Jump to content

Modi speech


Pruthvi@NBK

Recommended Posts

కాంగ్రెస్‌ తీరువల్లే విభజన సమస్యలు: మోదీ

పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారు

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించారు

లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం

01053207BRK93A.JPG

దిల్లీ: వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలుగేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.

‘ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మేం మద్దతు పలికాం. వాజ్‌పేయి ప్రభుత్వం దీర్ఘదృష్టి కారణంగా మూడు రాష్ట్రాలు విభజించినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఎవరి వాటాలు ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో అలా జరగలేదు. రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు. నామమాత్రం ప్రతిపక్షం, ప్రసార మాధ్యమాలపై నియంత్రణతో కాంగ్రెస్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.తమ నిర్వాకాలు బయటకు రాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిగా వ్యవహరించింది. అప్పుడు వారు చేసిన తప్పుల వల్లనే ఈనాడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదు. కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు. తమిళనాడు, పంజాబ్‌, కేరళ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసింది. హైదరాబాద్‌లో ఏపీ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అవమానించారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చేసిన రాజకీయ అరాచకాలు అనేకం. అలాంటివారా ఆ రాష్ట్రం గురించి మాట్లాడేది.  కర్ణాటక ఎన్నికలు లేకుంటే ఆంధ్రప్రదేశ్‌ విభజన గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడేవారా?’ అని మోదీ అన్నారు.

ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన మోదీ

ఈ ప్రసంగం మధ్యలో మోదీ.. ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు.

నేను చెప్పేది వినేందుకు ధైర్యం ఉండాలి

తాను చెప్పేది వినేందుకు ధైర్యం లేకనే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రసంగాన్ని అడ్డుకుంటోందని మోదీ అన్నారు. పార్టీలు శాశ్వతం కాదు.. దేశమే శాశ్వతమన్న  విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయంలో రోజుకు 11 కిలోమీటర్లు మేర రోడ్డు వేస్తే.. తమ హయాంలో రోజుకు 22కి.మీల మేర రహదారులు వేసినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష నియోజకవర్గమా? మన నియోజకవర్గమా? అన్న భేదాన్ని తాము చూపించడం లేదని స్పష్టం చేశారు. ఖర్గే ఎంపీగా ఉన్న బీదర్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం 1020 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ వేసిందని... ఖర్గే రైల్వేమంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్ర్లాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. యూపీఏ కంటే తమ ప్రభుత్వం వచ్చాకే అత్యధిక గ్రామాల్లో ఫైబర్‌నెట్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోదీ వస్తే ఆధార్‌కు మంగళం పాడతారని ప్రతిపక్షం ప్రచారం చేసింది. ఆధార్ వ్యవస్థను బలోపేతం చేసేసరికి ఇప్పడు ఆధార్‌ను వద్దంటోందన్నారు. సమతుల అభివృద్దిని ప్రతిపక్షం ఇన్నాళ్లూ సాధించలేకపోయిందని.. తాము చేసి చూపించామన్నారు. ప్రతిపక్షం కళ్లు మూసుకుని ఉన్నందునే ఉపాధి కల్పన పెరిగినా చూడలేకపోతోందన్నారు. అవినీతి, దళారి వ్యవస్థకు మేం కళ్లెం వేశామని ప్రతిపక్షం బాధపడుతోందని ఎద్దేవా చేశారు. మా హయంలో అతి పొడవైన సొరంగం, అత్యంత వేగవంతమైన రైళ్లు, గ్యాస్‌ పైప్‌లైన్లు వచ్చాయి... కేరళ, బంగాల్‌, ఒడిశా, కర్ణాటకలో కోటి మందికి ఉపాధి కల్పించాం... కర్ణాటకలో ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పించిందో కాంగ్రెస్‌ చెప్పాలని మోదీ డిమాండ్‌ చేశారు.

నిరసనల మధ్యే ప్రసంగం

మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రసంగం మొదట్లో తెదేపా, వైకాపా ఎంపీలు కూడా నినాదాలు చేశారు. అయితే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మూడుసార్లు హెచ్చరించడంతో తెదేపా ఎంపీలు ఆందోళన విరమించి వారి స్థానాల్లో కూర్చున్నారు. వైకాపా సభ్యులు మాత్రం సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...