Jump to content

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కేడర్ రెడీ.. నేతలేరీ!?


koushik_k

Recommended Posts

  • జిల్లాలో పార్టీని చక్కదిద్దండి బాబూ
  • కేడర్ రెడీ.. నేతలేరీ?
  • చంద్రబాబుకు కార్యకర్తల వేడికోలు
కవచాలతో, ఖడ్గాలతో నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. సైన్యమూ సర్వసన్నద్ధంగా ఉంది. భేరీ మోగడమే తరువాయి. తేదీ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా...? అన్నంత దూకుడూ, ఆత్మవిశ్వాసమూ అధినేతలో కనిపిస్తోంది. గ్రామదర్శిని, జ్ఞానభేరి, యువనేస్తం, జలభగీరధయత్నం.. నిరంతరం పరుగులు.. అలుపూసొలుపు లేదు, ఇల్లూపిల్లలూ విశ్రాంతి అనే ఆలోచన లేదు. అభివృద్ధి పతాకాన్ని చేతబట్టి పల్లెపల్లే చుట్టుముడుతున్నాడు. దన్నుగా, వెన్నుగా మారి వెంట పరుగులు తీయాల్సిన పెద్ద తమ్ముళ్లు కొందరు మాత్రం సొంత జిల్లాలో దారి తప్పుతున్నారు. తమకు అంటిన బురదని పార్టీకీ అద్దుతున్నారు. గ్రూపుగొడవలతో పరువు తీస్తున్నారు. పార్టీకి బలమైన అండదండలున్న జిల్లాలో ఓట్లకు గండికొడుతున్నారు. పెద్దాయన కాస్త పట్టించుకుని దారిలో పెట్టాలని కార్యకర్తలు వేడుకుంటున్నారు.
 
 
చిత్తూరు: పది నెలల దూరంలో ఎన్నికల మహా సంగ్రామం ముంచుకొస్తోంది. రాజ్యం మనుగడ దృష్ట్యా ఆ యుద్ధంలో గెలిచి తీరాలి. ఎదుర్కొనేందుకు సైన్యం సర్వ స్నద్ధంగా వుంది. అయితే దాన్ని ముందుకు నడిపించే సమర్థులైన సేనాధిపతులే కరువవుతున్నారు. గ్రూపులుగా విడిపోయి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ కొందరు, అవినీతి బురదతో పార్టీకి నష్టం చేస్తున్నవారు మరికొందరు, అభిమానం దండిగా ఉన్నా నడిపించే నాయకులెవరో తెలియక అయోమయంలో కార్యకర్తలున్న తావులు కొన్ని... అధినేత దృష్టి సారిస్తే తప్ప జిల్లాలో పార్టీ గాడిలో పడదని తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ పార్టీని చక్కదిద్దే పనిని సొంతజిల్లాలో చేపట్టాలని వారు కోరుకుంటున్నారు.
 
 
అయోమయం, గందరగోళం
మదనపల్లెలో టీడీపీ బలంగా వుంది. 1983 నుంచీ ఇప్పటిదాకా జరిగిన ఎనిమిది ఎన్నికల్లో టీడీపీ ఐదుసార్లు గెలిచింది. గత ఎన్నికల నుంచీ ఇన్‌ఛార్జి లేరు. బహునాయకత్వం, వర్గ వైషమ్యాలు పార్టీని పీడిస్తున్నాయి. ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధి ఒకరు భూకబ్జాలు, అవినీతి ఆరోపణలకు గురై పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడానికి కారణమవుతున్నారు. వర్గ విభేదాలు ముదిరి అధిష్టానం పిలుపిస్తున్న కార్యక్రమాలను విడివిడిగా చేపడుతున్నారు. ఇన్‌ఛార్జి లేకపోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది ఊహామాత్రంగా కూడా చెప్పలేని పరిస్థితుల్లో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
 
