Jump to content

దక్షిణాదిని ముంచేస్తారా?


sonykongara

Recommended Posts

 

దక్షిణాదిని ముంచేస్తారా?
10-02-2018 02:34:47

విడిపోయే పరిస్థితి తెస్తారా?..
క్రమశిక్షణే మా నేరమా?
ఉత్తరాదిని అభివృద్ధి చేయండి..
కానీ... మాకు అన్యాయం చేయొద్దు..
దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం
ఆర్థిక సంఘం ముందు నిరసన..
నిధుల కేటాయింపునకు 2011జనాభా లెక్కలకు ససేమిరా
అమరావతి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాలకు సహాయం చేస్తే చేయండి. మాకు అభ్యంతరం లేదు. కానీ... ఆ పేరిట మాకు అన్యాయం చేస్తే అంగీకరించేది లేదు’’ అని దక్షిణాది రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 15వ ఆర్థిక సంఘం సంప్రదింపుల సమావేశం జరిగింది. ఇందులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ‘‘ఉత్తరాదిలోని వెనుకబడిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి కదా! వాటికి నిధులు ఇవ్వకుంటే ఎలా? అభివృద్ధి చెందిన మీకు నిధులు ఎందుకు?’’ అనేలా ఆర్థిక సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై దక్షిణాది అధికారులు మండిపడ్డారు. ‘‘వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకోండి. వాటినీ అభివృద్ధి చేయండి. కానీ... దాని పేరిట దక్షిణాదిలోని ప్రగతిశీల రాష్ట్రాలను శిక్షిస్తారా? దక్షిణాది రాష్ట్రాలను ముంచేస్తారా? దేశం నుంచి విడిపోయే పరిస్థితి తెస్తారా?’’ అని ఒక రాష్ట్రానికి చెందిన అధికారి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
 
జనాభా కిరికిరి...
13వ ఆర్థిక సంఘం వరకు కేంద్రం నిధులను 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు కేటాయిస్తూ వచ్చారు. దీనిని మార్చి... 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటామని 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా, దక్షిణాది రాష్ట్రాలు ససేమిరా అన్నాయి. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలిపాయి. దీంతో అప్పుడు ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇచ్చేలా కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. తాజాగా... 15వ ఆర్థిక సంఘం సభ్యులు మరోమారు జనాభా లెక్కల ప్రతిపాదన తీసుకొచ్చారు.
 
దీనిపై దక్షిణాది రాష్ట్రాల అధికారులు మండిపడ్డారు. 1971 వరకు దేశంలో కుటుంబ నియంత్రణపై అవగాహన లేదు. ఆ తర్వాత ఇద్దరు ముద్దు, ముగ్గురు హద్దు, మేమిద్దరం మాకిద్దరు అంటూ కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు. దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావడంతో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గింది. ఉత్తరాదిలో మాత్రం జనాబా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. దీంతో... 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే కేంద్ర నిధులను కేటాయిస్తూ వచ్చారు.
 
ఇప్పుడు... 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మునిగిపోవడం ఖాయమని శుక్రవారం నాటి సమావేశంలో తేల్చి చెప్పారు. ‘‘మేం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. కేంద్రం విధించిన నిబంధనల మేరకు, ఆ ప్రాతిపదికల ఆధారంగా పని చేస్తున్నాం. జనాభాను నియంత్రిస్తున్నాం. అక్షరాస్యతను పెంపొందిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటే మమ్మల్ని శిక్షించడమేమిటి? క్రమశిక్షణ లేని రాష్ట్రాలను ప్రోత్సహించడమేమిటి?’’ అని నిలదీసినట్లు తెలిసింది. 2011 జనాభా లెక్కల నిధులు కేటాయించాలనే ప్రతిపాదన వల్ల తమకు వేలకోట్లలో నష్టం జరుగుతుందని ఆ లెక్కలు కూడా చెప్పారు. ‘ఈ పద్ధతి పనికిరాదు’ అని కుండబద్దలు కొట్టారు.
 
ఏపీకి 14వేల కోట్లు ‘లోటు’
14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం గురించి రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. ‘‘పన్నుల్లో వాటా కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.58 వేల కోట్లు వస్తాయన్నారు. కానీ... 44వేల కోట్లే వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.68 వేలకోట్లు వస్తాయంటున్నారు. ఈ తప్పుడు లెక్కల వల్ల మాకు రెవెన్యూలోటు భర్తీలో అన్యాయం జరిగింది. 14వ ఆర్థిక సంఘం లెక్కలు పక్కాగా ఉండి ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకోట్లు రెవెన్యూ లోటు కింద వచ్చేది’’ అని తెలిపారు.
 
దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా తలసరి ఆదాయం తక్కువగా ఉన్నది ఏపీకేనని చెప్పారు. రాష్ట్ర వృద్ధి 14 శాతం కాగా... వ్యవసాయ రంగం వృద్ధి 25 శాతమని చెప్పారు. కాబట్టి, వృద్ధిరేటు రెండంకెల్లో ఉన్నా ఖజానాకు తక్షణమే వచ్చే నిధులేవీ లేవని వివరించారు. 14వ ఆర్థిక సంఘం పొరపాటు అంచనాల వల్ల తమకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని తమకు సమంజసమైన కేటాయింపులు జరపాలని రవిచంద్ర కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...