Jump to content

Galeru Nagari Sujala Sravanthi Project


Recommended Posts

ప్రత్యామ్నాయ మార్గంలో గాలేరు-నగరికి నీరు
20-06-2018 12:43:15
 
  • కోడూరు నుంచి తుంబుర కోనకు లిఫ్ట్‌
  • టన్నెల్స్‌ తవ్వకం, భూసేకరణ భారం తగ్గే విధంగా రూపకల్పన
  • రూ. 800 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
తిరుపతి (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల వరప్రసాదిని అయిన గాలేరు-నగరి ప్రాజెక్టు పనులకు భూసేకరణ, అటవీ ప్రాంతాల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. ఈ సమస్యలు ఉన్న చోట ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. తొలుత అనుకున్నదాని ప్రకారం కోడూరు నుంచి మల్లెమడుగుకు నీరు పారాలంటే రెండు టన్నెల్స్‌ (సొరంగ మార్గాలు) తవ్వాల్సి ఉంది. ప్రధాన కాలువకు అటవీ భూసేకరణ, కోడూరు ప్రాంతంలో విలువైన ప్రైవేటు భూముల సేకరణ కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో సొరంగ మార్గాలకు ప్రత్యామ్నాయంగా రైల్వే కోడూరు ప్రాంతం నుంచి తుంబుర కోన వరకు లిఫ్ట్‌ ద్వారా నీటిని తీసుకొచ్చి అక్కడినుంచి గ్రావిటీ ద్వారా మల్లెమడుగుకు, అక్కడ నుంచి బాలాజి, అడవికొత్తూరు, వేణుగోపాలసాగర్‌, వేపగుంట రిజర్వాయర్లకు నీరందించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలకు నీరందించేందుకు ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సుమారు రూ.800 కోట్ల అంచనాతో రూపొందించారు. జిల్లాలోని ఐదు ప్రాజెక్టులకు 9.866 టీఎంసీల నీరు తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే బాలాజి, వేణుగోపాలస్వామి రిజర్వాయర్లతోపాటు మల్లెమడుగుకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చేందుకు తాత్కాలిక పనులు చేపట్టారు. ఇవి కాకుండా శాశ్వత పనులు చేపట్టేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
 
 
మొదటి రూపకల్పన ఇలా..
గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. 38 టీఎంసీల కృష్ణా నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాలకు తీసుకురావాల్సి ఉంది. ఇందులో చిత్తూరు జిల్లాలోని 1.03 లక్షల ఎకరాలకు సుమారు 10 టీఎంసీల నీళ్ళు తీసుకొచ్చేందుకు పనులు రూపొందించారు. తొమ్మిది ప్యాకేజీలు గల ఈ పనులు రూ. 2,500 కోట్లతో అంచనా వేసి రూ. 1481 కోట్లతో మొదటి విడతగా పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.240 కోట్లు ఖర్చు పెట్టి 30 శాతం పనులు చేపట్టారు. ఆ తరువాత భూసేకరణ, అటవీ అనుమతుల నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. గాలేరు-నగరి ప్రధాన కాలువ 161 నుంచి 333 వరకు తొమ్మిది ప్యాకేజిలు ఉంటే 6, 7 ప్యాకేజిలు కడప జిల్లాలో ఉన్నాయి. 245వ కిలోమీటరు తరువాత చిత్తూరు జిల్లాలో మిగిలిన ప్యాకేజిల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో బాలాజి టన్నెల్స్‌ 1,2, పనులు చేపట్టాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ 11 కిలోమీటర్లు, రెండవ టన్నెల్‌ పనులు 13 కిలోమీటర్లు చేపట్టాల్సిఉంది. ఈ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్‌, అభయారణ్యాలు ఉన్నాయి. ఈ టన్నెల్స్‌ కాకుండా తిరుపతిలో పద్మావతి సాగర్‌, శ్రీనివాససాగర్‌ రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టాలంటే కూడా భూసేకరణ అనుమతులు ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా కోడూరు నుంచి ప్రధాన కాలువ రావాలంటే రైల్వే, నేషనల్‌ హైవే క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అవరోధాల నుండి బయట పడేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించారు.
 altm1.jpg
 
ప్రత్యామ్నాయం ఇలా...
కడప జిల్లా రైల్వే కోడూరు దగ్గర గల ప్రధాన కాలువ 240 కిలోమీటరు వద్ద నుండి నీటిని లిఫ్ట్‌ చేసి తుంబురుకోనకు పంపితే అక్కడి నుంచి మల్లెమడుగుకు గ్రావిటీ ద్వారా తీసుకురావచ్చు. మల్లెమడుగు నుంచి బాలాజీ రిజర్వాయర్‌కు లిఫ్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మల్లెమడుగు నుండి వేణుగోపాలస్వామి రిజర్వాయర్‌కు కైలాసగిరికోన నుంచి వచ్చే పంట కాలువలు వెడల్పు చేసి అక్కడి నుంచి లిఫ్ట్‌ ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ 300 కిలోమీటరు వద్దకు నీటిని పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 334 కిలోమీటరు వరకుఉన్న వేణుగోపాలస్వామి రిజర్వాయర్‌, వేపగుంట, అడవికొత్తూరు రిజర్వాయర్లకు గ్రావిటీ (వాలు పద్ధతి) ద్వారా నీరు ఇచ్చే విధంగా ఈ ప్రతిపాదన సిద్ధం చేశారు.
 
