Jump to content

Clouds clear avutunnaya


APDevFreak

Recommended Posts

 

పాండ్యాను చంపింది నయీమ్‌ గ్యాంగే
07-11-2018 01:27:33
 
636771508549567586.jpg
  • సొహ్రాబుద్దీన్‌, నయీమ్‌, షాహిద్‌కు సుపారీ
  • చంపినవారు తులసీరాం ప్రజాపతి, మరొకరు
  • హత్య కాంట్రాక్టు వారికిచ్చింది డీజీ వంజారా
  • కోర్టుకు తెలిపిన గ్యాంగ్‌స్టర్‌ ఆజంఖాన్‌
  • నరేంద్రమోదీతో హరేన్‌పాండ్యాకు విభేదాలు
  • 2003 మార్చిలో పాండ్యా హత్య
  • 2005 సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌
  • 2006 తులసీరాం కాల్చివేత
  • 2016 నయీం ఎన్‌కౌంటర్‌
 
గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌పాండ్యాను హత్య చేసింది నయీమ్‌ ముఠానా? ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి డీజీ వంజారా.. పాండ్యా హత్య కాంట్రాక్టును సొహ్రాబుద్దీన్‌, నయీమ్‌, అతడి అనుచరుడు షాహిద్‌కు ఇచ్చారా?.. ఉదయ్‌పూర్‌ గ్యాంగ్‌స్టర్‌, సొహ్రాబుద్దీన్‌ స్నేహితుడు అయిన ఆజంఖాన్‌ ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే జవాబిస్తున్నాడు. సొహ్రాబుద్దీన్‌, అతడి అనుచరుడు తులసీరామ్‌ ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ కేసుపై ముంబై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో అతడు ఈ విషయాలను వెల్లడించినట్టు పేర్కొంటూ ‘ముంబై మిర్రర్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది.
 
ఆ కథనం ప్రకారం.. సోహ్రాబుద్దీన్‌, తాను స్నేహితులమని, కొన్నాళ్లపాటు కలిసి ఉన్నామని ఆజంఖాన్‌ కోర్టుకు తెలిపాడు. ‘‘హరేన్‌ పాండ్యాను హత్య చేసే కాంట్రాక్టు వచ్చిందని.. తాను, నయీం, అతడి అనుచరుడు షాహిద్‌ కలిసి ఆ పని పూర్తిచేశామని సోహ్రాబుద్దీన్‌ నాకు చెప్పాడు’’ అని న్యాయమూర్తికి వివరించాడు. ‘‘అప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఒక మంచివ్యక్తి (హరేన్‌ పాండ్యా) అనవసరంగా ప్రాణాలు కోల్పోయాడని సోహ్రాబుద్దీన్‌తో అన్నా. దానికి అతడు.. ఈ హత్యకు కాంట్రాక్టు ఇచ్చింది డీజీ వంజారా అని నాతో చెప్పాడు. ఆ తర్వాత నేను సోహ్రాబుద్దీన్‌తో సంబంధాలు తెంచుకున్నా ను’’ అని ఆజంఖాన్‌ తెలిపాడు.
 
 
క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసిన న్యాయవాది.. సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆజంఖాన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆజంఖాన్‌.. సోహ్రాబుద్దీన్‌ ఆదేశాల మేరకు తులసీరామ్‌ ప్ర జాపతి, మరొకరు కలిసి పాండ్యా హత్య చేసినట్టు 2010లో తాను సీబీఐకు తెలిపానని, కానీ అలా చెప్తే అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని ఓ అధికారి అన్నార న్నాడు. సీబీఐ నమోదు చేసిన తన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని చేర్చకపోవడానికి కారణమేమీ లేదని అభిప్రాయపడ్డాడు.
 
 
మోదీ వర్సెస్‌ పాండ్యా
హరేన్‌పాండ్యా చిన్నప్పుడే ఆరెస్సె్‌సలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యారు. కేశూభాయ్‌ పటేల్‌ మద్దతుదారైన పాండ్యా.. 1998లో గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేశూభాయ్‌ కేబినెట్‌లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టాక ఆయనకు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పజెప్పారు. గోధ్రా అల్లర్ల అనంతరం జరిగిన ఒక కేబినెట్‌ భేటీలో.. బాధితుల మృతదేహాలను ఆహ్మదాబాద్‌కు తీసుకురావడంపై చర్చ జరిగిందని, దీన్ని పాండ్యా నిరాకరించారని... దీనిపై ఆ భేటీలో గొడవ జరిగిందని చెబుతారు. అనంతరకాలంలో పాండ్యా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
 