 
నగరిలో ముద్దుకృష్ణమ మృతితో ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయింది. ఆయన కుటుంబానికి అవకాశం లేదని అధిష్టానం తేల్చిచెప్పినా వారసులు పోటాపోటీగా ముందుకెళుతున్నారు. ఇతరులూ రేసులో వున్నారు. ఇక్కడా ఇన్‌ఛార్జి లేకపోగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఎవరికనేది అంతుబట్టడం లేదు. చంద్రగిరిలో పార్టీతో పాటు నేత గల్లా అరుణకుమారి కూడా బలమైన వారే. తొలి నుంచీ పార్టీలో వున్న నేతలతో ఆమెకు సత్సంబంధాలు లేవు. తగిన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఇన్‌ఛార్జి పదవి నుంచీ తప్పుకున్న అరుణమ్మ వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచీ ఎవరూ పోటీచేయరని తేల్చి చెప్పేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు అయ్యాక కాస్త చురుగ్గానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి అభ్యర్థి ఎవరో తెలియక శ్రేణుల్లో అయోమయం నెలకొంటోంది.
 
 
వీరిని పట్టించుకోండి
2004-14 నడుమ పదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో లేదు. నేతలు, క్రియాశీలక కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. తంబళ్ళపల్లెలో నాటి ఎమ్మెల్యే ప్రవీణ్‌ వైసీపీలో చేరిపోవడంతో పార్టీకి దిక్కు లేకుండా పోయింది. మదనపల్లెకు చెందిన కోపూరి మల్లిఖార్జుననాయుడు సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుని ఆర్థికంగా చితికిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగన్నరేళ్ళు అవుతున్నా ఆయన్ని పట్టించుకున్నవారే లేరు. పీలేరులో చింతల వైసీపీకి, ఇంతియాజ్‌ అహ్మద్‌ కాంగ్రె్‌సకూ వెళ్ళిపోయి పార్టీ గడ్డు స్థితిలో వుండగా మల్లారపు రవిప్రకాష్‌ సమన్వయకర్తగా పనిచేసి పార్టీని నడిపించారు. పార్టీ పవర్‌లోకి వచ్చినా ఆయన్ను గుర్తించిన వారే లేరు.
 
పుంగనూరులో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని పార్టీ ఉనికిని కాపాడిన వెంకట్రమణరాజుకూ ప్రాధాన్యత లేదు. గతంలో చంద్రగిరిలో రామనాధం నాయుడు పరిస్థితీ అలాగే వుంది. పలమనేరులో నాటి ఎమ్మెల్యే అమర్‌ సైతం వైసీపీలోకి వెళ్ళగా అక్కడా సుభాష్‌ చంద్రబోస్‌ పార్టీకి నాయకత్వం వహించి భారం మోశారు. ఆయనకు ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌గా నామమాత్రపు పదవి దక్కింది. అధికారంలో లేనపుడు పార్టీ బాధ్యతలు మోసి కష్టనష్టాలకు గురైన వారికి సరైన గుర్తింపు లేకపోవడం సీనియర్‌ కార్యకర్తలకు నిస్పృహ కలిగిస్తోంది.
 
 
అసంతృప్తి, విభేదాలు
పలమనేరులో టీడీపీ బలంగా వున్నా మంత్రి అమర్‌, మాజీ ఇన్‌ఛార్జి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గాల మధ్య సయోధ్య లేదు. శ్రీకాళహస్తిలోనూ పార్టీ పటిష్టంగా వున్నా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో సమీకరణలు మారుతున్నాయి. ఆయన కుటుంబసభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ రెండు వర్గాలు కలసి పనిచేసే అవకాశాలు కనిపించడంలేదు. పీలేరులో మాజీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ప్రస్తుత ఇన్‌ఛార్జి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో దూరదూరంగా వుంటున్నారు. ఆయన తరచూ ప్రత్యేక సమావేశాలు నిర్విహిస్తూ వర్గాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్బాల్‌ కంటే ముందు సమన్వయకర్తగా పనిచేసిన మల్లారపు రవిప్రకాష్‌ కూడా ప్రత్యేక వర్గం నడుపుతున్నారు. సత్యవేడులో పార్టీ ముఖ్యనేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మండల స్థాయి నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అందుబాటులో వుండడం లేదని క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చిత్తూరులో నేతలు ఎక్కువగా వున్నా పార్టీ క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వుంటున్నందున పనుల కోసం ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...