 
భారం తగ్గేదిలా..
ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదన ద్వారా బాలాజి టన్నెల్స్‌ 1, 2 తవ్వే అవసరం ఉండదు. అలాగే 50 కిలోమీటర్ల కాలువ నిడివి తగ్గుతుంది. 8వ ప్యాకేజిలోని 240వ కిలోమీటరు నుంచి 250 కిలోమీటరు వరకు 172 మీటర్ల లెవల్‌కు పంపింగ్‌ చేయడం ద్వారా సుమారు 80 మీటర్ల లోతు గల కాలువలు తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే 40 మీటర్ల వెడల్పున కాలువ తీసేందుకు అటవీ భూమిలో చెట్లు నరకాల్సిన అవసరం ఉండదు. కోడూరు ప్రాంతంలో అరటి, మామిడి, బొప్పాయి లాంటి పండ్ల తోటలు పండే విలువైన భూములను సేకరించాల్సిన అవసరం తగ్గుతుంది. లేదంటే 60 కిలోమీటర్ల కాలువను ఈ భూముల్లో తీసుకురావాల్సి ఉంటుంది. కాలువ మట్టిని తోలేందుకు కూడా మరికొంత భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను అధికారులు రూపొందించి సీడీఆర్‌ (కేంద్ర రూపకల్పన విభాగానికి) పంపారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే గాలేరు-నగరికి అవరోధాలు తగ్గి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
అవుకు బైపాస్‌ టన్నెల్‌ పూర్తి
17-08-2018 03:33:52
 
636700736341867484.jpg
  • గాలేరు-నగరి ప్రాజెక్టులో కీలకమిదే... 
  • నెలాఖరు నాటికి లైనింగ్‌ పూర్తి
  •  సెప్టెంబరు నుంచి గండికోటకు నీళ్లు
  •  10 వేల క్యూసెక్కులు మళ్లించేందుకు సన్నాహాలు
కర్నూలు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో కీలకమైన అవుకు బైపాస్‌ టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. దీంతో కడప జిల్లా గండికోట జలాశయానికి సెప్టెంబరు ఆరంభం నుంచి 10 వేల క్యూసెక్కులు మళ్లించేందుకు మార్గం సుగమం అయింది. అవుకు టన్నెల్‌ నిర్మాణ పనులు పరిశీలిస్తే.. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలలో 5 లక్షల జనాభాకు తాగునీరు అందిచాలనే ఆశయంతో గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు (జీఏన్‌ఏ్‌సఏ్‌స) ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. శ్రీశైలం జలాశయం ఎగువన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 21 వేల క్యూసెక్కుల కృష్ణా వరద జలాలు తీసుకోవాలన్నది ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఫేజ్‌-1 కింద ఇప్పటికే రూ. 3 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. కర్నూలు జిల్లాలో గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపి, కడప జిల్లాలో గండికోట జలాశయానికి కృష్ణా జలాలు ఫ్లడ్‌ కెనాల్‌ ద్వారా తీసుకువెళ్లాలని ప్రభుత్వ సంకల్పం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గండికోటకు కృష్ణా జలాలు చేరాలంటే దాదాపు 132 కి.మీ. ప్రవహించాలి. ఈ ప్రాజెక్టులో అవుకు ట్విన్‌ టన్నెల్‌ (రెండు సొరంగ కాల్వలు) నిర్మాణం అత్యంత కీలకమైనది.
 
