Jump to content

అప్పిస్తే తీర్చగలరా?


KING007

Recommended Posts

అప్పిస్తే తీర్చగలరా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎస్‌బీఐ సందేహం
ఏపీపీఎఫ్‌సీఎల్‌ రుణ మంజూరుపై ఆచితూచి..
మరిన్ని వివరాలు పంపాలని కోరిన బ్యాంకు
ఈనాడు - అమరావతి

అప్పిస్తే తీర్చగలరా?

మనం ఎక్కడైనా అప్పు తీసుకోవాలంటే.. దానిని తిరిగి తీర్చగలిగే శక్తి మనకుందో లేదో శల్య పరీక్ష చేస్తారు. ఎవరైనా మనకు గ్యారంటీ ఉంటామంటే వాళ్ల చరిత్రనూ సమూలంగా పరీక్షిస్తారు. ఆ తర్వాతగానీ అప్పు పుట్టదు. కానీ ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చే ఏ సంస్థకైనా ఇట్టే అప్పు పుడుతుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఆర్థిక సంస్థ లిమిటెడ్‌కు (ఏపీపీఎఫ్‌సీఎల్‌) అప్పు పుట్టడం కష్టంగానే ఉంది. రుణానికి గ్యారంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అసలు అప్పును ఎలా తీర్చగలరంటూ సందేహాలను లేవనెత్తుతోంది. ‘అసలు మీకు అప్పిస్తే తీర్చగలిగే శక్తి ఉందా? అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు? ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏమైనా సంపాదిస్తున్నారా’ అంటూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ను సూటిగా ప్రశ్నించింది. మరోవైపు రాష్ట్రంలో గత ప్రభుత్వాలిచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించడం లేదని.. రుణ మంజూరు విషయంలో దీనినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సర్కారు మీదా పరోక్షంగా అనుమానాలను వ్యక్తం చేసింది. తాము తెలిపిన అభ్యంతరాలకు, అనుమానాలకు సమాధానాలు ఇవ్వాలంటూ ఏపీపీఎఫ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టరుకు లేఖాస్త్రం సంధించింది.

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.2.52 లక్షల కోట్లు ఉన్నాయని, 2020 నాటికి అవి రూ.3 లక్షల కోట్లకు చేరతాయని బ్రిక్‌వర్క్‌ సంస్థ నివేదిక ద్వారా తెలుస్తోందని ఏపీపీఎఫ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టరుకు రాసిన లేఖలో ఎస్‌బీఐ పేర్కొంది. ‘2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీపీఎఫ్‌సీఎల్‌ సంస్థ ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు రూ.9,665 కోట్లుంటే.. 2017-18 నాటికి అవి రూ.35,964 కోట్లకు పెరిగాయని బ్రిక్‌వర్క్‌ నివేదిక సూచిస్తోంది. ప్రస్తుతం ఏపీపీఎఫ్‌సీఎల్‌ ప్రతిపాదించిన రూ.3వేల కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటంవల్ల రుణభారం అసాధారణంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రుణం తిరిగి చెల్లింపు, అందుకున్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి’ అని బ్యాంకు పేర్కొంది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు/ వివరణలు పంపితే వాటిని తమ కార్పొరేట్‌ కార్యాలయానికి పంపుతామని తెలిపింది.

