Jump to content

NTR Housing Scheme


Recommended Posts

మార్కాపురం డివిజన్‌లో ఎన్టీఆర్‌ గృహాల మంజూరు

pks-gen5a.jpg

మేడపి(త్రిపురాంతకం), న్యూస్‌టుడే: మార్కాపురం డివిజన్‌లోని వై.పాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో మూడేళ్లకు 10,450 ఎన్టీఆర్‌ గృహాలను మంజూరు చేసినట్లు మార్కాపురం గృహ నిర్మాణ శాఖ ఈఈ ఈ.బసవయ్య తెలిపారు. మండలంలోని మేడపి, లేళ్లపల్లి, మిట్టపాలెం గ్రామాల్లో నిర్మాణంలోని ఎన్టీఆర్‌ గృహాలను ఆయన బుధవారం పరిశీలించి తనిఖీ చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 3,850 గృహాలు మంజూరైతే అందులో 1997 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని ఆయన పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 3,300, 2018-19 ఆర్థిక సంవ్సరానికి గాను మరో 3,300 ఎన్టీఆర్‌ గృహాలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా 1,042 గృహాలు మంజూరు చేయగా 310 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ గృహానికి రూ.1.50 లక్షలు, పీఎంజీఎస్‌వై పథకం ద్వారా మంజూరయ్యే గృహానికి రూ.2 లక్షలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. 2015-16లో ఐఏవై ద్వారా మంజూరై అర్ధాంతరంగా ఆగిన గృహాల నిర్మాణాలకు అదనంగా రూ.25 వేలు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. యర్రగొండపాలెం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల నుంచి 3,562 జన్మభూమి దరఖాస్తులు అందగా 2,196 సమస్యలను పరిష్కరించినట్లు డీఈఈ ఏ.శ్రీనివాస్‌ తెలిపారు. సిమెంటు అవసరమైన వారు బస్తా రూ.250 చొప్పున ఒక్కొక్కరికి 80 బస్తాలను, పీఎంజీఎస్‌వై పథకం లబ్ధిదారులకు 100 బస్తాలను సరఫరా చేస్తామని ఆయన వివరించారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటే వెంటనే బిల్లులను మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. వీరి వెంట ఏఈఈ రాజేశ్వరావు, సిబ్బంది ఉన్నారు.

