Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

ravindras

akshayapatra anna canteens contractor

Recommended Posts

వంటశాలల్లో  బాహుబలి 
3 గంటలు.. లక్ష భోజనాలు

ఏమిటిది: అక్షయపాత్ర హైటెక్‌ మెగా సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ 
ఎక్కడుంది: కంది గ్రామం, సంగారెడ్డి జిల్లా 
విశేషం: గంటల్లోనే లక్షల మందికి భోజనం వండి సరఫరా చేయగలదు. 
ప్రస్తుతం..: రోజుకు లక్ష భోజనాలు తయారవుతున్నాయి. నాలుగు జిల్లాల్లోని 698 ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్నభోజనం, 450 అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్ఠికాహారం ఇక్కడినుంచి సరఫరా అవుతోంది. 
ఇంకా..: దేశంలోని భారీ వంటశాలల్లో అత్యాధునికమైనది. తెలుగు రాష్ట్రాల్లో తిరుమలలోని నిత్యాన్నదానం వంటశాల తర్వాత ఎక్కువమందికి వండి పెడుతున్న కేంద్రమిదే.

ఆకలి, పోషకాహారలోపంతో ఏ విద్యార్థీ చదువుపై ధ్యాస కోల్పోకూడదన్నది అక్షయపాత్ర లక్ష్యాల్లో ప్రధానమైనది. అందుకు ప్రభుత్వాలు అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన  పథకాన్ని ఏజెన్సీగా తీసుకుని నిర్వహిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలతో పాటు వ్యక్తిగతంగానూ విరాళాలు సేకరించి ఈ   వ్యవస్థకు పుష్టితనం చేకూరుస్తున్నారు. ఇందులో ఆధునిక వంటశాలలు కీలకం.

టుగా వెళ్తూ చూస్తే అదో ఆధునిక హంగులున్న కార్యాలయంలా కనిపిస్తుంది. 5 ఎకరాల ఆవరణ నిండా పచ్చదనం, అలంకరణ మొక్కలతో ఆకట్టుకుంటుంది. ప్రాంగణంలో ఒకే తరహాలో ఉండే గూడ్స్‌ వ్యానులు 75 ఉంటాయి. అలాగని అది సరకు రవాణా కార్యాలయం కాదు. లోపలికి వెళ్లి చూస్తే కానీ తెలుసుకోలేం అదో భోజన తయారీ కేంద్రమని.

హైదరాబాద్‌ శివారులో సంగారెడ్డి జిల్లా కందిలో ఈ ఏడాది మార్చి 30న ప్రారంభమైన అక్షయపాత్ర ఫౌండేషన్‌ వారి హైటెక్‌ వంటశాల విశేషాలెన్నో.. పెద్దఎత్తున వంటకాలు తయారవుతున్నా పొగ, మంట, గదిలో వేడి ఉండవు. వేల కొద్దీ పాత్రల్లో వంటకాలు సిద్ధమై వెళ్తున్నా ఎక్కడా నేలపై ఒక్క మెతుకు, మరక అయినా కనిపించవు. ఆహార పరిశ్రమల్లో వినియోగిస్తున్న ప్రపంచస్థాయి ఆధునిక యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ వినియోగిస్తున్నారు. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల ప్రకారం ఆహార పరిశ్రమ స్థాయిలో భోజనం వండి పేద పిల్లలకు సరఫరా చేస్తున్న కేంద్రమిది. దీని పూర్తి సామర్థ్యం రోజుకు 2 లక్షల భోజనాలు కాగా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ ప్రకారం లక్ష భోజనాలు సరఫరా చేస్తున్నారు. ఇందుకు రోజుకు 8-10 టన్నుల బియ్యం, 3 టన్నుల కూరగాయలు, 2-3 టన్నుల పప్పు వినియోగిస్తున్నారు. ఇక్కడినుంచి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని 698 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. పటాన్‌చెరు ఐసీడీఎస్‌ పరిధిలోని 18 వేల మంది అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇక్కడినుంచే నిత్యం పౌష్ఠికాహారం పంపుతున్నారు.