ఫాల్ట్‌జోన్‌ అడ్డంకులను అధిగమించి..
గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-30 కింద ‘అవుకు ట్విన్‌ టన్నెల్‌’ నిర్మాణం కీలకమైనది. 5.750 కి.మీ. పొడవుతో ఒక్కో టన్నెల్‌లో 10 వేల క్యూసెక్కుల చొప్పున 20 వేల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యంతో ట్విన్‌ టన్నెల్స్‌ (రెండు సొరంగ కాల్వలు) నిర్మాణ పనులను రూ.403 కోట్లతో ఎన్‌సీసీ మైటాస్‌ సంస్థ చేపట్టింది. 2006లో చేపట్టిన ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలి. ఫాల్ట్‌జోన్‌(పైనుంచి మట్టిపెళ్లలు ఊడి పడడం) కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. లెఫ్ట్‌ టెన్నెల్‌లో 500 మీటర్లు, రైట్‌ టన్నెల్‌లో 600 మీటర్లు ఫాల్ట్‌ జోన్‌ ఏర్పడింది. ఈ ప్రాంతంలో మట్టిని తవ్వి పెద్ద పెద్ద ఇనుప రాడ్లు(గడ్డర్లు) ఏర్పాటు చేసి.. గాంట్రీ కాంక్రీట్‌ లైనింగ్‌ చేయాలి. ఓ పక్క పనులు చేస్తుంటే పైనుంచి మట్టిపెళ్లలు పడుతుండడంతో టన్నెల్‌ నిర్మాణం ముందుకు సాగలేని పరిస్థితి. దీంతో రైట్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను ఫాల్ట్‌జోన్‌ ప్రాంతం వరకు ఆపేసి అక్కడ గోడ కట్టి ఒక్కో సొరంగంలో 5 వేల క్యూసెక్కుల ప్రవాహంతో 10 వేల క్యూసెక్కులు తీసుకుపోయేలా రెండు బైపాస్‌ టన్నెల్స్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పనులకు జీవీఎస్‌ అండ్‌ జీవీ కంపెనీకి అప్పగించారు. గత ఏడాది ఒక బైపాస్‌ టన్నెల్‌ పూర్తి చేసి 5 వేల క్యూసెక్కులు గండికోట రిజర్వాయర్‌కు ఇచ్చారు. తాజాగా రెండో రైట్‌ బైపాస్‌ టన్నెల్‌ను పూర్తి చేసినట్టు కర్నూలు ఇరిగేషన్‌ సీఈ నారాయణరెడ్డి తెలిపారు. నెలాఖరులోగా లైనింగ్‌ పనులు పూర్తి చేసి సెప్టెంబరు ఆరంభం నుంచి 10 క్యూసెక్కులు గండికోటకు ఇస్తామని తెలిపారు. కాగా, లెఫ్ట్‌ టన్నెల్‌ కూడా నిర్మాణం పూర్తి చేస్తేనే లక్ష్యం మేరకు 21 వేల క్యూసెక్కులు గండికోటకు తీసుకువెళ్లవచ్చు. ఆ దిశగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
అనుమతి లేక.. ఆకృతి తేలక!
 గాలేరు-నగరి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో అనేక మార్పులు
 ఆల్తూరుపాడుకు పడని ఆమోదముద్ర
 డిసెంబరు నాటికి పూర్తి చేయడం సాధ్యమయ్యేనా
 ముఖ్యమంత్రి వేగం.. యంత్రాంగంలో జాప్యం
ఈనాడు, తిరుపతి
ctr-top1a.jpg
జిలాల తూర్పు ప్రాంతానికి వరప్రదాయినిగా చేపడుతున్న గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆకృతుల్లో మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత రూపొందించిన నమూనాల మేరకు పనులు చేపట్టాలని అనుకున్నా అది సాధ్యం కాదని తేలడంతో.. రకరకాల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఓ నమూనా ఖరారైందని, టెండర్లు పిలవడమే తరువాయి అనుకున్న దశలో.. ఇంజినీర్లు మరో నమూనాకు బీజం వేస్తున్నారు. వెరసి ప్రాజెక్టు పనులు ప్రతిపాదనల దశలోనే మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబరు నాటికి మల్లెమడుగు, బాలాజీ, వేణుగోపాల్‌సాగర్‌ జలాశయాలను పూర్తి చేసి నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ వేగం కొరవడింది.

ఇదీ తొలి దశ
గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఏడు జలాశయాలు నిర్మించి కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతం నుంచి సుమారు 10 టీఎంసీల నీటిని తరలించాలన్నది తొలుత వేసిన ప్రణాళిక. ఆ మేరకు పలు ప్యాకేజీల కింద అక్కడక్కడ పనులు ప్రారంభించారు. రైల్వే కోడూరు సమీపంలోని సూరాపల్లి నుంచి కుక్కలదొడ్డి వరకు ఒక సొరంగం, బాలాజీ జలాశయం దాటిన తర్వాత మరో టన్నెల్‌ నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ సొరంగాల ద్వారా వచ్చే నీటిని పద్మాసాగర్‌, శ్రీనివాససాగర్‌ల మీదుగా వేపగుంట జలాశయానికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేసి కాలువ తవ్వారు. ఆ తర్వాత తిరుపతి నగరంలో కాలువల నిర్మాణం సాధ్యం కాదని భావించి.. శేషాచలం కొండ కింద భాగం నుంచి భూగర్భంలో పైపులు లేదా సొరంగం వేయాలని యోచించారు. దీనికి తితిదే నుంచి ఆగమశాస్త్రానికి విరుద్ధమంటూ ఆక్షేపణలు రావడంతో.. ఈ ప్రతిపాదనలు విరమించుకున్నారు.

గుత్తేదారులతో సమస్యలు
గాలేరు-నగరిలో ప్రధానమైన బాలాజీ, మల్లెమడుగు జలాశయాల గుత్తేదారులతో అధికారులకు నిత్యం సమస్యలు ఏర్పడుతున్నాయి. తొలుత ఇసుక లభించట్లేదని పనులను నిలిపివేశారు. వాస్తవానికి వారికి అవసరమైన ఇసుకను సేకరించుకునేందుకు రీచ్‌లను ఎంపిక చేసి ఇచ్చారు. ఆ పనుల జాప్యం కారణంగా అక్కడి నుంచి ఇసుకను తీసుకోకపోవడంతో ఇప్పుడు కొరత ఏర్పడింది. ఆ తర్వాత  అధికారులు సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించారు. మళ్లీ బాలాజీ జలాశయ నిర్మాణానికి అవసరమైన మట్టి లేనందున తాము పనులు చేయలేమని గుత్తేదారు మొండికేశారు. దూర ప్రాంతం నుంచి మట్టిని తరలించేందుకు అదనంగా మరో రూ.30 కోట్లు కావాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అలాగే భూగర్భంలో నాలుగు మీటర్ల వరకూ కట్ట నిర్మాణ పనులు చేపట్టాల్సిన చోటు 20 మీటర్ల లోతు వరకూ పనులు చేశామని ఇందుకు అదనంగా మరో రూ.20 కోట్లు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఇలా పలుమార్లు గుత్తేదారులు వివిధ కారణాలను చూపిస్తూ పనులు ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