  •  
Link to comment
Share on other sites

మే 31నాటికి కొత్త గృహాలు మంజూరు పూర్తికావాలి

జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే : కొత్తగా ప్రకటించిన గృహాలను మే 31నాటికి మంజూరు పూర్తికావాలని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. జన్మభూమి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి జాబితాలను సిద్ధం చేయాలన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోని చాంబర్‌లో గృహనిర్మాణ సంస్థ అధికారులతో కలెక్టర సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గృహనిర్మాణల్లో జిల్లా ముందంజలో ఉండాలన్నారు. ఎన్‌.టి.ఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను కేటాయించిన గృహాల్లో రాజాం, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో 395 గృహాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గాల్లో 1208 ఇళ్లు ప్రారంభం కాకుండా ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. గృహనిర్మాణాల్లో జిల్లా వెనుకబడి ఉండడానికి వీలులేదని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ పిడి పి.ఆర్‌.నర్సింగరావు, ఈఈలు జి.నారాయణ, పి.కూర్మినాయుడు, కె.గణపతి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పట్టణ పేదలకు గృహయోగం
24-05-2017 08:51:21
636312127931866775.jpg
నరసరావుపేట : జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. గుంటూరు కార్పొరేషన్‌ మరో ఐదు పట్టణాలలో గృహాల నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తి కావచ్చింది. గుంటూరు కార్పొరేషన్‌లో 6,630 ఇళ్లను నిర్మిస్తారు. తెనాలి పురపాలక సంఘంలో 1152, చిలకలూరిపేటలో 4,512, నరసరావుపేట 1504, పొన్నూరు 2368, సత్తెనపల్లి 640, మంగళగిరి మునిసిపాలిటీలో 2592 గృహాలను నిర్మించనున్నారు. గృహాల నిర్మాణాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. జీ+3 బహుళ అంతస్థుల భవనాలలో ఒక్కొక్క ఫ్లోర్‌కు మూడు బ్లాక్‌లు నిర్మిస్తారు. మూడు వందల చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు ఇలా మూడు క్యాటగిరిలుగా గృహ నిర్మాణాలను విభజించారు. మూడువందల చదరపు అడుగుల గృహ నిర్మాణానికి ఎంపికైన లబ్ధిదారులు రూ 500 చెల్లిస్తే సరిపోతుంది. 365 చదరపు అడుగుల గృహ నిర్మాణానికి లబ్ధిదారుల వారి వాటా ధనం కింద రూ.50 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కార్పోరేషన్‌ కల్పిస్తుంది. 430 చదరపు అడుగుల్లో నిర్మించే ప్లాట్‌కు ఎంపికైన వారు రూ.లక్ష చెల్లించాలి. ఈ మొత్తాన్ని కూడా వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం ఇస్తారు. 300 చదరపు అడుగుల గృహం ధర రూ 6.30 లక్షలుగా ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం నిర్ణయించింది. 365 చదరపు అడుగుల గృహం రూ7.45 లక్షలు, 430 చదరపు అడుగుల గృహం ఖరీదు రూ 8.42 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుల వాటాకు బ్యాంకు రుణాలు
ఆయా గృహాలకు నిర్ణయించిన వ్యయం మొత్తంలో రూ 1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వం, రూ1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తాయి లబ్ధిదారుల వాటా ధనం, సబ్సిడీ రూ.3 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం కింద మంజూరు చేస్తారు. బ్యాంక్‌ రుణం కూడా చెల్లింపుకు వాయిదాల పద్ధతిని అమలు చేస్తారు. బ్యాంకర్లతో కూడా కార్పోరేషన్‌ చర్చిస్తోంది. క్యాటగిరీగా వారిగా లబ్ధి దారుల ఎంపికను పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి కార్పోరేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. రెండు రోజుల్లో జాబితాలను అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేటలో స్థల పరిశీలన
నరసరావుపేట పరిధిలో నిర్మించనున్న బహుళ అంతస్థుల భవనాల కోసం బాపనయ్య నగర్‌లో కేటాయించిన స్థలాన్ని కార్పోరేషన్‌ ఎస్‌ఈ ఎంసీహెచ్‌ కోటేశ్వరరావు, ఈఈ బీ ఆదినారాయణ మంగళవారం పరిశీలించారు. బాపనయ్య నగర్‌లో సుమారు ఏడు వందల గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. మిగిలిన గృహాలు బైపాస్‌ రోడ్డులో ప్రస్తుతం ఉన్న కంపోస్టు యార్డు ప్రాంతంలో నిర్మించేందుకు స్థల పరిశీలన చేశారు. ఎస్‌ఈ కోటేశ్వరరావు మాట్లాడుతూ నరసరావుపేట, మంగళగిరి పురపాలక సంఘాలలో నిర్మించే గృహాలకు సంబందించి వ్యయం అంచనాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. గుంటూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలలో గృహాల నిర్మాణాలకు సంబందించిన టెండర్లను తెరిచినట్ల తెలిపారు. రానున్న 15 నెలల్లో కార్పోరేషన్‌తో సహా ఆరు మునిసిపాలిటీలలో గృహాల నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఏ భానుప్రతాప్‌, మునిసిపల్‌ ఇంజనీరు గడిపూడి వెంకటేశ్వరరావు, టీపీవో కృష్ణ సముద్రుడు, టీపీఎస్‌ సాంబయ్య పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

15 నెలల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణం

పురపాలక మంత్రి నారాయణ వెల్లడి

ఈనాడు-అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం వచ్చే పదిహేను నెలల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. పట్టణ గృహనిర్మాణంపై ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం విజయవాడలో సమావేశమైంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ సభ్యులుగా ఉన్న ఈ ఉపసంఘ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో చేపట్టే 1.93 లక్షల ఇళ్ల నిర్మాణంపైనా, కొత్తగా ప్రతిపాదించిన ఆర్థిక నగరాలపైనా ప్రధానంగా చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ జీ-3 తరహాలో పట్టణ పేదల కోసం 1.20 లక్షల ఇళ్లు, సొంతంగా స్థలం ఉండి ఇంటికి నోచుకోని పేద కుటుంబాల కోసం మరో 73 వేల ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. ఈ ఇళ్ల కోసం పిలిచిన టెండర్లు ఒకటి, రెండు రోజుల్లో తెరిచి ఖరారు చేస్తామని తెలిపారు.

ఆర్థిక నగరాల అభివృద్ధికి ప్రణాళికలు: ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ వి.రామనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక నగరాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉండి ప్రజల ఆర్థికాభివృద్ధి మెరుగుపడేలా ఈ ఆర్థిక నగరాలు ఉంటాయని వివరించారు.

