Jump to content

NTR Biopic Print Mediq Articles


Yaswanth526

Recommended Posts

‘ఎన్టీఆర్‌’ చిత్రం... చరిత్రలో నిలిచిపోవాలి
- ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
29tollywood5b.jpg

‘‘తెలుగుదనానికి నిండుదనాన్ని, తెలుగువారికి ఓ గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన చరిత్రను సినిమాగా తీయడం తెలుగువారందరికీ గర్వకారణం. ఎన్టీఆర్‌ అభిమాని కాని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలి.. చరిత్రలో నిలిచిపోవాల’’ని ఆకాంక్షించారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు. ఎన్టీఆర్‌ జీవిత కథని ‘ఎన్టీఆర్‌’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా కనిపించబోతున్నారు. ఆయనే నిర్మాత. తేజ దర్శకుడు. ఎన్‌బికె స్టూడియోస్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వెంకయ్యనాయుడు క్లాప్‌ ఇచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఉపరాష్ట్రపతిగా నేను ఇలాంటి ప్రారంభోత్సవాలకు హాజరు కాకూడదు. కానీ ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో ఇక్కడికి వచ్చాను. తండ్రి పాత్రని తనయుడు పోషించడం చిత్ర  చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ అభినందనీయుడు. ఎన్టీఆర్‌పై గౌరవంతోనైనా మనమంతా తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు సంస్కృతిని పాటించాలి’’ అన్నారు. ‘‘ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. ఆయనపై ఓ సినిమా తీయడం బాలయ్య, తేజల అదృష్టం. ఈ చిత్రంలో ఒక్క సన్నివేశానికైనా దర్శకత్వం వహించే అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’నన్నారు కె.రాఘవేంద్రరావు. ‘‘మనల్ని మదరాసీలుగా పిలిచే కాలంలో.. ‘మేం తెలుగువాళ్లం’ అని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన కథని తెరపైకి తీసుకురావడం ఓ సాహసం. ఆ సాహసం చేయగల దమ్ము బాలయ్యకు మాత్రమే ఉంద’’ని అల్లు అరవింద్‌ తెలిపారు. తేజ మాట్లాడుతూ ‘‘నేను రామారావు గారికి వీరాభిమానిని. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ‘నేను సరితూగనేమో, న్యాయం చేయలేనేమో’ అనిపించింది. కానీ ‘మీరే చేయాలి’ అన్నారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడ్ని. ఇది కథ కాదు చరిత్ర. దీన్ని ఆరు సినిమాలుగా తీయొచ్చు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నామ’’న్నారు.     ‘‘అన్ని రంగాల్లోనూ విజేతగా నిలిచారు ఎన్టీఆర్‌. నాకు ఇష్టమైన ఏకైక కథానాయకుడు ఆయన. ఈ వేషంలో బాలయ్యని చూస్తుంటే ఎన్టీఆర్‌ని చూస్తున్నట్టే ఉంద’’న్నారు జమున. ‘‘ఎన్టీఆర్‌ అనే మూడక్షరాల వెనుక ఓ రాష్ట్రం నడిచింది, ఓ దేశం నడిచింది. ఈ చిత్రానికి మాటలు రాసే అవకాశం రావడం.. ఓ వరం. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతీ అక్షరం నా ఆయుష్షుని పెంచేలా రాస్తా’’ అన్నారు రచయిత బుర్రా సాయిమాధవ్‌. ‘‘మేజర్‌ చంద్రకాంత్‌’ సమయంలో ఎన్టీఆర్‌గారిని ఒకే ఒక్కసారి కలిసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంద’’న్నారు కీరవాణి.

29tollywood5a.jpg

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో ‘మహానుభావులు’ అనే పదం చాలా సర్వసాధారణంగా వాడేస్తున్నాం. కానీ నా దృష్టిలో ఓ శంకరాచార్యులు, ఓ రామానుజాచార్యులు, ఓ అంబేడ్కర్‌, ఓ గాంధీ.. ఓ ఎన్టీఆర్‌.. వీళ్లు మహానుభావులంటే. ఎన్టీఆర్‌ అనే మాట ఓ హృదయ స్పందన. తెలుగువారి గుండె చప్పుడు. ఆయన్ని కేవలం నా తండ్రిగానే చూడలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తలవొంచని ధైర్యం ఆయనది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. కళ కళ కోసమే కాదు, సమాజం కోసం అని నిరూపించిన వ్యక్తి. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోతున్నాం. ఎన్టీఆర్‌ చరిత్ర అలా కాకూడదు. శాశ్వతంగా నిలిచిపోవాలనే కాంక్షతోనే ఈ చిత్రాన్ని ప్రారంభించాం. మొత్తంగా తీస్తే ఆరుగంటల సినిమా అవుతుంది. కానీ దాన్ని కుదించి.. ఓ సినిమాగా మలుస్తున్నాం. మార్చి 29న ‘పాతాళ భైరవి’ ప్రింట్లు పెంచి మళ్లీ విడుదల చేశారు. ‘లవకుశ’ వచ్చిన రోజు కూడా ఇదే. నాన్నగారి మొదటి రంగుల చిత్రం ‘వంశోద్ధారకుడు’ విడుదలైన రోజు ఇది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే. అందుకే ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించామ’’న్నారు. ఈ కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్‌, పూరి జగన్నాథ్‌, కె.ఎస్‌.రవికుమార్‌, జెమిని కిరణ్‌, రాజశేఖర్‌, జీవిత, డి.సురేష్‌ బాబు, ఛార్మీ, దగ్గుబాటి పురంధేశ్వరి, కైకాల సత్యనారాయణ, విష్ణు ఇందూరి తదితరులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: ఎల్‌.శ్రీనాధ్‌, విష్ణువర్థన్‌, కళ: రామకృష్ణ - మౌనిక, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సంతోష్‌ తుండియిల్‌, సహ నిర్మాతలు: సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి.

