Jump to content

నృసింహ జయంతి శుభాకాంక్షలు


Recommended Posts

*నృసింహ జయంతి శుభాకాంక్షలు*

సేవించరో మొక్కరో చెలులాల నరులాల
కైవశమై వున్నవాడు కరుణాకరుడు    
॥సేవించరో॥

బాసికము కట్టుకొని బంగారు గద్దెమీద
లాసి కూచున్నాడిదివో లకిమమ్మతో
సూసకపు వనితలు సోబాన పాడగాను
భాసురమై యొప్పెనదె ప్రహ్లద వరదుడు    
॥సేవించరో॥

మునులు చదువగాను ముంజేతి కంకణాలతో
యెనసి నవ్వులు నవ్వీ ఇందిరతో
అనయము పేరంటాండ్లు ఆరతు లెత్తగాను
పనివూని వరాలిచ్చీ ప్రహ్లద వరదుడు    
॥సేవించరో॥

పొలతులు వడ్డించగా బువ్వాన గూచుండి
చెలగి సరసమాడీ శ్రీదేవితో
యెలమి శ్రీవేంకటాద్రి ఈతడే యెందుచూచినా
బలవంతుడై వున్నాడు ప్రహ్లద వరదుడు    
॥సేవించరో॥

                  - తాళ్ళపాక అన్నమాచార్యులు
         గానం - నవ్య పిసుపాటి

Link to comment
Share on other sites

శ్రీ నృసింహ గద్యము

ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వాల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...