Jump to content

ఆట ఆరంభం! AJ - Editorial..


KING007

Recommended Posts

ఆట ఆరంభం!
14-10-2017 01:42:17
 
ఎన్నికల సంఘం హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలెప్పుడో చెబుతూ గుజరాత్‌ ఊసెత్తనందుకు కాంగ్రెస్‌కు మాచెడ్డ కోపం వచ్చింది. ప్రభుత్వమూ, ఎన్నికల సంఘమూ మిలాఖత్‌ అయ్యాయన్న అర్థంలో ఆ పార్టీ విమర్శించినందుకు నోరు అదుపులో పెట్టుకోమని బీజేపీ మండిపడింది. హిమాచల్‌, గుజరాత్‌ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో ఈ ఆరంభం తెలియచెబుతున్నది. నవంబరు 9న హిమాచల్‌లోని 68 నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్‌ జరిపి, డిసెంబరు 18న ఫలితాలు ప్రకటిస్తానన్నది ఈసీ. ఆ లోపే గుజరాత్‌ ఎన్నికలూ జరుగుతాయంటూ హిమాచల్‌లో మాత్రం తక్షణమే ఎన్నికల నియమావళిని అమలులోకి తెచ్చింది. కానీ, నియమావళి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయనీ, జూలైలో వచ్చిన వరదల పునరావాస కార్యక్రమాలు నిలిచిపోతాయని గుజరాత్‌ పేర్కొనడంతో అక్కడి షెడ్యూల్‌ ప్రకటన వాయిదా వేసింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను గతంలోనూ పలుమార్లు కలపలేదని ఈసీ గుర్తుచేస్తుంటే, 16వ తేదీ మోదీ గుజరాత్‌లో పర్యటించి ఓటర్లకు వరాలు గుప్పించడానికే ఆ రాష్ట్రాన్ని మినహాయించారని కాంగ్రెస్‌ అంటున్నది.
 
దీపావళి తరువాత కాంగ్రెస్‌ పార్టీకి చక్రవర్తి కాబోతున్న రాహుల్‌ గాంధీకీ, రారాజుగా వెలుగుతున్న నరేంద్ర మోదీకీ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి. కొందరు వీటిని సెమీఫైనల్స్‌ అంటున్నారు. హిమాచల్‌ ప్రజలమీద నమ్మకమో, ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ మీద విశ్వాసమో తెలియదు కానీ రాహుల్‌ దృష్టంతా గుజరాత్‌పైనే ప్రధానంగా ఉన్నది. పట్టాభిషేకానికి ముందు తనను తాను నిరూపించుకోవాలన్న తాపత్రయం కనిపిస్తున్నది. ఆయన పట్టాభిషేకం ఎన్నికల ఫలితాలపై ఆధారపడి వుండకపోవచ్చు కానీ, గుజరాత్‌లో మోదీ పీఠాన్ని కాస్తంత కుదపగలిగినా పార్టీలో సీనియర్ల ముందు రాహుల్‌ ప్రతిష్ఠ పెరుగుతుంది. గెలుపు అధినాయకుడిది, ఓటమి స్థానిక నాయకులదన్న సూత్రం కాంగ్రెస్‌లో ఎలాగూ ఉండనే ఉన్నది కనుక రెండుచోట్లా ఓడినా రాహుల్‌కు పోయేదేమీ లేదు. హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు మిగిలిన ఆరు రాష్ట్రాల్లో ఒకటి. ఇప్పుడు బీజేపీ దానిని ఎగరేసుకుపోయే పనిలో ఉన్నది. వీరభద్రసింగ్‌ కుటుంబీకులపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రచారాస్త్రాలుగా మార్చింది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆయన వెంటపడుతున్నాయి. అక్రమ మైనింగ్‌, కుంటుబడిన ఉపాధి, తగ్గిన వ్యవసాయం, పెరిగిన అప్పులు ఇత్యాది అంశాలతో పాటు శాంతిభద్రతల సమస్యపై బీజేపీ ప్రధానంగా విరుచుకుపడుతున్నది. బీజేపీ చేతుల్లోకి హిమాచల్‌ పోవడం ఖాయమనీ, అందుకే దానిని వదిలేసి రాహుల్ గుజరాత్‌పై పడ్డారని కొందరి వాదన.
 
