Jump to content

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు.


Recommended Posts

వరంగల్:  ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(85) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ మంగళవారం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్లకే నేరెళ్ల తన కెరీర్‌‌ను ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, తమిళంలో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 2001లో ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి వేణుమాధవ్‌ను సత్కరించింది.
 
తెలుగు వర్సిటీలో మిమిక్రీ అధ్యాపకుడిగా నేరెళ్ల సేవలందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో మిమిక్రీ డిప్లొమా ప్రారంభించేందుకు వేణుమాధవ్‌ కృషి చేశారు. ధ్వని అనుకరణ ప్రక్రియ 'మిమిక్రీ కళ' పుస్తకం రాసిన ఆయన మిమిక్రీ కళలో ఎంతోమంది శిష్యులను తయారుచేశారు. నేరెళ్లపై ఐవీ చలపతిరావు, పురాణం సుబ్రమణ్యశర్మ పుస్తకాలు రాశారు. 1981లో రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డును నేరెళ్ల అందుకోగా, 1978లో కళాప్రపూర్ణ బిరుదుతో ఏయూ ఆయనను సత్కరించింది. నేరెళ్ల వేణుమాధవ్‌కు ఏయూ, కేయూ, ఇగ్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి.
 
నేరెళ్ల వేణుమాధవ్ 12 సినిమాల్లో కూడా నటించారు. ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ వెనుక సినీప్రముఖులు బీఎన్.రెడ్డి ప్రమేయం ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే నేరెళ్ల సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోనూ నేరెళ్ల తన సేవలను అందించారు. మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. నేరెళ్ల వేణుమాధవ్‌కు నలుగురు సంతానం కాగా, కుమార్తె తులసిని మిమిక్రీ కళాకారిణిగా తీర్చిదిద్దారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంగా ప్రభుత్వం నామకరణం చేసింది.
 
నేరెళ్ల మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతీ వ్యక్తి సొంతంగా ఓ కళతో ఎదగాలని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని వేణుమాధవ్ చెప్పేవారని నేరెళ్ల అభిమానులు చెబుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేరెళ్ల భౌతికకాయాన్ని ఆయన నివాసంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...