Jump to content

బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీల్లోకి ఐటీ అడుగు.....


KING007

Recommended Posts

బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీల్లోకి ఐటీ అడుగు 
హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, కోచి, గురుగ్రామ్‌లలో సర్వే 
  పన్ను ఎగవేతపై అనుమానాలే కారణం 
13busi1a.jpg

హద్దూపద్దూలేకుండా పెరుగుతున్న బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉత్సుకతను తీసుకువచ్చింది. ఈ ఏడాది జనవరిలో 1000 డాలర్లు (రూ.65000)గా ఉన్న ఒక బిట్‌ కాయిన్‌ విలువ ఈ వారంలో 17,000 డాలర్ల(దాదాపు రూ.11 లక్షలు)కు చేరి.. దాని గురించి తెలియనివారు కూడా తెలుసుకునేలా చేసింది. అయితే వాటిలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందిన వారు పన్నులు ఎగవేస్తున్నారేమోనన్న అనుమానం భారత ఆదాయ పన్ను విభాగానికి కలిగినట్లుంది. అందుకే బుధవారం దేశవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలపై సర్వే నిర్వహించింది. ఆ మేరకు పన్ను అధికార వర్గాలు పీటీఐకి తెలిపాయి. 
ఈ విభాగానికి చెందిన పలు బృందాలు బెంగళూరు దర్యాప్తు విభాగం నేతృత్వంలో దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోచి, గురుగ్రామ్‌లలోని తొమ్మిది బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలను సందర్శించినట్లు సమాచారం. ఆదాయ పన్ను చట్టం 133ఏ కింద ఈ సర్వేలు చేపట్టారు. ‘మదుపర్లు, ట్రేడర్లు.. వారు జరిపిన లావాదేవీలు, అవతలి పక్షం వాళ్ల గుర్తింపు, సంబంధిత బ్యాంకు ఖాతాలను తెలుసుకుని సాక్ష్యాలను సేకరించడం’ ఈ సర్వే ఉద్దేశమని తెలుస్తోంది.

ఇదే తొలి చర్య : బిట్‌కాయిన్‌కు సంబంధించినంత వరకూ దేశంలో తీసుకున్న తొలి పెద్ద చర్య ఇదేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సర్వే బృందాలకు ముందుగానే ఈ ఎక్స్ఛేంజీల సమాచారం, ఆర్థిక గణాంకాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. బిట్‌కాయిన్‌ అనేది ఎవరి నియంత్రణలోనూ లేని వర్చువల్‌ కరెన్సీ. దీంతో భారత్‌ సహా పలు దేశాల రిజర్వు బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్‌బీఐ సైతం ఈ తరహా అనియంత్రిత డిజిటల్‌ కరెన్సీలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ తరహా వర్చువల్‌ కరెన్సీలను పరిశీలించడానికి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఇది అంతర్జాతీయంగా, దేశీయంగా జరిగే ఈ కరెన్సీల లావాదేవీలను పరిశీలిస్తుంది.

‘బిట్‌ కాయిన్‌ బ్యాంకుల’పై నిషేధం: దక్షిణ కొరియా 
బిట్‌కాయిన్‌ ప్రకంపనలు దక్షిణ కొరియాకూ వ్యాపించాయి. ఈ కరెన్సీ లావాదేవీలను నిర్వహించే బ్యాంకులపై ఆ దేశం నిషేధం విధించింది. రిటైల్‌ స్పెక్యులేటర్లను ఇది ఈ మధ్య బాగా ఆకర్షించడం అందులోనూ ఈ దేశం నుంచి వారు ఎక్కువగా ఉండడంతో ఈ చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ బిట్‌కాయిన్‌ లావాదేవీల్లో 20 శాతం ఇక్కడే జరగడం ఇందుకు నేపథ్యం. దాదాపు పది లక్షల మంది(అందులో ఎక్కువ భాగం చిన్న మదుపర్లు) దగ్గర ఈ బిట్‌కాయిన్లు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ గిరాకీ ఎక్కువగా ఉండడంతో అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాతో పోలిస్తే 20 శాతం ఎక్కువగా ధరలు ఉన్నాయి. దక్షిణ కొరియా తాజా ప్రకటనతో అక్కడి అతిపెద్ద బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన బిట్‌థంబ్‌లో  ధరలు 5% దాకా పడ్డాయి. 
ఒక్కో ఎక్స్ఛేంజీలో ఒక్కో ధర: పెద్ద ఎక్స్ఛేంజీల్లో గిరాకీ ఎక్కువగా ఉండడం, చిన్న ఎక్స్ఛేంజీల్లో గిరాకీ తక్కువగా ఉండడం వల్ల ఒక్కో ఎక్స్ఛేంజీల్లో ఒక్కో ధరలో బిట్‌కాయిన్‌ ఉంటోంది. సరఫరాను బట్టి ధర మారడం ఎక్కడైనా జరిగేదే. ఇక బిట్‌కాయిన్‌ ధరను నిర్ణయించడానికి ఏకసూత్రం అంటూ ఏదీ లేకపోవడంతో ఎవరూ దాని ధర ఇంతా అని నిర్ణయించలేకున్నారు. ఇది కూడా ఎక్స్ఛేంజీలను బట్టి ధర మారడానికి ఒక కారణం. ఇక ప్రస్తుతమున్న బిట్‌కాయిన్‌ వ్యవస్థ నేపథ్యంలో ట్రేడర్లు పలు ఎక్స్ఛేంజీల్లో బిట్‌కాయిన్లను కొని ఈ ధరల వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకోవడానికి వీలు కావడం లేదు.