అంతా చకచకా.. 
ఉదయం 2-3 గంటలకే ఇక్కడ వంట ప్రక్రియ మొదలవుతుంది. ఆవిరి, ఇండక్షన్‌ అనుసంధానిత జ్వలన డేకిశాలు(కోల్డ్రన్‌ డ్రమ్స్‌)లో అన్నం వండుతారు. ఒక్కో కోల్డ్రన్‌డ్రమ్‌లో 90-100 డిగ్రీల వేడిలో 20-25 నిమిషాల్లో 50 కిలోల బియ్యం ఉడుకుతాయి. ఇలాంటివి పది ఉన్నాయి. ఓ విడతకు 500 కిలోల బియ్యం.. అన్నమైపోతోంది. సెమీ ఆటోమేటిక్‌గా పనిచేసే కోల్డ్రన్‌డ్రమ్స్‌లో పడే బియ్యం పరిమాణానికి తగ్గట్టుగా నీటిని, వేడిని అవే తీసుకుంటాయి. 20 నిమిషాల తర్వాత సరిగా ఉడికిందో లేదో చూసుకుంటుంటే చాలు. అన్నం పూర్తయ్యాక హాట్‌బాక్సుల్లో సులువుగా నింపేయవచ్చు. ఇలాగే మరో వైపున్న భారీ డేకిశాలో సాంబారు, పప్పు, చల్ల చారు సిద్ధమైపోతాయి. వీటి తయారీకి అవసరమైన కూరగాయలు, పోపు సామగ్రి అంతా ముందురోజు రాత్రికే సిద్ధం చేసి ఉంచుతారు.  కూరల తయారీకి విడతకు గంట వరకు సమయం పడుతుంది. ఇలా మొత్తం 3 గంటల్లోనే ఉదయం 6 గంటలకల్లా లక్ష మంది పిల్లలకు భోజనాలు సిద్ధమైపోతాయి. కన్వేయర్‌ బెల్టుపై నేరుగా వాహనాలు ఉండే చోటుకు భోజనాల పాత్రలన్నీ చేరిపోతాయి. వాటిని వ్యానుల్లో నింపేయడం గంటన్నర వ్యవధిలో పూర్తయిపోతుంది. ఉదయం 7 గంటలకు వాహనాలు బయలుదేరుతాయి.

పక్కాగా సరఫరా 
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం 11 గంటలకల్లా ఉండేలా రవాణా ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 వాహనాలు 4 జిల్లాల్లో 140 కిలోమీటర్ల పరిధిలో సకాలంలో వెళ్లేలా ప్రణాళిక ఉంటుంది. పాఠశాలల్లో 12 గంటలకు తినే సమయానికి వంటకాలన్నీ 65-75 డిగ్రీల వేడితో ఉంటాయి. ఇందుకు తగ్గట్టుగా వినియోగించే పాత్రలతో పాటు సరఫరా చేసే వాహనాల్లోనూ వేడిమి తగ్గకుండా ఏర్పాట్లుచేశారు. ఎక్కడ ఏ బడిలో ఏ ఆహార పదార్థంలో లోపం ఉన్నట్టు ఫిర్యాదు వచ్చినా దాని తాలూకు పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించేలా ప్రతిదీ విభాగం వారీగా వండి, సరఫరా చేసే వ్యవస్థ ఉంది. ఎప్పుడూ 3 నెలలకు సరిపడా వంట సామగ్రి నిల్వ ఉంటుందిక్కడ. కూరగాయలు మాత్రం ప్రతిరోజూ సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌ నుంచి తీసుకొస్తారు.

పోషకాలు పరిపూర్ణం! 
సంప్రదాయ వంట పద్ధతులకు భిన్నంగా శాస్త్రీయంగా, అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో నిర్మించిన వంటశాల ఇది. నిర్వహణ అంతా నిపుణుల పర్యవేక్షణలోనే సాగుతోంది. సరకుల ఎంపిక నుంచి పాఠశాలలకు సరఫరా వరకు మొత్తం 15 విభాగాలు పనిచేస్తుంటాయి. బియ్యం, కూరగాయల్లోని పోషకాలు ఆహారంలో గరిష్ఠంగా ఉండేలా వంట పద్ధతులు పాటిస్తారు. భోజనంతో పాటు చిరుతిళ్లను ప్రతి పాఠశాలకు సరఫరా చేస్తారు. వీటిని రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు వంటి సిరి ధాన్యాలతో ఇక్రిశాట్‌ సూచనల ప్రకారం తయారుచేయించి పంపుతున్నారు. కూరల్లో మీల్‌మేకర్‌, సోయాబీన్‌ వంటి ఎక్కువ పోషకాలున్నవి వినియోగిస్తారు.

