Jump to content

అవినీతికి రక్ష!


KING007

Recommended Posts

అవినీతికి రక్ష! 
24-10-2017 00:48:36
 
ప్రభుత్వాలు ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకున్నాయంటేనే అందులో ఏదో ఉన్నట్టు. పైగా నెలన్నరక్రితమే ఆర్డినెన్సు తయారుచేసి మీడియా కంటబడకుండా దాస్తే భయాపడాల్సిది, అనుమానించాల్సింది చాలా ఉన్నట్టు. రాజస్థాన్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వివాదం రేకెత్తించింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ సహా మీడియా సంఘాలన్నీ వసుంధరా రాజే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. తమ చేతులూ కాళ్ళూ కట్టేస్తున్న ఈ ఆర్డినెన్సును ఉపసంహరించమని డిమాండ్‌ చేస్తున్నాయి. అవినీతిపరులైన అధికారులను కాపాడుకొస్తున్నందుకు వివిధ సంస్థలూ, సంఘాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మంగళవారం రాజస్థాన్‌ అసెంబ్లీలో విపక్షాలు రచ్చరచ్చచేశాయి. ఇది 1817 కాదు మహారాణీగారూ అంటూ రాహుల్‌ చెణుకులు విసిరారు. ప్రభుత్వాధికారులకు, మేజిస్ట్రేట్లకు విశేషమైన రక్షణలు ఇస్తూ, మీడియాను జైలుకు పంపుతానని బెదిరిస్తున్న ఈ ఆర్డినెన్సు, మరో బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర అడుగుజాడల్లోనే రూపొంది మరింత పదునుదేరింది.
 
ప్రభుత్వ అనుమతి లేనిదే అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్లకు లేకుండా చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఓ ఆర్డినెన్సు ద్వారా. ఈ కచవకుండలాలేమిటంటూ న్యాయస్థానాల్లో దీన్ని అనేకమంది సవాలు చేశారు. వసుంధరారాజే ఇదేదారిలో మరో నాలుగు అడుగులు ముందుకేశారు. ప్రభుత్వ అనుమతి లేనిదే పబ్లిక్‌సర్వెంట్స్‌పై దర్యాప్తునకు ఆదేశించకూడదన్న నియమంతో పాటు, ఆ అనుమతి వచ్చేవరకూ సంబంధిత వ్యక్తుల వివరాలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నిషేధించింది. అంతటితో ఆగకుండా ఈ ఆదేశాలను ఉల్లంఘించిన మీడియా సంస్థల బాధ్యులకు రెండేళ్ళ జైలుశిక్ష కూడా విధిస్తున్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను కాపాడడంతో పాటు, అవినీతిని వెలికితీసే పాత్రికేయుల చేతులు కట్టేయడం, పరిశోధనాత్మక కథనాలకు పాతరేయడం వసుంధర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నది. ‘న్యాయస్థానాలు ఐదునిముషాల్లో ఈ ఆర్డినెన్సుకు కొట్టిపారేయడం ఖాయం’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులే ఘంటాపథంగా చెబుతున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో ఆమెకు విశేషమైన బలం ఉన్నది కనుక విపక్షాలు ఎంత గలాభా చేసినా బిల్లు గట్టెకుండా ఆగదు. హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఇది నిలుస్తుందా, కొట్టుకుపోతుందా అన్నది అటుంచితే, ఈ చర్యద్వారా పబ్లిక్‌సర్వెంట్ల తప్పుడు చేష్టలను దాచిపెట్టాలనుకోవం, వారి ప్రవర్తనను తెలుసుకొనే హక్కు ప్రజలకు లేకుండా చేయానుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
 
ప్రజాసేవకులమని చెప్పుకుంటున్నవారు తమకు తాముగా ఏ విషయమూ ప్రజలకు తెలియనవ్వకుండా, తెలుసుకోనివ్వకుండా సర్వమూ రహస్యంగా మార్చేస్తున్న కాలంలో, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కులను కూడా ఈ విధంగా దిరగదోడడం ఆవేదన కలిగిస్తున్నది. సభలో సంఖ్యాబలం ఉన్నకారణంగా ఇటువంటి తిరోగామి చట్టాల తయారీకి రాజే సిద్ధపడుతున్నది కానీ, ఆమె అప్రజాస్వామిక చర్యలకు తీవ్రస్థాయి ప్రజావ్యతిరేకత తప్పదు.
 
