Jump to content

ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?


Npower

Recommended Posts

ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్?

మాజిద్ జహంగీర్బీబీసీ కోసం
ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్Image copyrightMAJID

జమ్ము-కశ్మీర్ పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర సోమవారం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి.

కానీ, 28 ఏళ్ల ఆర్మీ కూలీ మొహమ్మద్ అస్లం హత్యతో ఆ ప్రాంతమంతా షాక్‌లో ఉంది. గత శుక్రవారం నియంత్రణ రేఖ దగ్గరున్న కసాలియాన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అస్లంను హత్య చేశారు.

సోమవారం నేను అస్లం గ్రామానికి చేరుకునేటప్పటికి భారీ వర్షం కురుస్తోంది. ఆ గ్రామం నియంత్రణ రేఖ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిన్నగా ఉన్న అస్లం ఇంట్లో నిశ్శబ్దం అలముకుని ఉంది. ఇంట్లో వాళ్లు అస్లం చనిపోయిన బాధలో ఉంటే, గ్రామస్థులు భయంతో ఉన్నారు. పొరుగింటి మహిళలు అస్లం ఇంట్లో ఉన్నారు. అతడి అమ్మనాన్నల బాధను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అస్లం భార్య పరిస్థితి దారుణంగా ఉంది.

గత శుక్రవారం అస్లం సహా ఐదుగురు కూలీలపై నియంత్రణ రేఖ దగ్గర పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) దాడి చేసిందిని చెబుతున్నారు. ఆ సమయంలో కూలీలు ఇండియన్ ఆర్మీ కోసం కొన్ని సరుకులు తీసుకెళ్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు మొహమ్మద్ అస్లం, అల్తాఫ్ హుస్సేన్ చనిపోయారు. మిగతా ముగ్గురూ గాయపడ్డారు.

నియంత్రణ రేఖ చుట్టుపక్కల గ్రామాల్లో భారత సైన్యం నిఘా తీవ్రంగా ఉంటుంది. ఆర్మీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఆర్మీ గ్రామాల్లోకి రోడ్లు కూడా వేయించింది. నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో ఈ గ్రామాలు తరచూ సమస్యల్లో పడుతూ ఉంటాయి.

ఎలాంటి యూనిఫాం లేకుండా ఆ సరుకులను సరిహద్దు వరకూ చేర్చడం ఆర్మీ కూలీల పని. దానికి వారికి నెలవారీ చెల్లింపులు ఉంటాయి.

తన కొడుకు శవానికి తల లేదనే విషయం తనకు మొదట చెప్పలేదని అస్లం తల్లి ఆలంబీ అన్నారు.

మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తే, మేం చూసుండేవాళ్లం. కానీ ఇప్పుడు నేను వెళ్లి చూసే పరిస్థితిలో అది లేదు. శుక్రవారం నా కొడుకును చివరిసారి చూశాను. తను ఎక్కడికెళ్లాడో నాకు తెలీదు. పేదరికం వల్ల కూలి పనులకు వెళ్లేవాడు. నేను తన శవాన్ని చూసే పరిస్థితిలో లేను" అన్నారు

అస్లం ఏం పని చేస్తాడని ఆలంబీని అడిగినపుడు, ఆమె "తను ఆర్మీ కోసం పనిచేసేవాడు. తను సైన్యం కోసం ప్రాణాలు అర్పించాడు. కానీ ఇప్పటివరకూ సైన్యం నుంచి ఎవరూ ఇక్కడికి రాలేదు. ఏ నేతా రాలేదు. నాకు నా కొడుకు తిరిగి కావాలి. నా కొడుకు మరణానికి ఆర్మీ సమాధానం చెప్పాలి" అన్నారు.

ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్Image copyrightMAJID

అస్లం తండ్రి మొహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ.. "నేను ఏదో పనిమీద వెళ్లా. నా చిన్న కొడుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చేసరికి సరిహద్దుల్లో ఆర్మీ కూలీలు కొందరు గాయపడ్డారని చెప్పారు. ఆ తర్వాత మేం ఘటనాస్థలానికి వెళ్లాం. అక్కడ ఉన్న కూలీలు తమపై దాడి జరిగినప్పుడు, సాయం కోసం ఏడ్చామని, కానీ ఎవరూ రాలేదని చెప్పారు. నా కొడుకు మృతదేహానికి తల లేదు. వాళ్లు తీసుకెళ్లిపోయారు". అని చెప్పారు.

అస్లం తలను ఎవరు నరికి తీసుకెళ్లారు అని అడిగాను. దానికి ఆయన "పాకిస్తాన్ తీసుకెళ్లింది. పాకిస్తాన్ అలా చేయగలదు, అక్కడ అలా ఇంకెవరు చేయగలరు" అన్నారు.

గత నాలుగేళ్ల నుంచీ తన కొడుకు సైన్యం కోసం పనిచేస్తున్నాడని సిద్ధిక్ చెప్పారు.

"నా కొడుకు కూలీ అనేది నిజం, కానీ తను ఆర్మీలో ఒక జవాన్ కంటే ఎక్కువ పనిచేసేవాడు. ఔరంగజేబు(ఆర్మీ జవాన్)కు చనిపోయిన తర్వాత పూర్తి గౌరవ లాంఛనాలు అందించినపుడు, నా కొడుకుని ఎందుకు నిర్లక్ష్యం చేశారు. సైన్యం కూలీలు కూడా ఆర్మీ కోసమే పనిచేస్తారు. ప్రభుత్వం శత్రువులకు బుద్ధి చెప్పాలి. కానీ, అది జరగదని నాకు తెలుసు’’ అన్నారు.

