Jump to content

నవ్యాంధ్ర పండింది!


Recommended Posts

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం
వరి దిగుబడిలో ద్వితీయం
హెక్టారుకు 518 కేజీలు పెరిగిన ధాన్యం దిగుబడి
పండ్లలో మహారాష్ట్ర కన్నా మిన్న
ధాన్యంలో పంజాబ్‌ తర్వాతి స్థానం
రిజర్వ్‌బ్యాంకు తాజా గణాంకాలు
ఈనాడు - దిల్లీ

 

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పండ్ల ఉత్పత్తిలో అద్భుత పురోగతి సాధించింది. దేశంలో ఉద్యాన పంటలకు మారుపేరైన మహారాష్ట్రను   తోసిరాజని అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్‌ రైతులు మహారాష్ట్రీయులకంటే తక్కువ విస్తీర్ణంలో పండ్లతోటలు వేసినా వారికి మించిన దిగుబడి సాధించారు. వరి దిగుబడిలోనూ నవ్యాంధ్రది ఇదే ఒరవడి. రిజర్వ్‌బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం.. 2016-17లో రాష్ట్రంలో హెక్టారుకు సగటున 3,540 కేజీల ధాన్యం దిగుబడి వచ్చింది. 2014-15తో పోలిస్తే హెక్టారుకు సగటున 518 కేజీల దిగుబడి పెరిగింది. అంటే ఎకరాకు 1432 కేజీల దిగుబడి లభించినట్లు లెక్క. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే పంజాబ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. అక్కడ హెక్టారుకు సగటున 3,998 కేజీల ధాన్యం రాగా, ఆంధ్రప్రదేశ్‌ 458 కేజీలు వెనుకబడి ఉంది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాల కాలంలో వరి దిగుబడి హెక్టారుకు 939 కేజీలు పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల ఉత్పత్తి రాష్ట్ర విభజన తర్వాత 29.77 లక్షల టన్నులమేర పెరిగింది. 2014-15లో 91.21లక్షల టన్నుల మేర దిగుబడి రాగా.. 2016-17 నాటికి అది 1.20కోట్ల టన్నులకుఎగబాకింది. దేశంలో మరే రాష్ట్రమూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీపడలేదు. పండ్లతోటలకు పేరొందిన మహారాష్ట్రలో 2016-17లో పండ్ల ఉత్పత్తి 1.03కోట్ల టన్నులకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పండ్లతోటల సాగు విస్తీర్ణం 2014-15లో 5.45 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా 2016-17 నాటికది 6.04 లక్షల హెక్టార్లకు చేరింది. ఇది మహారాష్ట్ర కంటే లక్షన్నర హెక్టార్లు తక్కువైనా దిగుబడి దానికంటే 17లక్షల టన్నులమేర ఎక్కువ వచ్చింది.
* వరిసాగు విస్తీర్ణం గత మూడేళ్లలో రాష్ట్రంలో తగ్గుతూ వస్తోంది. 2014-15లో 23.94 లక్షల హెక్టార్లలో వరి వేయగా 2016-17 నాటికది 21.05లక్షల హెక్టార్లకు తగ్గింది. హెక్టారుకు సగటు దిగుబడి పెరగడంతో సాగు తగ్గినా పంట దిగుబడిలో పెద్ద తేడా రాలేదు. 2014-15లో 72.33లక్షల టన్నుల మేర వచ్చిన వరి దిగుబడి 2016-17 నాటికి 74.52లక్షల టన్నులకు పెరిగింది. పంట విస్తీర్ణం మూడేళ్లలో 13% తగ్గినా దిగుబడి 3% పెరిగింది.

05ap-main2b.jpg

* పప్పుదినుసుల సగటు దిగుబడి మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 2014-15లో హెక్టారుకు 911 కేజీలు వచ్చిన దిగుబడి తర్వాతి సంవత్సరాల్లో వరుసగా 848, 659 కేజీలకు పడిపోయింది.
* మొత్తం ఆహార ధాన్యాల సగటు దిగుబడి (హెక్టారుకు) 2014-15లో 2,648 కేజీలుండగా తర్వాతి సంవత్సరాల్లో ఇది 2,571, 2611 కేజీలకు పరిమితమైంది.
* బీ గత మూడేళ్లలో నూనెగింజల సగటు దిగుబడుల్లోనూ భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. 2014-15లో హెక్టారుకు 557 కిలోల దిగుబడి రాగా 2015-16లో అది ఏకంగా 954 కేజీలకు పెరిగింది. 2016-17లో మాత్రం 581 కిలోలకు తగ్గింది. పత్తి ఉత్పత్తిలోనూ హెచ్చుతగ్గులు కనిపించాయి. 2014-15లో హెక్టారుకు 588 కేజీల దిగుబడి రాగా, తర్వాతి సంవత్సరాల్లో అది 482, 563 కేజీలకు చేరింది. ఈ అంశంలో హరియాణ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
* రాష్ట్రంలో ఎరువుల సగటు వినియోగం గత మూడేళ్లలో ఏటా తగ్గుతూ వస్తోంది. ఎన్‌పీకే ఎరువుల వినియోగం 2014-15లో హెక్టారుకు సగటున 237.2 కేజీలుండగా, 2015-16లో అది 225.7 కిలోలకు, 2016-17లో 212.07 కిలోలకు తగ్గింది.
* రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిలో మంచి వృద్ధి నమోదైంది. 2014-15లో 5.28లక్షల టన్నుల మేర ఉన్న మాంసం ఉత్పత్తి 2017-18 నాటికి ఏకంగా 7.09 లక్షల టన్నులకు చేరింది.
* పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 96.56లక్షల టన్నులమేర ఉన్న ఉత్పత్తి 2017-18 నాటికి 1.37కోట్ల టన్నులకు పెరిగింది.
* కూరగాయల ఉత్పత్తీ రాష్ట్రంలో మెరుగైంది. 2014-15లో 45.92 లక్షల టన్నులమేర ఉన్న వీటి ఉత్పత్తి 2016-17 నాటికి 53.55 లక్షల టన్నులకు చేరింది. ఈ విషయంలో పశ్చిమబంగ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా, హరియాణా, తమిళనాడులు ఆంధ్రప్రదేశ్‌ కంటే బాగా ముందున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...