Jump to content

దక్కిందొక్కటి.. పోయింది పది!


KING007

Recommended Posts

దక్కిందొక్కటి.. పోయింది పది!
27-01-2020 02:47:54
 
 
637156900748785129.jpg
  • విలీన ఆనందం సిబ్బందిలో ఆవిరి
  • ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ తదితర ఉద్యోగ, పదవీ అనంతర లబ్ధి రద్దు
  • అదే దారిన మరికొన్నిటికి ఎసరు.. ప్రజా రవాణా ఉద్యోగులు అవాక్కు
  • ఎన్జీవోలుగా మారాలన్న యాజమాన్యం సూచనపై ఆగ్రహావేశాలు
  • సౌకర్యాలు తీస్తే ఊరుకోబోమని సంఘాల హెచ్చరిక
అదనంగా వస్తాయని ఆశిస్తే ఉన్న వసతులే ఊడుతున్నాయి. విలీనంతో మేలు జరుగుతుందనుకుంటే, ‘ఎందుకిది.?’ అనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఏ సౌకర్యాలు వస్తున్నాయో తెలీదు. ఏవి పోతున్నాయో క్లారిటీ లేదు. వెరసి ప్రజా రవాణా విభాగంగా మారిన ఆర్టీసీలో సిబ్బంది తలలు పట్టుకొంటున్నారు. ప్రయోజనాల పరిరక్షణ, అవసరాల గురించి యాజమాన్యంతో చర్చించేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నిస్తే, మీరు అసోసియేషన్లుగా మారండన్న సలహా ఇస్తున్నారు.
 
 
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అప్పుల ఊబిలోని ఆర్టీసీని రక్షించుకోవడానికి కార్మికులు గత ఏడాది సమ్మెకు సిద్ధమయ్యారు. ఇంతలో ప్రభుత్వం మారి జగన్‌ సీఎం అయ్యారు. కార్మికసంఘాలను జూన్‌ రెండో వారంలో ఆయన పిలిపించుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కమిటీలు వేసి చివరకు సిబ్బంది మాత్రం విలీనం చేసి, ఆర్టీసీకి ప్రజారవాణా వ్యవస్థగా పేరు మార్చడం తెలిసిందే. అయితే, ప్రభుత్వరంగ కార్పొరేషన్‌గా ఉన్న సంస్థలో కార్మికుల నుంచి ప్రభుత్వశాఖలో సిబ్బందిగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌ వస్తుందని ఆశపడ్డారు. ఆర్టీసీలో ప్రస్తుతం కొనసాగుతున్న పెన్షన్‌ స్కీమ్‌ కావాలా.? పీటీడీలో విలీనం అయ్యాక సీపీసీ కావాలా..? అంటూ సిబ్బందిని ఆప్షన్‌ అడిగారు. ఎడారి కావాలా? సముద్రం కావాలా? అంటే ఎక్కడా దాహం తీరదని, అందుకే ఆ రెండూ తమకు వద్దని ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఓపీఎస్‌) కావాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు రాతపూర్వకంగా కోరాయి. వాటిని అప్పట్లో విలీన ప్రక్రియ కోసం ఏర్పాటయిన రెండు కమిటీల్లో ఒకటైన కృష్ణబాబు కమిటీ పట్టించుకోక పోవడంతో సిబ్బందిలో అసహనం మొదలైంది. ఈయూ నేతలు పలిశెట్టి దామోదర్‌రావు, వైవీ రావు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ఎన్‌ఎంయూ నేతలు పీవీ రమణారెడ్డి, వై. శ్రీనివాసరావు బృందం ఇదే సమస్యపై చర్చలు జరిపింది. అయునా పాత పెన్షన్‌ స్కీమ్‌పై ఎలాంటి సానుకూలతా కనిపించలేదు.
 
