Jump to content

ఆర్య పుత్రులకు అంతా ఎరుకేనా? ఆర్యులెవరు? ఎక్కడ్నించి వచ్చారు?


Recommended Posts

ఆర్య పుత్రులకు అంతా ఎరుకేనా?
ఆర్యులెవరు? ఎక్కడ్నించి వచ్చారు?
ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏం చేశారు?
26hyd-main3a.jpg
చిరకాలంగా చరిత్రలో అతిపెద్ద చిక్కుముడిలా మిగిలిపోతూ.. సామాజికంగానే కాదు.. రాజకీయంగా కూడా రకరకాల భావ యుద్ధాలు, విపరీత భావోద్వేగాలు రేపుతున్న ఈ ప్రశ్నలకు జన్యువులు జవాబివ్వబోతున్నాయా? తాజా జన్యు పరిశోధనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆ మాటకొస్తే.. ఈ ప్రశ్నలకే కాదు.. అసలీ ఉపఖండంలో ఉంటున్న మనం ఎవరం? మన పూర్వీకులెవరు? మన మూలాలెక్కడివన్న ఆసక్తికర ప్రశ్నలకూ జన్యు పటాల్లో ఆనవాళ్లు, ఆచూకీలు దొరుకుతుండటం.. సరికొత్త చర్చకు తెర తీస్తోంది!
జాతుల జగడం.. జన్యువు తీరుస్తుందా?
26hyd-main3b.jpg

ఆర్యుల పేరెత్తితే చాలు.. రకరకాల అనుమానాలు, అభిమానాలు, ఆందోళనలు, ఆవేశకావేశాలు కట్టలుతెంచుకుంటుంటాయి. మన చరిత్రలో వాళ్ల ఉనికికి సంబంధించిన ప్రశ్నలు రేకెత్తించినన్ని భావోద్వేగాలు మరి దేనికీ రేగవు. ఆర్యులన్న పేరు వింటూనే చరిత్రకారుల నుంచి, సామాజిక వేత్తల నుంచి.. చివరికి రాజకీయనాయకుల వరకూ అంతా దిగ్గున లేస్తారు. వాదోపవాదాలు భగ్గున రేగుతుంటాయి. ఆర్యులనేవాళ్లు బయటి నుంచి ఉత్తర భారతానికి వచ్చి.. ఇక్కడి స్థానికులను దక్షిణాదికి తరిమేశారని చెప్పేవాళ్లు కొందరు. అసలు ఆర్యులే దేశమంతా విస్తరించారనే వాళ్లు మరికొందరు. లేదులేదు, వాళ్లెవరో బయటి నుంచి రావటమేమిటి? అసలు ప్రపంచ జాతులన్నింటికీ మన భరతఖండమే పుట్టినిల్లు, ఆధునిక మానవ జాతి అంతా ఇక్కడి నుంచే ప్రపంచమంతా విస్తరించిందని బల్లగుద్ది  వాదించే వాళ్లు మరికొందరు. ఈ వాదనల యుద్ధాలు ఏదో చరిత్ర పుస్తకాలకే పరిమితం కాలేదు. దేశంలో భిన్న వర్గాల మధ్య సాంస్కృతిక విభేదాలకు, అగాధాలకు ఆస్కారం ఇస్తూ.. ఇటీవలి కాలంలో రాజకీయంగానూ సంచలనాల దుమ్ము రేపుతున్నాయి. మరి ఈ చిరకాలపు చిక్కుముడి వీడేదెలా? ఇప్పటి వరకూ ఉన్న పరిశోధనలు, చరిత్ర పద్ధతులన్నీ దీనికి సమర్థమైన సమాధానం ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో.. తాజాగా జన్యు పరిశోధనలు రంగం మీదికి వస్తుండటం విశేషం.

