Jump to content

ముగాబే విన్యాసం....


KING007

Recommended Posts

ముగాబే విన్యాసం
16-11-2017 00:54:35
 
నాలుగు దశాబ్దాలుగా జింబాబ్వేను పాలిస్తున్న రాబర్ట్‌ ముగాబే జీవిత చరమాంకంలో ఈ దుస్థితిని ఎదుర్కోవడం విషాదమే. ఇప్పుడు ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగి పాలన సైన్యం చేతుల్లోకి వచ్చింది. ముగాబేను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. ముగాబే చుట్టూ ఉన్న నేరగాళ్ళ భరతం పట్టడానికే ఈ పనిచేశామనీ, ముగాబే కుటుంబమంతా తమ రక్షణలో ఉన్నదని సైన్యాధ్యక్షుడు చెబుతున్నారు. పార్లమెంటు, న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాలను అధీనంలోకి తీసుకోవడంతో పాటు ముగాబే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మిలటరీ సీజ్‌ చేసింది. జింబాబ్వేను ఆర్థికంగానూ, సామాజికంగానూ నాశనం చేసిన కొన్ని శక్తులను ఏరిపారేసిన తరువాత పరిస్థితులు యథాతథస్థితికి వచ్చేస్తాయనీ, ఇది సైనిక తిరుగుబాటు కాదని సైన్యాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలోనే అసలు రహస్యం ఉన్నది. తన తరువాత అధికారం దీర్ఘకాల ఉద్యమ సహచరుడికి కాక, భార్యకు దఖలుపడే విధంగా ముగాబే పన్నిన పన్నాగం వల్లనే జింబాబ్వే ఈ గందరగోళ స్థితిలోకి జారిపోయింది.
 
ఇప్పుడు ముగాబే తన భార్య గ్రేస్‌ క్షేమంగా దేశం విడిచిపోయేందుకు సహకరించినపక్షంలో అధికారం నుంచి తప్పకుంటానంటూ సైన్యంతో రాజీకి వస్తున్నట్టు సమాచారం. జింబాబ్వే పెద్దదిక్కు దక్షిణాఫ్రికా కూడా రంగంలోకి దిగింది. ఆ దేశాధ్యక్షుడు ముగాబేతోనూ, సైన్యాధ్యక్షుడితోనూ చర్చలు జరిపి రాజీమార్గాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలోనే రాజీ కుదరవచ్చునని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, తిరుగుబాటు జరిపిన సైన్యం ఎవరిపక్షానైతే రంగప్రవేశం చేసిందో అతడే తాత్కాలిక దేశాధ్యక్షుడూ కావచ్చు. దేశంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమర్సన్‌ మాంగ్వాగ్వాను పదవినుంచి ముగాబే తప్పించడమే ఈ విపరీత పరిణామాలకు కారణం. ఎమర్సన్‌ పార్టీలో కీలకమైన వ్యక్తిమాత్రమే కాదు, ముగాబేతో పాటు నాలుగుదశాబ్దాల క్రితం వలసపాలకులకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించినవారిలో ముఖ్యుడు. ముగాబే రాజకీయ వారసుడు అతడేనని అందరూ భావిస్తున్న తరుణంలో, మారోమారు ఎమర్సన్‌ ఉపాధ్యక్షుడు కాకుండా ముగాబే అతడిని పదవినుంచి పీకేయడం దేశంలో పెనుసంచలనం సృష్టించింది. ఈ ప్రమాదకరమైన విన్యాసానికి ముగాబే ఒడిగట్టడానికి ఏకైక కారణం ఆయన రెండవ భార్య గ్రేస్‌. తనకంటే వయసులో నలభైయేళ్ళ చిన్నదైన ఈమె అధ్యక్షభవనంలో ఉద్యోగినిగా ఉండగా ముగాబే ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆయన మొదటిభార్య కిడ్నీ దెబ్బతిని మరణించేనాటికే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఆ తరువాత నాలుగేళ్ళకు వీరిద్దరి వివాహం జరిగింది. ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, ఆమె నిరంకుశ, దుందుడుకు వైఖరికి సంబంధించిన కథనాలను అటుంచితే, డబ్బుపైనా, అధికారంపైనా ఆమె తన మోహాన్ని కూడా ఎన్నడూ దాచుకోలేదు. ఈ మధ్యన జరిగిన ఒక ర్యాలీలో ముగాబేను తాను వారసులెవరో తేల్చిచెప్పమని కోరాననీ, అధ్యక్షపదవి తనకు అప్పగిస్తే అద్భుతంగా పనిచేయగల శక్తి తనకు ఉందని చెప్పానంటూ ప్రకటించి ప్రజలను నివ్వెరపరచింది. ముగాబేను ఇప్పటికే జాను–ఎఫ్‌ పార్టీ రాబోయే ఎన్నికల్లో దేశాధ్యక్షపదవికి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పార్టీ మరోమారు ఎన్నికల్లో నెగ్గితే ఎమర్సన్‌ మరోమారు ఉపాధ్యక్షుడయ్యేవారు. కానీ, గ్రేస్‌ కారణంగా ఆయన పదవిపోవడమే కాదు, ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచివుండటంతో ఆయన ఏకంగా దేశమే విడిచిపోవలసి వచ్చింది. ఈ కుట్ర అంతా గ్రేస్‌ను ఉపాధ్యక్షురాలి స్థానంలో కూర్చోబెట్టడానికి జరిగిందే కనుక, వచ్చేనెల పార్టీ సదస్సులో ముగాబే ఆమె పేరును ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. అదే జరిగితే ముగాబే వయసు రీత్యా ఆయన తరువాత ఆమె దేశాధ్యక్షురాలయ్యేందుకు కూడా వీలుండేది. కానీ, సైన్యం రంగప్రవేశంతో కథ అడ్డం తిరిగింది.
 