కాలువలు తవ్వేశారు
బాలాజీ రిజర్వాయర్‌ నుంచి తిరుపతి మీదుగా రామచంద్రాపురం, వడమాలపేట మండలాల పరిధిలో కాలువ తవ్వకాలు చేపట్టారు. సుమారు 36 కి.మీల పరిధిలో కాలువ తవ్వకంతోపాటు పద్మాసాగర్‌, శ్రీనివాససాగర్‌ నిర్మాణానికి రూ.189 కోట్ల పనులను ఓ ప్యాకేజీగా విభజించి గుత్తేదారుకు అప్పగించారు. ఇందులో సుమారు 10 కి.మీల మేరకు ఇప్పటికే ప్రధాన కాలువ తవ్వకాలు పూర్తి చేశారు. కాలువ తవ్వకాలతోపాటు భూసేకరణకు సుమారు రూ.40 కోట్లకుపైగా వెచ్చించారు. ఇప్పుడు అటు పద్మాసాగర్‌, ఇటు శ్రీనివాససాగర్‌ జలాశయాలకు పక్కనబెట్టడంతో కాలువలు అక్కరకు రాకుండా పోయాయి. సరైన ప్రణాళిక లేని కారణంగా ప్రజాధనం దుర్వినియోగమైంది.

ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు
అనేక సమస్యలు ఎదురవుతుండటంతో తొలుత అనుకున్న ప్రతిపాదనలకు భిన్నంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. రైల్వేకోడూరు దాటిన తర్వాత రెండు లిఫ్టులను ఏర్పాటు చేసి తుంబురకోన ద్వారా మల్లెమడుగుకు.. అటునుంచి బాలాజీ జలాశయానికి నీటిని తరలించాలని భావించారు. ఇక్కడి నుంచి పద్మాసాగర్‌, శ్రీనివాససాగర్‌లకు అనుసంధానించాలనుకున్న కాలువకు స్వస్తి పలికారు. తద్వారా ఈ రెండు జలాశయాలను పూర్తిగా నిలిపివేసినట్లే అర్థమవుతోంది. అదేవిధంగా మల్లెమడుగు నుంచి కైలాసగిరి కాలువ ద్వారా నీటిని కల్లూరు వరకూ తరలించేందుకు ప్రతిపాదించారు. కల్లూరు నుంచి వేణుగోపాల్‌సాగర్‌, వేపగుంట, అడవికొత్తూరుకు నీటిని తరలించనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.

కండలేరు ద్వారా
అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఇప్పుడు మళ్లీ కొత్త ప్రతిపాదనలతో పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కండలేరు నుంచి తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని మల్లెమడుగుకు పంపింగ్‌ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో భాగంగా తొలుత కృష్ణా నీటిని సోమశిల డ్యాంకు తరలించనున్నారు. అక్కడి నుంచి సోమశిల కండలేరు వరద నీటి కాలువ ద్వారా కండలేరు జలాశయంలో నింపనున్నారు. అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారానే నీటిని మల్లెమడుగుకు తరలించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా కండలేరు నుంచి పూందీ జలాశయానికి వెళ్లే కాలువ ద్వారా నీటిని తరలించనున్నారు. కాలువలోని 34వ కి.మీ వద్ద ఆల్తూరుపాడు జలాశయానికి పంపించనున్నారు. అక్కడి నుంచి సోమశిల కాలువ ద్వారా మేర్లపాకకు కలపనున్నారు. అక్కడి నుంచి లిఫ్ట్‌ల ద్వారా మల్లెమడుగుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు రూ.551 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇప్పటికే ఆల్తూరుపాడు జలాశయంతొపాటు లిఫ్ట్‌ల ఏర్పాటుకు టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ఏడాదిలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇలా అనేక మెలికల నడుమ ఇప్పుడు గాలేరు  నగరి ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు పనులు త్వరితగతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి నీటి సమస్య తీరుతుంది.

కొలిక్కి వచ్చిన భూ సేకరణ
గాలేరు-నగరి ప్రాజెక్టులో ప్రధానమైంది అటవీ ప్రాంతంలో భూ సేకరణ. ఇన్నాళ్లుగా పనులు నత్తనడకన సాగడానికి గుత్తేదారులు కొంత బాధ్యత వహించాల్సి ఉండగా, భూ సేకరణా ప్రధాన సమస్యగా మారింది. ప్రాజెక్టు కోసం సుమారు 760 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. వీటికి అటవీ శాఖ నుంచి అనేక అభ్యంతరాలు ఎదురవుతూ వచ్చాయి. వారికి కేటాయించేందుకు చూపించిన భూములు సక్రమంగా లేవని వాదిస్తూ వచ్చారు. ఆఖరికి ఉన్నతాధికారులు అందరూ జోక్యం చేసుకోవడంతో వాటిని తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు సాధారణంగా ఇచ్చే భూమి కంటే మరో 200 ఎకరాలు అధికంగా ఇవ్వాలని కోరారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించారు. అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని 990 హెక్టార్లను అటవీశాఖకు ముందస్తు బదలాయించేందుకు అనుమతి ఇస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ సేకరణ సమస్య ఒక కొలిక్కి వచ్చింది.

