Jump to content

EVMs Tampering


JVC

Recommended Posts

‘ఈవీఎంలతో మాయ’

 

2014 ఎన్నికల్లో భాజపా ఓటు యంత్రాలను హ్యాక్‌ చేయించింది
ఈ విషయం తెలిసిన గోపీనాథ్‌ ముండే హత్యకు గురయ్యారు
ఆ కేసు దర్యాప్తు చేసిన అధికారీ మరణించారు
ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చని మేము రుజువు చేశాం
మా బృందంలో కొంత మందిని హైదరాబాద్‌లో చంపేశారు
భాజపా నేతను కలవడానికి వెళ్లినప్పుడు మాపై కాల్పులు
నేను తప్పించుకుని విదేశాలకు పారిపోయా
స్కైప్‌ ద్వారా లండన్‌లో ఆరోపించిన ‘సైబర్‌ నిపుణుడు’ 
ఖండించిన ఎన్నికల సంఘం, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి

21hyd-main2a_4.jpg

లండన్‌: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’  జరిగిందంటూ సైబర్‌ నిపుణుడిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వీటిని హ్యాక్‌ చేయవచ్చని ఆయన చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. సయ్యద్‌ షుజా అనే ఈ నిపుణుడు సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం (ఐరోపా) నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకూ తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా అన్నది పరిశీలించాలని ఈసీఐఎల్‌ తన బృందాన్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. అయితే తన వాదనకు మద్దతుగా ఆయన ఆధారాలను ఇవ్వలేదు. షుజా వాదన ప్రకారం.. 
* ఈవీఎంలను హ్యాక్‌ చేయడం కోసం తక్కువ పౌనఃపున్యమున్న సంకేతాలను పొందేలా భాజపాకు టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సాయం చేసింది. డేటాను ట్రాన్స్‌మిట్‌ చేయడానికి జియోకు నెట్‌వర్క్‌ ఉంది. దీనివల్ల భాజపా లబ్ధి పొందింది. ఇలాంటి సౌకర్యాలు దేశవ్యాప్తంగా 9 చోట్ల ఉన్నాయి. అయితే తాము ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడుతున్నామన్న సంగతి జియో ఉద్యోగులకు తెలియదు. డేటా ఎంట్రీ మాత్రమే చేస్తున్నామని వారు అనుకున్నారు. (అయితే 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి.)

21hyd-main2d.jpg

* మిలటరీస్థాయి పౌనఃపున్యాలను ట్రాన్స్‌మిట్‌ చేసే మాడ్యులేటర్‌ ద్వారా ఈవీఎంలను భాజపా హ్యాక్‌ చేసింది.

 

* గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది.

 

* 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో భాజపాను బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో భాజపా నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు.

 

* గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేసినట్లు తెలుసుకున్నందువల్లే భాజపా నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్‌ ముండే హత్యకు గురయ్యారు. (నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దివారాలకే దిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే చనిపోయారు.)

 

* ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

* 2015లో దిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే భాజపా స్వీప్‌ చేసి ఉండేది.

 

* రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ భాజపా విజయం సాధించి ఉండేది. 

 

* ఈవీఎంలతో రిగ్గింగ్‌ చేయవచ్చా అన్నది తెలుసుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ  నన్ను సంప్రదించాయి. సాయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను మేమే సంప్రదించాం.  


* నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా.

 

* ఈ విలేకరుల సమావేశానికిఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు.


గౌరీ లంకేశ్‌కు చెప్పా
ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సహ చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది.


ఎలాంటి లోపాలు లేవు: ఈసీ
షుజా ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఖండించింది. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవన్న తమ వాదనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తాజా ఆరోపణలకు సంబంధించి ఎలాంటి న్యాయ చర్యలు తీసుకోవాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు వివరించింది. దురుద్దేశంతో ఈ యంత్రాలపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఈవీఎంలను ప్రభుత్వ రంగంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), ఈసీఐఎల్‌ తయారుచేస్తున్నాయని వివరించింది. కఠిన పర్యవేక్షణ, భద్రతా స్థితిగతుల నడుమ వీటి రూపకల్పన జరుగుతోందని తెలిపింది. తయారీలోని అన్ని దశల్లోనూ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది.

