Jump to content

పాక్‌తో అమెరికా క్విడ్‌ప్రోకో..? 


KING007

Recommended Posts

పాక్‌తో అమెరికా క్విడ్‌ప్రోకో..? 

పాక్‌తో అమెరికా క్విడ్‌ప్రోకో..? 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాక్‌కు కర్మసిద్ధాంతం అంటే ఏమిటో తెలిసొస్తోంది. తాను చేసిన పాపాలు కొన్నింతలై ఆ దేశాన్నే మింగేస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుల్లో ఊగిసలాడుతోంది. పాక్‌లో ఒక్కో వ్యక్తిపై ఉన్న తలసరి అప్పు 1,53,689 పాకిస్థానీ రూపాయిలకు చేరినట్లు కొన్నాళ్ల కిందట పాక్‌ ఫైనాన్షియల్‌ పాలసీ స్టేట్‌మెంట్‌లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం పెరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌ చేతికందిన చోటల్లా అప్పులు చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. అసలు అప్పులు చేయడంలో ఇమ్రాన్‌ ఏకంగా రికార్డు సృష్టించారు. ఏడాది వ్యవధిలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయిల అప్పు తెచ్చి చరిత్ర సృష్టించారు. దేశ రుణభారం మొత్తం రూ.32.7లక్షల కోట్లకు చేరింది. ఇది అంతకు ముందు ఏడాది కేవలం రూ.24.9లక్షల కోట్లు మాత్రమే. వీటిల్లో అత్యధిక రుణాలు చైనా నుంచి తెచ్చిన రుణాలే ఉన్నాయి. మరోపక్క చైనా అప్పుతో నిర్మించిన చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అనుకున్నంత ఆదాయం సృష్టించలేకపోతోంది. ఈ మార్గంలో వచ్చే వాహనాలను చివరి వరకు భద్రత కల్పించాల్సి రావడం చైనాకు తలనొప్పిగా మారింది. ఇలాంటి దశలో పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షలు మూలిగేనక్కపై తాటిపండు చందంగా మారాయి. ఇప్పటికే గ్రేలిస్ట్‌లో ఉన్న పాక్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పడకుండా.. అవకాశం ఉంటే గ్రే లిస్ట్‌ నుంచి కూడా బయటపడేలా విశ్వప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి నుంచి పారిస్‌లో మొదలైన ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు పాక్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 

గ్రేలిస్ట్‌ నుంచి తప్పించుకొనే అవకాశాలు ఇలా..

 ఈ సారి ఎఫ్‌ఏటీఎఫ్‌ ఛైర్మన్‌గిరీ చైనాకు దక్కింది. చైనాలో పీపుల్స్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ షియంగ్‌ మిన్‌లూ దీనికి అధ్యక్షత వహిన్నారు. దీంతో పాక్‌ను బయటపడేసేందుక చైనా పూర్తిస్థాయిలో కృషి చేస్తుందనడంలో సందేహం లేదు. దీంతోపాటు పశ్చిమ దేశాల మద్దతు కూడా పాక్‌కు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మలేషియాలో నిర్వహించిన ఓఐసీ భేటీకి పాక్‌ హాజరు కాకుండా సౌదీ ఒత్తిడి చేసింది. దీంతో పాక్‌ వెళ్లలేదు. దానికి ప్రతిఫలంగా సౌదీ ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్‌కు అనుకూలంగా ఓటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా ఓటు ఎటు పడుతుందనే అంశం ఆధారంగానే పాక్‌ భవిత ఆధారపడి ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అఫ్గానిస్థాన్‌లో దళాల ఉపసంహరణ కోసం డొనాల్డ్‌ ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ అమెరికా పరవు దక్కించుకొని బయటపడాలంటే పాక్‌ మద్దతు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో క్విడ్‌ప్రోకో కింద పాక్‌కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోయినా.. బ్లాక్‌ లిస్ట్‌లో పడకుండా సాయం చేయవచ్చు. ఇటీవల భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి కూడా ఇదే విషయంపై మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ట్వీట్‌ కూడా చేశారు. ‘చైనా, అమెరికాలు ఎఫ్‌ఏటీఎఫ్‌  గ్రేలిస్ట్‌ నుంచి బయటపడేస్తామని పాక్‌కు హామీ ఇచ్చాయి.  బ్లాక్‌లిస్ట్‌లో అప్‌గ్రేడ్‌ చేయడానికి బదులు ఇటువంటి హామీ ఇచ్చాయి. ఇది నిజమైతే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. అంతర్జాతీయంగా భారత్‌కు దౌత్యశక్తి తగ్గడంపై ప్రధాని సమీక్షించుకోవాలి’’ అని స్వామి ట్వట్‌ చేశారు. మరోపక్క ఎఫ్‌ఏటీఎఫ్‌ వ్యవహరాలు చూసే భారత అధికారులు కూడా అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాల మద్దతుతో పాక్‌ గ్రేలిస్ట్‌ నుంచి బయటపడే అవకాశం ఉందని ఒక ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.  