శుచి, శుభ్రతే ప్రథమం 
కార్మికులు, ఉద్యోగులు అంతా శుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. వంట విభాగంలో అందరూ హెడ్‌క్యాప్‌లు, కాళ్లకు గమ్‌బూట్‌లు, చేతులకు తొడుగులు, నోటికి మాస్కులు ధరించడం తప్పనిసరి. వంట పనివారు తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి వంటకం ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’ ప్రమాణాల ప్రకారం తయారయ్యేలా వసతులున్నాయి. వచ్చిన కూరగాయలు, ఇతర సరకులను నాణ్యత నిర్ధరణ నిపుణులు తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తారు. సరకు ఏదైనా 95 శాతానికి తగ్గని నాణ్యత ఉంటేనే తీసుకుంటారు. లేకుంటే తిప్పిపంపుతారు. ఎఫ్‌సీఐ సరఫరా చేసే ఉచిత బియ్యాన్ని మహిళలతో చెరిగిస్తారు. కూరగాయల్ని తొలుత క్లోరిన్‌ నీటి యంత్రంతో శుభ్రం చేస్తారు. పైనున్న పురుగుమందుల అవశేషాలు ఇక్కడ తొలగిపోతాయి. అనంతరం వాటిని అల్ట్రావయోలెట్‌(యూవీ) కిరణాలు ప్రసరించే విభాగంలోకి పంపుతారు. ఈ విధానంలో లోపలున్న పురుగుమందుల అవశేషాలు సైతం చాలావరకు సంగ్రహణకు గురై తొలగుతాయి.  ఆ తర్వాత మూడో దశలో వాటి గ్రేడింగ్‌ ఉంటుంది. ఈ దశ దాటి వచ్చిన వాటినే ముక్కలు చేయడానికి పంపుతారు. అమెరికన్‌ కటింగ్‌ యంత్రాలతో కావాల్సిన పరిమాణంలో కత్తిరిస్తారు. ఇక్కడున్న ఒక్కో యంత్రం 30 మంది మహిళలు రోజంతా చేసే పనిని ఒక్క గంటలో చేయగలదు. ఈ విభాగం నేల అంతా తివాచీ పరిచినట్టుగా ఉండే సిలికోల్‌ ఫ్లోర్‌ మ్యాట్‌తో ఉంటుంది. గీతలు, మరకలు పడకుండా, ఎంత బరువునైనా తట్టుకుని మన్నికగా ఉండే గచ్చు ఇది. ప్రత్యేకంగా జర్మనీ నుంచి తెప్పించి వేశారు. తామరాకులా నీటిని పీల్చుకోని గుణం, ఎలాంటి మరకలలైనా తేలికగా శుభ్రం చేసే వీలు ఉంటుంది. ఈ యూనిట్‌ ఏర్పాటుకు వాయికాలుష్యం లేకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండే చోటును ఎంచుకున్నారు.

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ నెలకొల్పిన 40 వంటశాలల్లో కంది గ్రామంలోని ఉన్నది 39వ యూనిట్‌. వాటన్నింటిలో సాంకేతికంగా, సామర్థ్యపరంగా పెద్దది. ఇందుకోసం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రూ.18.5 కోట్లు విరాళంగా అందజేసింది.

అండగా నిలుస్తున్న కార్పొరేట్‌ సంస్థలు 
దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు అక్షయపాత్ర కంది యూనిట్‌ ఏర్పాటు, నిర్వహణకు అండగా నిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఈ యూనిట్‌ ఏర్పాటుకు అన్నీ తానై వ్యవహరించింది. స్థలం కొనుగోలుతో పాటు అత్యాధునికంగా భవనాన్ని నిర్మించి యంత్రసామగ్రిని సమకూర్చి ఇచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఏస్‌ అర్బన్‌, ప్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, బీడీఎల్‌, మిథానీ వంటి పలు దిగ్గజ సంస్థలు భోజన రవాణా వాహనాలు కొనుగోలు చేసి అందజేశాయి. నిర్వహణకు ఎప్పటికప్పుడు ఉదారంగా విరాళాలిస్తున్నాయి. వ్యక్తిగతంగానూ, ఆన్‌లైన్‌లోనూ ఎందరో తమ వంతు చేయూత ఇస్తున్నారు.

ఏదీ వృథా కాదు 
ఏ రోజు ఎన్ని భోజనాలు అవసరమో ముందురోజు సాయంత్రానికి పాఠశాలల వారీగా సమాచారం ఇక్కడికి చేరిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఎక్కువ, తక్కువ కాకుండా వండి సరఫరా చేస్తారు. భోజనం తయారీ క్రమంలో మిగిలిపోయే కూరగాయల వ్యర్థాలు, ఇతరత్రా వృథా అయ్యే పదార్థాలను ఇక్కడున్న బయోగ్యాస్‌ విద్యుత్తు ప్లాంటుకు పంపుతారు. దాన్నుంచి రోజుకు 25 కేవీ విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ వంటశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ ప్లాంటును బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే వంటశాలలో వినియోగించగా, పాత్రలు కడిగితే వచ్చే వృథా నీటిని పునర్వినియోగానికి వీలుగా శుద్ధి చేసి మొక్కల పెంపకం వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం 80 వేల కిలోలీటర్ల సామర్థ్యంతో వ్యర్థజలాల శుద్ధి యూనిట్‌(ఈటీపీ) కూడా ఉంది. ఇది కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ప్రమాణాల ప్రకారం పనిచేస్తోంది.

- చండ్ర మదన్‌మోహన్‌, ఈనాడు, హైదరాబాద్‌ 
- చిత్రాలు: ఎన్‌.గిరి, ఈనాడు సంగారెడ్డి

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×