సైన్సే కాదు.. ప్రశ్న లేకుండా చరిత్రా పురుడుపోసుకోదు. అందుకే చరిత్ర నిండా బోలెడన్ని ప్రశ్నలు, లెక్కలేనన్ని చిక్కుముళ్లు! రకరకాల మార్గాల్లో గతంలోకి తొంగి చూసి.. చిక్కుముళ్లను విడదీసుకుంటూ పోయే కొద్దీ అస్పష్టతలు వీడి చరిత్ర ఒక రూపానికి వస్తుంటుంది. అందుకే చరిత్ర పరిశోధకులు దశాబ్దాలుగా పురాతత్వ తవ్వకాల నుంచి శాసనాలు, నాణేల వరకూ రకరకాలుగా అధ్యయనాలు చేస్తూ.. చరిత్ర నిర్మాణానికి ఏ చిన్న ఆధారం దొరుకుతుందా? అని మూలాలను జల్లెడపడుతుంటారు. అయితే వీటిన్నింటికీ ఎన్నో పరిమితులున్నాయి. ముఖ్యంగా ఆదిమ మానవులు, జాతుల ఆవిర్భావం, వారి కదలికలకు సంబంధించి ఈ ఆధారాలేవీ కూడా కచ్చితంగా అక్కరకొచ్చేవిగా లేకపోవటం పెద్ద సమస్య! ఇప్పుడీ పరిమితులను ఎంతోకొంత అధిగమించి.. చరిత్ర క్రమంలో ఆదిమ కాలం నుంచి ఇటీవలి వరకూ కూడా మనుషుల కదలికలకు సంబంధించిన ఆనుపానులను పట్టుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతోంది జన్యు విశ్లేషణ! నాటి మనుషులు, జాతులకు సంబంధించి ఏ చిన్న నమూనా లభ్యమైనా.. ఆ జన్యువులను విశ్లేషించటం ద్వారా వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో పట్టుకునే వీలుండటం జన్యు విశ్లేషణల ప్రత్యేకత! అందుకే చరిత్ర వివాదాలను తీర్చేందుకు జన్యు పరిశోధనలు అక్కరకొస్తున్నాయి. ఆర్యులు, భారత ఉపఖండంలో ఆదిమ మానవుల ఆవాసాలు, కదలికలకు సంబంధించిన విలువైన ఆధారాలుగా కూడా జన్యువిశ్లేషణలు కొత్త ద్వారాలు తెరుస్తుండటం విశేషం. నిజానికి మన దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రజలు ఎక్కడివారు, వీళ్లెక్కడి నుంచి పుట్టుకుని/వచ్చారన్న దానిపై ఇప్పటి వరకూ పూర్తి స్పష్టత లేదు. అందుకే దీని గురించి బోలెడన్ని చర్చలు, సిద్ధాంతాలున్నాయి. ఇది సామాజిక పరిస్థితులతో, స్థానిక రాజకీయాలతో కూడా బలంగా పెనవేసుకుపోయినది కావటంతో ఎవరి సిద్ధాంతాలను వాళ్లు తయారుచేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. వీటిలో మచ్చుకు రెండు....


నీలికళ్లు, తెల్లతోలు ఆర్యులు గుర్రాల మీద భారత ఉపఖండంలోకి దండెత్తివచ్చి.. కనబడిన వారినల్లా జయించుకుంటూ.. ఇక్కడి నాగరకతలను, పురాలను ధ్వంసం చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని ఆక్రమించు కున్నారన్నది నాజీలతో సహా పలువురు చిరకాలంగా చెబుతున్న అంశం.  మరోవైపు ఇటీవలి కాలంలో దీనికి పూర్తి విరుద్ధ సిద్ధాంతం ఒకటి విస్తృత ప్రచారంలోకి వస్తోంది.



ఇండో-యూరోపియన్‌ భాషలను పరిశీలిస్తే అవన్నీ కూడా భారత ఉపఖండంలోనే పుట్టి.. ఇక్కడి నుంచే పాశ్చాత్య ప్రపంచానికి విస్తరించాయని అర్థమవుతోంది కాబట్టి మానవ నాగరకత భరత ఖండం నుంచే ప్రపంచమంతా విస్తరించింద న్నది వీరి వాదన. దీన్నే ఇప్పుడు ‘ఔట్‌ ఆఫ్‌ ఇండియా’ సిద్ధాంతం అంటున్నారు. పలువురు హిందూ సిద్ధాంత, ప్రచారకర్తలు బలంగా ప్రచారం చేస్తున్న అంశం ఇది.