పరిపాలన నగర ప్రణాళిక 90 శాతం పూర్తి: రాజధానిలో పరిపాలన నగర ప్రణాళిక దాదాపు 90 శాతం పూర్తయ్యిందని మంత్రి నారాయణ చెప్పారు. హైకోర్టు, శాసనసభ ఆకృతులు సిద్ధమై నిర్మాణాలు త్వరలో మొదలవుతాయని వివరించారు.

Link to comment
Share on other sites

పట్టణ పేదలందరికీ గృహయోగం!
ఆరు పురపాలక సంఘాలకు ఎన్టీఆర్‌ పట్టణ గృహాలు
న్యూస్‌టుడే - అద్దంకి
pks-gen1a.jpg

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లులేని వారందరికీ ‘ఎన్టీఆర్‌ పట్టణ గృహాలు’ మంజూరుకు శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇప్పటివరకూ గ్రామీణ పేదలకే ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం పథకాన్ని వర్తింపజేశారు. ఇకపై పట్టణాల్లోని పేదలెవరూ ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ గృహ నిర్మాణం లక్ష్యంగా పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో రెండు పథకాల ద్వారా లబ్ధిదారులను ఎంపికచేసి ఇళ్లు నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికే గృహ నిర్మాణం వర్తిస్తుండగా, పట్టణ ప్రాంతంలో అమలు చేస్తున్న పథకంలో 323 చ.అ. ఖాళీస్థలం ఉండి, రూ. 3 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారినీ లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ఈ పథకం(బీఎల్‌సీ) మార్గదర్శకాలను ఆయా నగర పంచాయతీ/ పురపాలక సంఘాల కమిషనర్లకు పంపించారు.

అందరికీ ఇళ్లు లక్ష్యం..
స్వాతంత్య్రం సిద్దించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సందర్భంగా దేశంలో నివసించే ఎవరూ గృహవసతి లేకుండా ఉండరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రధానమంత్రి ఆవాస యోజనలో పట్టణ వాసులకూ ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమూ తనవంతు తోడ్పాటు అందిస్తోంది. ఇప్పటికే అన్ని పురపాలక సంఘాల్లో ప్రైవేటు కన్సల్టెంట్లను నియమించి మురికివాడలను లక్ష్యాలుగా చేసుకొని సర్వే చేశారు. సొంత నివేశన స్థలం ఉన్న వారికి బీఎల్‌సీ పథకం ద్వారా గృహనిర్మాణం సమకూరనుంది. ఈ పథకంలో లబ్ధిదారు ఆయా పట్టణ నివాసులై ఉండాలి. 323 చ.అ. ఖాళీ స్థలం వారి పేరుతో ఉండాలి. అలాగే వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉండాలి. గృహ నిర్మాణం కింద ఎంపికైన లబ్ధిదారుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష భరిస్తాయి. మిగిలిన రూ. లక్షలో రూ. 25 వేలను లబ్ధిదారులు తమ వాటాగా భరించాల్సి ఉండగా రూ.75వేలు గృహనిర్మాణ సంస్థ సహకారంతో రుణం మంజూరవుతుంది. రెండు బెడ్‌ రూంలు, ఒక హాలు, కిచెన్‌, వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా ఇంటి నిర్మాణం డిజైన్‌ చేశారు.

* దరఖాస్తు చేసుకోదలచిన వారు వారి ఖాళీ స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఖాళీ స్థలం పన్ను వివరాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా నంబరుతో సమీపంలోని పురసేవా కేంద్రాలను సంప్రదించాలి. అంతర్జాలంలో నమోదు చేయడం ద్వారా వారి దరఖాస్తులు పురపాలక సంఘాలకు చేరతాయి. ఇప్పటికే ఒంగోలు, చీరాల పట్టణాల్లో ఈ పథకంలో ఇళ్లు మంజూరు కాగా మిగిలిన ఆరు పురపాలక సంఘాల్లో తాజాగా కేటాయించారు.

