Jump to content

25 years for CBN as CM


hari_nbk

Recommended Posts

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పరిపాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయి. సమస్యలు కొన్ని సహజంగా వస్తే, మరికొన్ని స్వయంకృతం. అయితే, ఆయన తన పరిపాలనతో వేసిన ‘ముద్ర’ ఇప్పటికీ ప్రజల హృదయాలలో చెరిగిపోలేదు. హైటెక్‌సిటీని చూసినా, రైతు బజారుకు వెళ్లినా, ఐటి ఉద్యోగంలో స్థిరపడినవారితో మాట్లాడినా గుర్తుకొచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.



తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య సంఘటనకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేయడమే ఆ సంఘటన. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు ఆనాడు ఎన్టీఆర్‌ మాదిరిగా గ్లామరు లేదు. ప్రజల్లో చెప్పుకోదగ్గ పలుకుబడి లేదు. పైగా, ఎన్టీఆర్‌ను బలవంతంగా పదవి నుంచి దించారన్న అపప్రథ, ఎన్టీఆర్‌ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు. వాటికితోడు, ఇంకా అనేక సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందిపెట్టిన ఖాళీ ప్రభుత్వ ఖజానా చేతికొచ్చింది.



ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని స్వల్పకాలంలోనే చంద్రబాబు యావత్‌ దేశం దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై జాతీయ పత్రికలు సైతం దృష్టి సారించేటట్లు చేయగలిగారు. ప్రసిద్ధ ఆర్థికవేత్తల, పత్రికా సంపాదకుల విశ్లేషణలలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించడం మొదలయింది. చంద్రబాబు ఏమిచేశారు? అంతకుముందు ఏ ముఖ్యమంత్రీ చేయని గొప్ప పనులేమైనా చేశారా? ఆ సమయంలో చంద్రబాబునాయుడు ‘టాక్‌ ఆఫ్‌ ద నేషన్‌’ కావడానికి కారణాలేమిటి? ఆసక్తికరమైన ఆ పరిణామాలను ఓ సారి మననం చేసుకోవాలి.



రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందరూ నడిచిన దారిలో కాకుండా భిన్న మార్గాన్ని అనుసరించారు. ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచే చర్యలు తీసుకొన్నారు. ఫైళ్ల వారోత్సవాలంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ల దుమ్ము దులిపించారు. ఆకస్మిక తనిఖీలంటూ సచివాలయం మొదలుకొని జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంలో పని దొంగల భరతం పట్టేందుకు నడుం బిగించి, అందరిలో జవాబుదారీతనాన్ని పెంచేయత్నం చేశారు. తిష్ట వేసిన రెడ్‌ టేపిజంను పారద్రోలి ప్రజలకు వేగంగా, నాణ్యంగా పారదర్శకతతో సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలలో కంప్యూటర్ల వాడకం పెంచడం; శాఖలవారీగా ప్రభుత్వాధికారులతో వీడియో సమావేశాలు, పనితీరు సూచికలు వంటి వినూత్న పాలనా పద్ధతులతో ప్రభుత్వ వ్యవస్థలను సమర్థంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చేయగలిగారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు వచ్చేందుకు కృషి చేశారు.



అంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉపయోగించని ఆధునిక, నవతరం భాష చంద్రబాబు మాట్లాడుతుంటే.. చాలామందికి అర్థం కాలేదు. యథా తథస్థితి (స్టేటస్‌ కో) కొనసాగించడమే తమ బాధ్యతగా భావించే కొంతమంది ఉన్నతాధికారులకు చంద్రబాబు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో త్వరగానే అర్థం అయింది. ‘మీ మైండ్‌ సెట్‌ మారాలి’ అని చంద్రబాబు చెబితే కొందరు నొచ్చుకొన్నారు. మరికొందరు అపార్థం చేసుకొన్నారు. చివరకు ఆయన లక్ష్యం ఏమిటో అర్థం చేసుకొని సహకరించడం మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడు సాధించిన విజయాలలో అది తొలి మెట్టు.