26hyd-main3f.jpg....ఈ నేపథ్యంలో అసలు ఆర్యులు ఎక్కడివాళ్లు, వాళ్లు నిజంగా దండెత్తివచ్చి.. ముట్టడించి ఆక్రమించారా? లేక వలస వచ్చారా? (ఇన్వేజన్‌ /లేక/ మైగ్రేషన్‌) నేటి మన భారత ఉపఖండ ప్రజలెవరు? వీళ్లది మిశ్రమజాతా? ఒకవేళ అయితే ఇది ఏయే జాతుల మిశ్రమం? చిరకాలంగా చరిత్రకారులను వేధిస్తున్న ప్రశ్నలివి. తాజాగా 92 మంది అంతర్జాతీయ పరిశోధకులు లోతుగా శోధించి గత నెల వెలువరించిన జన్యు పరిశోధనా పత్రం ‘ద జెనోమిక్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ అండ్‌ సౌత్‌ ఏషియా’ ఒక రకంగా ఈ చర్చలకు బలమైన సమాధానాలను పైకి తెచ్చింది. ప్రజా జన్యుపరిశోధకులు, పురాతత్వవేత్తలు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు ఇలా.. భిన్న శాస్త్ర రంగాలకు చెందిన విఖ్యాత పరిశోధకులు పాల్గొన్న అధ్యయనం కావటంతో ఇది అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

26hyd-main3k.jpg
ఏమిటీపరిశోధన?
హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌    నుంచి మన సీసీఎంబీ వరకూ పలు విఖ్యాత సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ అధ్యయనంలో 612 మంది ప్రాచీనుల జన్యు నమూనాలను (అంటే డీఎన్‌ఏను) తీసుకున్నారు. ఇవి ఇరాన్‌, అప్ఘానిస్థాన్‌, ఉబ్జెక్‌, తజక్‌, కజకిస్థాన్‌, స్వాత్‌ లోయతో సహా పలు భారత ఉపఖండ ప్రాంతాలకు చెందిన ప్రాంతాల వారివి, అలాగే వీటిలో భిన్న కాలాలకు.. క్రీపూ 5,600 నుంచి క్రీపూ 1000 మధ్య కాలానికి చెందిన నమూనాలూ ఉన్నాయి. తర్వాత ఈ నమూనాలను నేటి ఆధునిక దక్షిణాసియా ప్రాంతవాసులైన 246 భిన్న జాతులకు చెందిన 1,789 మంది డీఎన్‌ఏ నమూనాలతో పోల్చి చూశారు. ఇలా ప్రాచీన-ప్రస్తుత డీఎన్‌ఏ నమూనాలను పోల్చటంవల్లే ఎక్కడివాళ్లు ఎలా ఉన్నారు? ఎవరు ఎట్నుంచి ఎటు మళ్లారు? వంటివి స్పష్టంగా తెలుస్తాయి. వీటిని విశ్లేషించి చూస్తే..
తేలిందేమిటి?
26hyd-main3d.jpgప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రాచీన వాసుల డీఎన్‌ఏలో కనిపించిన మార్పులను లోతుగా విశ్లేషిస్తే అర్థమయ్యేదేమంటే..
1 ఆది వాసులు: దక్షిణాసియా ప్రాంతంలో మనకు ఆధారాలు లభించినంత వరకూ తొలి నుంచీ ఆవాసం ఉన్నవాళ్లు దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలు. (వీళ్లకు వ్యవసాయం తెలియదు). ఇప్పటికీ అండమాన్‌ దీవుల వంటి చోట్ల వీళ్లను మనం చూడొచ్చు.
2 తొలి వలస: క్రీ.పూ.7000 ప్రాంతంలో ఇరాన్‌ నుంచి వ్యావసాయిక ప్రజలు ఇక్కడికి వచ్చారు. వీళ్లే బార్లీ, గోధుమ, వరి వంటి పంటలను, సేద్య పద్ధతులను ఈ ఉపఖండానికి తీసుకొచ్చారు. ఈ రెండు జాతులకు చెందిన మిశ్రమంగా ఉనికిలోకి వచ్చినవాళ్లే ప్రధానంగా ఈ ప్రాంత వాసులు. అయితే.. ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలో పెను మార్పు చోటుచేసుకుంది.
26hyd-main3e.jpg3 మరో వలస: క్రీ.పూ.2000-1500 ప్రాంతంలో ఆఫ్ఘానిస్థాన్‌కు ఉత్తరాన ఉన్న విస్తారమైన గడ్డిభూముల నుంచి పశుపోషకులు హిందూకుష్‌ పర్వతాలు దాటుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు.