ఓటింగ్‌ ఇలా..

 

గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ), ఐరోపా కమిషన్‌తోపాటు మొత్తం 39 సభ్యదేశాలు ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఉన్నాయి. ఇందులో జరిగే ఓటింగులో సాధారణ మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. అన్ని దేశాలు దాదాపుగా ఏకతాటిపైకి రావాలనేది దీని ఉద్దేశం. తీర్మానానికి అనుకూలంగా మూడు దేశాలు లేకపోయినా ఆమోదం పొందదు. గతంలో చైనా తటస్థంగా ఉండగా టర్కీ, మలేషియా మద్దతుతో ఇస్లామాబాద్‌ ‘బ్లాక్‌లిస్టు’ గండం నుంచి బయటపడింది. ఇంతకుముందు పాకిస్థాన్‌తోపాటు ‘గ్రే లిస్టు’లో టర్కీ ఉండటం గమనార్హం. ఇప్పుడు పాక్‌ గ్రేలిస్ట్‌ నుంచి బయటపడటానికి 15-16 ఓట్లు అవసరం. టర్కీ, చైనా, సౌదీ, అమెరికా మిత్రదేశాల మద్దతు సమకూరితే సులువుగా పాక్‌ బయటపడిపోతుంది. ఇప్పటికే జనవరిలో బీజింగ్‌లో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్‌ అనుబంధ సంఘ సమావేశంలో పాక్‌  ఉగ్రనిధుల కట్టడి, మనీలాండరింగ్‌పై తీసుకొంటున్న చర్యలపై ఒక నివేదికను సమర్పించింది. ఇటీవల లష్కరే అధినేత హఫీస్‌ సయీద్‌ అరెస్టు, జేఈఎం కార్యకలాపాలపై అమెరికా ఒత్తిడితో తీసుకొన్న చర్యలను ఘనంగా చెప్పుకుంటోంది. సయీద్‌పై తీసుకొన్న చర్యల విషయంలో అమెరికా కొంత సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. 

టర్కీ, మలేషియాల మద్దతు బలంగా..

టర్కీ, మలేషియాలు పాక్‌కు బలమైన మద్దుతు దారులుగా కొనసాగనున్నాయి. ఇటీవల టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్‌ పాక్‌ పర్యటనలో కూడా కశ్మీర్‌ విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. దీంతోపాటు పాక్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇస్లామిక్‌ దేశాలపై ఆధిపత్యం కోసం సౌదీతో టర్కీ పోటీపడుతోంది. ఈ నేపథ్యంలో అణుశక్తి అయిన పాక్‌ మద్దతు వీరికి చాలా అవసరం.  సరికొత్త ఖలీఫాగా ఎదగాలనే కలలను సాకారం చేసుకొనేందుకు ఎర్డగాన్‌ ఎంతకైనా తెగించేందుకు ఉత్సాహపడుతున్నారు. 

 

దొంగ నోట్ల తయారీలో మార్పులేదు..

పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో ఉంచినా భారత్‌ కరెన్సీకి నకిలీ నోట్లను తయారీ చేయడం మాత్రం పాక్‌ మానలేదు. ఈ విషయాన్ని భారత్‌ సమర్థంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ ఎదుట నిరూపించాల్సిన అవసరం ఉంది. అత్యంత నాణ్యమైన నకిలీ నోట్లను తాయరు చేసి భారత్‌లోకి చొప్పించి వచ్చిన సొమ్మును ఉగ్రవాదానికి, గూఢచర్యానికి పాక్‌ వినియోగిస్తోంది. దీనికోసం దక్షిణాసియా, మధ్యప్రాశ్చ్యం, ఆగ్నేయాసియాలో పటిష్ఠమైన ముఠాలను ఏర్పాటు చేసుకొంది. ఇటీవల భారత్‌లో ఫేక్‌ కరెన్సీ పెరిగిపోవడానికి ఇవే కారణంగా నిలుస్తున్నాయి. 

 

బ్లాక్‌లిస్ట్‌ ప్రభావం ఇదీ..
ఎఫ్‌ఏటీఎఫ్‌ అనుమానాస్పద దేశాల జాబితా (గ్రే లిస్టు)లో ఉండటం ఇస్లామాబాద్‌కు కొత్తేమీ కాదు. 2008లో, 2012-15 మధ్యకాలంలోనూ పాక్‌ ఆ జాబితాలో ఉంది. ఆయా సందర్భాల్లో ఆర్థికంగా కుదేలైపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 2018లో మరోమారు ఈ జాబితాలో చేరడంతో ఏడాదిలో దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లిందని గతేడాది ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ వెల్లడించడం గమనార్హం. నిషేధిత జాబితా (బ్లాక్‌ లిస్ట్‌)లో ప్రవేశిస్తే పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ నుంచి వచ్చే రుణాలూ ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ, పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం చాలా కష్టమన్న అభిప్రాయం అంతర్జాతీయంగా దౌత్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...