Jump to content

Recommended Posts

జనాకర్షకం కాదు 
రాబోయే బడ్జెట్‌పై ప్రధాని మోదీ సంకేతాలు 
ప్రజలు ఉచితాలు కోరుకోవడం లేదు 
నిజాయతీతో కూడిన పాలన కావాలనుకుంటున్నారు 
మూడేళ్లలో ఉజ్వల భారత్‌గా తీర్చిదిద్దామని వెల్లడి 
21hyd-main5a.jpg

దిల్లీ: రాబోయే బడ్జెట్‌ ప్రజాకర్షకంగా ఉండదని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. తన ప్రభుత్వం సంస్కరణల అజెండా కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఐదు దుర్బల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న దేశం ఈ సంస్కరణలతో ఉజ్జ్వల భారత్‌గా అవతరించిందని చెప్పారు. టైమ్స్‌ నౌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రధాని తన ఆర్థిక విధానాలను గట్టిగా సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద విజయగాథ అని చెప్పారు. వస్తు, సేవల పన్ను విధానంలో లోపాలు ఏమైనా ఉంటే మార్పులకు సిద్ధమేనని తెలిపారు. 
2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌లో మీ ప్రభుత్వం ప్రజాకర్షకంగా మారుతుందా అని ప్రశ్నించగా మోదీ స్పందిస్తూ  ‘‘సామాన్యులు ఉచిత పథకాలు, ఉచిత వరాలు కోరుకోరు. వారు వాటిని ఆశిస్తారన్నది ఒట్టి మాటే. నన్ను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చూసిన వారికి, ప్రధానమంత్రిగా చూసిన వారికి ఈ విషయం తెలుస్తుంది. సామాన్యులు నిజాయతీతో కూడిన పాలనను కోరుకుంటారు’’ అని స్పష్టం చేశారు. బలమైన భారత్‌-అభివృద్ధి కావాలా లేదా రాజకీయ సంస్కృతి-కాంగ్రెస్‌ సంస్కృతిని అనుసరించాలా అన్నది నిర్ణయించుకోవాలన్నారు. ఉద్యోగాలు లేని వృద్ధిని సాధిస్తున్నారన్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే గత మూడేళ్లలో రహదారి నిర్మాణం రెండింతలయ్యేదా అని ప్రశ్నించారు. రైల్వే ట్రాక్‌ నిర్మాణం సాధ్యమయ్యేదా అని అడిగారు. ఉద్యోగ కల్పన లేకుండా విద్యుద్దీకరణ, ఓడరేవుల నిర్మాణం జరిగేదే కాదని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో సమస్యలున్నాయన్న సంగతిని అంగీకరించారు. రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఉందని చెప్పారు. సౌర విద్యుత్తుతో నడిచే పంపులను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్‌ను పెంచడం, గ్రామీణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ఆలోచనలు తనకు ఉన్నాయన్నారు. 
చివరి ఏడాదిన్నర కాలంలో తన ముందున్న లక్ష్యంపై స్పందిస్తూ ఇంకా విద్యుత్తు సౌకర్యం లేని నాలుగు కోట్ల కుటుంబాలకు ఆ లోటు తీర్చడం, సామాన్యుల లబ్ధికి ప్రారంభించిన కార్యక్రమాలు, పథకాలను పూర్తి చేయడం తన ప్రాధాన్యాంశమన్నారు. ఆర్థికంగా తన ప్రభుత్వ విజయాలపై స్పందిస్తూ ‘‘ఐదు దుర్బల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న పరిస్థితి నుంచి మూడేళ్ల కాలంలో దేశం బయటపడింది. అంతే కాదు.. ఇప్పుడు ఉజ్వల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను చూస్తున్నారు.’’ అని ప్రధాని చెప్పారు. ఆర్థికాంశాలకు సంబంధించిఅన్ని పరామితుల్లోనూ భారత్‌ పురోగతి సాధించిందన్నారు. దావోస్‌ సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తున్న తొలి భారత ప్రధాని తాను కావడంపై స్పందిస్తూ భారత్‌ అభివృద్ధి చెందింది కాబట్టే ఇది సాధ్యమయిందన్నారు. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అన్న తన నినాదంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆ పార్టీని నిర్మూలించడం ఆ నినాదం అర్థం కాదని, కాంగ్రెస్‌ సంస్కృతిని నిర్మూలించడం అని అన్నారు. కులతత్వం, వారసత్వం, అవినీతి, అధికారంపై పూర్తి నియంత్రణ ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే విజయం సాధించొచ్చన్న సంస్కృతి  దేశంలోని అన్ని పార్టీలకూ పాకిందని, దానికి మూలస్తంభం కాంగ్రెస్సేనని చెప్పారు. ఈ సంస్కృతి నుంచి రాబోయే తరాలను రక్షించాలన్నారు. ముమ్మారు తలాక్‌ బిల్లుకు రాజ్యసభలో ఆ పార్టీ అభ్యంతరం తెలపడాన్ని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అయినా మరో పార్టీ అయినా ఓటు బ్యాంకు రాజకీయాలను వదిలి మహిళా సాధికారికత, మహిళల గౌరవం కోణంలో ఆలోచించాలని హితవు పలికారు.

