Jump to content
Sign in to follow this  
rajanani

వినాశకాలే విపరీత బుద్ధి

Recommended Posts

న్యాయమూర్తులకు ప్రమోషన్‌ లభించే సమయంలో గతాన్ని తవ్వితీసి పసలేని ఆరోపణలు చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డ్డే ఇటీవల వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో హైకోర్టుకు పదోన్నతి పొందిన ఒక జిల్లా న్యాయమూర్తిపై కొందరు చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్‌ బోబ్డ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్.‌వి రమణపై చీఫ్‌ జస్టిస్‌ బోబ్డ్డేకు చేసిన ఫిర్యాదును కూడా ఈ కోణంలోనే చూడాలా? భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉన్న జస్టిస్‌ రమణపై జగన్‌ చేసిన ఫిర్యాదును న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు న్యాయ నిపుణులు తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే సదరు ఫిర్యాదును విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని పలువురు ఆక్షేపించారు. జగన్మోహన్‌ రెడ్డి చర్యను కేవలం ఇద్దరు మాత్రమే సమర్థించారు. వీరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఏకే గంగూలీ ఒకరు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఇటీవల శిక్ష పడిన ప్రశాంత్‌ భూషణ్‌ రెండో వ్యక్తి. రిటైర్డ్‌ జస్టిస్‌ గంగూలీ తనపై ఒక యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేయకూడదని అభ్యంతరం చెప్పడం గమనార్హం. జస్టిస్‌ రమణపై ఫిర్యాదు చేసే నైతికత జగన్మోహన్‌ రెడ్డికి ఉందా? సదరు ఫిర్యాదులో పస ఉందా? ఫిర్యాదు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జగన్‌ను ఈ దుస్సాహసానికి ప్రేరేపించింది ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. జస్టిస్‌ బోబ్డే పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్‌ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఫిర్యాదు చేస్తే ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా నిలువరించవచ్చని జగన్‌ అండ్‌ కో వ్యూహమన్నది బహిరంగ రహస్యం. అమరావతిని రాజధానిగా 2014లో ప్రకటిస్తే, 2015 జూన్‌లో జస్టిస్‌ రమణ కూమార్తెలు అక్కడ కొంత భూమి కొనుక్కున్నారు. ఈ కొనుగోలు ప్రక్రియ ఏ చట్టం కింద నేరమవుతుందో జగన్‌ చర్యలను సమర్థించేవారితో పాటు జగన్‌ లేఖపై విచారణ జరపాలని కోరుతున్న వారు చెప్పాలి. ప్రభుత్వ ప్రకటనకు ముందు అక్కడ భూమి కొనుగోలు చేసినా చట్ట ప్రకారం నేరం కాదు. కాకపోతే అనైతికమని నిందించవచ్చు. అయినా జగన్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కొంతమంది న్యాయ నిపుణులు కోరడం వింతగా ఉంది. మరి, కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసే నైతికత జగన్మోహన్‌రెడ్డికి ఉందా? పలు అవినీతి కేసులలో జగన్‌ నిందితుడు. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం జగన్‌పై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోగా ముగించాల్సి ఉంటుంది. తనకు శిక్షపడే అవకాశం ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం నచ్చని కారణంగానే జస్టిస్‌ రమణను ముఖ్యమంత్రి టార్గెట్‌ చేసుకున్నారన్నది బహిరంగ రహస్యం. 