బ్యాంకు అభ్యంతరాలివీ..
* ఏపీపీఎఫ్‌సీఎల్‌ ప్రతిపాదిత రుణ ప్రణాళిక ప్రకారం అప్పులు/ఆస్తుల మధ్య అంతరం 714.32 రెట్లకు చేరడం, ఆర్జిస్తున్న లాభాలు కేవలం రూ.0.04 కోట్లు కావడం, విద్యుత్తు బాండ్ల ద్వారా సేకరించిన రూ.4వేల కోట్లకు క్రిసిల్‌ సంస్థ ‘డి’ గ్రేడ్‌ ఇవ్వడం... ఈ కారణాలన్నింటి దృష్ట్యా కేవలం ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ మీదే రుణ ప్రతిపాదన ఆధారపడుతోంది.
* క్రిసిల్‌ సంస్థ సెప్టెంబరు 17, 2019న జారీ చేసిన ఎక్స్‌టర్నల్‌ క్రెడిట్‌ రేటింగ్‌లో (ఈసీఆర్‌) 2005, 2010, 2011, 2012 సంవత్సరాల్లో జారీ చేసిన బాండ్లకు ‘డి’ గ్రేడ్‌ కేటాయించింది. సంస్థ తన రుణాలను తిరిగి చెల్లించటంలో జరుగుతున్న జాప్యానికి ఇది అద్దం పడుతోంది. దీన్ని అధిగమించటానికి సంస్థ కార్యాచరణ ప్రణాళిక ఏంటి?
* ఏపీపీఎఫ్‌సీఎల్‌ కొత్తగా ప్రతిపాదించిన రూ.5వేల కోట్ల బాండ్లకు క్రిసిల్‌ సంస్థ ప్రొవిజినల్‌గా ఏ ప్లస్‌ గ్రేడ్‌ కేటాయించింది. బాండ్ల జారీకి ప్రొవిజినల్‌ రేటింగ్‌ ఉపయోగపడదని ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 17, 2019న క్రిసిల్‌ సంస్థ ఇచ్చిన గ్రేడింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటాం.
*  బ్రిక్‌వర్క్‌ సంస్థ ఆగస్టు 13, 2019న ఇచ్చిన ఎక్స్‌టర్నల్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏ ప్లస్‌ ఆధారంగా ఏపీపీఎఫ్‌సీఎల్‌ రుణ ప్రతిపాదన తయారుచేసింది. వాస్తవానికి బ్రిక్‌వర్క్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లకు (ఎన్‌సీడీ) రేటింగ్‌ ఇచ్చింది. అదీ రూ.5వేల కోట్ల వరకు మాత్రమే. ప్రతిపాదిత అప్పులు రూ.9,741.33 కోట్లు. బ్రిక్‌వర్క్‌ పాత రేటింగ్‌ ఆధారంగా రుణ మంజూరు సాధ్యమా? మరో తాజా రేటింగ్‌ అవసరమా? ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.
* సంస్థకు ఉన్న అప్పులతో పోలిస్తే.. నికర నిధులు రూ.16.92 కోట్లే ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అప్పులు/ఆస్తుల మధ్య అంతరం 141.32 రెట్లుంటే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తాజాగా తీసుకునే రుణాలతో కలిపితే ఇది 714.32 రెట్లు అవుతుంది.
* సంస్థ ఆస్తి, అప్పుల నిష్పత్తి ఆగస్టు 31, 2019 నాటికి 1:1గా ఉంది. వాస్తవానికి ఇది 1.25:1గా ఉండాలి.
* క్రిసిల్‌ సంస్థ కంపెనీ బాండ్లకు ఇచ్చిన ‘డి’ గ్రేడ్‌ ఆధారంగా సంస్థ తాను తీసుకున్న అప్పులతో ఆదాయం సంపాదించడం ప్రశ్నార్థకంగా ఉంది. ఆ ఆస్తులనే ఇప్పుడు సెక్యూరిటీగా చూపిస్తుండటంతో.. సెక్యూరిటీ కవరేజి, నిరర్ధక ఆస్తుల పరిస్థితి దృష్ట్యా ముప్పు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
* కంపెనీ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.2,325.70 కోట్లు. ఇది రూ.12,067.03 కోట్లకు పెరుగుతాయన్నది అంచనా మాత్రమే. దానికి తగ్గ స్థాయిలో సంస్థకు అప్పులున్నాయి. ప్రతిపాదిత అప్పుతో బాండ్లను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లిస్తారా? లేదా విద్యుత్‌ సంస్థలకు ఉన్న బకాయిల తిరిగి చెల్లింపునకు ఉపయోగిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. దానిపై స్పష్టత ఇవ్వాలి.
* ఏపీపీఎఫ్‌సీఎల్‌కు, ప్రభుత్వానికి, రుణమిచ్చే బ్యాంకుకు మధ్య రుణం తిరిగి చెల్లింపుకోసం త్రైపాక్షిక ఒప్పందం ఏమైనా ఉంటుందా?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...