 
పుండుపై కారం జల్లేలా...
ఆర్టీసీ కార్మికులను ఆర్థిక సమస్యల్లో ఆదుకొంటున్న ఎస్‌ఆర్‌బీఎస్‌ (సిబ్బంది పదవీ విరమణ అనంతర ప్రయోజన పథకం), ఎస్‌బీటీలను (సిబ్బంది ప్రయోజన ట్రస్ట్‌) రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. రేపు ప్రభుత్వంలో ఏమి ఇస్తారో తెలీకుండానే, తాము వద్దంటున్నా ఏకపక్షంగా తొలగించడం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలసుకోవడానికి కార్మిక సంఘాలు ప్రయత్నించగా, అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌.. నేరుగా గుర్తింపు కార్మిక సంఘం ఈయూ కార్యాలయానికి వచ్చారు. ‘కార్మికుల సౌకర్యాలు తొలగించబోం’ అని హామీ ఇచ్చారు. దీంతో కొంత సంతృప్తిచెందినా ఆ తర్వాత బోర్డు మీటింగ్‌లో నిర్ణయాలు గోప్యంగా ఉంచడం, వెలువడుతున్న కోతల సర్క్యులర్లు సిబ్బందికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
 
 
పోతున్నవేమిటి?
ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యాజమాన్యం.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాన్ని ఆపేసింది. ఇకపై ఆర్టీసీ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తోంది. దీంతోపాటు సిబ్బంది పిల్లలకు స్కాలర్‌షిప్పులు, స్టూడెంట్‌ బస్‌పాసుల రద్దు చేస్తారన్న ప్రచారం ఊపందుకొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ ఇస్తున్నందున, ఫ్యామిలీ పాస్‌ రద్దు, వికలాంగ ఉద్యోగులకు అలవెన్సుల కత్తిరింపు, చివరికి మరణించిన ఉద్యోగుల దహన సంస్కార ఖర్చును కూడా రద్దు చేస్తారన్న వ్యాఖ్యలు కార్మికుల్లో వినిపిస్తున్నాయి. ఇవన్నీ అడిగేందుకు ప్రయత్నిస్తున్న కార్మిక సంఘాలకు ఎండీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదు.. ‘మీరు అసోసియేషన్లుగా మార్చుకోండి. నేనే మీ వద్దకు వచ్చి మాట్లాడుతా’’నని ఆయన అంటున్నారు.
 
 
అదెలా కుదురుతుంది?
ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలను ఉద్యోగ అసోసియేషన్లుగా మార్చుకోవాలన్న యాజమాన్యం సూచన సరికాదంటున్నాయి కార్మిక సంఘాలు. డ్రైవర్లు, కండక్టర్లు ఎంటీడబ్ల్యూ యాక్టు కింద పనిచేస్తున్నప్పుడు వారి సమస్యలపై పోరాడేందుకు ట్రేడ్‌ యూనియన్లు ఉండాలికానీ ఎన్‌జీవోలు ఉంటాయా? అని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు ప్రశ్నిస్తున్నారు. గ్యారేజీ సిబ్బంది పనిచేసేది ఫ్యాక్టరీ చట్టాల కింద అని యాజమాన్యానికి తెలుసు కదా.? అని ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకులు పీవీ రమణా రెడ్డి గుర్తు చేస్తున్నారు. బీఎ్‌సఎన్‌ఎల్‌, రైల్వేలో లేని నిబంధనలు ఆర్టీసీ నుంచి పీటీడీకి మారగానే ఎలా వస్తాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సుందరయ్య నిలదీస్తున్నారు. కార్మికులు ఏమి కొరుకొంటున్నారో చెప్పేందుకు విలీన కమిటీలోకానీ, పీటీడీ ఏర్పాటు కమిటీలో కానీ సంఘాల ప్రతినిధులకు చోటివ్వలేదని, ఇప్పుడు ఇలా చేయడం సరికాదని సంఘాలు ఆక్షేపిస్తున్నాయి..
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...