* మరో పథకం ‘ఎఫర్టబుల్‌ హౌసింగ్‌ ప్రోగ్రాం’ (ఏహెచ్‌పీ) లోనూ లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించనున్నారు. పట్టణాల్లో నివసించేందుకు సెంటు సొంత భూమి లేకుండా, దేశంలో ఎక్కడా సొంత ఇల్లు లేని వారికి ఈ పథకంలో ‘ఎన్టీఆర్‌ పట్టణ గృహాలు’ మంజూరవుతాయి. యూనిట్‌ రూ. 3.50 లక్షలుగా నిర్ణయించారు. కేంద్రం రూ. 1.50 లక్షలు, రాష్ట్రం రూ. 80వేలు, లబ్ధిదారుని వాటా రూ.50వేలు, రుణం రూ.70వేలుగా నిర్ణయించారు. ఇందులో నమోదు కావాలంటే ముందుగా పురసేవా కేంద్రాల్లో ఆధార్‌ నంబరును అప్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వ స్థలంలో సామూహిక గృహ నిర్మాణం చేపడతారు. ఇందులోనూ డబుల్‌ బెడ్‌రూం, హాలు, కిచెన్‌, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా డిజైన్‌ చేశారు.

hhh.jpg

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి- డీవీఎస్‌ నారాయణరావు, కమిషనర్‌, అద్దంకి
ప్రభుత్వం ద్వారా లభిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు పుర సేవా కేంద్రాలను వినియోగించుకోండి. ఇంటి నుంచీ దరఖాస్తు చేసుకోవచ్చు. దళారులను ఆశ్రయించొద్దు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపికచేసి గృహ నిర్మాణ శాఖకు అందిస్తాం. అద్దంకి పురపాలక సంఘంలో బీఎల్‌సీ ద్వారా 218, ఏహెచ్‌పీలో 1312 మంజూరయ్యాయి.

Link to comment
Share on other sites

పట్టణ పేదలకు ‘ఆధునిక’ ఇళ్లు

636330062987248741.jpg


  • దేశంలోనే తొలిసారిగా షీర్‌ వాల్‌ టెక్నాలజీ
  • జీప్లస్‌ త్రీ విధానంలో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణం
  • త్వరలో లక్ష ఇళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌: నారాయణ

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటిసారిగా షీర్‌ వాల్‌ టెక్నాలజీతో గృహనిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పట్టణ పేదలకు జీప్లస్‌ త్రీ విధానంలో 1.20 లక్షల ఇళ్లు నిర్మించనున్నామని, వాటన్నిటినీ ఈ ఆధునిక సాంకేతిక విధానంలో నిర్మించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన పట్టణ గృహనిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పట్టణ పేదలకు మొత్తం 1.93 లక్షల ఇళ్లు నిర్మించనున్నామని, అందులో 73 వేల ఇళ్లను లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మించుకోనున్నట్లు తెలిపారు.

 

సొంత స్థలాలు లేని వారికి జీప్లస్‌ త్రీ విధానంలో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. వీటికి వరుసగా రూ.5.5 లక్షలు, రూ.6.5 లక్షలు, రూ.7.5 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశామని తెలిపారు. అందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.3లక్షలు పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని మంత్రి వివరించారు. కేంద్రం త్వరలో మరో లక్ష ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇళ్లులేని రైతు కూలీలకు జీప్లస్‌ త్రీ విధానంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. పది చోట్ల 500 ఇళ్లు చొప్పున మొత్తం 5 వేల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పక్కా ఇళ్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఏమిటీ షీర్‌ టెక్నాలజీ!

షీర్‌ వాల్‌ టెక్నాలజీతో నిర్మించే ఇళ్లు అత్యంత నాణ్యతతో ఉంటాయి. ఈ విధానంలో నిర్మించే ఇళ్లకు ప్రత్యేకంగా రాళ్లతో కట్టిన గోడలు ఉండవు. స్లాబు నిర్మాణంతోపాటే కాంక్రీటు గోడలు వస్తాయి. ఈ టెక్నాలజీతో నిర్మించిన గోడలకు పెనుగాలులు, భూకంపాలను తట్టుకొనే శక్తి ఉంటుంది. ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకూ ఈ సాంకేతికత దోహదపడుతుంది. ఈ విధానంలో ప్రీ ఫాబ్రికేటెడ్‌ గోడలు కూడా అందుబాటులో ఉన్నాయి

Link to comment
Share on other sites

లక్షన్నర ఇళ్ల నిర్మాణానికి రేపే శంకుస్థాపన

విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా..

మిగతా ప్రాంతాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో..