పాక్‌ ప్రజలతో నేరుగా మాట్లాడుతా 
సమస్యలపై భారత్‌, పాక్‌లు కలిసి పోరాటాలు చేయాల్సి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘పాక్‌ ప్రజలతో నేను నేరుగా మాట్లాడుతా. వారిని సూటిగా అడుగుతా...మనం పేదరికానికి వ్యతిరేకంగా పోరాడవద్దా? నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాటం చేయొద్దా? వ్యాధుల నివారణకు పోరు సలపవద్దా? వీటిపై కలిసి యుద్ధం చేద్దాం. త్వరగా విజయాలు పొందుదాం’ అని అభిప్రాయపడ్డారు.

ప్రతివారికీ ప్రధానితో మాట్లాడే హక్కు 
కశ్మీర్‌ సమస్యపై చర్చలకు ప్రత్యేక ప్రతినిధిని నియమించడంపై సమాధానం ఇస్తూ ప్రతి భారత పౌరునితో ఇలాంటి సంభాషణలు ఉంటాయి, ఇవి కొనసాగుతాయని అన్నారు. ‘‘ఇదేమీ కొత్త కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నవే. ‘మోదీ గారూ, దయచేసి నిలబడి మాతో మాట్లాడండి’ అని అడిగే హక్కు ప్రతి పౌరునికీ ఉంది. రాజ్యాంగాన్ని నమ్మేవారు, దేశం కోసం బతుకుతూ ప్రాణాలు ఇచ్చేవారి కోసమే మేమున్నాం’’ అని అన్నారు. మరి వేర్పాటువాదులు రాజ్యాంగాన్ని నమ్మరు కదా అని ప్రశ్నించినప్పుడు ‘అలాంటప్పుడు వారితో మేమెందుకు చర్చలు జరపాల’ని ప్రశ్నించారు.

పాక్‌ను ఏకాకిని చేయడం మా పని కాదు 
పాకిస్థాన్‌ను ఏకాకి చేయడానికి భారత్‌ తీవ్రంగా కృషి చేస్తోందన్న వాదనను మోదీ కొట్టివేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ‘పాక్‌ను ఒంటరి చేయడానికి ప్రపంచమంతా తిరిగి ప్రయత్నిస్తున్నామన్నది తప్పు. ఇది మా పని కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకమవుతోంద’ని అన్నారు. భారత్‌ విదేశాంగ విధానం పాకిస్థాన్‌పై ఆధారపడి లేదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దృఢచిత్తంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఆయన మాటలను స్వాగతిస్తున్నా. ఆయనను గౌరవిస్తున్నా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకున్నా వారిని ప్రశంసిస్తా. ఎందుకంటే నా దేశం గత నలభై ఏళ్లుగా ఉగ్రవాదంతో బాధపడుతోంది. ప్రపంచంలో ఉగ్రవాదానికి ముగింపు పలకాల్సి ఉంద’ని చెప్పారు.

న్యాయ సంక్షోభం నుంచి పార్టీలు దూరంగా ఉండాలి 
ప్రస్తుతం న్యాయవ్యవస్థలో తలెత్తిన సంక్షోభం నుంచి పార్టీలు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. ‘మన న్యాయవ్యవస్థకు ఘనమైన చరిత్ర ఉంది. వారు చాలా సమర్థులు. వారు కలిసి కూర్చొని సమస్యకు పరిష్కారం కనుక్కొగలరు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. దీనిపై జరిగే చర్చ నుంచి నేను దూరంగా ఉంటాను. ప్రభుత్వం కూడా తప్పకుండా దూరంగా ఉండాలి. రాజకీయ పార్టీలు కూడా దీన్నే పాటించాల’ని అన్నారు. భాజపా అగ్రనాయకులను ఈ వివాదంలోకి లాగేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న యత్నాలపై సమాధానం చెబుతూ తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి తనను రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయని అన్నారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...