‘‘నాపై అవినీతి ఆరోపణలున్నా ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు, మధ్యలో న్యాయస్థానాల పెత్తనం ఏమిటి? నన్ను శిక్షించాలనుకోవడం ఏమిటి?’’ అని ముఖ్యమంత్రి భావిస్తుండవచ్చు. రాజ్యాంగం వెసులుబాటు కల్పించినంత మాత్రాన పలు కేసులలో నిందితుడిగా ఉన్నా కూడా ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయవచ్చా? అలాంటి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని కోరడం న్యాయవ్యవస్థ నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడమవదా? భూములు కొనుక్కోవడమే నేరమైతే జగన్‌రెడ్డిపై ఉన్న కేసులలో విచారణ కూడా అవసరం లేదు, నేరుగా శిక్ష వేయవచ్చు కదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నిందితుడు నిందితుడు కాకుండా పోడు. అలాంటి నిందితుడు ఫిర్యాదు చేశారని ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడు కావాల్సిన వ్యక్తిని అడ్డుకుంటే ఇకపై జేబు దొంగలు కూడా తమపై కేసు విచారణకు వచ్చినప్పుడు తాము దొంగిలించిన సొమ్ములో కొంత భాగాన్ని కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కుటుంబసభ్యులకు ఇచ్చామని చెప్పవచ్చు కదా? న్యాయవ్యవస్థను ఆ స్థాయికి పతనం చేయాలనుకుంటున్న వారు మాత్రమే జగన్మోహన్‌ రెడ్డి చర్యలను సమర్థించగలరు. జస్టిస్‌ రమణపై ముఖ్యమంత్రి చేసిన మరో ఫిర్యాదులో పేర్కొన్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని 2014లో విభజిస్తారని 2010లోనే జస్టిస్‌ రమణ ఊహించి ఉండాలి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అవుతుందని ఆయన ముందుగానే కాలజ్ఞానం ద్వారా తెలుసుకుని అక్కడ భూములు కొనిపించి ఉండాలి. ఈ క్రమంలో తనకు సహకరించడానికి మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ చేపట్టిన కేసులలో అనుకూల తీర్పులు ఇచ్చి ఉండాలి. ఇంతకంటే హాస్యాస్పదమైన ఆరోపణలు ఉంటాయా? న్యాయమూర్తి కావడానికి ముందు జస్టిస్‌ రమణ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలిగేవారని, ఆ కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీకి మేలు చేయడం కోసం హైకోర్టును ప్రభావితం చేస్తున్నారన్నది మరో ఆరోపణ. న్యాయమూర్తులు ఆ పదవిలో నియమితులు కావడానికి ముందు రాజకీయ పార్టీలకు సంబంధించిన కేసులను వాదించడం సర్వ సాధారణం. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా న్యాయమూర్తులుగా నియమితులైన ఉదంతాలు ఎన్నో. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిబద్ధతగా వ్యవహరించి ఆ పదవికే వన్నె తెచ్చిన వి.ఆర్‌. కృష్ణయ్యర్‌ కేరళలో వామపక్ష ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా పనిచేయడం న్యాయమూర్తి పదవికి అనర్హత కాలేదే? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తండ్రి తరుణ్‌ గొగొయ్‌ కాంగ్రెస్‌ నాయకుడు. ఆయన అసోం ముఖ్యమంత్రిగా సేవలందించారు. 

ఇలాంటి ఉదంతాలు ఎన్నో. హైకోర్టులో, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తుల కుమారులు, కుమార్తెలు అదే కోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. అలా అని తమ పిల్లలు వాదించే కేసులలో అనుకూల తీర్పులు ఇవ్వాలని సహచర న్యాయమూర్తులను ఫలానా న్యాయమూర్తి ప్రభావితం చేసినట్లు విన్నామా? లేదే? అయినా జగన్మోహన్‌ రెడ్డి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా జస్టిస్‌ రమణపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని స్పష్టమవుతోంది కదా? ఏకంగా కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తినే ఆత్మరక్షణలోకి నెట్టగలిగితే, మొత్తం న్యాయ వ్యవస్థనే ఆత్మరక్షణలోకి నెట్టవచ్చన్నది ఆయన ఉద్దేశం కాబోలు. దీని ప్రభావం తనపై దాఖలైన కేసులను విచారించే న్యాయమూర్తిపై కూడా పడాలని ఆయన కోరుకుంటూ ఉండవచ్చు. కేంద్ర హోంమంత్రిని, భారత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మాత్రమే జస్టిస్‌ రమణపై ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తికి అందించడం వెనుక కూడా వ్యూహం దాగి ఉంది. తన చర్యలకు నరేంద్ర మోదీ, అమిత్‌ షాల మద్దతు ఉందని న్యాయ వ్యవస్థను నమ్మించాలనుకోవడం ఆ వ్యూహం. నిజంగా ఇందులో వాస్తవం లేదు. న్యాయవ్యవస్థతో పరిహాసమాడాల్సిందిగా ప్రధానమంత్రి చెబుతారా? ప్రజలను తప్పుదారి పట్టించడానికే జగన్‌ అండ్‌ కో ఆ సమయాన్ని ఎంచుకున్నారు.