ఈవీఎంల హ్యాకింగ్‌ అతి పెద్ద అబద్ధం: జైట్లీ

21hyd-main2b.jpg

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల)తో రిగ్గింగ్‌ చేయవచ్చన్న ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ అవివేకం ఓ అంటురోగంలా ప్రబలిపోతోందని, ఈవీఎంల విషయంలో ఆ పార్టీ వాదన అతిపెద్ద అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తల రుణమాఫీ, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు అంటూ చేసిన ఆరోపణలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ మరో అతిపెద్ద అబద్ధానికి దిగిందని ఆరోపించారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ప్రజలకు ఏ చెత్త చెప్పినా నమ్మేస్తారని కాంగ్రెస్‌ భావిస్తోందా అని ప్రశ్నించారు.


సిబల్‌ హాజరు కావడం కాకతాళీయం కాదు: నఖ్వీ
మరో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందిస్తూ- లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశానికి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ హాజరుకావడం కాకతాళీయమేమీ కాదన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీలే  వారి తరఫున సిబల్‌ను పంపించి ఉంటారని ఆరోపించారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయడం సాధ్యం కాదన్నారు.


21hyd-main2c_1.jpgఈసీ దృష్టికి హ్యాకింగ్‌ అంశం: మమతా
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)లను హ్యాక్‌ చేయవచ్చంటూ ఒక సైబర్‌ నిపుణుడు తాజాగా చేసిన వాదనను విపక్షం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రతి ఓటూ విలువైందేనని, అందువల్ల ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు.


ఈవీఎంల పనితీరును పరీక్షించాల్సిందే: కాంగ్రెస్‌
ఈవీఎంల హ్యాకింగ్‌ చాలా తీవ్రమైన విషయమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అన్నారు. ఈ యంత్రాల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయన్నారు. ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం కలిగించాల్సి ఉందనీ, ఎన్నికలకు ముందే సగం వీవీప్యాట్‌లను పరీక్షించి, వాటి కచ్చితత్వాన్ని నిరూపించాలన్నారు. ఎన్నికల సంఘం విశాల దృక్పథంతో దీని గురించి ఆలోచించాలని కోరారు

Link to comment
Share on other sites

మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీని విడుదల చేసే మాడ్యులర్లతో ఈవీఎంను హ్యాక్‌ చేశారంటూ సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ సుజా బాంబు పేల్చాడు. అసలు మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? అసలు అంత లో-ఫ్రీక్వెన్సీలో డేటా బదిలీ సాధ్యమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవే ప్రశ్నలను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, టెలికం ఇంజనీర్లను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫ్రీక్వెన్సీతో డేటా బదిలీ, ట్రాకింగ్‌, హ్యాకింగ్‌ సాధ్యమేనంటున్నారు. ఒకే ఫ్రీక్వెన్సీ మాడ్యులర్లు ఈవీఎంలకు, కంట్రోల్‌ యూనిట్లకు అనుసంధానమై ఉంటే.. వాటిని ప్రభావితం చేయవచ్చంటున్నారు.
 
 
సాధారణంగా రేడియో ఫ్రీక్వెన్సీ మూడు కేటగిరీల్లో ఉంటుంది. హై-ఫ్రీక్వెన్సీ (హెచ్‌ఎఫ్‌), వెరీ హై-ఫ్రీక్వెన్సీ (వీహెచ్‌ఎఫ్‌) మొదటి రెండు రకాలు కాగా.. మూడో కేటగిరీలో అలా్ట్ర హై ఫ్రీక్వెన్సీ (యూహెచ్‌ఎఫ్‌), ఎల్‌, ఎస్‌ బ్యాండ్లు ఉంటాయి. వీటిలో హెచ్‌ఎ్‌ఫలో అతి తక్కువ ఫ్రీక్వెన్సీ స్థాయి(3మెగా హెర్‌ట్జ్‌ నుంచి 30 మెగా హెర్‌ట్జ్‌), తరంగదైర్ఘ్యం (100-10 మీటర్లు) ఉంటాయి. తొలినాళ్లలో హెచ్‌ఎ్‌ఫలోని వేర్వేరు బ్యాండ్లను 2జీ ఫోన్ల మాదిరిగా కేవలం కమ్యూనికేషన్‌కు ఉపయోగించేవారు. అప్పట్లో మిలటరీ, పోలీసు విభాగాలతోపాటు.. పెద్ద కంపెనీలు వీటిని ఉపయోగించేవి. మొబైల్‌ ఫోన్ల ఆగమనం తర్వాత.. బడా కంపెనీలు హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌కు స్వస్తి పలుకగా.. ప్రస్తుతం త్రివిధ దళాలు, రక్షణ సంస్థలు, పోలీసు శాఖలు, రాడార్‌ వ్యవస్థలను నిర్వహించే విభాగాలు ఉపయోగిస్తున్నాయి.
 
