Jump to content

జాతీయ సంస్థకు.. గుజరాత్‌ దెబ్బ


sonykongara

Recommended Posts

జాతీయ సంస్థకు.. గుజరాత్‌ దెబ్బ
21-10-2018 02:04:25
 
636756842640551637.jpg
  • ఓఎన్జీసీకి మోదీ ‘సొంత’ బ్యాండ్‌
  • గుజరాత్‌ పెట్రోలియం కోసం ఓఎన్జీసీకి 8 వేల కోట్ల గండి
  • పనికిరాని బ్లాక్‌లు అంటగట్టిన వైనం
  • పదేళ్లు తవ్వినా పడని చమురు చుక్క
  • వాటినే ఓఎన్జీసీకి కట్టబెట్టారు
  • హెచ్‌పీసీఎల్‌లోనూ 14 శాతం అదనపు ధరతో వాటాల కొనుగోలు
  • ఏడాదిలో రెట్టింపైన ఓఎన్జీసీ నష్టాలు
  • సిబ్బంది జీతాలకూ కటకట
  • ముంచేస్తున్నారంటున్న కార్మికులు
‘బతుకు, బతికించు’... ఇది భారతీయ సిద్ధాంతం! ‘మనకు కావాల్సిన దానిని బతికించుకునేందుకు... మరొక దానిని ముంచెయ్‌’... ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానం! వినడానికి కర్కశంగా ఉన్నప్పటికీ... ఇది అక్షరాలా నిజం! సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు మేలు చేసేందుకు మొత్తం దేశానికి చెందిన చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ)కు దెబ్బకొట్టారు. ‘నవరత్న’ సంస్థల్లో ఒకటిగా వెలుగుతున్న ఓఎన్జీసీ మెడకు మరిన్ని గుదిబండలు తగిలించి సముద్రంలో ముంచుతున్నారు. దీనిపై స్వయంగా ఓఎన్జీసీ ఎంప్లాయిస్‌ మజ్దూర్‌ సభ (ఈఎంఎస్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీ పెత్తనంతో ముంచేయకండి’ అని ఈఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ తాడ్వి గత నెలలో స్వయంగా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఓఎన్జీసీ నష్టాలతో గుజరాత్‌కు లింకు ఏమిటి? ఈ సంస్థ ముఖానికి ‘చమురు’ ఎలా పూశారు! ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
 
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఓఎన్జీసీ... దేశంలోని నవరత్న కంపెనీల్లో ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థల్లో మేటిగా, ఎలాంటి ఒడిదొడుకులూ లేకుండా సాఫీగా సాగిపోతున్న సంస్థ. కానీ గత కొన్నేళ్లుగా వందల కోట్ల నష్టాలను చవిచూస్తూ ప్రసుత్తం దివాలా దిశగా సాగుతోంది, ఎందుకని? ఏం జరిగింది? కారణాలు సుస్పష్టం. అప్పుల ఊబిలో కూరుకున్న గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ - జీఎస్పీసీని ఒడ్డున పడేయడానికి ఓఎన్జీసీని పణంగా పెట్టారు. కృష్ణా గోదావరి బేసిన్‌లో ఉన్న, జీఎస్పీసీకి చెందిన గ్యాస్‌ లేని, గ్యాస్‌ పడని పనికిమాలిన బ్లాకులను ఓఎన్జీసీకి బలవంతంగా అంటగట్టారు. ఇది చాలదని హెచ్‌పీసీఎల్‌లో 51 శాతం వాటాను ఓఎన్జీసీతో అధిక ధరకు కొనుగోలు చేయించారు. దీని ఫలితం... ఓఎన్జీసీ అప్పుల పాలైంది. అది ఏకంగా కొండలా పేరుకుని లక్షా 11 వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఓఎన్జీసీ దుస్థితి ఏంటంటే.. అప్పులు తెచ్చి వాటితో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు.
 
అసలేం జరిగింది...
గుజరాత్‌... ఒక ప్రగతిశీల రాష్ట్రం! సాహసోపేత నిర్ణయాలతో దూసుకుపోయే రాష్ట్రం! ఇందులో భాగంగానే 1979లో గుజరాత్‌ స్టేట్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (జీఎస్పీఎల్‌) ను ఏర్పాటు చేసింది. చమురు, సహజ వాయువు అన్వేషణలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ కంపెనీలో 95 శాతం వాటా గుజరాత్‌ ప్రభుత్వానిది. 1994లో హైడ్రోకార్బన్‌ రంగాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడంతో ఇది ‘గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌’ (జీఎస్పీసీ)గా పేరు మార్చుకుంది. తన రెక్కల్ని మరింత విస్తరించింది. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎం అయ్యాక 2002లో కృష్ణా గోదావరి బేసిన్‌లోని చమురు, సహజవాయువు వెలికితీతకు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి కొత్త లైసెన్సింగ్‌ విధానాన్ని వినియోగించుకుని... అనేక గ్యాస్‌ బ్లాకులను కొనుగోలు చేసింది.
 