తానొకటి తలిస్తే..

ఇంతకీ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరిందా? సాహసం అని భావిస్తూ ఇంతటి దుస్సాహసానికి పాల్పడడం వెనుక ఉన్న కారణాలు, శక్తులు ఏమిటి? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. న్యాయవ్యవస్థతో చెలగాటమాడాలనుకున్న జగన్‌ రెడ్డి వ్యూహం బూమరాంగ్‌ అయింది. ఆయన చర్యలను జాతీయ మీడియా సైతం తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయ నిపుణుల నుంచి కూడా జగన్‌కు మద్దతు కొరవడింది. ఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి ఊహించలేదు. తన ఫిర్యాదుపై జాతీయ మీడియాలో రచ్చ జరుగుతుందని, ఫలితంగా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా జస్టిస్‌ రమణను అడ్డుకోవచ్చన్న జగన్‌ ప్రయత్నం వికటించింది. ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా జగన్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయారు. ఆర్థిక నేరాలకు సంబంధించి తీవ్రమైన అభియోగాలు జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్నాయన్న విషయం సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులకు తెలియదు. పదేళ్ల క్రితం ఆయనపై కేసులు నమోదైనప్పుడు వారంతా వివిధ హైకోర్టుల్లో పనిచేస్తుండేవారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడేం జరిగిందో చాలామందికి తెలియదు. జగన్మోహన్‌ రెడ్డికి ఇంత ఘన చరిత్ర ఉందా? అని న్యాయమూర్తులతో పాటు న్యాయ నిపుణులు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. 50 శాతం ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలతో అసాధారణ విజయం సాధించిన నాయకుడిగానే జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో పలువురికి తెలుసు. ఆయనపై ఇన్ని కేసులు ఉన్నాయా? అని ఇప్పుడు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. జస్టిస్‌ రమణను ఏదో చేయాలనుకుని చేసిన ఫిర్యాదు ఆయన మెడకే చుట్టుకోబోతున్నది. ఆర్థిక నేరాలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంమీద జగన్మోహన్‌ రెడ్డి తన గతాన్ని తానే విప్పి చెప్పుకొన్నారు. ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది’ అంటే ఇదే! ఇంతకీ న్యాయవ్యవస్థనే ఢీకొట్టాలన్న దుస్సాహసానికి జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు పూనుకున్నట్లు? ఒకరి అసూయ, మరొకరి ద్వేషం ఇందుకు కారణం. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేసిన జస్టిస్‌ చలమేశ్వర్‌కు జస్టిస్‌ రమణ అంటే పొసగదన్నది బహిరంగ రహస్యం. తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని అందుకోలేకపోవడానికి జస్టిస్‌ రమణతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని జస్టిస్‌ చలమేశ్వర్‌ తన సన్నిహితుల వద్ద విమర్శిస్తుంటారు. ఈ అనుమానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి జస్టిస్‌ చలమేశ్వర్‌కు జస్టిస్‌ రమణపై అసూయ, ద్వేషం ఏర్పడ్డాయని ఆయన సన్నిహితులు చెబుతారు. తనకు దక్కని భారత ప్రధాన న్యాయమూర్తి పదవి జస్టిస్‌ రమణకు కూడా దక్కకూడదన్న ఉద్దేశంతోనే జస్టిస్‌ చలమేశ్వర్‌ తెర వెనుక మంత్రాంగం నడిపారని విస్తృతంగా ప్రచారంలో ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు ప్రతిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా పాల్గొంటారని ఆ రోజు విస్తృతంగా ప్రచారం జరిగింది. వేదికపై మూడు కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. కారణాలు తెలియదు కానీ, చివరి నిమిషంలో అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాంతో పాటు జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా తప్పుకొన్నారు. చివరికి ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మాత్రమే విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తరఫున ఫిర్యాదు లేఖను జస్టిస్‌ చలమేశ్వర్‌ రూపొందించారని అధికార పార్టీ నాయకులే చెబుతున్నారు. వ్యవస్థ తనకు అన్యాయం చేసిందని జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా బాధపడేవారట. ఈ నేపథ్యంలోనే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ చలమేశ్వర్‌ మరో ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి ఆయనపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. ఉన్నపళంగా కోర్టు విధుల నుంచి తప్పుకొని ఇంటికి వెళ్లిపోయి విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజానికి అలా చేయడం సమర్థనీయం కాదు. తెలుగుదేశం పార్టీతో జస్టిస్‌ రమణ సన్నిహితంగా మెలిగారన్నది ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదులో ఒక భాగం. నిజంగా అలా ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండటం తప్పు అయితే జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా న్యాయమూర్తి పదవికి అనర్హుడే అవుతారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండేవారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఎంపిక కావడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరోక్ష సహకారం ఉంది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితంగా, మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే జస్టిస్‌ చలమేశ్వర్‌ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని ఢిల్లీలోని తన నివాసంలో కలుసుకునేవారు. వారిద్దరి మధ్య అనుసంధానకర్తగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యవహరించేవారన్నది కూడా బహిరంగ రహస్యమే. ఇటు జస్టిస్‌ చలమేశ్వర్‌, అటు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తమ ఉమ్మడి శత్రువులుగా జస్టిస్‌ రమణను, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రకటించుకున్నట్లు కనిపిస్తోంది. ఫలితమే ఇదంతా. కొంతమందిలో ఏర్పడిన అసూయ, ద్వేషాలు న్యాయ వ్యవస్థ ఔన్నత్యానికే సవాల్‌గా పరిణమించడం విషాదకరం. 

