Jump to content

సగటు ఆదాయంలో ముందున్న ఏపీకి  ప్రత్యేక హోదా ఎలా సాధ్యం? 


KING007

Recommended Posts

సగటు ఆదాయంలో ముందున్న ఏపీకి 
ప్రత్యేక హోదా ఎలా సాధ్యం? 
ప్రభుత్వం నుంచి అభ్యర్ధన వస్తే చూద్దాం 
హైదరాబాద్‌కు 40% ఆదాయం ఏపీ వారి నుంచే.. 
వారిక్కడికి వస్తే ఏ సమస్యా రాదు 
నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు 
కొత్త ఆవిష్కరణల్లో ఏపీ ఆదర్శం 
రియల్‌టైం గవర్నెన్స్‌ సందర్శన, ప్రశంస 
కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్‌ 
ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థ వద్దన్న చంద్రబాబు 
ఈనాడు - అమరావతి 
18ap-main4a.jpg

లసరి ఆదాయంలో జాతీయ సగటు కన్నా ముందున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం ఎలా సాధ్యమని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తనకు సంబంధించిన అంశం కానప్పటికీ రాష్ట్రం నుంచి అభ్యర్థన వస్తే చూద్దామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ‘రియల్‌ టైం గవర్నెన్స్‌ను (ఆర్టీజీ) గురువారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల సందర్శనలో భాగంగా అందరు ముఖ్యమంత్రులను కలుస్తున్నామని, ఈ క్రమంలో బుధ, గురువారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అనేక విషయాలపై చర్చించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యాలు అద్భుతమని కొనియాడారు. తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తాగా రెండు ఆర్థిక జోన్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని, ఆదాయపరంగా ఇందులో కొన్ని సమస్యలున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తుందని వివరించారు. నీతి ఆయోగ్‌ సంబంధిత అంశాలపై త్వరితగతిన పరిష్కారం కోసం రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక సలహాదారు పని చేస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గొప్ప ఆశయమని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌తో ఎంతో అనుబంధం... 
రాష్ట్రంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తన విద్యార్థి జీవితం ఇక్కడే ప్రారంభమైనట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1975లో తన మొదటి పరిశోధనా పత్రాన్ని అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు సచివాలయంలోని ఆర్టీజీని పరిశీలించిన ఆయన అద్భుతం, అమోఘమంటూ కితాబిచ్చారు. మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సిఫార్సు చేస్తామని తెలిపారు. ఆర్టీజీ నుంచి ప్రజలకు సకాలంలో సేవలు ఏవిధంగా అందిస్తున్నది ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వాహణాధికారి అహ్మద్‌ బాబు వివరించారు. దేశ రాజధానిలో త్వరలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిర్వహించే సమావేశంలో ఆర్టీజీ గురించి ప్రదర్శన ఇచ్చేందుకు రావాలని అధికారులకు రాజీవ్‌ కుమార్‌ సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

18ap-main4b.jpg

నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉన్నాం 
ప్రణాళిక సంఘంతో తమ సంస్థకు ఎలాంటి పోలికా లేదని రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టీమ్‌ ఇండియాగా పని చేయాలన్నదే తమ యోచనని చెప్పారు. 2047కు సర్వ శ్రేష్ఠ భారత్‌, జగద్గురు భారత్‌గా మారాలన్నదే కేంద్రం లక్ష్యమని చెప్పారు. 2022 నాటికి ఆరోగ్య, పరిశుభ్ర, సంపన్న, నైపుణ్య, సురక్షిత భారతాన్ని ఆవిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కేంద్రం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రైవేటు రంగంతో ప్రభుత్వాలు పోటీపడితేనే ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం మనం నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఉన్నామని, ఈ-నాలెడ్జ్‌ ఎకానమీని ఏపీ అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు నీతి ఆయోగ్‌కు సంబంధించి పలు అంశాలపై సందేహాలను వెలిబుచ్చి కొన్ని సూచనలు చేశారు. రాజీవ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోలేదని, అలాంటి చర్యలు చేపడితే ఎన్జీవోల నుంచి వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ఎంప్లాయిమెంట్‌ జోన్‌ విషయంలో వచ్చిన సూచనను కేంద్రానికి తెలియజేస్తానని, సాధికార కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విభజనలో హైదరాబాద్‌ను కోల్పోవడంవల్ల ఏపీకి నష్టం జరిగిందని, హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో 40శాతం ఆంధ్రావారిదేననీ, వాళ్లు ఇక్కడికి వస్తే ఏ సమస్యా రాదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. 12 నుంచి 15శాతం వృద్ధి రేటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేయూత అవసరం లేదని సరదాగా పేర్కొన్నారు. అంతకు ముందు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ఐదంచెల స్థానిక పాలన వ్యవస్థలో మార్పులు అవశ్యమని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