జీపీఎస్‌ నుంచి డేటా బదిలీ దాకా
ప్రస్తుతం హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌లోనూ భారీ మార్పులు వచ్చాయి. ఉదాహరణకు తెలంగాణలోని గ్రేహౌండ్స్‌ పోలీసు దళం అడవుల్లో కూంబింగ్‌ చేస్తుంటే.. వారెక్కడున్నారో హైదరాబాద్‌లోని అధికారులు ట్రాక్‌ చేస్తారు. అంటే.. లో-పవర్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (ఎల్‌పీవ్యాన్‌) మాదిరిగా కూడా ఈ బ్యాండ్లు ఉపయోగపడుతాయి. 0.3 కేబీపీఎస్‌ నుంచి 50 కేబీపీఎస్‌ వేగంతో డేటా బదిలీ కూడా జరుగుతుంది. మిలటరీ వారు వాడే హెచ్‌ఎఫ్‌ పరికరాల్లో (మిల్‌-స్టాండర్డ్‌) పీసీ-ఇన్‌పుట్‌, యూఎ్‌సబీ పోర్టులు, ఎస్‌ఎంఎస్‌ పంపే సదుపాయం, లొకేషన్‌ ఫైండ్‌, లొకేషన్‌ ట్రాకర్లు ఉన్నాయి. దీని సహాయంతో.. సమీపంలో ఉండే ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్‌ను నియంత్రించడం, అందులోని డేటాను మార్చడం, హ్యాక్‌ చేయడం సులభసాధ్యమేనని టెలికం ఇంజనీర్లు చెబుతున్నారు. అంటే.. ఈవీఎంలలోనూ ఈ బ్యాండ్‌ మాడ్యుల్స్‌ ఉంటే.. వాటిని ప్రభావితం చేయడం సులభమేనంటున్నారు.
 
ప్రత్యేక అల్‌గారిథమ్‌..
ఒకప్పుడు వీహెచ్‌ఎఫ్‌, హెచ్‌ఎఫ్‌ పరికరాలను కొనుగోలు చేసేవారు అందులో పోలీసులు ఉపయోగించే ఫ్రీక్వెన్సీకి ట్యూన్‌ చేస్తే.. వారి మాటలను వినే అవకాశం ఉండేది. హ్యామ్‌రేడియో వంటి పరికరాలతోనూ వాటిని ట్రాక్‌ చేసే వీలుండేది. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌లో జరిగే కమ్యూనికేషన్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేస్తున్నారు. ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్‌ చేసేవారికి రేడియో శూన్య శబ్దాలు తప్ప.. సంభాషణలు వినిపించవు. ‘ఇప్పుడున్న హెచ్‌ఎఫ్‌ పరికరాల్లో భద్రత ఎక్కువ. పైగా.. బ్రాడ్‌బ్యాండ్‌ ఓవర్‌ పవర్‌లైన్స్‌ (బీపీఎల్‌) ఇంటర్నెట్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ బ్యాండ్‌ ద్వారా చేసే ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ను ఇతరులు ట్రాక్‌ చేయలేరు. కానీ, ఇతరుల బ్రౌజింగ్‌ హిస్టరీని ఈ పరికరాల ద్వారా ట్రాక్‌ చేయవచ్చు’ అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు వివరించారు. ‘మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీలో ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, ప్రత్యేక అల్‌గారిథమ్‌ ఉంటాయి. ఎవరూ హ్యాక్‌ చేయలేరు. కానీ, ఆ టెక్నాలజీ తెలిసిన వారు ఒకే నెట్‌వర్క్‌లో ఉండే ఇతర పరికరాలను హ్యాక్‌ చేయడం అసాధ్యమేమీ కాదు. ఈవీఎంలలో ఈ టెక్నాలజీ ఉంటే.. మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీతో వాటిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు.
- సెంట్రల్‌ డెస్క్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...