ఆయనతో పోలికా..?

ఇక న్యాయమూర్తులపై ముఖ్యమంత్రులు ఫిర్యాదులు చేయడం అసాధారణమేమీ కాదనీ, 1961లోనే నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రారెడ్డితో పాటు ఒకరిద్దరు న్యాయమూర్తులపై అప్పటి హోం మంత్రి లాల్‌బహదూర్‌ శాస్ర్తికి ఫిర్యాదు చేసిన లేఖను జగన్‌ అండ్‌ కో తమ అనుచరుల ద్వారా బహిర్గతం చేశారు. తాను రాసిన లేఖను రహస్యంగా ఉంచాల్సిందిగా లాల్‌ బహదూర్‌ శాస్త్రిని ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రత్యేకంగా కోరారు. ఆయన కోరిక మేరకు ఆ లేఖ ఇప్పటివరకు రహస్యంగానే ఉంది. అయితే ఆ లేఖ రాసిన రెండేళ్ల తర్వాత అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌ హైకోర్టును సందర్శించి జస్టిస్‌ చంద్రారెడ్డిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వడం, ఆ తర్వాత కొంత కాలానికి జస్టిస్‌ చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కాకుండా రాజకీయ నాయకుల స్థాయిలోనే ఈ బదిలీ జరిగింది. ఇప్పుడు ఇంతకాలానికి సంజీవయ్య రాసిన లేఖను లోకం దృష్టికి తెచ్చారు. ప్రజా జీవితంలో అత్యున్నత ప్రమాణాలకు, విలువలకు కట్టుబడిన దామోదరం సంజీవయ్యతో జగన్‌రెడ్డికి పోలిక ఏమిటి? తాను మొండివాడినని అనిపించుకోవడం జగన్మోహన్‌ రెడ్డికి ఇష్టం. అందుకే కాబోలు ముఖ్యమంత్రిగా కూడా ఆయన మొండిగానే కాకుండా మొరటుగానూ వ్యహరిస్తున్నారు. ఎవరినీ కలవడు–ఎవరి మాట వినడు. అయితే మొండితనం కొంతవరకు ఆకర్షణీయంగానే ఉంటుంది. మితిమీరినప్పుడే ప్రతికూల ఫలితాలొస్తాయి. అప్పటివరకు సమర్థించినవారు కూడా దూరమవుతారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి విషయంలో జరుగుతున్నది ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసైనా న్యాయ వ్యవస్థతో ఎలా వ్యవహరించాలో జగన్‌ రెడ్డి తెలుసుకోవడం అవసరం. 

