Jump to content

అంబటికి వైసీపీ టిక్కెట్ ఇస్తే జరిగేది ఇదేనా..?


sonykongara

Recommended Posts

అంబటికి వైసీపీ టిక్కెట్ ఇస్తే జరిగేది ఇదేనా..?
19-01-2019 10:19:57
 
636834901701447791.jpg
అక్కడ మాటకు మాటే సమాధానం చెబుతుంది. అధినేత పాదయాత్రకు సంఘీభావంగా ఆ నియోజకవర్గంలో పోటీచేయబోయే అభ్యర్ధి సభ నిర్వహిస్తుంటే.. ఆ అభ్యర్ధికి వ్యతిరేకంగా ప్రత్యర్ధులు పోటీ సభపెట్టారు. ఆయన ఒక మండలానికి పరిమితమైతే.. పార్టీలోని ప్రత్యర్ధులు అన్ని మండలాల్లో తిరిగి ఆయనకు వ్యతిరేకంగా పొగబెట్టారు. ఆయన కాకుండా మరెవరికి టిక్కెట్‌ ఇచ్చినా సదరు అభ్యర్ధిని గెలిపించుకుంటామని తెగేసి చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే మాత్రం సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి గత ఎన్నికల ఫలితం పునరావృతం అవుతుందని సవాల్ చేస్తున్నారు. అసమ్మతి వర్గాన్ని పార్టీ అధిష్టానం భాగ్యనగరానికి పిలిపించి మాట్లాడినా వారు శాంతించలేదు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఏ పార్టీలో ఈ పరిణామం చోటుచేసుకుంది? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
      యువజన- శ్రామిక- రైతు కాంగ్రెస్‌పార్టీ తరఫున అధికార ప్రతినిధే కాదు.. అంతకంటే ఎక్కువగా గళం వినిపించే అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి మొదలైంది. అది రోజురోజుకు పెరిగిపోయి నియోజకవర్గంలో ఆ పార్టీని కార్చిచ్చులా కమ్మేస్తోంది. అంబటికి మినహా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామనీ, ఆయనకు ఇస్తే మాత్రం ఓడించి తీరతామనీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం తాజాగా సవాల్ చేసింది. అంతేకాదు- అంబటికి వ్యతిరేకంగా పోటీ సభలను కూడా ప్రారంభించింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు నియోజకవర్గంలో ఒకస్థాయి కలిగిన నేతలంతా సమావేశం అవ్వడమే కాకుండా.. అన్ని మండలాల్లో, సత్తెనపల్లి పట్టణంలో కూడా సమావేశాలు ఏర్పాటుచేసి బహిరంగంగానే వైకాపా అధినాయకత్వానికి అల్టిమేటం జారీచేసింది. ఈ పరిణామమే ప్రస్తుతం సత్తెనపల్లిలో చర్చోపచర్చలకు దారితీస్తోంది.
 
 
    ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఉన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావును ఎదుర్కోవాలంటే అంబటి రాంబాబు సరిపోరన్న చర్చ వైసీపీలో ఎప్పటినుంచో సాగుతోంది. మూడేళ్లపాటు నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి.. ఆరు నెలల క్రితమే నియోజకవర్గానికి వచ్చి హడావుడి చేస్తున్నారంటూ వైసీపీలోని ఒక వర్గం రాంబాబుని విమర్శిస్తోంది. సొంత మనుషులతో రాజకీయాలు నడిపించాలని చూస్తున్నారనీ, నియామకాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీ జెండా మోసిన వారిని పక్కనపెట్టారనీ అసంతృప్తివర్గం దుయ్యబడుతోంది. ఇదిలా ఉంటే, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా అంబటి రాంబాబు రాజుపాలెం మండలంలో పాదయాత్ర చేపట్టి ఒక సభను ఏర్పాటుచేశారు. అయితే అదే రోజున సత్తెనపల్లి పట్టణంలో అంబటికి వ్యతిరేకంగా అసమ్మతివర్గం మరొక భారీ సభను నిర్వహించింది. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ గజ్జెల నాగభూషణరెడ్డి, డాక్టర్ బ్రహ్మారెడ్డి, రాజుపాలెం జడ్పీటీసీ మర్రి వెంకట్రామిరెడ్డి, వివిధ మండలాలకి చెందిన కొర్లకొంట వెంకటేశ్వర్లు, గార్లపాటి ప్రభాకర్, మదమంచి రాంబాబు, యనమల శింగయ్యా వంటి ముఖ్యనేతలు, సత్తెనపల్లి కౌన్సిలర్లు కూడా అంబటికి వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో నియోజకవర్గ వైసీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది.
 
