Jump to content

GST: ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నారు ......


KING007

Recommended Posts

ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటున్నారు 
పన్నురేట్లు తగ్గాయ్‌ 
సరకు ధరలు పెరిగాయ్‌ 
వినియోగదారుకు అందని ప్రయోజనం 
20business-news1a.jpg
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానంలో వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే మాట వినిపిస్తోంది. పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెట్టడంతో.. ఇటీవల కొన్ని వస్తువులపై ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించింది. అయినా వినియోగదారులకు లభించిన వూరట శూన్యమే. ప్రభుత్వం ఎంతైతే పన్ను తగ్గించిందో.. ఆ మేరకు కొందరు వ్యాపారులు వస్తువుల ధర పెంచేస్తున్నారు. దీంతో పన్ను తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందకుండా పోతోంది.
20business-news1b.jpgవంబరు 15కు ముందు.. ఏసీ రెస్టారెంటులో అల్పాహారం లేదా భోజనం చేస్తే 18% జీఎస్‌టీ చెల్లించాలి. అదే నాన్‌ ఏసీ/ ఇతర సాధారణ హోటళ్లలో తింటే పన్ను రేటు 12%.

నవంబరు 15 నుంచి.. జీఎస్‌టీ మండలి సిఫారసు అమల్లోకి రావడంతో ఏ రకం రెస్టారెంటు (ఏసీ/ నాన్‌ ఏసీ)లోనైనా భోజనం, అల్పాహారం అయినా జీఎస్‌టీ 5% మాత్రమే.

పై రెండింటిని పరిగణనలోకి తీసుకుంటే నవంబరు 15 ముందుతో పోలిస్తే ఆ తర్వాత పన్ను రేటు 7- 13% వరకు తగ్గింది. మనం చెల్లించే బిల్లు మొత్తంలో కూడా ఈ మేరకు తగ్గింపు కనిపించాలి. కాని వాస్తవ పరిస్థితి అలా లేదు.

పన్ను రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. ఇంచుమించు దానికి సమానంగా ఆహార పదార్థాల ధరలు, పెంచేసి లెక్క సరిచేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇలా చేయడం ద్వారా వినియోగదార్లకు చేరాల్సిన ప్రయోజనాన్ని వ్యాపారులే తమ జేబులో వేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదార్లకు పన్ను ప్రయోజనం దక్కనప్పుడు ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించి లాభమేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి వీళ్లు అడుగుతోంది సబబే. మరి వ్యాపారులు ఎందుకు అలా చేస్తున్నారు. ఏదైనా కారణముందా?

నవంబరు 10న గువాహటిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వానికి పలు సిఫారసులను జీఎస్‌టీ మండలి సూచించింది. పన్ను రేట్ల తగ్గింపు, రిటర్న్‌ల దాఖలు ప్రక్రియ సరళీకరణ, రిటర్న్‌ల దాఖలు ఆలస్యంపై విధించే రుసుం లాంటివి ఇందులో ముఖ్యమైనవి. వ్యాపార, పరిశ్రమ సంఘాల వినతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలు, ముడి సరుకు - అంత్య ఉత్పత్తి మధ్య పన్ను రేట్ల సమతౌల్యం, గుజరాత్‌ ఎన్నికలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిని నిర్ణయించింది. ఈ సిఫారసులకు సంబంధించి ఇప్పటికే 35 నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది.

జీఎస్‌టీ మండలి ప్రధాన సిఫారసులు ఇవే.. 
* 178 వస్తువుల పన్ను రేటు 28% నుంచి 18 శాతానికి తగ్గింపు. 
* 13 వస్తువుల పన్ను రేటు 18 శాతం 12 శాతానికి సవరణ 
* రెండు వస్తువుల పన్ను రేటు 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు 
* ఆరు వస్తువుల పన్ను రేటు 18 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. 
* 8 వస్తువులు 12 శాతం పన్ను స్లాబు నుంచి 5 శాతం పన్ను స్లాబులోకి 
* అంతకుముందు 5 శాతంగా ఉన్న ఐదు వస్తువులపై పన్ను రద్దు. 
* స్టార్‌ హోటళ్లు మినహా అన్ని రకాల (ఏసీ/ నాన్‌ ఏసీ) హోటళ్లు, రెస్టారెంట్లకు 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సౌలభ్యం ఉండదు. 
* ట్రేడర్లు, తయారీదార్ల కాంపోజిషన్‌ పన్ను రేటు 1 శాతానికి తగ్గింపు. ఇంతకుమునుపు ఈ విధానంలో తయారీదార్లు 3 శాతం పన్ను స్లాబ్‌లో ఉండేవారు. 
* రూ.1.50 కోట్లకు మించి టర్నోవరు ఉన్న ట్రేడర్లు 2018 మార్చి 30 వరకు నాలుగు కాకుండా రెండు రిటర్న్‌లను (జీఎస్‌టీఆర్‌ 3బీ, జీఎస్‌టీఆర్‌-1) దాఖలు చేస్తే సరిపోతుంది. 
* రూ.1.50 కోట్ల లోపు టర్నోవరు ఉన్న ట్రేడర్లు 3 నెలలకో సారి జీఎస్‌టీఆర్‌-1 దాఖలు చేయాలి. 
* జీఎస్‌టీఆర్‌-3బీ రిటర్న్‌ గడువును 2017 డిసెంబరు నుంచి 2018 మార్చికి పొడిగింపు. శూన్య లావాదేవీలు, శూన్య టర్నోవరుకు సరళీకృత జీఎస్‌టీఆర్‌-3బీ. 
* 2017 అక్టోబరు, ఆ తర్వాతి నుంచి రిటర్న్‌ల దాఖలు ఆలస్య రుసుం రోజుకు రూ.200 నుంచి రూ.50కి తగ్గింపు. శూన్య లావాదేవీల రిటర్న్‌లకైతే రోజుకు రూ.20.