ఆల్తూరుపాడుపై సందిగ్ధం
ముందుగా నిర్దేశించిన మార్గం ద్వారా కాకుండా తెలుగుగంగ ద్వారా ఆల్తూరుపాడుకు నీటిని తరలించి అక్కడి నుంచి మేర్లపాక వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మల్లెమడుగుకు నీటిని తరలించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రెండు ప్యాకేజీల కింద ఆల్తూరుపాడు జలాశయంతోపాటు మేర్లపాక వద్ద లిఫ్ట్‌ ఏర్పాటుకు టెండర్లు పూర్తి చేసి రాష్ట్ర సాంకేతిక కమిటీకి నివేదించారు. అయితే, మేర్లపాక వద్ద నిర్మించాల్సిన లిఫ్ట్‌కు టెండర్లు పిలిచేందుకు ఆమోదించగా.. ఆల్తూరుపాడు జలాశయంపై నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా ఉన్నతస్థాయి నుంచి అనుమతులు రాక ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఈ జాప్యానికి కారణం కూడా చెప్పడం లేదు. ఈ తరుణంలో డిసెంబరు నాటికి పనులెలా పూర్తవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వస్తే త్వరితగతిన పనులు ప్రారంభించి తూర్పు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

 
 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
అవుకు సొరంగం రెడీ
20-09-2018 04:13:21
 
636730135981966530.jpg
  • కుడి ట్విన్‌ బైపాస్‌ టన్నెల్‌ పూర్తి
  • 22న జాతికి అంకితం చేయనున్న సీఎం
  • ఆ వెంటనే గండికోటకు 10 వేల క్యూసెక్కులు
  • 12 ఏళ్లుగా ఎన్నో ఆటంకాలు
  • ఫాల్ట్‌జోన్‌తో నిర్మాణ కష్టాలు.. ఎట్టకేలకు కొలిక్కి
కర్నూలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. 12 ఏళ్లుగా ఎన్నో అవరోధాలు.. వీటన్నిటినీ అధిగమించి అవుకు సొరంగంలోని కుడివైపు జంట టన్నెళ్ల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం పూర్తిచేసింది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు 22న (శనివారం) జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు నుంచి 10 వేల క్యూసెక్కులు గండికోట రిజర్వాయర్‌కు టన్నెల్‌ నుంచి మళ్లించేలా జలవనరుల శాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో ఈ సొరంగం ఎంతో ముఖ్యమైనది. కడప జిల్లా గండికోట జలాశయానికి కృష్ణా జలాల తరలింపునకు ఇదే కీలకం. శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 38 టీఎంసీల వరద జలాలు తీసుకుని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో గాలేరు-నగరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఫేజ్‌-1 కింద పోతిరెడ్డిపాడు నుంచి గండికోట రిజర్వాయరు వరకు 132 కి.మీ. ప్రధాన వరద కాలువ, కర్నూలు జిల్లాలో 12.84 టీఎంసీల సామర్థ్యంతో గోరకల్లు జలాశయం, కీలకమైన అవుకు జంట సొరంగాలు నిర్మించాలి.
 
వరద కాలువ, గోరకల్లు రిజర్వాయర్లు పూర్తిచేసినా.. ఫాల్ట్‌జోన్‌ కారణంగా అవుకు ట్విన్‌ టన్నెల్‌ నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ప్యాకేజీ-30 కింద.. ఒక్కో టన్నెల్‌లో 10 వేల క్యూసెక్కుల చొప్పున 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో రెండు సొరంగ మార్గం కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి పొడవు ఒక్కోటీ 5.750 కి.మీ. రూ.403 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌సీసీ, మైటాస్‌ సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి.. 2006లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పనులు చేపట్టాయి. ఒప్పందం ప్రకారం రెండేళ్లలోగా పూర్తి చేయాలి. నాటి పాలకుల వైఫల్యం, కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తకు నడక నేర్పాయి. దీనికితోడు లెఫ్ట్‌ టన్నెల్‌లో 500, రైట్‌ టన్నెల్‌లో 600 మీటర్లు ఫాల్ట్‌ జోన్‌ (పైనుంచి మట్టిపెళ్లలు విరిగిపడడం) ఏర్పడింది. దీనిని అధిగమించాలంటే.. ఈ ప్రాంతంలో మట్టిని తవ్వి పెద్ద పెద్ద ఇనుప రాడ్లు (గడ్డర్లు) ఏర్పాటుచేసి.. గాంట్రీ కాంక్రీట్‌ లైనింగ్‌ చేయాలి. ఓ పక్క పనులు చేస్తుంటే పైనుంచి మట్టిపెళ్లలు పడుతుండడంతో కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. పనులు ఆగిపోయాయి. 2014 జూన్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక.. కడప జిల్లా గండికోట జలాశయానికి కృష్ణా జలాలు తీసుకెళ్లాలన్న సంకల్పంతో కీలకమైన అవుకు టన్నెల్‌ నిర్మాణంపై దృష్టి సారించారు. అయితే ఫాల్ట్‌జోన్‌ కారణంగా టన్నెల్‌ నిర్మాణం కష్టమని నిపుణులు తెలిపారు. బైపాస్‌ టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
 