పురపాలక మంత్రి పి.నారాయణ వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజల కోసం లక్షన్నర ఇళ్ల నిర్మాణానికి ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారని వివరించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో అత్యుత్తమమైన షీర్‌వాల్‌ సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. ‘2018 జనవరి నాటికి వీటిలో 15 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది. ఆపై ప్రతి రెండు, మూడు నెలలకు 15-20 శాతం ఇళ్లు నిర్మిస్తారు. ఇలా 15 నెలల వ్యవధిలో దశలవారీగా ఈ గృహాల నిర్మాణం పూర్తిచేస్తాం. ఆ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సామాజిక భవనాలు, ఇలా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం. నాలుగు గోడలకు ఒకేసారి శ్లాబ్‌ వేస్తాం’ అని నారాయణ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి నివాసం పక్కన సమావేశ మందిరం.. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన సమావేశ మందిరం నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 300 మందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా కొత్త సమావేశ మందిరం ఉంటుందని వివరించారు. దీని నిర్మాణానికి అవసరమైన 60 సెంట్ల స్థలాన్ని భూసమీకరణ కింద తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిఫలంగా సంబంధిత భూయజమానికి 1450 చ.గజాల స్థలాన్ని అందిస్తామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

రాజధాని పేదలకు 5,024 గృహాలు

జీ+3 విధానంలో మూడు విభాగాలుగా నిర్మాణం

పది ప్రాంతాలు ఎంపిక చేసిన సీఆర్‌డీఏ

ఒక్కో చోట 500 ఇళ్ల నిర్మాణం

ఈనాడు - అమరావతి

రాజధాని గ్రామాల్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం 5,024 గృహాలు నిర్మించనుంది. రాజధాని పరిధిలో పది చోట్ల వీటిని నిర్మిస్తారు. ఒక్కో చోట ఐదెకరాల చొప్పున మొత్తం 50 ఎకరాల్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కేటాయించింది. ఒక్కో చోట 500 ఇళ్ల చొప్పున నిర్మిస్తారు. నిర్మాణ బాధ్యతను ఏపీటిడ్కో చేపడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద మొత్తం మూడు విభాగాల్లో, జీ+3 విధానంలో ఇళ్లు నిర్మిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.లక్షన్నర చొప్పున మొత్తం రూ.3 లక్షలు రాయితీగా ఇస్తాయి. మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా అందజేస్తారు. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. ఇళ్ల నిర్మాణానికి రూ.344.97 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ప్రాంతాల ఎంపిక..!

రాజధాని గ్రామాల్లో ఇళ్లులేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని రాజధాని భూసమీకరణ సమయంలో ప్రభుత్వం హామీనిచ్చింది. సీఆర్‌డీఏ నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలో రాజధాని గ్రామాల్లో సొంత ఇళ్లులేని పేద కుటుంబాలు ఏడు వేల వరకు ఉన్నట్టు అంచనా వేశారు. వీరిలో చాలా మంది ఆక్రమించిన స్థలాల్లోని తాత్కాలిక నిర్మాణాల్లోను, అద్దె ఇళ్లలోను ఉంటున్నారు. తొలి దశలో 5,024 మందికి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. బోరుపాలెం, అనంతవరం, శాఖమూరు, ఉండవల్లి, పెనుమాక, ఐనవోలు, నిడమర్రు, నవులూరు, నేలపాడు, మందడం గ్రామాల పరిధిలో ఇళ్లను నిర్మిస్తారు.

త్వరలోనే టెండర్లు

పేదల కోసం 300 చ.అడుగుల ఇళ్లు 992, 365 చ.అడుగుల ఇళ్లు 1536, 430 చ.అడుగుల ఇళ్లు్ల 2496 నిర్మిస్తారు. యూనిట్‌ వ్యయాన్ని 300 చ.అడుగుల ఇంటికి రూ.5.74 లక్షలు, 365 అడుగుల ఇంటికి రూ.6.60 లక్షలు, 430 అడుగుల ఇంటికి రూ.7.48 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారు తనకు నచ్చిన విభాగం ఇంటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మూడు విభాగాల ఇళ్లల్లో దేనికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.మూడు లక్షల రాయితీ మాత్రమే లభిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారే భరించాలి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని.. ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం తనకు అప్పగించిన తర్వాత నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాలి. 15 నెలల్లో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

Link to comment
Share on other sites

నియోజకవర్గానికి 500 ఇళ్లు
19-06-2017 01:07:56
 
636334352027426146.jpg
  • నేతల హామీలతో కట్టిన వాటికి ఆర్థిక ప్రయోజనం
  • త్వరలో అమలుచేసే యోచన
  • ఇంటికి 92 వేల లబ్ధి
 
అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలసీ కంటే ముందుగానే సొంతంగా ఇళ్లు కట్టుకున్న పేదలకు న్యాయం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకోసం సరికొత్త ఆలోచన చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించుకున్న ఇళ్లపై గతంలో ఆరా తీసింది. ప్రాథమిక దశలోనే దాదాపు లక్షకు పైగా ఇళ్లు ఉంటాయని తేలింది. దీంతో అందరికీ లబ్ధి చేకూర్చడం భారం కావడంతో పాటు, పథకాన్ని పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నందున నియోజకవర్గానికి 500 మందికి నిధులు మంజూరు చేయాలని తాజాగా యోచిస్తోంది. అది కూడా అందరికీ కాకుండా టీడీపీ ఎమ్మెల్యేల హామీల మేరకు నిర్మించుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. తాజాగా కేటాయించిన 4లక్షల ఇళ్లలోనే వీటిని మంజూరుచేసే అవకాశం ఉంది. రెండుమూడు నెలల్లో దీనిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల పాటు గృహనిర్మాణ పథకం అమల్లోకి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రీకాస్ట్‌ తరహా ఇళ్లు కట్టాలన్న ఆలోచనతో అధికారులు చాలాకాలం దానిపై కసరత్తు చేశారు. చివరకు ఇవి ఆర్థిక భారం కావడంతో పాటు, అన్ని ప్రాంతాల్లో వాటి నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు. అనేక మార్పుల తర్వాత గతేడాది ఏప్రిల్‌లో ఎట్టకేలకు ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. కానీ కొత్త పథకం అమల్లోకి వచ్చాక నిబంధనలు కఠినతరం చేయడంతో వాటికి లబ్ధి కలగలేదు. గత ప్రభుత్వంలో ముందుగా కట్టుకున్న ఇళ్లకు ఫొటోలు తీసి, తర్వాత అప్‌లోడ్‌ చేసి బిల్లులు మంజూరుచేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం జియోట్యాగింగ్‌ విధానం అమల్లోకి తేవడం వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో తమకూ న్యాయం చేయాలని హామీలపై ఇళ్లు కట్టుకున్న పేదలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఇటీవల వాటికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుందది.
 
లబ్ధిదారుల ఎంపికే సంక్లిష్టం
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల మేరకు ఇళ్లు నిర్మించుకున్న పేదలను గుర్తించడం అధికారులకు కష్టతరం కానుంది. ముందుగా కట్టుకున్న ఇళ్లను గుర్తించి ఎంపిక చేయడం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఈ తరహా ఇళ్లు రాష్ట్రంలో లక్షకు పైగా ఉంటాయని అంచనా. పథకాన్ని ప్రారంభిస్తే ఆ సంఖ్య భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.. ఇది మరో కుంభకోణం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గానికి 500 ఇళ్లు అంటే రాజకీయంగానూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే వాదన ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర రాయితీ ఇస్తున్నారు. కానీ పాలసీ కంటే ముందుగా కట్టుకున్న ఇళ్లకు రూ.92వేలే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. లక్షన్నర రాయితీలో రూ.92వేలు రాష్ట్ర ప్రభుత్వం, మిగతా నిధులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశారు. ఇప్పుడు పాత ఇళ్లకు రాయితీ ఇవ్వాలంటే ఉపాధిహామీ పథకం నిబంధనలు అడ్డొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ మాత్రమే వారికి వచ్చే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

ఏపీ వ్యాప్తంగా పట్టణాల్లో 1.50 లక్షల ఇళ్లు నిర్మించనున్న సర్కార్
19-06-2017 09:20:26
 
విజయవాడ: పట్టణ పేదల గృహ నిర్మాణానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా పట్టణాల్లో 1.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది.
ఇదే వేదిక మీద.. రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం సోమవారం నుంచి చంద్రన్న రంజాన్‌ తోఫాను పంపిణీ చేయనుంది.! సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Link to comment
Share on other sites

పేదల గృహ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి సోమిరెడ్డి..
19-06-2017 10:54:00
 
636334665658852541.jpg
నెల్లూరు: వెంకటేశ్వర యాస్పాల్ దగ్గర పట్టణ పేదల గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 4800 గృహాలకు మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీదారవిచంద్ర, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికలలో కూడా తమ పార్టీయే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...