విధినిర్వణలో భాగంగా సదుద్దేశంతో నిర్ణయాలు చేసిన అధికారులు, ఎవరి కారణంగానో అకారణంగా అప్రదిష్టపాలైన నిజాయితీపరులను కాపాడుకోవడానికే ఈ ఆర్డినెన్సు తెచ్చినట్టు రాజస్థాన్‌ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కాస్తోకూస్తో మిగిలిన అటువంటి అధికారుల పరువుపోకుండా, అవమానభారంతో కుమిలిపోకుండా రక్షించడం కచ్చితంగా అవసరమే. అందుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి కానీ, కొందరు మంచివారి పేరిట అవినీతిపరులందరినీ రక్షించే ఈ ప్రయత్నమే భయంకరమైనది. రాజే పాలనలో అవినీతి పతాకస్థాయికి చేరినందున అవినీతి అధికారులందరినీ కాపాడుకొచ్చే అధోగతికి ఆమె ప్రభుత్వం దిగజారిందని విపక్షాల ఆరోపణ. ఈ ఆరోపణలు అటుంచినా, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అవినీతికి పాల్పడుతున్న అధికారుల సంఖ్య అక్కడ హెచ్చుగానే ఉండటం, వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు అధమస్థాయిలో ఉండటం నిజం. ఇంతటి ఉదాసీనమైన స్థితిలో మరిన్ని రక్షణలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ప్రభుత్వానికి తెలియదనుకోలేం. విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అనుమతి ఉండాలన్న నియమంతో పాటు, ఈ అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం తనదగ్గర ఆర్నెల్ల సమయం పెట్టుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.
 
ఈ ఆర్నెల్లకాలంలో అనుమతి రానప్పుడు మాత్రమే గడువు ముగిసిన తరువాత న్యాయస్థానాలైనా, మీడియా అయినా తమ పనితాము చేయవచ్చు. అంతవరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరో, వారి పేర్లేమిటో, ఆరోపణలు ఏమిటో పత్రికలు రాయకూడదు. ఈ వెసులుబాటు అవినీతిపరులకు ఎన్నిరకాలుగా ఉపకరిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఒక నేరాన్ని దర్యాప్తు చేసే విషయంలో ‘ముందస్తు అనుమతి’ పొందాలన్న ఆంక్ష కొన్ని స్థాయిల్లోని కొందరు వ్యక్తుల విషయంలో ఉండివుండవచ్చును కానీ, అందరూ సమానులు కాదంటున్న ఆ నియమం ఏమాత్రం సముచితమైనది కాదు. ఒక నేరాన్ని తక్షణమే దర్యాప్తు చేయని పక్షంలో ఆ ఆధారాలు అనతికాలంలోనే చెరిగిపోవడం ఖాయం. సమాచారం మీడియాలో రాకుండా, దర్యాప్తు లేకుండా ఆర్నెల్లకాలం ప్రభుత్వ అనుమతికోసం వేచిచూస్తున్నప్పుడు అటువంటి కేసులు ఏమవుతాయో వివరంగా చెప్పుకోనక్కరలేదు. అనుమతికోసం మహారాష్ట్ర ప్రభుత్వం మూడునెలలు ఎదురుచూడమంటే, రాజస్థాన్‌ ప్రభుత్వం ఆర్నెల్లు ఆగలంటున్నది. ఈ దేశంలో అవినీతికేసుల్లో శిక్షలు పడుతున్న అధికారులు ఒక్కశాతం కూడా లేనిస్థితిలో, ప్రభుత్వాలు ఇటువంటి చట్టాలతో వారికి రక్షణవలయాలు ఏర్పాటుచేస్తూ పోవడం పతనమైపోతున్న విలువలకు పరాకాష్ఠ.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...