ఇందుకు రూ.33 కోట్ల అదనపు వ్యయమవుతుందని అంచనా. మొదట కుడి టన్నెల్‌లో ఫాల్ట్‌ జోన్‌ ఏర్పడిన ప్రాంతం వద్ద గోడ కట్టి అక్కడి నుంచి 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు బైపాస్‌ టన్నెల్స్‌ నిర్మాణానికి నిర్ణయించారు. దీని ప్రకారం 600 మీటర్ల ఫాల్ట్‌జోన్‌ను తప్పించి ముందు భాగంలో కలుపుతూ ‘యు’ ఆకారంలో బైపాస్‌ టన్నెల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులను మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. గత ఏడాది అవరోధాలను అధిగమించి ఒక బైపాస్‌ టన్నెల్‌ పూర్తిచేసి 5 వేల క్యూసెక్కులు గండికోటకు ఇచ్చారు. ఈ ఏడాది ఎలాగైనా రెండో బైపాస్‌ టన్నెల్‌ కూడా పూర్తి చేసి 10 వేల క్యూసెక్కులు కడప జిల్లాకు తరలించాలని కాంట్రాక్టు సంస్థపై సీఎం ఒత్తిడి పెంచారు. ప్రతి సోమవారం సమీక్ష జరుపుతున్నారు. నిజానికి లక్ష్యం మేరకు ఆగస్టు 3నే ఇది పూర్తికావలసి ఉండగా.. ఆలస్యమైంది. దీంతో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్లకు చార్జ్‌మెమోలు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు 20 రోజులు ఆలస్యంగానైనా రెండో టన్నెల్‌ నిర్మాణం, సీసీ లైనింగ్‌ పూర్తి చేయగలిగారు
Link to comment
Share on other sites

కరవు సీమలో జలపరవళ్లు 
నేడు అవుకు టన్నెల్‌ను ప్రారంభించనున్న సీఎం 
  కుడి సొరంగం ద్వారా  గండికోటకు 10 వేల క్యూసెక్కులు 
  తీరనున్న కర్నూలు,  కడప రైతుల కష్టాలు 
21ap-main16a.jpg

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలను వరద కాలువ ద్వారా తీసుకెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతిలో కీలకమైన అవుకు బైపాస్‌ టన్నెల్‌ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. అవుకు టన్నెల్‌తోపాటు గోరుకల్లు, పులికనుమ పథకాలనూ ప్రారంభించనున్నారు. 2015 మే 15న అవుకు  జలాశయం కట్టపై సీఎం నిద్రించారు. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 12 ప్రాజెక్టులను ప్రారంభిస్తుండగా అందులో కర్నూలు జిల్లాలోనే నాలుగు ఉండటం విశేషం.

ప్రత్యేక శ్రద్ధ 
ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరుచేసి ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. గతేడాది కుడి సొరంగంలో బైపాస్‌ టన్నెల్‌ పూర్తిచేసి ఐదు వేల క్యూసెక్కులను గండికోట జలాశయానికి వదిలారు. తాజాగా రెండో బైపాస్‌ టన్నెల్‌ను అతికష్టంపై పూర్తి చేశారు. గోరుకల్లు నుంచి అవుకు జలాశయానికి శనివారం ఉదయానికి నీరు చేరనుంది. సీఎం చేతులమీదుగా ఐదు వేల క్యూసెక్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రోజుకు టీఎంసీ చొప్పున కడప జిల్లా అవసరాలను బట్టి గండికోట జలాశయానికి 25-30 టీఎంసీల వరకు ఎంత కావాలన్నా నీళ్లు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ముఖ్య ఇంజినీర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గండికోట జలాశయానికి ప్రస్తుతం 12 టీఎంసీలు మాత్రమే తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అన్నదాతల్లో ఆనందం 
అవుకు టన్నెల్‌ ద్వారా గండికోట జలాశయానికి చేరే నీటితో కడప జిల్లా రైతుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి ఇబ్బందులు పడుతున్న కర్షకులకు ఇది శుభవార్తే. గండికోట నుంచి మైలవరం, పైడిపాలెం, చిత్రావతి వరకు నీళ్లు తీసుకెళతామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరనుంది. మరోవైపు కర్నూలు జిల్లాలో రూ.264 కోట్లతో చేపట్టిన పులికనుమ ఎత్తిపోతల ద్వారా 26,400 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటికే ఈ పథకం ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. దీంతో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, గోనెగండ్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గాలేరు - నగరి సుజల స్రవంతి 
* ప్రయోజనం పొందే జిల్లాలు: కడప, నెల్లూరు, చిత్తూరు 
* లక్ష్యం: రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, ఐదు లక్షల జనాభాకు తాగునీరు 
* ప్రాజెక్టు  స్వరూపమిలా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా వద్ద పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల కృష్ణా వరద జలాలు తీసుకుంటారు. 
* గండికోటకు మళ్లింపు ఇలా: తొలుత గోరుకల్లు, అవుకు జలాశయాలను నింపుతారు. గండికోటకు తరలింపులో భాగంగా అవుకు వద్ద సొరంగాలు తవ్వారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి గండికోటకు కృష్ణా జలాలు తరలించాలంటే 132 కి.మీ. నీరు ప్రవహించాలి. ప్రాజెక్టులో అవుకు జంట సొరంగాల నిర్మాణం కీలకం. 2007లో ప్యాకేజీ-30 కింద రూ.401 కోట్లతో పనులు చేపట్టారు.