ఈ మూడు జాతులు రకరకాలుగా కలగలిసిపోవటం వల్ల ఉనికిలోకి వచ్చినవాళ్లే నేటి మన దక్షిణాసియా వాసులు. ఇప్పుడు మన దక్షిణాసియాలో వాసుల్లో ప్రతి ఒక్కరికీ మూలం ఈ జాతుల మిశ్రమంలో కనబడుతోందని జన్యుపటాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
26hyd-main3c.jpg
మరి ఆర్యులెవరు?
26hyd-main3i.jpg
క్రీ.పూ. 2000-1500 ప్రాంతంలో వచ్చిన వాళ్లే ఆర్యులు! రష్యా సైబీరియా పచ్చికమైదానాల నుంచి వచ్చిన ఈ పశుపోషకులు అప్పటికి ఇక్కడ ఉన్న జాతులపై పెద్ద ప్రభావమే చూపారు. నిజానికి వీళ్లు రావటానికి పూర్వమే ఇక్కడ ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందిన నాగరకత ఒకటి విలసిల్లింది. అదే సింధు నాగరకత. సింధు నదీ పరివాహక సారవంతమైన భూముల్లో (ప్రస్తుత వాయవ్య భారతం, పాకిస్థాన్‌ ప్రాంతం) ఈ నాగరకత అప్పటికే బలంగా స్థిరపడింది. క్రీ.పూ.5500 నుంచీ ఇక్కడ మతపరమైన క్రతువులు జరుగుతున్నట్టు, క్రీ.పూ.4000 నుంచీ వ్యవసాయం చేస్తున్నట్లు, క్రీ.పూ.3000ల నుంచే ఇక్కడ పట్టణీకరణ జరిగినట్లూ ఆనవాళ్లున్నాయి. క్రీ.పూ. 2600 నాటికే ఇక్కడ డజన్లకొద్దీ పట్టణాలు, నగరాలు ఏర్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మొత్తానికి క్రీ.పూ. 2000 ముందు నాటికే.. అంటే ఆర్యులు రాకపూర్వం ఈ సింధు నాగరకత బ్రహ్మాండమైన ఉచ్చస్థితికి చేరింది. క్రీ.పూ. 2000-1500 మధ్య ఆర్యులు ఈ ఉపఖండంలో అడుగుపెట్టేశారు. జంతుపెంపకం బాగా తెలిసిన వీళ్లు తమతో గొర్రెలు, గుర్రాలు తెచ్చారు. ఇదో భారీ వలస! దీన్నే గత చరిత్రకారులంతా పెద్ద దండయాత్ర అంటుండేవాళ్లు. అసలు వీళ్ల వల్లే సింధు నాగరకత ధ్వంసమైపోయిందని చెప్పేవాళ్లూ ఉన్నారుగానీ నేటి చరిత్రకారులెవరూ దీన్ని విశ్వసించటం లేదు. ఎందుకంటే క్రీ.పూ.1900 నాటికే సింధునాగరకత పతనావస్థలో ఉందని చెప్పేందుకు ఆధారాలుదొరికాయి.
మరి సింధునాగరకతా ప్రజలెవరు?
26hyd-main3j.jpgఆర్యులు రాకముందే ఉనికిలో ఉన్న ఈ సింధునాగరకతా ప్రజలు ఎవరన్నది కీలకమైన ప్రశ్న. మనకీ నాగరకతకు చెందిన వారి డీఎన్‌ఏ నమూనాలేవీ అందుబాటులో లేవుగానీ.. దీనికి చాలా దగ్గరగా ఉండే ప్రజల నమూనాలను తీసుకుని పరిశీలిస్తే... ఆదివాసులైన దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలు.. ఆ తర్వాత వలస వచ్చిన ఇరాన్‌ వ్యావసాయిక జాతుల మిశ్రమంగా ఉనికిలోకి వచ్చినవాళ్లే ఈ నాగరకతకు చెందిన వాళ్లని చెప్పేందుకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇలా ఈ ప్రాంతంలో జాతుల మిశ్రమం అన్నది సింధు నాగరకతతోనే మొదలైంది.
ఆర్యుల రాక తర్వాత ఏమయింది?
ఆర్యుల రాక తర్వాత...ప్రధానంగా రెండు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
1. సింధు నాగరకతా ప్రజల్లో కొంతమంది ఉపఖండంలో మరింత దక్షిణానికి ప్రయాణించి.. అప్పటికే అక్కడున్న వారితో (దక్షిణాసియా వేట, ఆహారసేకర్తలతో) కలిసిపోయారు. వీళ్లనే ఇప్పుడు దక్షిణ భారతీయ పూర్వీక జాతి (యాన్‌సిస్ట్రల్‌ సౌతిండియన్స్‌-ASI) అంటారు.

