదేకి, ప్రభుత్వానికి ఉంది. పురావస్తుశాఖ లేఖ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఏం చేయాలో నిర్ణయిస్తాం’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రభావమేనా?
శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలనే ప్రయత్నం తితిదే వర్గాలో, హిందూ ధార్మిక సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే.. కొన్ని గంటల్లోనే కేంద్రం దిగివచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటకలో విధానసభ ఎన్నికలు జరుగుతుండటం.. అక్కడి పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించేందుకు సంసిద్ధులవుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 
 
 

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...