ఎదురైన సవాళ్లు:  వాస్తవానికి 2010 నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. సొరంగం తవ్వే సమయంలో మట్టిపెళ్లలు ఊడిపడటంతో పనులు నిలిచిపోయాయి. ఎడమ సొరంగంలో 500 మీటర్లు, కుడి సొరంగంలో 600 మీటర్ల వరకు ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కుడివైపు సొరంగంలో కొద్ది భాగం పనులు ఆపి అక్కడ గోడ కట్టి ఒక్కో సొరంగంలో ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం చొప్పున పదివేల క్యూసెక్కులను రెండు బైపాస్‌ టన్నెళ్లనుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Link to comment
Share on other sites

సీమకు జలహారతి!
22-09-2018 03:06:41
 
636731823991777914.jpg
  • నేడు 3 ప్రాజెక్టులను ప్రారంభించనున్న సీఎం..
  • అవుకు టన్నెల్‌, గోరకల్లు, పులికనుమ జాతికి అంకితం
  • గండికోట జలాశయానికి జలాలు విడుదల
  • సీమ వాసుల దశాబ్దాల కల సాకారం
 
అమరావతి/కర్నూలు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాయలసీమను రతనాలసీమగా మలిచే నీటి ప్రాజెక్టులు చకచకా పూర్తవుతున్నాయి. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మూడు కీలక పథకాలను ప్రారంభించనున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్ఎస్)లో అంతర్భాగమైన అవుకు సొరంగం, గోరకల్లు, పులికనుమ ఎత్తిపోతల పథకాలను ఆయన జాతికి అంకితమివ్వనున్నారు. రాయలసీమకు ప్రధానంగా కడప జిల్లాలో అతి ముఖ్యమైన గండికోట రిజర్వాయరులో 30 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు అవుకు టన్నెల్‌ ఉపయోగపడుతుంది. గాలేరు-నగరి 30వ ప్యాకేజీలో భాగమైన అవుకు జంట సొరంగాల ప్రాజెక్టుకు అంచనా విలువతో రూ.451.81 కోట్లుగా జల వనరుల శాఖ రూపకల్పన చేసింది. ఈ జంట సొరంగాల పొడవు ఒక్కోటీ సుమారు 5.75 కిలోమీటర్లు. 57.70 నుంచి 63.45 కిలోమీటర్ల దాకా ఉండే ఈ సొరంగాల నుంచి 20,000 క్యూసెక్కుల వరద నీటిని గండికోటకు తరలించడం లక్ష్యం. అయితే ఎడమ టన్నెల్‌లో 500, కుడి టన్నెల్‌లో 600 మీటర్లు ఫాల్ట్‌ జోన్‌ (పైనుంచి మట్టిపెళ్లలు విరిగిపడడం) ఏర్పడింది. ఫాల్ట్‌జోన్‌ కారణంగా టన్నెల్‌ నిర్మాణం కష్టమని.. బైపాస్‌ టన్నెళ్లు నిర్మించాలని నిపుణులు సూచించారు.
 
దాంతో మొదట కుడి టన్నెల్‌లో ఫాల్ట్‌ జోన్‌ ఏర్పడిన ప్రాంతం వద్ద గోడ కట్టి అక్కడి నుంచి 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు బైపాస్‌ టన్నెల్స్‌ నిర్మాణం తలపెట్టారు. నిరుడు ఒక బైపాస్‌ టన్నెల్‌ పూర్తిచేసి 5 వేల క్యూసెక్కులు గండికోటకు తరలించారు. ఈ ఏడాది రెండో బైపాస్‌ టన్నెల్‌ పూర్తయింది. ఈ మళ్లింపు సొరంగాల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని అవుకు జలాశయం ద్వారా గండికోట జలాశయానికి పంపే ఏర్పాటు చేశారు. ఎడమ టన్నెల్‌ కూడా పూర్తయితే 20 వేల క్యూసెక్కులను గండికోటకు తరలించడం సాధ్యమవుతుంది. గాలేరు-నగరి ప్రాజెక్టులోనే భాగంగా 12.84 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన గోరకల్లు జలాశయం నిర్మాణం కూడా పూర్తయింది. ఇక్కడ నుంచి గండికోటకు 20 వేల క్యూసెక్కులను మళ్లించాలన్నది ప్రధాన లక్ష్యం. కాగా.. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర ఎల్లెల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.263.10 కోట్లతో పులికనుమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. 26 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1.20 టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. పనులు పూర్తిచేసి ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు.
 
 
ఇదీ సీఎం షెడ్యూల్‌..
శనివారం కర్నూలు వస్తున్న సీఎం పై మూడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. తొలుత ఆయన బనగానపల్లె నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హెలికాప్టరులో మధ్యాహ్నం 1:50 గంటలకు అవుకు మండలం రామాపురంలో దిగుతారు. 2:00 గంటలకు గాలేరు-నగరి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు చేరుకుని జలసిరికి హారతి ఇస్తారు. అవుకు సొరంగం కుడివైపు నిర్మించిన జంట బైపాస్‌ టన్నెళ్లను ప్రారంభించి.. కడప జిల్లా గండికోట జలాశయానికి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. గోరకల్లు, పులికనుమ పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అనంతరం 2:45 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొలిమిగుండ్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 4:45కి రామాపురం హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 5:20 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ బయల్దేరతారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 57 ప్రాధాన్య ప్రాజెక్టులలో ఇప్పటికే 12 ప్రారంభమయ్యాయి. పై మూడింటితో కలిపి ఆ సంఖ్య 15కి చేరుకోనుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
చిత్తూరుకు గాలేరు నీరు 
136 కిలోమీటర్ల దూరం తగ్గించేలా ప్రతిపాదన 
చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి హంద్రీ-నీవా కాలువ మధ్య ఆరు ఎత్తిపోతలు 
27ap-main13a.jpg