 సోదరా దుశ్శాసనా...
న్టీఆర్‌ చిత్రాల్లో ఓ మేలిమి ముత్యం... ‘దానవీర శూరకర్ణ’. అందులో దుర్యోధనుడిగా నందమూరి తారక రామారావు హావభావాలు, పలికిన సంభాషణలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎన్టీఆర్‌ నట కౌశలానికి ప్రతి రూపంలాంటి పాత్రల్లో అదొకటి. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో అలనాటి దుర్యోధనుడిని గుర్తు చేయబోతున్నారు. ఇందులో బాలకృష్ణ దాదాపు 60 గెటప్పుల్లో కనిపించనున్నారు. వాటిలో దుర్యోధనుడి గెటప్‌ ఒకటి. ఈ గెటప్‌లో ఉన్న బాలకృష్ణపైనే క్లాప్‌ కొట్టారు వెంకయ్య నాయుడు. ‘దానవీర శూరకర్ణ’లో ఎన్టీఆర్‌ ఎలాంటి వేషధారణతో కనిపించారో, సరిగ్గా అవే ఆభరణాలతో దర్శనమిచ్చారు బాలయ్య. ‘సోదరా దుశ్శాసనా’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగుని గుక్క తిప్పుకోకుండా, అదే రీతిలో, ఏక బిగిన చెప్పి సెహభాష్‌ అనిపించుకున్నారు. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో తెరకెక్కించిన తొలి సన్నివేశం ఇదే.
ఎన్టీఆర్‌కి దండం పెట్టా!
కార్యక్రమంలో పాల్గొన్న అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎన్టీఆర్‌తో పెనవేసుకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు.‘‘మాయాబజార్‌ చిత్రానికి నేను సహాయకుడిగా పనిచేశా. ఓరోజు ఎన్టీఆర్‌ కృష్ణుడి గెటప్‌లో సెట్లో అడుగుపెట్టారు. సెట్లో ఉన్నవాళ్లంతా ఆయన్ని ఆ గెటప్పులో చూడ్డానికి ఎగబడ్డారు. వాళ్ల వెనుక నిలబడిన నేను.. ఎన్టీఆర్‌ని చూడ్డానికి గాల్లో ఎగురుతున్నాను. ఎన్టీఆర్‌ నా వంక చూసి ముందుకు రమ్మని ఎలా ఉన్నానని అడిగాడు. అప్పుడు నేను దండం పెట్టా. వెంటనే సెట్లో ఉన్నవాళ్లంతా నాలానే దండాలు పెట్టారు. అప్పటి నుంచీ ఆయన కనిపించగానే దండం పెట్టడం అలవాటైపోయింది. చరిత్ర ఉన్నంత కాలం ఆయనే శ్రీకృష్ణుడు. మరోసారి ‘శ్రీకృష్ణపాండవీయం’ స్క్రిప్టు వినిపించారు ఎన్టీఆర్‌. ‘ఎలా ఉంది?’ అని అడిగారు. ‘‘సినిమాను మొదట నేనే చూడాలన్నంత ఆశగా ఉంది’ అన్నాను. ఈ మాటలు గుర్తుపెట్టుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తరవాత రెండున్నరేళ్లకు ఆ సినిమా విడుదలైతే.. నన్ను పిలిపించి మరీ, నా కోసం ప్రత్యేకంగా ఓ ప్రివ్యూ వేయించారు. ఆయన ఏకాగ్రత, క్రమశిక్షణ బాలయ్యలోనూ కనిపించాయి. ఎన్టీఆర్‌ పాత్ర ఎవరైనా చేస్తారేమో, కానీ ఆత్మ కనిపించేలా చేయడం బాలయ్యకే సాధ్యం’’ అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...