Jump to content

అన్నకు అనారోగ్యం.. తమ్ముడికి మంత్రి పదవి!


koushik_k

Recommended Posts

నెల్లూరు: ఆనం బ్రదర్స్.. 80 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతలు. ముఖ్యమంత్రి పదవి తప్ప క్యాబినెట్‌లోని అన్ని శాఖలనూ నిర్వర్తించిన ఆ కుటుంబం ఇప్పుడు పదవిలేక కళ తప్పింది. సింహపురిలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవడంతో ఆనం బ్రదర్స్ అధికార టీడీపీలోకి వచ్చారు. అధికార పార్టీలో ఉంటే తమ జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చని వాళ్లు భావించారు. టీడీపీలోకి వస్తే ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ, రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో అధిష్టానం హామీ ఇచ్చిందని ఆనం అనుచరులు చెబుతుండడం వాళ్ల అభివృద్ధి పథకానికి బలం చేకూరుస్తోంది.
 
 
తెలుగుదేశం పార్టీలో చేరిన తొలినాళ్లలో ఆనం వివేకానందరెడ్డి ప్రతిపక్ష పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన ఆనం మూడు నెలలుగా మౌనంగా ఉన్నారు. దీనికి కారణం ఆయన అనారోగ్యానికి గురికావడమేనని తెలుస్తోంది. వివేకానందరెడ్డి ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేకపోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకాకు ఎలాగో పదవి ఇవ్వలేరు కాబట్టి రామ నారాయణరెడ్డికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అనుచరులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ నారాయణరెడ్డికి మంత్రి పదవి అప్పగించి, సీనియర్ మంత్రి అయిన ఓ నేతను రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
 
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ప్రతిపక్షానికి సరైన కౌంటర్ ఇచ్చే అధికార పక్ష నేతలు ఎవరూ లేరు. పైగా బీజేపీలో కూడా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సన్నపరెడ్డి సురేష్ టీడీపీ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారన్న భావం ఆ పార్టీ క్యాడర్‌లో బలంగా వినిపిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డికి, సన్నపరెడ్డికి మధ్య కూడా సఖ్యత లేదని, బీజేపీ-టీడీపీ కలిసికట్టుగా వ్యవహరించడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని, అధిష్టానం సూచన మేరకో లేక ఇతర కారణలవల్లో బీజేపీ నేతల వ్యాఖ్యలను కూడా పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇక మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరినీ పల్లెత్తిమాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోతున్నారని, ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టే నేతలు కరువయ్యారని, ఈ నేపథ్యంలో తమ నాయకుడికి పదవి ఇస్తే ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కుంటారని ఆనం వర్గం అభిప్రాయపడుతోంది.
 
 
ఆనం రామనారాయణ రెడ్డికి నెల్లూరు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. జిల్లాలో అందరినీ కలుపుకొనిపోయి పార్టీని ముందుకు నడిపించగల శక్తి కూడా రామనారాయణ రెడ్డిలో ఉందని చాలా మంది అభిప్రాయం. ఆత్మకూరు ఇన్‌చార్జ్‌గా ఆ నియోజకవర్గంలో మండల కమిటీల నుంచి బూత్‌లెవెల్ కమిటీల వరకూ క్యాడర్‌ను నిర్మించుకున్నారు. రాత్రికి రాత్రే రాజకీయం మార్చేయగల శక్తి రామనారాయణ రెడ్డికి ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినవాళ్లను మళ్లీ సొంతగూటికి తీసుకురావాలని ఆనం బ్రదర్‌కు ఉన్నా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని వారు అభిప్రాయపడుతున్నారు. తమ నేతకు పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
 
 
అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని అనుచరులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తుండడంపై రామనారాయణరెడ్డి వారిని వారిస్తున్నారు. ‘మనకు పదవులు కొత్తకాదు కదా’ అంటూ మంత్రి పదవిపై బయటపడలేకపోతున్నారు. టీడీపీలో చేరే ముందు అధిష్టానం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూనే మౌనం పాటిస్తున్నారు. పదవి వచ్చినా రాకపోయినా టీడీపీలోనే ఉందామని తన క్యాడర్‌కు బలమైన సంకేతాలిస్తున్నారు. వైసీపీలో మనిషిని మనిషిగా పలుకరించరని, గౌరవం లేకుండా రాజకీయాల్లో ఉండలేమని ఆనం రామనారాయణరెడ్డి తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి పార్టీపై ఉంచిన నమ్మకాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించి ఆయనకు మంత్రి పదవి కట్టబెడుతుందో లేదో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...