హంద్రీ-నీవా పథకం ద్వారా ప్రధానంగా చిత్తురు జిల్లాకు సాగు నీరు అందించడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మార్గాలు వెదుకుతోంది. ఈ క్రమంలో తాజా ప్రతిపాదన ఒకటి తెరపైకొచ్చింది. గాలేరు-నగరి పథకంలో భాగంగా ఉన్న చిత్రావతి రిజర్వాయర్‌ నుంచి నేరుగా ఐదు ఎత్తిపోతల ద్వారా అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని హంద్రీ-నీవా కాలువకు నీరు తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనీవల్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా, చిత్తూరు జిల్లాకు, కొంత భాగం కడప జిల్లాకు కృష్ణా జలాలు వేగంగా చేరేందుకు వీలుంటుంది. దీనిపై కసరత్తు చేసిన జలవనరులశాఖ ఇంజినీర్లు ఓ సమగ్ర పథక నివేదికను తయారు చేశారు. మొత్తం రూ.1827.57 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రతిపాదనను అనంతపురం జలవనరులశాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి పంపారు.

హంద్రీ-నీవా, గాలేరు-నగరి పథకాలు సీమ జిల్లాలకు గుండెకాయలు వంటివి. నాలుగు జిల్లాల్లోనూ ఈ పథకాలపై ఆధారపడి లక్షాది ఎకరాల ఆయుకట్టు ఉంది. రాయలసీమలోని ఎంతో కీలకమైన ఈ రెండు సాగునీటి పథకాలను కలిపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

27ap-main13b.jpg

కొత్త ప్రతిపాదనల ప్రకారం... 
* గాలేరు-నగరి పథకంలో భాగంగా కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా జలాలు 182 కి.మీ. ప్రయాణించి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి చేరుతాయి. అక్కడి నుంచి అయిదు ఎత్తిపోతల ద్వారా నీటిని కడప-అనంతపురం జిల్లాల సరిహద్దులో ఉన్న చిత్రావతి సమతుల జలాశయం-సీబీఆర్‌ (కొత్తపేరు పెంచికల బసిరెడ్డి జలాశయం)కు గత ఏడాది నుంచి తీసుకొస్తున్నారు. ఇది దాదాపు 60 కి.మీ. ఉంది. 
* సీబీఆర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో ఉన్న యోగివేమన జలాశయం వరకు నాలుగు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ రెండింటి మధ్య దూరం 22 కి.మీ. ఉంటుంది. మళ్లీ యోగివేమన జలాశయం నుంచి దాదాపు నాలుగు కి.మీ. మేర కాలువ తవ్వి రెండు ఎత్తిపోల పథకాల ద్వారా నీటిని తీసుకెళ్లి కదిరి సమీపంలోని హంద్రీ-నీవా ప్రధాన కాల్వలోని 386 కి.మీ. వద్ద కలపనున్నారు. అదే గాలేరు-నగరి ద్వారా అయితే 250 కిలోమీటర్లకే కృష్ణా జలాలు హంద్రీ-నీవా కాల్వలో చేరుతాయి. దీనివల్ల 136 కిలోమీటర్ల దూరం తగ్గినట్లవుతుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌, వెలిగల్లు జలాశయానికి నీరిచ్చేందుకు వీలు కలుగుతుంది.

ఇప్పటిదాకా  ఏం జరుగుతోందంటే...
హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) పథకం ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణమ్మను చిత్తూరు తరలించాలంటే వందల కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది.
* ఈ పథకం కర్నూలు జిల్లాలోని మల్యాల వద్ద మొదలై, అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం 216 కి.మీ. వరకు మొదటి దశగా ఉంది. ఈ మధ్య 8 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.
* రెండో దశలో జీడిపల్లి నుంచి గ్రావిటీపై నీరు ముందుకెళ్తుంది. ఈ ప్రధాన కాల్వ 490 కి.మీ. వద్ద అనంతపురం జిల్లాను దాటి చిత్తూరులో ప్రవేశించాలి. అయితే అనంతపురం జిల్లాలో నీటి అవసరాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో నీరు ముందుకెళ్లడం కష్టమవుతోంది.
* వర్షాభావ పరిస్థితులు ఉన్నపుడు అనంతపురంలో సాగు, తాగునీటికి డిమాండ్‌ ఎక్కువైనప్పుడు నీరు ముందుకు వెళ్లడం మరీ గగనంగా ఉంది. ఉదాహరణకు ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు.
హంద్రీ నీవా స్వరూపం 
27ap-main13c.jpg
* ప్రధాన కాల్వ పొడవు 554 కి.మీ. 
* కర్నూలు జిల్లాలో 144 కి.మీ. 
* అనంతపురం జిల్లాలో 346 కి.మీ. 
* చిత్తూరు జిల్లాలో 64 కి.మీ. 
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...