Jump to content

ఏపీలో ఈ పది జిల్లాలు ఎందుకు వెనుకబడుతున్నాయో అన్వేసిస్తే..


Kiriti

Recommended Posts

ఏపీలో ఈ పది జిల్లాలు ఎందుకు వెనుకబడుతున్నాయో అన్వేసిస్తే..
 
 
సంతోషం సగం బలం అంటారు. అలా సంతోషంగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పరిసరాలు, స్థిర ఆదాయం, కూతుళ్లు, కొడుకుల నుంచి ఆదరణ- ఇలాంటి అంశాలన్నీ కూడా కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తాయి. చక్కని రహదారులు, 24 గంటల విద్యుత్, రోజూ మంచినీటి సరఫరా వంటి సామాజిక అంశాలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి. అయితే ఈ సంతోషాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మూడు జిల్లాలు దూసుకువెళుతున్నాయి. మిగతా పది జిల్లాలు ఎందుకు వెనుకబడుతున్నాయనేది ఇప్పుడు సచివాలయంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కారణాలు కోసం అన్వేషిస్తే ఏమి తెలిసిందో ఈ స్టోరీలో చూద్దాం.
 
 
                  ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యలను వేగిరం పరిష్కారించడం, నిర్ణీత గడువులో ఈ పనులు పూర్తిచేయడం, పాలనలో సాంకేతికతను జోడించడం, తద్వారా పారదర్శకతను సాధించడం వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఇదివరకులా ప్రజాప్రతినిధుల వద్దకు దరఖాస్తులు తీసుకుని పరుగులు తీయనక్కరలేదు. ఇంటి వద్దే కూర్చుని 1100కు ఫోన్‌చేస్తే చాలు. ఆయా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అయితే ఈ చర్య పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎంత ఉందనేది ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్‌ గవర్నెన్స్ సెంటర్.. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆర్టీజీ నుంచి ప్రభుత్వం విశ్లేషణ చేస్తోంది. ప్రజలకి ఉన్న సమస్యలను పరిష్కరిస్తే సహజంగానే వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందనేది ప్రభుత్వం అంచనా.
 
 
             మారుమూల గ్రామాలలో ఉన్న వారు సైతం ప్రస్తుతం 1100కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ పరిష్కార వేదికకు కాల్ చేస్తే సమస్యలు తీరతాయనే భావం ప్రజల్లో బలంగా ఏర్పడింది. దీంతో ఈ సెంటర్‌కు ఆదరణ పెరిగింది. ప్రజల కోసం అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును కూడా ఈ సెంటర్ ద్వారా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల ఏ భావంతో ఉన్నారో తెలుసుకునేందుకు ఈ సెంటర్‌ ఉపయోగపడుతోంది. 1100 నుంచి రాష్ట్రంలోని లక్షలాది మందికి వారానికి ఒకసారి కాల్స్ వెళ్తూ ఉంటాయి. ప్రజల స్పందన ఆధారంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో, సమస్యల పరిష్కారంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తేలింది. గుంటూరుజిల్లాలోని గుంటూరు, తెనాలి డివిజన్లు, ప్రకాశం జిల్లాలోని కొంత ప్రాంతంలో ప్రభుత్వ కార్యక్రమాల పట్ల 80 శాతం సంతృప్తి వ్యక్తమవుతోందని విశ్లేషణలో తేలింది. గుంటూరుజిల్లాలోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి తదితర ప్రాంతాలలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి.
 
             రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం హ్యాపీనెస్ ఇండెక్స్ కోసం తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లో 50 శాతం వరకు సంతృప్తి రాగా, కడప జిల్లాలో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల విషయానికి వస్తే విశాఖపట్టణంలో ప్రభుత్వ సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖపట్టణం నగరంలో కూడా అభివృద్ధి బాగా జరిగిందని పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమైంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని డివిజన్లలో ప్రజలు సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు.
 
 
              ఆర్టీజీ సెంటర్, పరిష్కార వేదిక అయిన 1100 నుంచి వెళుతున్న కాల్స్‌లో తీస్తున్న సగటు శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రభుత్వం ఎక్కడైతే సంతృప్తిస్థాయి తక్కువ ఉందో.. ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రారంభించింది. ఇదే కాకుండా ప్రజాప్రతినిధుల పనితీరుపై చంద్రబాబు రప్పించుకుంటున్న సర్వే కూడా సంతృప్తిస్థాయిని ప్రభావితం చేస్తోందని అంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు, వస్తున్న అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉంటున్నారని కూడా ఒక విశ్లేషణలో తేలింది. వీటన్నింటినీ సెట్‌రైట్ చేసేందుకు సీఎం కసరత్తును ప్రారంభించారు.
 
              కుటుంబంలో ఉండే సంతోషంతోపాటు సామాజిక అవసరాలను కూడా తీరిస్తేనే ఆ కుటుంబానికి పూర్తి సంతోషం కలుగుతుందనేది కొలమానంగా పెట్టుకున్నారు. సామాజిక అవసరాలు.. ముఖ్యంగా రహదారులు, మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అందుబాటులో, సరసమైన ధరల్లో నిత్యావసర వస్తువులు, రైతుబజార్ల పనితీరు వంటివి మెరుగుపడితేనే పూర్తిస్థాయి సంతృప్తి వస్తుందనీ, అప్పుడే సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తంచేస్తారనీ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కడైతే సంతృప్తి తక్కువుగా ఉందో ఆ ప్రాంతాలపై ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...