Jump to content

Godavari puskarala hatyalaku reasons - Commission report


RKumar

Recommended Posts

అతి ప్రచారం వల్లే! 
నాడు గోదావరి పుష్కరాల్లో  తొక్కిసలాట 
మంచి ముహూర్తమంటూ మీడియా అధిక  ప్రాధాన్యం ఇచ్చింది 
జస్టిస్‌ సోమయాజుల కమిషన్‌ నివేదిక వెల్లడి 
ఈనాడు - అమరావతి 
19ap-main4a.jpg

గోదావరి పుష్కరాలపై హోరెత్తిన  ప్రచారమే కొంపముంచిందని, తొక్కిసలాటకు ఇదే కారణమని జస్టిస్‌ సి.వై.సోమయాజులు విచారణ కమిషన్‌ తేల్చింది. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 28మంది మృతి చెందగా.. 51మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నియమించిన కమిషన్‌ నివేదికను బుధవారం ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. సుముహుర్తకాలంలో పుష్కరుడు నదీ జలాల్లో ప్రవేశిస్తాడని, ఈ సమయంలోనే పుణ్యస్నానం చేస్తే మంచిదనే ప్రచారం ప్రమాదానికి కారణంగా నిలిచిందని కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఈ పుష్కరాలు 144 ఏళ్ల తర్వాత వస్తున్నాయని ఓ నమ్మకం.. విశ్వాసం.. ఆపై ప్రసార మాధ్యమాల్లో అతిశయోక్తులతో కూడిన ప్రచారం ఈ దుష్పరిణామం చోటుచేసుకోవడానికి దారితీసిందని వెల్లడించింది. పుష్కర సమయంలో ఏ సమయంలో స్నానం చేసినా అది పుణ్యప్రదమే అన్న విషయాన్ని ఏ ఛానల్లోనూ సరిగా చెప్పలేకపోయారని అభిప్రాయపడింది. ముహూర్తమన్న విషయానికి ప్రాధాన్యం ఇచ్చాయని వెల్లడించింది. దీంతో లక్షలాది మంది భక్తులు గోదావరీతీరాన పడిగాపులు పడ్డారని, ముహుర్త కాలంలోనే స్నానం చేయ్యకపోతే పుణ్యం రాదేమోనన్న బెంగతో ఒక్కసారిగా వెల్లువై నదిలోకి పరుగులెత్తారని పేర్కొంది. మూఢనమ్మకంతో భక్తులు తమకు రాబోయే విపత్తులను గుర్తించలేకపోయారని వెల్లడించింది. పత్రికలు, టీవీలు ప్రజలను తప్పుదారి పట్టించడంలో తమవంతు బాధ్యత వహించాయంది. ప్రసార మాధ్యమాలు, ప్రవచన పండితులు, పంచాంగకర్తలు, స్వామీజీలు, ప్రజలను మూఢనమ్మకాల పాల్జేశారని పేర్కొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వల్ల తన నివేదిక తయారీలో జాప్యం జరిగిందని జస్టిస్‌ సి.వై.సోమయాజులు పేర్కొన్నారు.

19ap-main4b.jpg

కమిషన్‌ నివేదికలోని అంశాలు 
* పుష్కరాలకు ఏడాది ముందు నుంచే ప్రచారం హోరెత్తింది. 2014 నుంచే మీడియా ప్రచారం చేసింది. 
* బ్రాండ్‌ గోదావరిపై ప్రచారం నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఏడాది ముందు నుంచి ఈ ప్రణాళిక చేసింది. రూ.1500కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అంచనా వేసింది.. 
* తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే 275 ఘాట్లను అభివృద్ధి చేసింది. పుష్కరాలకు ఎక్కువ మంది వచ్చేలా ఆహ్వానించింది. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం, లేజర్‌షోలు తదితరాలతో ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ ప్రచారం చేశారు. 
* ప్రచారంలో మీడియా ముఖ్యమైన సాధనం. అదే ప్రజల కష్టాలు, అసౌకర్యానికి కారణంగా నిలిచింది.  అన్ని రకాల వార్తలు, ఆధ్యాత్మిక ఛానళ్లు పుడగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రింట్‌, ఆడియో, దృశ్య మీడియా ప్రచారాలతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాయి. ఎక్కువ మంది వీక్షకులు ఉన్నవారు ఈ అవకాశాన్ని నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. ఛానళ్ల ప్రచారానికి పుష్కరాలను మంచి అవకాశంగా వినియోగించుకున్నారు. 
* తొక్కిసలాట జరిగిన ప్రాంతం కోటగుమ్మం ప్రాంతానికి సమీపంలో ఉంది. గోదావరి రైల్వేస్టేషన్‌ నుంచి కూతవేటు దూరంలోనే ఉంది. రాజమహేంద్రవరంలో 32 ఘాట్లు ఉండగా వీటిల్లో ఇది చిన్న ఘాట్‌. ఘాట్‌ ప్రవేశమార్గం 300మీటర్లు వెడల్పు మాత్రమే ఉంది. ఎక్కువ మంది వస్తే ఇక్కడ వారిని సర్దుబాటు చేయడం కష్టం. వీఐపీలు స్నానాలు చేసిన సమయంలో భద్రతా సిబ్బంది భక్తులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం చేసి వెళ్లే వరకు రద్దీ నిలిచిపోయింది. 
* చాలామంది బాధితులు ఇచ్చిన క్లిపింగ్‌ల్లో ముఖ్యమంత్రి పుష్కరాల ప్రారంభోత్సవం చేసి, ఆయన తన వాహనంలోకి ఎక్కినట్లు ఉంది. ఆ తర్వాత తొక్కిసలాట జరిగినట్లు ఉంది. తొక్కిసలాట జరిగిన సమయంలో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నట్లు ఏ క్లిప్పింగ్‌లోనూ లేదు. పుష్కరఘాట్‌ సమీపంలో ఎక్కువ భక్తుల రద్దీ పెరగడంతోనే తొక్కిసలాట జరిగింది. దీంట్లో అనుమానం లేదు. 
* ముఖ్యమంత్రి పుష్కరాలు ప్రారంభిస్తారనేదానిపై విరివిగా ప్రచారం నిర్వహించారు. ఎక్కువ మంది భక్తులు గుమిగూడడానికి ఇది ఒక కారణం కావొచ్చు. ముఖ్యమంత్రి స్నానం చేసిన తర్వాత చేయొచ్చని వారు భావించి ఉండొచ్చు.  తూర్పుగోదారి జిల్లా కలెక్టరుతోపాటు తొక్కిసలాటలో గాయపడిన సుమారు 12మంది, న్యాయవాదులు, ఇతరపార్టీల నేతలు కలిపి సుమారు 11మంది కమిషన్‌కు ఘటనపై వివరాలు అందించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...