ముగాబేను సైన్యం గృహనిర్బంధం చేసినా, నడివీధుల్లో ట్యాంకులు తిరుగుతున్నా జింబాబ్వే ప్రజలు సైన్యంపై తిరగబడకపోవడం, ఎటువంటి హింసా జరగకపోవడం చూసినప్పుడు ముగాబేపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉన్నదో తెలుస్తున్నది. ఇప్పుడు ఎమర్సన్‌ తిరిగి రావడాన్ని బట్టి చూస్తే సైన్యాధ్యక్షుడు చెబుతున్నట్టుగా సైనికపాలనలోకి దేశం జారిపోకపోవచ్చును కానీ, ముగాబే పాలన మాత్రం త్వరలోనే ముగిసిపోవచ్చు. అనుకున్న ప్రకారం ఎన్నికలంటూ జరిగినా ముగాబే సృష్టించిన ఈ సంక్షోభం తరువాత జాను–ఎఫ్‌ పార్టీ ఏడుపార్టీల విపక్ష సంకీర్ణంపై నెగ్గుకు రావడమూ కష్టమే. ముగాబేను అవినీతిపరుడిగా, దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన అసమర్థపాలకుడిగా ఎవరు ఎంతగా ప్రచారం చేస్తున్నా, అధికారం కోసం ఆయన అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడతారన్న విమర్శలున్నా, ఒక విముక్తినేతగా ప్రజల్లో ఆయన పట్ల అభిమానం మిగిలివున్నందునే నాలుగుదశాబ్దాలుగా అధికారంలో కొనసాగలిగారు. కానీ, ఆయన నిరంకుశ వైఖరి కారణంగా అన్ని రంగాలూ దెబ్బతినిపోతుండటంతో ఇటీవల ఆయనపై అసంతృప్తి బాగా హెచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ నెగ్గి అధ్యక్షుడు అవుతారో లేదో తెలియదు కానీ, ఇంతలోగా తనకు తానుగానే ఇలా చేటు చేసుకోవడం విషాదం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...