ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) సోమవారం హైదరాబాద్‌లో టీడీపీ యువ నేత లోకేశ్‌ను కలిశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ తరఫున ఎన్నికల వ్యూహం అమలుకు పీకే కొంత కాలం క్రితం రంగప్రవేశం చేశారు. క్షేత్రస్థాయిలో రాబిన్ శర్మ బృందాలు పని చేస్తుండగా, పై స్థాయిలో ఎన్నికల వ్యూహానికి పదును పెట్టే బాధ్యతను పీకే తీసుకున్నారు. వచ్చే వంద రోజుల పాటు పార్టీ పరంగా చేపట్టాల్సిన పనులు, నిర్వహించాల్సిన కర్తవ్యాలపై వారి మధ్య చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ-జనసేన కూటమి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలపై పీకే కొన్ని సలహాలు, సూచనలు అందజేశారు. సామాజిక వర్గాలపరంగా వైసీపీ బలంగా ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలో కూడా మంతనాలు జరిపారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సర్వే నివేదికలపై కూడా చర్చించారు. క్షేత్రస్థాయిలో టీడీపీ ప్రభంజనం కనిపిస్తోందని, అది మరింత పుంజుకునేలా చర్యలు చేపట్టాలని పీకే సూచించినట్లు సమాచారం.