2. మరోవైపు సింధు నాగరకతకు చెందిన మరికొందరు అక్కడే ఉండిపోయి.. కొత్తగా వచ్చిన ఆర్యులతో కలిసిపోయి.. మరో వైవిధ్య బృందంగా ఏర్పడ్డారు. దీన్నే ఉత్తర భారతీయ పూర్వీక జాతి (యాన్‌సిస్ట్రల్‌ నార్తిండియన్స్‌-ANI) అంటున్నారు.
ఇప్పుడు మన భారత ఉపఖండంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ ASI, ANI జాతుల మిశ్రమంగా ఆవిర్భరించిన వాళ్లే!

దీనర్థం ఏమిటి?
ఈ పరిశోధనల సారాంశం క్లుప్తంగా చెప్పుకోవాలంటే..
క్రీ.పూ.2000-1500 ఏళ్ల క్రితం వచ్చిన పశుపోషకులనే ఆర్యులనుకుంటే చరిత్రలో ఆర్యల వలస అన్నది కచ్చితంగా జరిగింది, వాళ్లు సింధు నాగరకతను, ఆ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశారు.


ఇన్నాళ్లుగా ఇండో-యూరోపియన్‌ భాషా సిద్ధాంతాలను బట్టి భారత ఉపఖండం నుంచే ప్రజలు ప్రపంచమంతా విస్తరించారని చెబుతున్న ‘ఔట్‌ ఆఫ్‌ ఇండియా’ సిద్ధాంతం నిజం కాకపోవచ్చని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ఎందుకంటే తొలినాటి ఇరాన్‌ వ్యావసాయిక ప్రజల జన్యువులు చూస్తే వాళ్లలో దక్షిణాసియా వేట, ఆహారసేకర్తల జన్యువులతో కలగలిసిన దాఖలాలేవీ కనబడటం లేదు. కాబట్టి జన్యువుల ప్రయాణ క్రమాన్ని పరిశీలిస్తే అవి దక్షిణాసియాలోకి వచ్చినట్టే కనబడుతున్నాయిగానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్లినట్టు దాఖలాలేవీ లేవని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నేడు మన దేశంలోనూ, ఆ మాటకొస్తే భారత ఉపఖండంలో ఉంటున్నవారంతా కూడా కచ్చితంగా వివిధ జాతుల మిశ్రమంగా ఆవిర్భవించిన జాతే. గతంలో జరిగిన జన్యు అధ్యయనాల్లో కేవలం స్త్రీల నుంచే తర్వాతి తరాలకు సంక్రమిస్తుండే మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ ఒక్కటే పోల్చి చూశారు. అది దాదాపుగా అందరిలోనూ ఒకేలా ఉండటంతో ఈ ఉపఖండంలో ఉంటున్న జనాభా అంతా కూడా వేలాది తరతరాలుగా ఇక్కడే ఉంటున్న మూలవాసులేనని భావిస్తుండేవారు. కానీ తాజా అధ్యయనాల్లో పురుషుల నుంచి సంక్రమించే వై-క్రోమోజోములను పరిశీలిస్తే ఇవి భిన్నంగా ఉంటున్నాయి. పైగా ఇరాన్‌, ఐరోపా, మధ్య ఆసియా ప్రాంత వాసులకు దగ్గరగా ఉంటున్నాయి. కాబట్టి మనది భిన్న జాతుల మిశ్రమం అని స్పష్టమవుతోంది.

మన ఏకత్వంలో ఉన్న భిన్నత్వానికి అలలు అలలుగా వెల్లువెత్తిన ఈ వలసల చరిత్రే పునాది అనీ తేటతెల్లమవుతోంది!!
జ్వాలాపురం.. కొత్త అధ్యాయం!
మన భరత ఖండంలో సంచరించిన తొలి మానవులెవరు?ఆసక్తికరమైన ప్రశ్నే. కాకపోతే దీనికి సమాధానం  కర్నూలు జిల్లాలోని జ్వాలాపురంలో దొరకటం విశేషం. ఇది చూసి ప్రపంచం మొత్తం విస్తుబోవటం ఇటీవలి పరిణామం. ఈ ఊరి కథేమిటో చూద్దాం.
26hyd-main3g.jpg
న్నేళ్లుగా అంతా భావిస్తున్నదీ, శాస్త్రవేత్తలంతా బలంగా నమ్ముతున్నదేమంటే మన పూర్వీకులు (హోమోసెపియన్స్‌) తూర్పు ఆఫ్రికాలోని రిఫ్ట్‌లోయ నుంచి లక్ష సంవత్సరాల నుంచి 60,000 సంవత్సరాల మధ్య బయల్దేరి.. రెండు దఫాలుగా ప్రపంచమంతా విస్తరించారని! దీన్నే ‘ఔట్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ సిద్ధాంతం అంటారు. మానవజాతి ఇక్కడి నుంచే బయల్దేరి ఖండాలన్నింటినీ చేరి.. తీర ప్రాంతాల్లో స్థిరపడిందన్నది కీలకాంశం. దీన్ని బట్టి తొలి మానవులు 50-60 వేల ఏళ్ల క్రితం మన భారత ఉపఖండం చేరి ఉంటారని ఇన్నేళ్లుగా అనుకుంటున్నారు. అయితే 2007 ప్రాంతంలో భారత, అంతర్జాతీయ పురాతత్వవేత్తలు (వీరిలో ఆక్స్‌ఫోర్డ్‌ ప్రొఫెసర్లూ ఉన్నారు) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జ్వాలాపురంలో జరిపిన తవ్వకాలు ఈ సిద్ధాంతాన్ని ఒక్కసారిగా తల్లకిందులు చేశాయి. ఎందుకంటే ఆఫ్రికా నుంచి వచ్చి ఉంటారని భావిస్తున్నదానికంటే చాలా పూర్వమే.. 75,000 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు ఉన్నారని ఆధారాలు లభ్యం కావటం విశేషం.