నవంబరు 15 నుంచే అమల్లోకి వచ్చాయి..: 
జీఎస్‌టీ మండలి సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం సుమారు 35 నోటిఫికేషన్లను జారీ చేసింది. వీటిలో చాలా వరకు 15 నవంబరు నుంచి అమల్లోకి వచ్చాయి. పన్ను రేట్ల తగ్గింపు నవంబరు 15 నుంచే వర్తింపజేశారు. ఈ తేదీ కంటే ముందు నిర్ణయించిన ఎంఆర్‌పీని, పన్ను రేట్ల తగ్గింపు మేరకు వ్యాపారులు సవరించుకోవాలి.

20business-news1c.jpg
ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లేదనే రేట్ల పెంపా? 
పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పటికీ వినియోగదారులకు ఆ ప్రయోజనం చేరడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే వ్యాపారుల నుంచి దీనిపై భిన్న వాదన వస్తోంది. 
ఉదాహరణకు పక్కనున్న రెస్టారెంట్‌ బిల్లులనే చూద్దాం. మొదటిది జీఎస్‌టీ పన్ను రేట్ల తగ్గింపు సిఫారసు అమల్లోకి రాకముందు. రెండోది.. సిఫారసు అమల్లోకి వచ్చిన తర్వాతి రోజు. 
మొదటి బిల్లు ప్రకారం.. 2017 నవంబరు 14న భోజనం ధర రూ.105.88గా ఉంది. దీనిపై 18 శాతం జీఎస్‌టీ రూ.19.06 కలిపితే మొత్తం అమ్మకం విలువ రూ.125 అయ్యింది. 
రెండో బిల్లులో.. నవంబరు 16న పన్ను రేటు 5 శాతం తగ్గడంతో భోజనం ధర రూ.124కి పెంచారు. జీఎస్‌టీ 5 శాతం (రూ.6.10) కలిపితే మొత్తం అమ్మకం విలువ రూ.130కి చేరింది. 
ఇక్కడ పన్ను రేటు తగ్గినప్పటికీ బిల్లు మాత్రం రూ.5 పెరిగింది. వాస్తవానికి పాత ధర (రూ.105.88)కు జీఎస్‌టీ కలిపితే మొత్తం బిల్లు రూ.111.18. ఈ లెక్కన చూస్తే రూ.19 అధికంగా చెల్లించామన్నమాట.

పై ఉదాహరణ ప్రకారం వినియోగదారునికి పన్ను రేట్ల ప్రయోజనం చేరలేదనే విషయం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోటి ఉంది. రెస్టారెంట్లు/ హోటళ్ల జీఎస్‌టీ రేటును 5 శాతానికి ప్రభుత్వం తగ్గించినప్పటికీ, మునుపు ఉన్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) సౌలభ్యాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఇదే కారణాన్ని కొందరు వ్యాపారులు వల్లెవేస్తున్నారు. ఐటీసీ పొందే వీలు లేకపోవడం వల్లే నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకొని పదార్థాల ధరలు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం ఐటీసీ వర్తింపజేసి, పన్ను రేట్లు తగ్గించి ఉంటే కనుక పన్ను ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసేవాళ్లమని చెబుతున్నారు. మరి జీఎస్‌టీ అమల్లోకి రాకముందు కూడా పూర్తి స్థాయిలో ఐటీసీ పొందే వీలు లేదనే విషయాన్ని ఇక్కడ వాళ్లు గుర్తుంచుకోవాలి. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ వినియోగదారులకు తగ్గిన పన్ను రేట్ల ప్రయోజనం బదిలీ కావటం లేదని మాత్రం అర్థమవుతోంది. మొత్తానికి గతంతో పోలిస్తే పన్ను రేటు తగ్గిందని భావించి రెస్టారెంటులో అడుగుపెట్టిన వినియోగదారునికి ఆఖర్లో బిల్లును చూశాక ‘ఆశ.. దోశ.. అప్పడం’ అనే మాట గుర్తుకు వస్తుందేమో.

ఎంఆర్‌పీ స్థానంలో మరోటి.. 
ప్రజలకు పన్ను రేట్ల ప్రయోజనాన్ని దరి చేర్చాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిందే. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ఫలితం వినియోగదారునికి మాత్రం చేరటం లేదు. అందువల్ల ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని సామన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి. అదే సమయంలో కొందరు వ్యాపారులు జీఎస్‌టీ ముసుగులో చేస్తున్న మాయాజాలానికి అడ్డుకట్ట వేయాలి. జీఎస్‌టీ చట్టంలో వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించాలంటే ప్రస్తుతమున్న ఎంఆర్‌పీ విధానం సరిపోదు. ఎందుకంటే దీనిని రూపొందించి చాలా ఏళ్లవుతోంది. కొందరు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసి, పన్ను రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే కనుక.. ‘బేసిక్‌ సెల్లింగ్‌ ప్రైస్‌ ప్లస్‌ అప్లికేబుల్‌ ట్యాక్సెస్‌’ విధానాన్ని అనుసరించొచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు దీనిని అమలు చేస్తున్నాయి.

గమనిక: పన్ను రేట్ల కోత అనంతరం పరిస్థితి ఎలా ఉందోనని చెప్పేందుకు ఉదాహరణగా పై బిల్లులు చూపించాం. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇలాంటివి చాలానే పోస్ట్‌ అవుతున్నాయి. బిల్లులో రెస్టారెంటు పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించాం. అటు వ్యాసకర్తకు కానీ, పత్రికకు కానీ దీంతో ఎలాంటి సంబంధం లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...