కేంద్రం లక్ష్యాలివే...
* రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం. 
* 2022 నాటికి పోషకాహార లోప విముక్తి భారతదేశ సాధన.

* 2022 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమైన 20 విద్యా సంస్థలు  భారత్‌లో ఏర్పాటు. 
* వంద రైల్వేస్టేషన్ల అభివృద్ధి. 2022 నాటికి బుల్లెట్‌ రైళ్లు. అత్యంత వేగవంతమైన రైల్వే చతుర్భుజి ఏర్పాటు.

* పీఎంజేఎస్‌వైలో 2019 నాటికి అన్ని గ్రామాలు వాటి శివారు పల్లెలతో అనుసంధానం. సాగరమాల, అంతర్గత జలరవాణా మార్గాలు, నదుల అనుసంధానం, ప్రాంతీయ అనుసంధానత కోసం ఉడాన్‌ పథకం.

* 2.50 లక్షల గ్రామపంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం. 
* 2022 నాటికి అందరికీ ఇళ్లు.

* 2019 అక్టోబరు 2 నాటికి బహిరంగ విసర్జన రహిత దేశంగా మార్చే చర్యలు. 
* 2022 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా ఇంధన సామర్థ్యం 175 గిగావాట్లకు పెంపు. 1.60 కోట్ల వరకూ ఎలక్ట్రిక్‌ వాహనాల ఏర్పాటు.

* అవినీతి రహిత భారతదేశం కోసం నోట్ల రద్దు, జీఎస్టీ, ప్రత్యక్ష నగదు బదిలీ, ఈ గవర్నెన్స్‌, బినామీ చట్టం. 
* పోలీసు బలగాల అధునికీకరణలో భాగంగా ఐదొంతుల్లో రెండొంతుల నిధులను వామపక్ష తీవ్రవాదం, జమ్మూ కశ్మీర్‌, ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాద నిర్మూలనకు కేటాయింపు.

* 100 వెనుకబడిన జిల్లాల్లో పేదరికాన్ని తగ్గించడం, అక్షరాస్యతను పెంచడం. 
* నయీ మంజిల్‌, నయీ రోషిణి, స్టాండ్‌ అప్‌ ఇండియా, బేగం హజరత్‌ మహల్‌ ఉపకార వేతనాలు, శిఖో ఔర్‌ కమావో తదితర కార్యక్రమాల అమలు.

* 2047 నాటికి సర్వశ్రేష్ఠ భారత్‌...జగత్‌గురు భారత్‌. 
* ఇప్పటి నుంచి 2047 వరకూ ఏటా క్రమం తప్పకుండా 8 శాతం వృద్ధిరేటు సాధన.

పోలవరం పనులు సంతృప్తికరం 
కేంద్రం నుంచి పూర్తి సహకారం 
నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ 
18ap-main4c.jpg
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న దాని కంటే వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం నుంచి తగినంత సహకారం అందించేందుకు కృషి చేస్తానని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నమూనాను చూశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పనులు ఊహించిన దాని కంటే వేగంగా జరుగుతున్నాయని, త్వరలో మరోసారి ప్రాజెక్టు సందర్శనకు వస్తానని చెప్పారు. అసలు పోలవరం నిర్మాణానికి ఇన్ని దశాబ్దాలు ఎందుకు పట్టిందని జల వనరులశాఖ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఎల్‌అండ్‌టీ, బావోర్‌ కంపెనీ ప్రతినిధి హసన్‌ గోదావరి గర్భంలో నిర్మిస్తున్న డయాఫ్రమ్‌వాల్‌, అందుకు వినియోగిస్తున్న యంత్రాల గురించి వివరించారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...