‘పని చేసే ముఖ్యమంత్రి’ అనే పేరును చంద్రబాబు చాలా త్వరగా సంపాదించుకోగలిగారు. భారీ వర్షాలు, తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని.. పరిస్థితులు సాధారణస్థితికి చేరేవరకు అక్కడే మకాం చేయడం వల్లనే ‘సంక్షోభంలోనే సమర్థత చాటుకొన్నారు’ అనే కితాబు పొందగలిగారు. అప్పటి వరకు ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు అనే భావన సామాన్య ప్రజలలో బలంగా ఉండేది. ప్రజలు, ప్రభుత్వం వేర్వేరుకాదని చెబుతూ చంద్రబాబు మొదలుపెట్టిన ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత దానిని ‘జన్మభూమి’గా మార్చి విస్తృతంగా అమలు చేయడంతోనే, అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం సాధ్యపడింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు ప్రజల శ్రమదానంతో, ప్రజలు అందించిన నిధులతో చకచకా జరిగాయి. ‘కదలిరండి.. కన్నతల్లి రుణం తీర్చడానికి’ అంటూ జన్మభూమి గీతం విని దేశవిదేశాలలో స్థిరపడిన తెలుగువారు సొంత రాష్ట్రానికి తరలివచ్చి తాము పుట్టిన మాతృభూమి బాగుకోసం తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని సంతోషంతో ఖర్చు పెట్టారు, ఆత్మ సంతృప్తి పొందారు. జన్మభూమి కార్యక్రమంలోనే నిర్వహించిన పచ్చదనం-పరిశుభ్రత, మొక్కలు నాటడం, వైద్య శిబిరాల నిర్వహణ మొదలైనవి అన్నీ ఆనాడు ప్రజలకు కొత్త అనుభవం. సమాజాభివృద్ధిలో ఇవన్నీ ఓ నూతన అధ్యాయాన్ని ప్రారంభించాయి.



చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు, ముఖ్యంగా గ్రామీణ పేద మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకానికి ప్రాముఖ్యత కలిగించి దానిని ఓ ఉద్యమంలా నడిపిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’ కారణంగా గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో కొత్త వెలుగులు పరుచుకున్నాయి. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగసిపడిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం అది.



హైదరాబాద్‌ నగరాన్ని తన పాలనలో పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి, పట్టుదలతో సాధించిన ఫలితాలు అందరి కళ్లముందు కనిపిస్తాయి. హైటెక్‌సిటీ, బిజినెస్‌ స్కూల్‌, టిష్యూకల్చర్‌ సెంటర్‌, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ ప్రధాన కార్యాలయం మొదలైన సంస్థలతో పాటు ఐటి దిగ్గజ కంపెనీలకు చెందిన సంస్థలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. అయితే, అవి ఏర్పాటు కావడానికి ముందు హైదరాబాద్‌ వేదికగా అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సమావేశాలను నిర్వహించారు. వాటికి ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు మొదలైనవారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చారు. కొన్ని సందర్భాలలో విందులో పాల్గొన్న అతిథులకు చంద్రబాబు తనే స్వయంగా వడ్డించిన సంఘటనలు ఉన్నాయి.



అప్పుడే ఆయనను అందరూ రాష్ట్రానికి ‘సి.ఈ.ఓ’ అని పిలవడం మొదలు పెట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి చంద్రబాబు ఆవిధంగా చేసిన కృషి ఫలితంగానే.. అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 22వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ స్వల్పకాలంలోనే 4వ స్థానానికి ఎగబాకింది. చంద్రబాబు కంటే ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొందరు రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చాలన్న ధ్యేయంతో కొన్ని కార్యక్రమాలకు చొరవ చూపిన మాట వాస్తవమే. కానీ, అవి శంకుస్థాపన పునాదిరాయిని దాటి పూర్తిస్థాయిలో అమలులోకి రావడానికి కారణం మాత్రం చంద్రబాబే. పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వల్లనే ఆనాడు హైదరాబాద్‌ దేశంలోనే ‘మోస్ట్‌ హాపెనింగ్‌ సిటీ’ కాగలిగింది. అలాగే, రాష్ట్రంలో మానవ వనరులను అభివృద్ధిపర్చి ‘హ్యుమన్‌ క్యాపిటల్‌’ను పెంచడానికి, పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల సంఖ్యను పెంచారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పారద్రోలే ఆయుధం అని పేద, మధ్యతరగతి వర్గాల యువతకు తెలిసిన సందర్భం అది.



ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో దేశంలో అమలుచేసిన ఆర్థిక సంస్కరణలు చాలావరకు సత్ఫలితాలు అందించినా, కొన్ని స్కాంలు జరగడం వల్ల ప్రజలలో అనేక అపోహలు పాతుకుపోయాయి. ఆ సమయంలో సంస్కరణలు అంటే ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, ప్రభుత్వోద్యోగాల్లో కోత, పన్నుల విధింపు, సబ్సిడీలలో కోత, ధరల పెంపుదల అనే ప్రచారం అధికంగా సాగింది. కొన్ని రాజకీయ పార్టీల తీవ్ర విమర్శలు అందుకు తోడయ్యాయి. విదేశీ రుణం అనేసరికి, ‘ప్రపంచబ్యాంకుకు రాష్ట్రం తాకట్టు’ అంటూ జరిగిన ప్రచారం చంద్రబాబు సంస్కరణల ఉద్దేశాన్ని దెబ్బతీసింది. పోఖ్రాన్‌ అణుపరీక్షల నేపథ్యంలో భారత్‌కు రుణాలివ్వరాదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు.ఆశ్చర్యం ఏమిటంటే..



ఆనాడు చంద్రబాబు ఏడాదికి సగటున తెచ్చిన రుణం కేవలం నాలుగున్నర వేల కోట్లే. ఆయనను ప్రపంచబ్యాంకు జీతగాడని దూషించిన వారు ఆ తర్వాత కాలంలో.. ఏడాదికి సగటున రూ.10వేల కోట్లపైగా అప్పులు చేశారు. అయితే, విద్యుత్‌ రంగంలో ముందు చూపుతో చంద్రబాబు చేసిన సంస్కరణలు పూర్తిగా బెడిసికొట్టాయి. విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ఆనాడు విపక్షాలు సాగించిన ఉద్యమం, బషీర్‌బాగ్‌ పోలీసు కాల్పుల సంఘటన.. చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. దానికి తోడు వరుసగా వచ్చిన కరువు పరిస్థితులు, తెలంగాణ ఉద్యమం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ నేపథ్యంలోనే, జాతీయ ధర్మల్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ను ఒప్పించి సింహాద్రి ప్రాజెక్టును సాధించినప్పటికీ, విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని తన హయాంలో 4,500 మెగావాట్లు పెంచినప్పటికీ, ఆ ఘనత గుర్తింపునకు నోచుకోలేదు. అదేవిధంగా, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ, తెలంగాణ ప్రాంత అభివృద్ధిని విస్మరించారనే అపవాదును కూడా చంద్రబాబు ఎదుర్కోవలసివచ్చినది. అధికారంలో ఉన్న ఆ సందర్భంలో అధికార ఫలాలను పంపిణీ చేసే క్రమంలో చంద్రబాబునాయుడు పాటించిన సమతుల్యత, సామాజికన్యాయం అంతకుముందు మరెవరూ చేసినట్లు కనపడదు. అవకాశం వచ్చినపుడు దళితనేతలు జిఎంసి బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా, శ్రీమతి ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోవడం దళితుల ఆత్మగౌరవాన్ని పెంచినట్లయింది.



చంద్రబాబుకంటే ముందు ఎన్టీఆర్‌; ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమ పాలనలో పేద, మధ్యతరగతి వర్గాలకు వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేసిన మాట నిజం. అయితే, చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే ఆయన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ప్రజలను కష్టపడమన్నారు. యువతను నైపుణ్యాలు పెంచుకోమన్నారు. పోటీ ప్రపంచంలో రాణిస్తేనే భవిష్యత్‌ అని చెప్పారు. అందరిలో పని సంస్కృతిని, ఆశావహ దృక్పథాన్ని పెంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పరిపాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయి. సమస్యలు కొన్ని సహజంగా వస్తే, మరికొన్ని తెచ్చిపెట్టుకున్నవి. అయితే, ఆయన తన పరిపాలనతో వేసిన ‘ముద్ర’ ఇప్పటికీ ప్రజల హృదయాలలో చెరిగిపోలేదు. హైటెక్‌సిటీని చూసినా, రైతు బజారుకు వెళ్లినా, ఐటి ఉద్యోగంలో స్థిరపడినవారితో మాట్లాడినా గుర్తుకొచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Link to comment
Share on other sites

On 9/1/2020 at 8:03 AM, TDP_Abhimani said:

Intersting fact entante ....TDP 9 years from 1995-2004 lo farmers suicide kanna 2004-2009 lo farmers suicides are more.....still YSR is considered farmer friendly.....

deenne political failure of cbn anachemo!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...