Jump to content

ISM Super Hit- EENADU Review


Ramesh39

Recommended Posts

రివ్యూ: ఇజం 

21brk-ism1a.jpg

సినిమా పేరు: ఇజం 

నటీనటులు: కల్యాణ్‌రామ్‌.. అదితి ఆర్య.. జగపతిబాబు.. పోసాని కృష్ణ మురళి.. గొల్లపూడి మారుతీరావు.. తనికెళ్ల భరణి.. అజయ్‌ ఘోష్‌, అలీ.. వెన్నెల కిషోర్‌ 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

ఛాయాగ్రహణం: ముఖేష్‌ జి 

కూర్పు: జునైద్‌ సిద్దిఖీ 

నిర్మాత: కల్యాణ్‌ రామ్‌ 

కథ.. మాటలు.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 

సంస్థ: ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ 

విడుదల: 21-10-2016

పూరి జగన్నాథ్‌ గొప్ప కథకుడు. చిన్న పాయింట్‌ అయినా ఆసక్తికరమైన కథలుగా మలచి ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కూర్చోబెట్టే సమర్థుడు. అందుకే పూరి సినిమాల్లో కథ కంటే.. వేగంగా పరిగెట్టే కథనం.. పసందైన మాటలు ప్లస్‌ పాయింట్లుగా మారతాయి. పూర్తి స్థాయి పూరీ స్టైల్‌లో తీసిన సినిమా ‘ఇజం’. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ‘ఇజం’ ఎలా ఉంది? ఇందులో పూరి ఏ ‘ఇజం’ గురించి చెప్పాడన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే..: కల్యాణ్‌రామ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ స్ట్రీట్‌ ఫైటర్‌. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బుల కోసం ఫైట్‌ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం అన్వేషిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అలియా (అదితి ఆర్య)ని చూసి మనసు పడతాడు. ఆమె.. చీకటి సామ్రాజ్యానికి అధినేత అయిన జావేద్‌ భాయ్‌ (జగపతిబాబు) కూతురు. దేశాన్ని తన తండ్రి భయపెట్టిస్తుంటే.. తన తండ్రినే భయపెట్టించే మగాడ్ని పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. ఆ లక్షణాలు చూసే కల్యాణ్‌రామ్‌ని ప్రేమిస్తుంది. అయితే కల్యాణ్‌రామ్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సత్యమార్తాండ్‌ ఎవరు? తను అలియా ప్రేమని అడ్డు పెట్టుకొని ఏం సాధించాలనుకొన్నాడు? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.

ఎలా ఉందంటే..: పూరి మార్క్‌ కమర్షియల్‌ హంగులతో సాగే సినిమా ఇది. ముందే చెప్పినట్టు పూరి ఓ చిన్న పాయింట్‌ని నమ్ముకొన్నాడు. అయితే ఆ పాయింట్‌ బలంగా ఉంది. వికీలీక్స్‌ లాంటి బలమైన నెట్‌వర్క్‌ని స్థాపించి.. విదేశాల్లో నలధనం దాచుకొంటున్న ‘నల్ల దొరల’ గుట్టురట్టు చేసి.. ఆ డబ్బుని పేద ప్రజలకు పంచి పెట్టడం అన్నదే ఆ పాయింట్‌. ఇలాంటి కథలు సామాన్య ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్‌ అయిపోతాయి. అయితే.. అసలు విషయం పది నిమిషాలే. సినిమా రెండు గంటలకు పైగా. అంటే.. మిగిలిన రెండు గంటలూ దర్శకుడు ఏం నడిపాడన్నది కీలకం.

సినిమా ప్రారంభానికి ముందే.. కల్యాణ్‌రామ్‌ ఓ జర్నలిస్ట్‌ అనే హింట్‌ దొరికేస్తుంది ప్రేక్షకులకు. దాన్ని ఇంట్రవెల్‌ వరకూ దాచి పెట్టి.. దాన్నో బ్యాంగ్‌ అన్నట్టు చూపించడం అతికినట్లుగా అనిపించదు. తొలి సగం.. కథ కంటే మిగిలిన విషయాలే సాగిపోతుంటాయి. హీరోయిన్‌ వెనుక పడటం.. ఆమెతో డ్యూయెట్లతో తొలి భాగం ముగిస్తే.. ద్వితీయార్థంలో హీరోని వెదుక్కొంటూ హీరోయిన్‌ వస్తుంది. ఆ సన్నివేశాలు అలా సాగుతున్న వేళ.. సినిమా చివర్లో ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. కోర్టు సీన్‌తో తన ఉద్దేశం.. లక్ష్యాన్ని చాటి చెప్పాడు దర్శకుడు. కోర్టు సీన్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఉద్దేశం గొప్పగా ఉన్నా.. ఆ విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటంలో తడబాటు కనిపిస్తుంది.

21brk-ism1b.jpg

ఎవరెలా చేశారంటే..: గత సినిమాల్లో కల్యాణ్‌ రామ్‌కు ఇందులో పాత్రకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూరి సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో.. అలానే కనిపిస్తారు కల్యాణ్‌ రామ్‌. కోర్టు సన్నివేశంలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. ఆమె ఓకే. జగపతిబాబుని విలన్‌ అనుకోవడానికి వీల్లేదు. బీడీ ప్రేమికుడిగా.. కొన్ని సన్నివేశాల్లో రక్తి కట్టించాడు. అయితే డాన్‌ పాత్రపై మరింత దృష్టి పెట్టాల్సింది. గొల్లపూడి కనిపించేది ఒక్క సన్నివేశమైనా బాగుంది. అనూప్‌ బాణీల్లో మెలోడీ గీతం బాగుంది. ‘ఇజం.. ఇజం’ అంటూ పూరి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. పూరి డైలాగుల్లో మరిన్ని మెరుపులు ఉంటే బాగుండేది. కథ విషయంలో మరికాస్త కసరత్తు చేయాల్సింది.

బలాలు 

+ కల్యాణ్‌ రామ్‌ 

+ క్లైమాక్స్‌

బలహీనతలు 

- కథ

చివరిగా.. జర్నలిజానికి జాతీయవాదం తోడైతే ఈ ‘ఇజం’ 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...