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలుగువారైన జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రమణను కలుసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరేవారు. అప్పట్లో ప్రధాన న్యాయమూర్తిని కూడా కలుసుకుని హైకోర్టు విభజన వంటి విషయాలు చర్చించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిసేవారు. రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజనీతిజ్ఞులు ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పడానికి కేసీఆర్‌ ఒక ఉదాహరణ కాగా, ఎలా వ్యవహరించకూడదో చెప్పడానికి జగన్‌ మరో ఉదాహరణ. న్యాయవ్యవస్థను బ్లాక్‌మెయిల్‌ చేసి లొంగదీసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా వికటించకమానదు. తీర్పులు వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తులను మేనేజ్‌ చేస్తున్నారని నిందించడం స్వీయ తప్పిదాలను గుర్తించి సవరించుకోవడానికి నిరాకరించడమే అవుతుంది. గతంలో తన కేసుల విషయంలో ఉపశమనం కల్పించిన అప్పటి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజా ఇళంగో, జస్టిస్‌ శివశంకర్‌ రావుకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి పదవులు కట్టబెట్టారు. అంటే అప్పట్లో వారిద్దరినీ మేనేజ్‌ చేశారా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే ఉన్నారు. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పులు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాల్లోని ఉచితానుచితాలను సమీక్షించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానాల పని. తీర్పులు వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తులను నిందించడం దుస్సాహసం కాక మరేమవుతుంది? తెలంగాణ హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నది. కరోనా వైరస్‌ వల్ల రోజుకు 10 మంది లోపే చనిపోయేలా యముడిని ఏమైనా ఆదేశించారా అని తాజాగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించలేదా? అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు పారేసుకోవడం లేదే? ఏ పదవి చేపట్టకుండానే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా న్యాయస్థానం వైపు వేలెత్తి చూపాలనుకోవడం దురహంకారమే అవుతుంది. చరిత్ర సృష్టించిన వారు చరిత్రహీనులుగా మారాలనుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? తనను తాను రక్షించుకుని న్యాయాన్ని రక్షించే సత్తా మన న్యాయ వ్యవస్థకు ఉంది. జగన్మోహన్‌ రెడ్డి వంటి నిందితుల బెదిరింపులకు, ఫిర్యాదులకు భయపడి పారిపోయే బీరువులు కావు మన న్యాయస్థానాలు. జగన్‌ చర్యలను గమనిస్తున్నవారు వినాశకాలే విపరీత బుద్ధి అని వ్యాఖ్యానించకుండా ఉండలేరు. న్యాయవ్యవస్థలో పనిచేసిన వారు కొందరు అదే న్యాయ వ్యవస్థను చెరబట్టాలనుకునే వారి వైపు నిలబడాలనుకోవడం నిజంగా విషాదం. ఏ వ్యూహంతో జగన్మోహన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థపై దాడికి దిగినప్పటికీ ప్రజలకు అంతో ఇంతో దిక్కుగా ఉన్న న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు నైతిక మద్దతు ఇవ్వడం పౌర సమాజం బాధ్యత!

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×