Jump to content

JVC

Recommended Posts

http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB

 

ఎన్నారైలు 'ఓవర్సీస్ ఎలక్టర్స్' గా నమోదు కావచ్చు

ప్రవాస భారతీయులు ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు జాతీయ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950(ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్) ప్రకారం ఎవరైనా తమ సాధారణ నివాసంలో ఆరు నెలలకు పైగా లేనట్లయితే వారి పేరు ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. సైన్యం, భద్రతా దళాలలో పని చేసేవారికి నివాసం విషయంలో మినహాయింపు ఇచ్చి ‘సర్వీస్ ఓటర్’ గా నమోదు చేస్తారు. తమ సాధారణ నివాసమైన గ్రామం లేదా పట్టణం నుండి వేరే ప్రాంతానికి వలస వెళ్లి ఆరు నెలలకు పైగా వాపస్ రానివారు, విదేశాలకు వలస వెళ్లిన ఎన్నారైల పేర్లు కూడా ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో 'ఓవర్సీస్ ఎలక్టర్స్' గా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎను ఆన్‌లైన్ నింపి తమ దరఖాస్తులను సమర్పించాలి. ఒక కలర్ ఫోటో (3.5 x 3.5 సైజు), పాస్‌పోర్టు, వీసా పేజీ కాపీలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత భారతదేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏడు రోజుల్లో ఓటరుగా నమోదు చేస్తారు.

ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. “ఓవర్సీస్ ఎలక్టర్స్‌(ప్రవాసి ఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్‌కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరికి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయరు. కాబట్టి, ఒరిజినల్ పాస్‌పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి.

ఎన్నారైలు 'ప్రాగ్జీ' (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) విధానాన్ని అమలు చేసే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్ (ఆన్‌లైన్ ఓటింగ్) లేదా ఎంబసీల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ప్రవాసులు కోరుతున్నారు. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే ఎన్నారైలు భారత ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతారు.

ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేయాలి..  
భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లింకు http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GBను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫామ్ 6ఎ కనిపిస్తుంది. ముందుగా ఓటరు నమోదు అధికారి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ(పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు  పేరు, బంధుత్వం నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగం(స్త్రీ, పురుష, ఇతర), ఈ-మెయిల్, ఇండియా మొబైల్ నెంబర్‌ను పేర్కొనాలి. ఇండియాలోని చిరునామా(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా) ఇంటి నెంబర్, వీధి పేరు, పోస్టాఫీసు పేరు, గ్రామం/ పట్టణం, జిల్లా, పిన్ కోడ్ తెలియజేయాలి.

పాస్ పోర్ట్ నెంబరు, పాస్ పోర్ట్ జారీ చేసిన ప్రదేశం పేరు,  పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా నెంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్ ఎంట్రీ / మల్టిపుల్ ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ మరియు గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణం ఉద్యోగం కొరకా, విద్య కొరకా, లేదా ఇతర కారణాలా వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు అయిన తేదీ పేర్కొనాలి.

విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ అనగా ఇంటి నెంబర్, వీధి, గ్రామం/ పట్టణము, రాష్ట్రం, దేశం, పిన్ కోడ్‌లను నమోదు చేయాలి. 3.5 x 3.5 సైజు (పాస్ పోర్ట్ సైజు) గల కలర్ ఫోటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను జెపిజి(ఇమేజ్) ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...