పశ్చిమ బైపాస్‌పై సంక్రాంతికి రయ్.. రయ్
By Andhra Pradesh Dist. DeskPublished : 26 Aug 2025 04:44 IST
Ee
Font size
2 min read
ఎన్‌హెచ్-16పై ముమ్మరంగా అనుసంధాన పనులు
ఈనాడు, అమరావతి
కాజ సమీపంలో పొక్లెయిన్‌తో నేల చదును చేస్తూ..
పశ్చిమ బైపాస్‌పై పెద్ద పండగకు ప్రయాణం మొదలుకానుంది. ఆ దిశగా అధికారులు వడివడిగా పనులు చేపడుతున్నారు. ఓ వైపు ప్యాకేజీ-3లో హైటెన్షన్ టవర్ల మార్పిడి అంశంపై వారంలో స్పష్టత రానుండగా..మరోవైపు ప్యాకేజీ ల్యాండింగ్ పనులు సాగుతున్నాయి.
ఎన్‌హెచ్-16పై కాజ దగ్గర వెస్ట్ బైపాస్ ల్యాండింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడ నుంచి గుంటూరు వళ్లే వాహనాలు అనుసంధాన ప్రాంతానికి రాకుండా సర్వీస్ రహదారి నుంచి మళ్లించి 100 మీటర్ల దూరం తర్వాత హైవే ఎక్కించారు. ఈ పనులు పూర్తి చేసిన తర్వాత గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను సైతం ఇలాగే డైవర్షన్ చేయనున్నారు. అనుసంధానం చేస్తున్న ప్రాంతంలో సర్వీస్ రహదారులను వేరు చేస్తూ, ప్రమాదాలకు తావు లేకుండా 230 మీటర్ల రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. బైపాస్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఎన్‌హెచ్16 మీదకు వెళ్లిపోతాయి. బైపాస్ నుంచి విజయవాడ వెళ్లే వారు యూటర్న్ తిరిగేందుకు అనువుగా, ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు మరో రెండు వరుసలు రోడ్డు వేస్తారు. ఈ మొత్తం పనులు జరగడానికి మూడు నెలల వరకు సమయం పడుతుందని చెబుతున్నారు. తాజాగా కొండవీటి వాగు దగ్గర నీరు తరలించేందుకు 50 మీటర్ల మేర ఎన్హెచ్ని తవ్వేయగా రెండు వారాల్లో ఆ రహదారి మళ్లి నిర్మించే పనులు పూర్తి చేస్తారు.
విద్యుత్తు టవర్ల సమస్య దాదాపు కొలిక్కి..
ఏడు నెలలుగా విద్యుత్తు హైటెన్షన్ లైన్ల అలైన్మెంట్ వివాదం దాదాపు కొలిక్కి వచ్చింది. ల్యాంకో ట్రాన్స్మిషన్ టవర్ లైన్ల అలైన్మెంట్ మార్పు చేయాలన్న ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ విరమించుకుంది. పాత అలైన్‌మెంట్‌లోనే విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచి రహదారి నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు దిల్లీకి పంపారు. వారంలో అనుమతులు రానున్నాయి. అనుమతులు సైతం లాంఛనమే కావడంతో నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఈ పనులు సైతం డిసెంబరు చివరికల్లా పూర్తి చేయనున్నారు.
శ్రీ ప్యాకేజీ-1లో గుండుగొలను-కలపర్రు, ప్యాకేజీ-2 కలపర్రు-చినఆవుటపల్లి పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్యాకేజీ-3 చినఆవుటపల్లి- గొల్లపూడి, ప్యాకేజీ-4 గొల్లపూడి-కాజ వరకు జరగాల్సిన పనులకు అడ్డంకులు దాదాపు పూర్తి చేశారు. దీంతో సంక్రాంతికి రహదారిపై ప్రయాణం మొదలవుతుందన్న లెక్క పక్కాగా కనిపిస్తోంది.