అస్లం భార్య నసీమా అఖ్తర్ బీబీసీతో "చనిపోయాక కూడా నా భర్త ముఖం చూడలేకపోయా. ఈ బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది. నాకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మేమంతా ఎలా బతకాలి" అన్నారు.

అస్లం కుటుంబం దశాబ్దాలుగా పూంఛ్ జిల్లాలోని కసోలియాన్ గ్రామంలోనే ఉంటోంది.

అస్లం చిన్నాన్న "ఆర్మీ తమ కూలీల ప్రాణాలే కాపాడలేకపోతే, దేశాన్ని ఎలా కాపాడుతుంది" అన్నారు.

‘‘ఈ ఘటన జరిగినప్పుడు ఆర్మీ పికెట్‌లో ఉంది. వాళ్లు ఏం చేయలేదు. వాళ్లు పోస్టుల్లోంచి బయటికి కూడా రాలేదు. వాళ్లు రాలేకపోతే, కనీసం గాల్లో అయినా కాల్పులు జరిపి ఉండాల్సింది. మేం అస్లం తల కోసం రెండు కిలోమీటర్ల వరకూ వెతికాం. కానీ కనపడలేదు. అప్పుడు మాతోపాటూ ఒక్క జవాన్ కూడా రాలేదు" అని చెప్పారు.

ఆర్మీ కూలీ తల నరికి తీసుకెళ్లిన పాకిస్తాన్Image copyrightMAJID

అస్లంకు భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మ, నాన్న, తమ్ముడు ఉన్నారు.

"మేం సామాను తీసుకుని వెళ్తున్నాం. అప్పుడే హఠాత్తుగా మందుపాతర పేలింది. తర్వాత ఆర్మీ యూనిఫాంలో ఉన్న ముగ్గురు వచ్చారు. ఒక కూలీ నేలపై పడిపోయాడు. అస్లం నా వైపు చూస్తున్నాడు. వాళ్లు ముగ్గురూ ఒక కూలీ వైపు వెళ్లారు. గొంతు కోసెయ్ అన్నారు. తను చేతులు జోడించి నన్ను వదిలేయండి అంటూ ఏడ్చాడు. ఆ తర్వాత వాళ్లు కాల్చారు. ఆ తర్వాత అస్లం వైపు వెళ్లారు. అప్పుడు తన భుజాలపై ఆర్మీ సరుకులు ఉన్నాయి. అస్లం చాలా భయపడిపోయి ఉన్నాడు. అతడిని అక్కడినుంచి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి తలను వేరు చేశారు" అని ఒక గాయపడ్డ కూలీ చెప్పాడు.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి మిగతా కూలీలు పనికి వెళ్లాలంటే భయపడుతున్నారని మరో కూలీ చెప్పాడు.

"పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి ఐదు కిలోమీటర్లు లోపలికి వచ్చి మన పౌరుడి తల తీసుకెళ్లింది. రేపు వాళ్లు మా ఇళ్లలో చొరబడి మా తలలు కూడా తీసుకెళ్తారేమో" అన్నాడు.

జనవరి 10న ఈ ఘటన జరిగినప్పటి నుంచి తమ గ్రామంలో ఉన్నవారంతా భయపడిపోయి ఉన్నారని గ్రామ సర్పంచి మహమ్మద్ సాదిక్ చెప్పాడు.

"జనవరి 10న మా గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు చనిపోయారు. దాంతో గ్రామస్థులకు సరిహద్దు దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు. ప్రభుత్వం కూలీలను కాపాడాలి. వాళ్లు సైన్యానికి సాయం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ BAT లోపలికి వచ్చి మన పౌరుడి తల తీసుకెళ్లింది. ఇది మళ్లీ జరక్కూడదు. కూలీ తలను తీసుకెళ్లడం సాహసం అనుకుంటున్నారా. ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి’’ అన్నారు.

దీనిపై బీబీసీతో మాట్లాడిన పూంచ్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ "ఒక సాధారణ పౌరుడిని తల నరికి చంపడం ఇదే మొదటిసారి. సైన్యం కోసం కూలీగా పనిచేసేవాళ్లు సామాన్యులే ఉంటారు. ఇంతకు ముందు ఇలా జమ్ము-కశ్మీర్‌లో ఎప్పుడూ జరగలేదు. సరిహద్దు దగ్గర ఉండే వాళ్లు యూనిఫాం లేని సైనికులు అని నేను ఎప్పుడూ చెబుతాను" అన్నారు.

ఇది పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ ఫోర్స్ ‌చేసిందా అని అడిగితే, "దీనిపై దర్యాప్తు జరగాలి" అని చెప్పారు.

అయితే, పేరు వెల్లడించని ఒక ఆర్మీ అధికారి బీబీసీతో ఇది పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ చేసిన దాడి అని చెప్పారు.

"పూంచ్ సెక్టార్‌లో ఇద్దరిపై దాడి చేసి చంపేసిన పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ వారిలో ఒకరి తల నరికి తీసుకెళ్లింది" అన్నారు.

దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేను ప్రశ్నించినప్పుడు ఆయన "మేం అలాంటి క్రూర చర్యలకు పాల్పడం. ఒక ప్రొఫెషనల్ ఫోర్స్‌లాగే పోరాడతాం. అలాంటి పరిస్థితులను మిలిటరీ విధానంలోనే ఎదుర్కుంటాం" అన్నట్లు పీటీఐ చెప్పింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...