నవ్యాంధ్ర తీరంలోని కేజీ బేసిన్‌ పరిధిలో ‘దీన్‌ దయాళ్‌ వెస్ట్‌’ పేరిట కొన్ని బ్లాక్‌లు 2005లో సొంతం చేసుకుంది. గాడిమొగ వద్ద వంద ఎకరాల్లో గ్రూప్‌ గేథరింగ్‌ స్టేషన్‌ (జీజీఎస్‌) కూడా నిర్మించింది. నాలుగు బావులు తవ్వింది. విదేశీ నిపుణులను రప్పించి, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి డ్రిల్లింగ్‌ చేసింది. పదేళ్లపాటు పలురకాలుగా కష్టపడింది. దీనిపై 19వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఫలితం శూన్యం. ఒకే ఒక్క బావిలో మాత్రం కొద్దిగా చమురు కనుగొంది. కానీ... వెలికి తీయలేకపోయింది. ఈ అన్వేషణ, డ్రిల్లింగ్‌ ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. ఈ విషయాన్ని గుజరాత్‌ ప్రభుత్వం చాలాకాలం గోప్యంగా ఉంచింది. దాచాలంటే దాగదులే అన్నట్లు... కాగ్‌ ఈ గుట్టును రట్టు చేసింది.
 
మోదీ రాకతో...
పీకల్లోతు నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోయిన జీఎస్పీసీని గట్టెక్కించాల్సిన బాధ్యత గుజరాత్‌ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రం అదృష్టం కొద్దీ అదే సమయానికి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. వెంటనే జీఎస్పీసీని గట్టెక్కిస్తే విమర్శలొస్తాయని భావించారో, ఏమో! 2016లో ఈ వ్యవహారాన్ని టేకప్‌ చేశారు. కేజీ బేసిన్‌లోని జీఎస్పీసీ బ్లాక్‌లకు రూ.10 వేల కోట్లు వెల కట్టి... అందులో 80 శాతం వాటా ఓఎన్జీసీకి, 20 శాతం విదేశీ కంపెనీలకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఓఎన్జీసీపై రూ.8 వేల కోట్ల భారం పడింది. ఉద్యోగసంఘాలు సమ్మె నోటీసు కూడా ఇచ్చి నిరసన వ్యక్తం చేశాయి. రాజకీయ విమర్శలు సరేసరి. ఎక్కడిదాకానో ఎందుకు... స్వయంగా పెట్రోలియం శాఖ వర్గాలే ఈ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశాయి. జీఎస్పీసీ పదేళ్లు కష్టపడినా చుక్క చమురు దొరకని, సహజ వాయువు వాసనలే లేని బావులను తీసుకోవడం ఎందుకని ప్రశ్నించాయి. గుజరాత్‌ సర్కారుకు అప్పనంగా 8వేల కోట్లు అప్పగించడం తప్ప మరొకటి కాదని విమర్శించాయి. అయినా... మోదీ సర్కారు పట్టించుకోలేదు.
 
ఖాళీ బావులు మిగిలాయి!
జీఎస్పీసీ విలీనాన్ని సమర్థించుకోవడానికి పెట్రోలియం శాఖ అనేక ఆర్భాటపు ప్రకటనలు చేసింది, ‘ఏడాదిలోపే డ్రిల్లింగ్‌ చేసి గ్యాస్‌, పెట్రోల్‌ వెలికితీస్తాం’ అని ఓఎన్జీసీ ప్రకటించింది. ఇప్పటిదాకా ఆ దిశగా చెప్పుకోదగ్గ పురోగతి కనిపించలేదు. ఓఎన్జీసీ ప్రస్తుతం డ్రిల్లింగ్‌ చేయడానికి చమురు, సహజ వాయువులను వెలికితీసే షిప్‌ను మాత్రం గాడిమొగ సమీపానికి ఇటీవల పంపించింది. కానీ, ఉత్పత్తి ప్రారంభించే దిశగా ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. అక్కడి ఉపకరణాల నిర్వహణకు ప్రతినెలా 4 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. తవ్వకాలు జరిగినా తగిన ఫలితం ఉండదనే.... ఈ వ్యవహారాన్ని అలా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇలా జీఎస్పీసీ రూపంలో ఓఎన్జీసీ మెడకు ఒక గుది బండ తగులుకుంది. ఇది అంతటితో ముగియలేదు. ఓఎన్జీసీ నెత్తిన మరో కొండనే పెట్టేశారు. అది... హెపీసీఎల్‌ 51 శాతం వాటాను అంటగట్టడం. అదెలా జరిగిందంటే...
 