ఈ నిర్ధారణకు రావటానికి వెనక ఓ చిన్న కథ ఉంది.
సుమారుగా 75,000 సంవత్సరాల క్రితం మనకు 2500 కి.మీ. దూరంలో ఉన్న ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లోని తోబా పర్వతాల్లో అత్యంత భయానకమైన అగ్నిపర్వతం బద్దలైంది. ఇది దాదాపుగా 10 ఏళ్ల పాటు మండుతూనే ఉంది, తర్వాత చల్లబడటానికి మరో 10,000 ఏళ్లు పట్టింది. దాని ప్రభావం ఈ ఆసియా ప్రాంతంలోని మానవ అడుగుల మీద బలంగా ఉంది. ఆ అగ్నిపర్వతం మండుతున్న రోజుల్లో అక్కడి నుంచి బలమైన గాలులు వీచి.. దాన్నుంచి రేగిన బూడిద ఎంతోదూరం విస్తరించింది. అది మన భారత ఉపఖండాన్నీ ముంచెత్తింది. భూమి పొరల్లో ఆ కాలాన్ని తరచి చూస్తే మన దేశంలో కూడా 1-3 మీటర్ల మందంలో ఈ బూడిద పేరుకుని కనబడుతుంది. జ్వాలాపురంలో కూడా ఈ తోబా అగ్నిపర్వత బూడిద ఉంది. కాకపోతే విశేషమేమంటే పురాతత్వ తవ్వకాల్లో ఈ బూడిద పొరకు పైనా, కిందా కూడా నాటి మనుషులు ఉపయోగించిన పదునైన రాతి పనిముట్లు కనబడటం ఆశ్చర్యకరం. దీన్నిబట్టి అంతా భావిస్తున్నట్లుగా ఆఫ్రికా నుంచి ఆదిమానవుడి వలసల కంటే చాలా ముందే ఇక్కడ మానవ ఆవాసం ఉందని అర్థమవుతోంది. దీని గురించి విఖ్యాత ‘నేచర్‌’ పత్రికకు పత్రం రాసిన మైఖేల్‌ పెట్రాగ్లియా.. ‘ఈ పరికరాలు 1,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా మధ్యరాతియుగాల్లో మనిషి వాడిన పనిముట్లలా ఉన్నాయి’’ అని నిర్ధారణకు వచ్చారు. ఈ ఆధారాలు బయల్బడగానే చరిత్ర వర్గాల్లో పెద్ద సంచలనం రేగింది. ఆఫ్రికా నుంచి వలస అన్నది మనం అనుకుంటున్న దానికి వేల ఏళ్లకు పూర్వమే జరిగి ఉండొచ్చని అర్థమైపోయింది. అందుకే మన మూలపురుషుల ఉనికికి జ్వాలాపురం ఒక కీలక పురాతత్వ
ఆధారం!



సుమత్రా దీవుల్లోని తోబా పర్వతాల్లో బద్దలైన అత్యంత భయానకమైన అగ్నిపర్వతం... దాన్నుంచి రేగిన బూడిద.. మన భారత ఉపఖండాన్నీ ముంచెత్తింది. ఈ బూడిద జ్వాలాపురంలో కూడా కనబడింది. నేడు మనకి ఇదో పెద్ద ఆధారం
- ఈనాడు ప్రత్యేక విభాగం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...