Jump to content

godavari to srisailam reverse pumping takes 3 months to fill water


ravindras

Recommended Posts

శ్రీశైలానికి నీళ్లు వెళ్లాలంటే 3 నెలలు!

రివర్స్‌ పంపింగ్‌లో పెద్ద సమస్య ఇదే
ఈ లోపు వరద వస్తే ప్రయత్నం అంతా వృథా
బొల్లాపల్లి మార్గం వైపే మళ్లీ దృష్టి

ఈనాడు, అమరావతి: గోదావరి -కృష్ణా- పెన్నా అనుసంధానంలో రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని శ్రీశైలానికి తీసుకువెళ్లే ప్రతిపాదనపై అధ్యయనం చేసిన నిపుణులు, జలవనరులశాఖ అధికారులు ఆ మార్గంలో నీటిమళ్లింపు కష్టమే అని తేల్చిచెప్పారు. ఈ పద్ధతిలో గోదావరి వరదనీటిని శ్రీశైలం జలాశయానికి తీసుకెళ్లాలంటే మూడు నెలలు పడుతుందని చెబుతున్నారు. జులైలో గోదావరికి వరదలు వస్తాయి. పోలవరం జలాశయం నుంచి ఈ నీటిని మళ్లించడం ప్రారంభిస్తే శ్రీశైలానికి అక్టోబరు నెలకు గానీ రావు. ఈలోపు కృష్ణానదికి ఎలాగూ ఎగువ నుంచి జలాలు వస్తాయి. ఆ వరద ఎక్కువగా ఉంటే.. మళ్లించి తీసుకొచ్చిన జలాలన్నీ వృథాయేనని వివరిస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్‌ వద్ద నెల రోజుల కిందట జలవనరులశాఖ ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమయంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజికి, అక్కడి నుంచి క్రమేణా ఎగువకు పులిచింతల, టెయిల్‌పాండ్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలకు రివర్స్‌లో నీటిని ఎత్తిపోస్తూ తీసుకువెళ్లే ఆలోచనపై చర్చ జరిగింది.

ఈ ప్రతిపాదనలో ఇవీ ఇబ్బందులు..
పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజికి నీటిని తెచ్చి, అక్కడినుంచి శ్రీశైలం వరకు వెనక్కు జలాలు నింపుతూ వెళ్లడం ఇందులో ప్రధాన ఉద్దేశం. భూసేకరణ, కాలువల తవ్వకం, పైపులైన్లు తదితర వ్యయాలన్నీ తగ్గి.. తక్కువ ఖర్చుతోనే నీటిని మళ్లించవచ్చనే ఆలోచనతో కసరత్తు సాగించారు.
* నీటిని ఇలా మళ్లించాలంటే ప్రతి జలాశయంలో తగిన స్థాయిలో నీటిమట్టాలు ఉండాలి. అప్పటికే తాగు, సాగునీటి అవసరాల కోసం జలాశయాల నీటిని వినియోగించడంతో చాలా జలాశయాలు అడుగంటే ఉంటాయని అంచనాకు వచ్చారు. ప్రతి జలాశయాన్నీ పూర్తిస్థాయిలో నింపితే తప్ప మరో జలాశయానికి నీటిని తీసుకువెళ్లలేమని అంచనాకు వచ్చారు.
* ప్రకాశం బ్యారేజిలో 3 టీఎంసీలు, తర్వాత వైకుంఠపురం వద్ద నిర్మించ ప్రతిపాదించిన బ్యారేజిలో 10 టీఎంసీలు నింపిన తర్వాత పులిచింతలకు తీసుకువెళ్లాలి. పులిచింతలలో 42 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ఆ జలాశయం నిండుతుంది. మధ్యలో సాగర్‌ టెయిల్‌పాండ్‌ నింపాలి. మరోవైపు నాగార్జునసాగర్‌లో 150 టీఎంసీల వరకు నీటిని నింపాకే శ్రీశైలం జలాశయానికి మళ్లించగలరు.
* ఇలా జలాశయాలన్నీ నింపుతూ వెళ్లాలంటే శ్రీశైలం చేరేందుకు 3 నెలలు అవుతుందని లెక్కించారు. ఈలోపు కృష్ణాకు అంచనాకు మించి వరద వస్తే ఈ జలాశయాలన్నీ ఖాళీచేయాలి కాబట్టి.. ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
* శ్రీశైలం నుంచి బనకచర్ల తీసుకువెళ్లేందుకు ఖర్చు కూడా ఎక్కువగా ఉందని, ఈ ప్రతిపాదనకు రూ.75వేల కోట్ల వరకు ప్రాథమికంగా ఖర్చవుతుందని లెక్క తేల్చారు. దీంతో ఇక పాత ప్రతిపాదన.. అంటే బొల్లాపల్లి జలాశయానికి తొలుత నీటిని తరలించి, అక్కడినుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించే ప్రతిపాదనపై మరింతగా అధ్యయనం చేయనున్నారు. ఈ విధానంలో కొత్తగా ఒక జలశయాన్ని నిర్మించుకోవచ్చు. అక్కడినుంచి ఎటు కావాలంటే అటు నీటిని మళ్లించుకోవచ్చు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...