గతంలో ఐదురాష్ట్రాల ఎన్నికలప్పుడు వాటిని ‘డీమానిటైజేషన్‌’కు రెఫరెండమ్‌ అన్నారు. ఆ లెక్కన ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను జీఎస్టీపై ప్రజాతీర్పు అనాలి. హిమాచల్‌లోనూ జీఎస్టీ ఎన్నికల అస్త్రమే కానీ, గుజరాత్‌లో ఇది మరింత స్పష్టంగా ఉంటుంది. 182 స్థానాలున్న గుజరాత్‌లో బీజేపీ కేవలం ఈ ఒక్క కారణంగా ఓడిపోతుందని ఎవరూ అనడం లేదు కానీ, జీఎస్టీ మీద అక్కడ వచ్చినంత వ్యతిరేకత దేశంలో మరెక్కడా లేదన్నమాట వాస్తవం. జీఎస్టీలో మొన్నటికి మొన్న ప్రకటించిన మరిన్ని మినహాయింపుల్లో అత్యధికం అక్కడి వర్తకుల ఆగ్రహాన్ని ఉపశమింపచేసేందుకు నిర్దేశించినవే. గుజరాత్‌లో రాహుల్‌ ఆర్థికాన్నే దాడికి ఆధారం చేసుకున్నారు. పాదయాత్రలో భాగంగా జరుగుతున్న ఆలయ సందర్శనలు, స్థానికులతో ముచ్చట్లు, యువతరంతో చిట్‌చాట్లు అటుంచితే, మోదీ దూకుడుగా తీసుకున్న రెండు అతిపెద్ద నిర్ణయాలు దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయనీ, వ్యాపారాన్నీ, ఉపాధినీ దెబ్బతీశాయంటూ ప్రచారం చేస్తున్నారు. జీఎస్టీలో ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని మినహాయింపులు ఇచ్చినా వర్తకులు, వ్యాపారులు ఎన్నటికీ కోలుకోలేరన్నది ఆయన వాదన. మోదీ స్వరాష్ట్రంలో ఆయనను వ్యక్తిగతంగా విమర్శించే విషయంలో రాహుల్‌ మాట తూలకుండా జాగ్రత్తపడుతున్నారు. మోదీ చీటికీమాటికీ ‘కాంగ్రెస్‌ ముక్త్‌’ అంటారనీ, తాను ఎన్నటికీ బీజేపీ దేశంనుంచి పోవాలని కోరుకోనని వ్యాఖ్యానించడం ద్వారా సౌమ్యుడిగా, పరిణతిగల నాయకుడిగా కనిపించే ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌లో పాటీదార్లలోనూ, దళితుల్లోనూ బీజేపీపై ఆగ్రహం ఉన్నమాట వాస్తవం. దళితులపై దాడులు హెచ్చుతూ వారిలో ఆగ్రహం పెరుగుతున్నది.
 
పాటీదార్ల వైఖరిని అంచనా కట్టలేకపోయినా, దళితుల ఓట్లు మాత్రం ఈ మారు కాంగ్రెస్‌కు హెచ్చుసంఖ్యలో పడతాయన్నది ఒక విశ్లేషణ. అయితే, రెండు దశాబ్దాలకుపైగా గుజరాత్‌లో అధికారంలో లేనికారణంగా బీజేపీ వ్యతిరేకతను ఓట్లుగానూ, సీట్లుగానూ మార్చుకోగలిగే సంస్థాగత సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదు. ముఖ్యంగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శంకర్‌సిన్హ్‌ వాఘేలా నిష్క్రమణ ఆ పార్టీని చావుదెబ్బ తీసింది. అహ్మద్‌పటేల్‌ రాజ్యసభ ఎన్నిక సందర్భంగా అప్పట్లోనే చక్రం తిప్పి వాఘేలాను పార్టీనుంచి బయటకు లాగేసిన బీజేపీ ఈ కారణంగానే కాస్తంత నిశ్చింతగా ఉన్నది. ఆయన ఇప్పుడు ఓ వేరుకుంపటి పెట్టుకొని రేపు అవసరార్థం బీజేపీని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాహుల్‌ పాదయాత్ర కష్టానికి ఫలితం ఎంత ఉంటుందో తెలియదు కానీ, ఆయన కారణంగా గుజరాత్‌లో సీట్లు ఏమాత్రం తగ్గినా అది నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బ. నర్మదా ప్రాజెక్టును ఘనంగా ఆరంభించి, బుల్లెట్‌ రైలుతో సహా అన్నింటినీ అక్కడకు తరలిస్తూ ఆ రాష్ట్రాన్ని ఎలాగోలా నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఎన్నికల ప్రకటన వాయిదా ఎంతగా లాభిస్తుందో చూడాలి.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...