Jump to content

Ashok Khemka


RKumar

Recommended Posts

నీతికి నిలబడి నిజాయతీగా..

 

అరుదైన ఐఏఎస్‌ అశోక్‌ ఖేమ్కా
27 ఏళ్లలో 52 బదిలీలు

18ap-main21a.jpg

నిజాయతీ.. అవినీతి..
రెండింటికీ అక్షరాలు నాలుగే.
అర్థాల్లో మాత్రం ఎవరెస్టు శిఖరానికి,
అధఃపాతాళానికి ఉన్నంత తేడా..
మొదటిది అందరి మాటల్లోనూ వినిపిస్తుంది. ఆచరణలో మాత్రం అతి తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అలాంటి నిజాయతీకి నిదర్శనంగా నేనున్నానంటూ, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఓ అరుదైన అధికారి గురించి ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది. ఆయనే హరియాణా సీనియర్‌ ఐఏఎస్‌ అశోక్‌ ఖేమ్కా.
ఆయన నిబద్ధతను ఇష్టపడని ప్రభుత్వ పెద్దలు పదేపదే అదేపనిగా బదిలీలు చేస్తున్నా ఏమాత్రం చలించడం లేదు. 1991 బ్యాచ్‌కు చెందిన అశోక్‌ ఖేమ్కాకు మాత్రం ఇప్పటికే 50కి పైగా బదిలీలయ్యాయి. ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్‌ హయాంలో ఎక్కువగా జరిగిన బదిలీల బంతాట, ఇప్పుడు భాజపా అధికారంలోనూ కొనసాగుతోంది.

2012 : వాద్రా వ్యవహారం
అశోక్‌ ఖేమ్కా 2012లో యూపీఏ హయాంలోనే ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా సంస్థ-డీఎల్‌ఎఫ్‌ మధ్య భూ ఒప్పందాన్ని రద్దుచేసి సంచలనం సృష్టించారు ఖేమ్కా. ఈ ఒప్పందం విలువ రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 3.50 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా. వాద్రా తక్కువ ధరలకు భూమి కొనుగోలు చేసి, ఖరీదైన ధరలకు విక్రయించేవారనేది ఖేమ్కా ఆరోపణ. ఇక అప్పటి నుంచీ అనేకసార్లు యూపీఏ హయాంలో ఆయనను తరచూ బదిలీ చేసేవారు.

భాజపాదీ అదే దారి..
కాంగ్రెస్‌ హయాంలో ఖేమ్కా బదిలీలపై అప్పట్లో భాజపా తీవ్రంగా మండిపడేది. పలుమార్లు ఆయనకు బాసటగా కూడా నిలిచింది. అయితే ప్రస్తుత భాజపా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఖేమ్కాపై అదే బదిలీల అస్త్రం ప్రయోగిస్తూ కాంగ్రెస్‌ బాటలోనే పయనిస్తోంది. 15 నెలల క్రితమే హరియాణా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఖేమ్కా నియమితులయ్యారు. మళ్లీ ఈనెల 3న ఆయనను శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇది పెద్దగా ప్రాముఖ్యం లేని, నామమాత్రమైన పదవి.

అశోకుడు.. ఆరావళి..
ఆరావళి పర్వత శ్రేణుల్లో ఫరీదాబాద్‌ వద్ద అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా అశోక్‌ ఖేమ్కా 2012లో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా ఆ ఆదేశాలను రద్దు చేస్తూ సవరణలు చేసింది. ఫలితంగా 3100 ఎకరాల భూమిని అటవీ ప్రాంతం నుంచి తొలగించారు. దీనిపై స్పందించిన ఖేమ్కా అక్రమ నిర్మాణాలు పర్యావరణ సమతుల్యానికి నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తుల భూదాహానికి పర్యావరణం బలైపోతుందని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఖట్టర్‌ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది కూడా. అయితే వెంటనే అశోక్‌పై బదిలీ వేటు పడింది.

వయసు 53.. బదిలీలు 52..

అశోక్‌ ఖేమ్కా వయసు 53. పుట్టింది కోల్‌కతాలో. ఈ ఏడాది మార్చి 3న ఆయన 27 ఏళ్లకు పైబడిన ఉద్యోగ జీవితంలో 52వ సారి బదిలీ అయ్యారు. అంటే సగటున సంవత్సరానికి రెండు బదిలీలు.
* నాలుగున్నరేళ్ల ప్రస్తుత భాజపా పాలనలో ఆరో బదిలీ.
* అంతకుముందు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి బీఎస్‌ హుడా పాలనలో 22 సార్లు.
* ఓపీ చౌతాలా సీఎంగా ఉన్న కాలంలో 10 బదిలీలు.
* ఓచోట అత్యధిక కాలం పనిచేసింది (దాదాపు 21 నెలలు): హరియాణా రాష్ట్ర వేరేహౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ (2008 జులై నుంచి 2010 ఏప్రిల్‌)
* అతితక్కువ కాలం (20 రోజులు): గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అడ్మినిస్ట్రేటర్‌.
* 2002లో ఒకే ఏడాదిలో 4 బదిలీలు.

హైకోర్టులో ఖేమ్కాకు ఊరట

చండీగఢ్‌: హరియాణా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌)లో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాసిన వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించాలంటూ సోమవారం పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశించింది. 2016-17 ఏసీఆర్‌లో ఖేమ్కాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎస్‌.దేషి 10కి గానూ 8.22 మార్కులు ఇచ్చారు. అనంతరం ఆ దస్త్రం క్రీడల శాఖ మంత్రి అనిల్‌విజ్‌ వద్దకు వెళ్లింది. ఖేమ్కా పనితీరును ఇష్టపడే కొద్దిమందిలో ఒకరైన ఆయన మాత్రం 9.92 మార్కులు ఇచ్చారు. అంతేకాకుండా ‘‘నేను మూడేళ్ల కాలంలో 20 మంది ఐఏఎస్‌ అధికార్లతో పనిచేశాను. ఖేమ్కా వంటి మంచి అధికారిని ఇంతవరకు చూడలేదు. చాలా ఆటంకాలు ఉన్నప్పటికీ ఆయన మంచి ఫలితాలు సాధించారు.’’ అని పేర్కొన్నారు. ఈ దస్త్రం చివరగా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వద్దకు వెళ్లగా ‘‘మంత్రి కొంచెం అతిశయోక్తులు రాశారు’’ అని పేర్కొంటూ ఆయన మార్కులను 9కి తగ్గించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ఇచ్చిన మార్కులు తక్కువేమీ కాకపోయినా.. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పదోన్నతి పొందడానికి ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు ఆటంకం కలిగిస్తాయి. ఒక బ్యాచ్‌లో కేవలం 20శాతం మందికి మాత్రమే పదోన్నతి లభించే అవకాశం ఉండటంతో ఏ చిన్న వ్యతిరేకత అయినా ప్రతికూలంగా మారుతుంది. దాంతో ఖేమ్కా హైకోర్టును ఆశ్రయించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...