2 రోజుల్లో రెండింతలైన లైట్‌కాయిన్‌ 
గత రెండు రోజులుగా బిట్‌కాయిన్‌తో పాటు వినిపిస్తున్న మరో పేరు లైట్‌కాయిన్‌. ప్రపంచంలోనే అతిపెద్ద అయిదో డిజిటల్‌ కరెన్సీ ఇది. డిసెంబరు 11న 148 డాలర్లుగా ఉన్న ఈ లైట్‌కాయిన్‌ 48 గంటలు గడిచే సరికి 309 డాలర్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి అయిన 341.72 డాలర్లకూ చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో దీని విలువ 4 డాలర్లతో పోలిస్తే ఇది 7725 శాతం పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ ఈ వ్యవధిలో 2191 శాతం పెరిగిందని కాయిన్‌మార్కెట్‌క్యాప్‌ వెల్లడిస్తోంది. 


ఆయిల్‌ కాయిన్లు వస్తున్నాయ్‌ 
13busi1b.jpg

బిట్‌కాయిన్‌.. ప్రస్తుతం అందరి నోళ్లలోనూ నానుతున్న పదం. ఒక్క బిట్‌ కాయిన్‌ విలువే.. రూ.10 లక్షలకు పైగా పలికిందని వింటూనే ఉన్నాం. అయితే ఎవరి నియంత్రణలోనూ లేని బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీ(డిజిటల్‌ కరెన్సీ)కి ఏ మాత్రం పోలికలేని మరో క్రిప్టోకరెన్సీ వస్తోంది. అదే ఆయిల్‌కాయిన్‌. 
భవిష్యత్‌ ఇక సాంకేతికత ఆధారిత కాగితరహిత కరెన్సీదే అయినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ఆ దిశగా అధికారికంగా తొలి అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం త్వరలోనే నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే డిజిటల్‌ కరెన్సీ అయిన ఆయిల్‌కాయిన్‌ను తీసుకురానుంది. ముడి చమురు ఆస్తుల ఆధారంగా ఇది పనిచేస్తుంది. 
ఎలా కొనొచ్చు..:  ఒక ఆయిల్‌కాయిన్‌ను కొనాలంటే.. కొనుగోలుదారు ప్రస్తుత కరెన్సీతో ఆయిల్‌కాయిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్ని డబ్బులు పెడితే ఒక ఆయిల్‌కాయిన్‌ టోకెన్‌ వస్తుందన్నది అధికారిక వర్గాలే నిర్ణయిస్తాయి. అయితే బిట్‌కాయిన్లలాగా ఇవేమీ హామీలేని, భద్రతలేని డిజిటల్‌ కరెన్సీ కాదు. అమెరికా ప్రభుత్వమే రంగంలోకి దిగుతోంది కాబట్టి వీటిని కొనుగోలు చేయడం సురక్షితమేనని విశ్లేషకులు అంటున్నారు. 
ఎవరు కనిపెట్టారు: ఈ ఆలోచనను నిపుణుల ప్యానెల్‌ ఒకటి ప్రతిపాదించింది. అమెరికా కమొడిటీ ఫ్యూచర్స్‌ కమిషన్‌ మాజీ కమిషనర్‌ బార్ట్‌ చిల్టన్‌ (2007-2014) ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఈ డిజిటల్‌ కరెన్సీ ఆలోచనను ఆవిష్కరించారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు కూడా. 
ఎలా పనిచేస్తాయంటే..: ఆయిల్‌కాయిన్లను టోకెన్లుగా భావించొచ్చు. ఒక్కో ఆయిల్‌కాయిన్‌ ఒక్కో చమురు బారెల్‌ విలువకు సమానంగా ఉంటుంది. ఆయిల్‌కాయిన్‌ శ్వేత పత్రం ప్రకారం.. భౌతిక ముడి చమురు, ఆయిల్‌ ఫ్యూచర్స్‌, చమురు ఉత్పత్తి చేసే ఆస్తులన్నిటి ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. ఇక అన్ని ఆస్తుల సగటు విలువకు.. చెలామణీలో ఉన్న అన్ని ఆయిల్‌కాయిన్ల విలువ సమానంగా ఉంటుంది. ఎవరి వద్దనైనా ఆయిల్‌కాయిన్లను మార్చుకోవాలనుకుంటే.. దాని విలువకు సమానమైన చమురు బారెళ్లు, సంబంధిత చమురు ఆస్తులను పొందొచ్చు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న గిరాకీని అందుకోవడం కోసం కూడా ఈ ఆయిల్‌కాయిన్ల చెలామణీని తీసుకువస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...