2003 మార్చి 26న ఉదయం 7.40 గంటలకు అహ్మదాబాద్‌లోని లాగార్డెన్‌ వద్ద ఆయన హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆయన శరీరంలో ఐదు బుల్లెట్లు దింపారు. 2007లో.. స్పెషల్‌ పోటా కోర్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన అస్గర్‌ అలీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ శిక్ష విధించింది. మరో ఏడుగురికి సాధారణ యావజ్జీవ శిక్ష, ఇద్దరికి పదేళ్ల జైలు, ఒకరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2011 ఆగస్టు 29న.. గుజరాత్‌ హైకోర్టు ఈ పన్నెండు మందినీ హత్యకేసులో నిర్దోషులుగా ప్రకటించింది. హరేన్‌ పాండ్యా హత్య జరిగి ఇప్పటికి 15 ఏళ్లు గడిచినా.. ఆయన్ను చంపినవారెవరో ఇప్పటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో అజంఖాన్‌ కోర్టుకు తెలిపిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
 
 
మోదీయే దైవంగా...
సోహ్రాబుద్దీన్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా బయటపడిన డీజీ వంజారాకు మోదీ సన్నిహితుడుగా పేరుంది. మోదీని తన ఆరాధ్య దైవంగా వంజారా భావించేవారు. అలాంటి వ్యక్తి.. 2013లో రాజీనామా చేస్తూ మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో తనతో సహా 32 మంది అధికారులను మోసం చేశారని ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాడిన పోలీసు అధికారులను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది’’ అని విమర్శించారు. ‘‘నరేంద్ర మోదీని నేను దైవంగా భావించేవాడిని. కానీ, అమిత్‌ షా దుష్ప్రభావం ఆయన మీదా పడింది. మా విషయంలో తగిన విధంగా స్పందించలేకపోయారు. ఎన్‌కౌంటర్లకు మోదీ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం ఆచితూచి ఎంచుకున్న విధానాన్నే వివిధ విభాగాల అధికారులు అమలు చేసినట్లు విస్పష్టంగా చెప్పగలను. ప్రభుత్వంలో ఉన్నవారు తీసుకున్న నిర్ణయాలనే క్షేత్రస్థాయి సిబ్బందిగా, అధికారులుగా మేం అమలు చేశాం.
 
 
మేం చేసింది నకిలీ ఎన్‌కౌంటర్లయితే అప్పట్లో ఉగ్రవాద నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించిన వారినీ అరెస్టు చేయాలి. ఈ ప్రభుత్వం ఉండాల్సింది గాంధీనగర్‌లో కాదు. ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలోనో.. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్‌ జైల్లోనో’’ అని 2013 సెప్టెంబరు 1న గుజరాత్‌ హోం శాఖ కార్యదర్శికి పంపిన 10 పేజీల సుదీర్ఘమైన లేఖలో పేర్కొన్నారు. ‘‘కాలం గడిచేకొద్దీ నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఈ ప్రభుత్వానికి మమ్మల్ని కాపాడే ఉద్దేశం లేదు. అంతే కాదు, మమ్మల్ని ఎప్పటికీ జైళ్లలోనే ఉంచి సీబీఐ నుంచి తనను తాను కాపాడుకునేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది’’ ఆ లేఖలో ఆరోపించారు. ఈ లేఖ అప్పట్లో సంచలనం సృష్టించింది.
 
 
కట్‌-అవుట్‌ మర్డర్‌!
పోలీసు పరిభాషలో హరేన్‌ పాండ్యా హత్యలాంటివాటిని ‘కట్‌-అవుట్‌ మర్డర్‌’గా వ్యవహరిస్తారు. హత్యకు గురైనవారికి, హత్యకు పురమాయించినవారికి మధ్య సంబంధాన్ని రుజువు చేయడం కష్టమైన సందర్భాల్లో ఈ పదబంధాన్ని వాడుతారు. కట్‌-అవుట్‌ మర్డర్‌ గురించి ఒక పోలీసు అధికారి చెప్పిన ఆసక్తికర ఉదాహరణ.. ‘‘ ‘ఏ’ అనే వ్యక్తి ‘జడ్‌’ అనే వ్యక్తిని హత్య చేయించాలనుకుంటాడు. ఆ పనిని ‘బి’ అనే వ్యక్తికి పురమాయిస్తాడు. ‘బి’ ఆ పనిని ‘సి’కి చెప్తాడు. ఇక్కడ ‘సి’కి ‘ఏ’ గురించి తెలియదు. ఈ చైన్‌ ఇలాగే కొనసాగి ‘వై’ దాకా వెళ్తుంది. ‘వై’ ‘జడ్‌’ను చంపేస్తాడు. విచారణలో బయటపడుతుందనుకుంటే.. ‘ఏ’ ఈ చైన్‌లో ఎవరో ఒకరిని తొలగిస్తాడు (కట్‌-అవుట్‌). ఇక, ఆ కేసు ఎప్పటికీ తేలదు’’
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...