14 శాతం అదనానికి...
ఓఎన్జీసీ తనపని తాను చేసుకోకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రం చేతులు కట్టేసిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లో 51% వాటాను 36,915 కోట్లు చెల్లించి ఓఎన్జీసీ కొనుగోలు చేసింది. అది కూడా షేర్‌ విలువకు 14% అదనంగా చెల్లించారు. కేవలం కేంద్రప్రభుత్వం తన ద్రవ్యలోటును తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఓఎన్జీసీకి ఈ ‘డీల్‌’ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్‌ కార్యకలాపాలు వేర్వేరు. ఒకటి చమురు, సహజవాయువు వెలికితీతలో నిమగ్నం కాగా... రెండోది ముడి చమురు శుద్ధి, మార్కెటింగ్‌లో ఉంది! అయినా ఈ రెంటికీ ముడిపెట్టారు. ఏదైతేనేం... కేంద్రం తీసుకున్న నిర్ణయాలవల్ల 2016-17లో 55,619 కోట్లు ఉన్న ఓఎన్జీసీ అప్పులు... 2017-18కి 1,11,533 కోట్లకు చేరుకున్నాయి.
 
పోరాడి పరిహారం సాధించిన మత్స్యకారులు..
కాకినాడ సమీపంలో తాళ్లరేవు మండల పరిధిలో సముద్రం నుంచి గ్యాస్‌ నిక్షేపాల వెలికితీతకు జీఎస్పీసీ పైప్‌లైన్లు వేసింది. ఆ సమయం లో వేటను నిషేధించారు. ఏడాదికిపైగా మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. దీంతో వారంతా ప్రాజెక్టు కాస్ట్‌(8వేల కోట్లు)లో సీఎ్‌సఆర్‌ పరిహారం కింద 1% డబ్బులు ఇవ్వాలని, అర్హులైన మత్స్యకారులందరికీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎన్నినెలలు కార్యకలాపాలు జరిగితే అన్ని నెలలు మత్స్యకార భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ ఆధ్వర్యంలో పడవల్లో వెళ్లి రిగ్‌ను ముట్టడించారు. దీంతో యానాం మత్స్యకారులకు ఐదున్నర నెలలు, తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులకు 6నెలలు పరిహారం చెల్లించారు. కొన్నాళ్లకు జీఎస్పీసీని ఓఎన్జీసీ టేకోవర్‌ చేసింది.
 
మోదీ జీ..! ఏంటిది?
జీఎస్పీసీని కాపాడటానికి ఓఎన్జీసీని ముంచేస్తారా.. అని సెప్టెంబరు 4న ఓఎన్జీజీసీ ఎంప్లాయీస్‌ మజ్దూర్‌ సభ ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ తాడ్వి నేరుగా ప్రధానికి రాసిన లేఖలో ప్రశ్నించారు. అందులోని ముఖ్యాంశాలివి... జీఎస్పీసీకి సంబంధించిన బ్లాక్‌లు భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైన ప్రాంతంలో ఉన్నాయి. అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత, తక్కువ పొరోసిటీ (గ్యాస్‌, చమురు ప్రవాహానికి అవకాశమిచ్చే సూక్ష్మ రంద్రాలతో కూడిన), తక్కువ పెర్మియబులిటీ(గ్యాస్‌, చమురును చొరబడనిచ్చే గుణం) ఉన్న ఆ ప్రాంతంలో చమురు, సహజవాయువు అన్వేషణ సాంకేతికంగా పెనుసవాలుతో కూడుకున్నదని అప్పటికే రుజవైంది. జీఎస్పీసీ పదేళ్లలో వేలకోట్లు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. అలాంటి బ్లాకులను ఓఎన్జీసీ 8వేల కోట్లు చెల్లించి ఎందుకు సొంతం చేసుకున్నట్లు? నిధుల లభ్యతపై ఇదితీవ్ర ప్రభావం చూపింది.
 
హెచ్‌పీసీఎల్‌లో 51% షేర్‌ వాల్యూకు 14% అదనపు ధరతో కొనుగోలు చేయడంతో సంస్థ అప్పులు ఏడాదిలోనే రెట్టింపయ్యా యి. కేంద్ర ప్రభుత్వ మితిమీరిన జోక్యంతో సంస్థ సీఎండీ, డైరెక్టర్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకసంస్థ ఆర్థికంగా దెబ్బతింది. చివరికి... జీతాల చెల్లింపులకు కూడా ఎప్పటికప్పుడు ఓవర్‌ డ్రాఫ్టులకు వెళ్లాల్సి వస్తోంది. ఓఎన్జీసీ నిర్వహణ, ఆర్థిక నిర్ణయాల్లో కేంద్రం ప్రత్యక్ష జోక్యం చేసుకోవడానికి నిదర్శనం... ఎలాంటి అనుభవం లేని సంబిత్‌ పాత్రను ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నియమించడమే. దయచేసి ఇప్పటికైనా ఓఎన్జీసీకి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వండి. పోటీ ప్రపంచంలో మా చేతులు కట్టేయకండి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...