Jump to content

Zoho Development Centre in Tirupati


sonykongara

Recommended Posts

అనంతలో ‘బెంగళూరు++’
13-01-2018 02:42:28
  • రాష్ట్రానికి రానున్న యాష్‌ టెక్నాలజీస్‌
  • నేడు తిరుపతిలో 8 ఐటీ కంపెనీలు ప్రారంభం
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో భారీ ఐటీ పార్కును అభివృద్ధి చేయనుంది. సైబరాబాద్‌ ఐటీ పార్కు తరహాలోనే ఈ భారీ ప్రాజెక్టు ఉండనుంది. సమీపంలోని బెంగళూరులో ఉన్న పలు కంపెనీలను ఆకర్షించేందుకు ఇది ఉపకరిస్తుందని ఐటీశాఖ అంచనా వేస్తోంది. ‘బెంగళూరు++’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే తలమానికగా ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు క్లౌడ్‌ సర్వీసెస్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ సైన్స్‌, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ సేవలను అందించే యాష్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రానికి రానుంది. హైదరాబాద్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో శుక్రవారం ఐటీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని, కియా, అపోలో, హెచ్‌సీఎల్‌ లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు.
 
దీంతో ఏపీలో పెద్దఎత్తున కార్యకలాపాలు ప్రారంభించేందుకు యాష్‌ టెక్నాలజీస్‌ అంగీకరించింది. ఏడాదిలో వెయ్యిమందికి, రానున్న మూడేళ్లలో 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, మంత్రి లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు శనివారం తిరుపతిలో ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. వీటిలో జోహో సాఫ్ట్‌వేర్‌ సంస్థను తొలుత ప్రారంభిస్తారు. అనంతరం తిరుపతి టెక్‌ హబ్‌లో ఏజీఎస్‌ హెల్త్‌ కంపెనీ, అలాగే పారికర్‌ సాఫ్ట్‌వేర్‌, ఎక్సాఫ్లూఎన్స్‌, నేస్‌, ఏఎన్‌ఎస్‌, వైఐఐటీ, ఇన్జెనిసిస్‌ కంపెనీలను సీఎం ప్రారంభించనున్నారు.
 
దావోస్‌ పర్యటనకు రండి
దావోస్‌ పర్యటనకు రావాలంటూ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను ఆహ్వానించారు. ఈనెల 23నుంచి 26వరకు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ‘టెక్నాలజీస్‌ ఫర్‌ టుమారో’ అంశంపై ఒక సెమినార్‌ను రాష్ట్ర ఐటీశాఖ నిర్వహించనుంది.
Link to comment
Share on other sites

ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై చంద్రబాబు ‘కోహినూరు’ చమత్కారం
14-01-2018 10:17:29
 
636515218468711248.jpg
తిరుపతి నగరం, జనవరి 13: జోహో కార్పొరేషన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తిరుపతిని అతి పెద్ద ఐటీ సెంటరుగా రూపొందించాలని ఆ కంపెనీ ప్రతినిధులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తిరుపతిలో ఐటీ రంగానికి ‘జోహో’ పునాది కావాలని ఆకాంక్షించారు. దీనికి ఎంత స్థలం.. ఎక్కడ కావాలో కోరుకుంటే ఆరు నెలల్లో అనుమతులు ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయాల్సిందిగా ఐటీ సెక్రటరీ విజయానందకు ఇక్కడికక్కడే ఆదేశాలిస్తున్నట్టు చెప్పారు. డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు వంటి సరళీకృత విధానం అమల్లో ఉన్నందున ఆన్‌లైన్‌లో తక్షణమే అనుమతులు పొందవచ్చన్నారు. మౌలిక సదుపాయలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తామన్నారు.
 
విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కడప ప్రాంతాలకు రోడ్‌ కనెక్టీవిటీ ఉందన్నారు. బెంగళూరు పెద్ద సిటీ కావడం, ట్రాఫిక్‌ వంటి సమస్యలు ఉన్నాయని.. చెన్నై తరహాలో తిరుపతికి వరదల వల్ల ముప్పులేదని వివరించారు. ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చన్నారు. అన్నింటికీ మించి తిరుమల బాలాజీ స్వామి ఇక్కడే ఉన్నారంటూ సెంటిమెంట్‌ను జోడించే ప్రయత్నం చేశారు. ఇక్కడి యువతపై, నాలెడ్జిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఆంగ్ల భాషతో పాటు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ఉందని వివరించే క్రమంలో.. కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లినా ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను బ్రిటిషర్లు ఇక్కడే వదిలేశారని చంద్రబాబు చమత్కరించారు. ప్రపంచానికి జీరోను పరిచయం చేసిన ఘనత ఇండియాదేనన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీలు ఉన్నాయని వివరించారు. జోహో ఐటీ సెంటర్‌ విస్తరణకు తిరుపతి ఒక్కటే బెస్ట్‌ అండ్‌ సేఫ్‌ ప్లేస్‌ అని స్పష్టం చేశారు. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతేడాది మే నెల్లో జోహో ప్రతినిధులను ఏపీకి ఆహ్వానిస్తే సంక్రాంతికంతా తిరుపతిలో సెంటర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
 
బలమైన పునాదులు వేశాం
25 ఏళ్ల కిందటే ఐటీ రంగానికి బలమైన పునాదులు వేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు గుర్గావ్‌, పుణేలకు పరిమితంగా ఉండేదని, ఇప్పుడు ఐటీకి ఏపీలో ప్రొఫెషనల్స్‌ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. జోహో కార్పొరేషన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నూతన కేంద్రాన్ని రేణిగుంటలో శనివారం ప్రారంభించాక ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి పది మంది ఐటీ ప్రొఫెషనల్స్‌లో నలుగురు ఇండియన్లు.. వారిలో ఒకరు తెలుగువారై ఉన్నారన్నారు. అగ్రికల్చరల్‌, మెడిసిన్‌, లా చదివే వారూ ఐటీని ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం విజన్‌ వల్లే 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, మరో రెండు లక్షల మందికి ఎలకా్ట్రనిక్‌ పరిశ్రమల రంగంలో ఉద్యోగాలను కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. 1995లో హైదరాబాద్‌లో సైబర్‌ టవర్‌ను నిర్మించడం వల్లే ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ప్రస్తుతం అమరావతి, విశాఖ, తిరుపతి, అనంతపురంలో 2020 నాటికి నాలుగు సైబర్‌ టవర్లను కట్టనున్నట్టు చెప్పారు. మన రాష్ట్రంలో బిల్డింగ్‌ స్పేస్‌ పెట్టడం వల్ల జోహో, హెచ్‌సీఎల్‌, ఫ్రాంక్లిన్‌ లాంటి పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. జిల్లాలో కొత్త పరిశ్రమలు రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం సంతోషంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌.అమరనాథరెడ్డి అన్నారు. 2017 మేలో సీఎం చంద్రబాబు అమెరికాలో కలిసినప్పుడు..తమకు ఏపీ రావాలన్న ఆలోచనలే లేదని జోహో సీఈవో శ్రీధర్‌ తెలిపారు. కానీ, ముఖ్యమంత్రితో ఇరవై నిమిషాలు మాట్లాడాక తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు. చిన్న పట్టణాల్లో చదువుకునే విద్యార్థులు వేరే చోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉద్యోగాలను కల్పించాలన్న ఉద్దేశంతోనే రేణిగుంటలో తమ కంపెనీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌, ఐటీ కార్యదర్శి విజయానంద్‌, కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఐటీ అడ్వయిజర్‌ జేఏ చౌదరి, జోహో కంపెనీ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.
 
జోహో ప్రస్థానం
సాఫ్ట్‌వేర్‌ రంగంలో 21 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులుంటే.. 3.5 కోట్ల మంది వినియోగదారులున్నారు. సుమారు ఐదు వేల కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌ అందిస్తూ మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఫర్‌ వరల్డ్‌ నినాదంతో స్థాపించింది. 150 మంది ఉద్యోగులతో రేణిగుంటలో నూతన కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తమ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ సీఈవో శ్రీధర్‌ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...