 
    ఈ వ్యవహారం అంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లింది. అయితే అంబటిని మాత్రం మార్చేది లేదని పార్టీ పెద్దల నుంచి సమాచారం వచ్చిందని అంటున్నారు. అసమ్మతివర్గం సత్తెనపల్లిలో సమావేశాలు నిర్వహించడం మీడియాలో ప్రముఖంగా వచ్చంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి అసమ్మతివర్గానికి చెందిన పద్నాలుగు మంది నేతలను హైదరాబాద్ పిలిపించారు. సుమారు మూడు గంటలపాటు వారితో చర్చించారు. అయినప్పటికీ అసమ్మతివర్గం మెత్తబడలేదు. అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేపక్షంలో.. రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లోనే వైసీపీ పోటీచేస్తున్నట్టుగా భావించాలని అసమ్మతివర్గ నేతలు విజయసాయిరెడ్డి వద్ద కుండబద్దలు కొట్టారు. సత్తెనపల్లిపై ఆశ వదులుకోవాలి అన్నది వారి మాటల అంతరార్థం! జగన్మోహనరెడ్డి మాత్రం అంబటికే టిక్కెట్ ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పగా.. ఓడిపోయేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అసమ్మతివర్గం సాయిరెడ్డికి స్పష్టంచేసింది. అంతేకాదు- అంబటి ఏకపక్ష చర్యలను మరోసారి ఆయన ముందు ఎండగట్టింది.
 
 
   అంబటి రాంబాబు తన ఒంటెద్దు పోకడలతో వైకాపాని భ్రష్టు పట్టించారనీ, నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ, ఆయన చేసిన పొరబాటు వలనే గత ఎన్నికలలో పార్టీ ఇక్కడ ఓడిపోయిందనీ పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం గట్టిగా వాదిస్తోంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని గేలిచేస్తున్నారని కూడా అసమ్మతివర్గం ఆరోపిస్తుంది. అంబటి తీరువల్లే గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా తయారయ్యాయన్న విమర్శలున్నాయి. ముప్పాళ్ళ జడ్పీటీసీ యనమాల మమతా సింగయ్య వంటి పలువురు నేతలు కూడా అంబటి అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
 
   అంబటి వ్యతిరేకులు అంతటితో ఊరుకోలేదు. సత్తెనపల్లి పట్టణంలోనూ, రెంటపాళ్ళలో కూడా భారీ సమావేశాలను ఏర్పాటుచేశారు. అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని తామెందుకు వ్యతిరేకిస్తున్నదీ వారంతా పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. త్వరలోనే ముప్పాళ్ళ, రాజుపాలెం, సత్తెనపల్లి రూరల్, నకిరేకల్ మండలాల్లో కూడా సభలు ఏర్పాటుచేస్తామని అసమ్మతివర్గం చెబుతోంది.
 
 
   అంబటి వ్యతిరేకవర్గం రెంటపాళ్ళలో ఏర్పాటుచేసిన సభకు భారీగా వైసీపీ నేతలు హాజరుకావడంపై ఆ పార్టీలో కలవరం మొదలైంది. సత్తెనపల్లి వ్యవహారం ఇప్పుడు కోస్తాజిల్లాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులపై తీవ్రస్వరంతో విరుచుకుపడే అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే.. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకులు తయారుకావడం, ఆయనపై వారంతా నోరేసుకుని విరుచుకుపడటం, ఆ అసమ్మతి గళం ఆంధ్రప్రదేశ్‌ అంతటా వినిపించడం ఆశ్చర్యకర పరిణామం. వైకాపా అభ్యర్ధిని మార్చకపోతే సత్తెనపల్లిలో గత ఎన్నికల ఫలితమే పునరావృతం అవుతుందని ఆ పార్టీలోని అసమ్మతివర్గం ఘంటాపథంగా చెబుతోంది. మాట తప్పని, మడమ తిప్పని అధినేతనని చెప్పుకునే వైకాపా సారథి జగన్‌ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, సత్తెనపల్లి సమస్యకి ఎలా ముగింపు పలుకుతారో వేచి చూడాల్సిందే! స్పీకర్ కోడెలపై నేరుగా విమర్శలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ అంబటి రాంబాబు అభ్యర్థిగానే సత్తెనపల్లిలో ఎన్నికలకు వెళతారా? లేక అభ్యర్ధిని మారుస్తారా? అనేది వైసీపీ క్యాడర్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది!
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...